ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది- భార్య, భర్త వారి ఒక కూతురు. ఆ పాప పేరు స్వాతి. భార్యభర్తలిద్దరూ రోజూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఇద్దరూ రెక్కలు విరిగేట్లు పని చేస్తే తప్ప వాళ్లకు పూట గడిచే అవకాశం లేదు. కష్టం చేసే వాళ్ళు, అభిమానవంతులు కావటంతో, రోజుకింత సొమ్ము వెనక వేసుకుంటూ, అప్పులు చేయకుండా సంసారాన్ని గుట్టుగా నడిపించుకొస్తున్నారు.

కూతురి భవిష్యత్తు తమలాగా ఉండకూ-డదని వాళ్ల కోరిక: 'ఆ పాప బాగా చదువు-కోవాలి.. పెద్ద ఉద్యోగం చేయాలి..' అని.

చదువు బాగుండాలనే తపనతో స్వాతిని వాళ్ళు పట్నంలో పేరున్న ఓ ప్రైవేటు బడిలో చేర్పించారు. స్కూలు బస్సొకటి రోజూ ఊళ్ళోకి వచ్చి, స్వాతి లాంటి పిల్లల్ని కొంత- మందిని మాత్రం బడికి తీసుకెళ్తుంది.

బడిలో మొదటి రోజున టీచరు తనని తాను పరిచయం చేసుకొని, "ఇప్పుడు మీరంతా ఒక్కరొక్కరుగా లేచి నిలబడి, మీ గురించి, మీరు చదివిన పుస్తకాల గురించి, కుటుంబాల గురించి, మీ అమ్మనాన్నలు ఏం చేస్తుంటారు వగైరా వివరాలు చెప్పండి" అని అడిగారు. పిల్లలంతా వరసగా లేచి "మా అమ్మ డాక్టర్, మా నాన్న ఇంజనీర్, మా అమ్మ లాయర్, మా నాన్న సైంటిస్ట్.." ఇట్లా గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు స్వాతి వంతు! "మా అమ్మా-నాన్నలు కూలోళ్ళు" అని చెబితే 'వాళ్లంతా నవ్వుతారేమో!’ అని స్వాతికి భయం వేసింది. "అందరూ నవ్వి, ఎగతాళి చేస్తారేమో.. ఇంక నాతోటి స్నేహం చెయ్యరేమో!" అని, ఆ పాప అప్పటికప్పుడు అబద్ధం చెప్పేసింది- "మా అమ్మనాన్నలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు.. నన్నేమో మా ఊళ్ళో ఉంచారు. నన్ను చూసుకునేందుకని ఊళ్ళో ఒక కుటుంబాన్ని చేరదీసారు" అని.

బడిలో పిల్లలంతా అది విని ఆశ్చర్య-పోయారు.

కొందరైతే ముందుకొచ్చి స్వాతిని అభినందించారు. "మీ అమ్మ వాళ్లకు మన దేశం అంటే చాలా ఇష్టమేమో! మన పల్లెల్లోని పేదవాళ్లంటే ఇష్టమేమో" అన్నారు.

ఆ రోజున స్వాతికి 'రమ' అనే పాప పరిచయం అయ్యింది. రమ తల్లిదండ్రులు పట్నంలో వ్యాపారం చేస్తారు. త్వరలోనే రమ, స్వాతి ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. రమ స్వాతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేసింది కూడా.

అయితే స్వాతి మటుకు ఆ పాపను తమ ఇంటికి పిలవలేదు. 'పిలిస్తే ఎలాగ? తన రహస్యం బయట పడిపోతే ఎలాగ?" అని అందోళన చెందింది.

అందుకనే తన తల్లిదండ్రులకు బడి సంగతులేవీ చెప్పలేదు, రమ గురించీ చెప్పలేదు!

అయితే ఒక సెలవు రోజున రమ బయలుదేరి వచ్చింది, స్వాతి వాళ్ల ఊరికి. ఆ రోజున స్వాతి కూడా ఊళ్ళో పిల్లలతో కలిసి నేరేడు కాయలు ఏరుకునేందుకు వెళ్ళి ఉన్నది. రమ వెతుక్కుంటూ స్వాతి వాళ్ల ఇంటికి వచ్చి, స్వాతివాళ్ల అమ్మని "స్వాతి ఉండేది ఇక్కడేనా?" అని అడిగింది.

"అవునమ్మా! ఇదే, స్వాతి వాళ్ల ఇల్లు. రా, లోపలికి వచ్చి కూర్చో. స్వాతి వచ్చేసరికి ఇంకా గంట-గంటన్నర అవ్వచ్చు" అన్నది స్వాతి వాళ్లమ్మ.

ఇంట్లోకి వచ్చి కూర్చొని అమాయకంగా "స్వాతి వాళ్ల అమ్మానాన్నలు అమెరికాలో ఏం చేస్తుంటారు, ఎప్పుడైనా వస్తుంటారా?" అని అడిగింది రమ. స్వాతివాళ్ళ అమ్మ నవ్వి "నేనే కదమ్మా, వాళ్ల అమ్మని?! మేం ఇక్కడే ఉంటాం. ఎక్కడికి పోతాం? మాకు అవన్నీ ఏం తెలవదు!" అన్నది.

రమ నిర్ఘాంతపోయి "మరి స్వాతి అట్లా చెప్పిందే?!" అంటూ బడిలో జరిగిన విషయం అంతా చెప్పింది.

అంతలోనే స్వాతి వాళ్ల నాన్న కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ బాధని గుండెల్లోనే దాచుకొని, "చిన్నపిల్ల కదా, నవ్వులాటకి అట్లా అని ఉంటుందమ్మా! తనంతట తానే స్వయంగా ఈ నిజం చెప్పేంత వరకూ మనం కూడా ఇది తనకు చెప్పద్దు. సరేనా, ఈ సంగతి మనకు తెలిసినట్లు స్వాతికి తెలియకూడదు- అసలు నువ్వు మా ఇంటికి వచ్చిన సంగతి కూడా తనకు చెప్పకు!" అన్నారు.

రమ కూడా "సరే అంకుల్! నేను ఇక్కడికి వచ్చినట్లు స్వాతికి గాని, మరే స్నేహితులకు గానీ చెప్పను!" అని వెళ్ళిపోయింది.


కొన్ని రోజుల తరువాత స్వాతికి ఒళ్ళంతా కురుపులై, జ్వరం వచ్చింది. డాక్టరు గారు స్వాతి తల్లిదండ్రులతో "ఇది అంటువ్యాధి. ఒకరినుండి ఒకరికి వస్తుంది. తగ్గిపోతుంది లెండి; కానీ ఒక వారం పది రోజుల పాటు ఎవ్వరూ ఆ పాప ఉన్న గదిలోకి కూడా పోవద్దు. లేకపోతే ఆ వ్యాధి మీకు కూడా రావచ్చు" అని చెప్పారు.

"ఇంక నాకు అమ్మ అన్నం కూడా పెట్టదేమో, నాకోసమని ఏ పనులూ చేయదేమో" అనుకొని నీరసపడింది స్వాతి.

కానీ తను అనుకునట్లు ఏమీ జరగలేదు.

అమ్మ ఎప్పటిలాగానే ఆ రోజు కూడా అన్నం తీసుకొచ్చి పెట్టింది; స్వాతి విడిచిన బట్టలు ఉతికింది; జుట్టు దువ్వి జడ వేసింది.

"దూరం ఉండమన్నారు కదా డాక్టరు గారు? నాకొచ్చింది అంటు వ్యాధి అట! మళ్ళీ ఈ వ్యాధి నీకు వస్తే ఎలా?" అన్నది స్వాతి

"పర్లేదులే, రాకుండా జాగ్రత్తగానే ఉంటున్నాము. నిన్ను ఒకే చోట ఉంచు-తున్నాం; అంతటా తిరగనివ్వట్లేదు; నీ పనులు చేసాక నేను, నాన్న ఇద్దరం వేపాకుతో స్నానం చేస్తున్నాము. అయినా రోగం అదీ వస్తే ఏమున్నది, ఓ వారం రోజులు మందులు వేసుకుంటూ దూరం ఉంటాము, రోగం అదే పోతుంది" అన్నది అమ్మ.

"అయ్యో! నాకోసమని వీళ్ళిద్దరూ తమ ఆరోగ్యాల్ని కూడా లెక్క పెట్టరే, ఇట్లాంటి అమ్మనాన్నల గురించి నేనెందుకు, మా బడిలో అబద్ధాలు చెప్పాను? నిజం చెప్పుకో-లేకపోయానెందుకు?" అని ఏడ్చింది స్వాతి.

"ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు! ఏడిస్తే వ్యాధి మరింత పెరుగుతుంది. ఏడవ కూడదు!" అని మందలించింది అమ్మ.

ఇంక దు:ఖాన్ని ఆపుకోలేని స్వాతి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది.

"ఊరుకో! ఈ విషయం మాకు ముందే తెలుసు. రమ మన ఇంటికి వచ్చి చెప్పింది. పిల్లలందరిముందూ మనం పేదవాళ్లమని చెప్పుకోలేక, అట్లా అన్నావు కదా, ఏ‌ం పర్లేదులే!" అని ఓదార్చింది స్వాతి వాళ్ల అమ్మ. స్వాతి బావురుమన్నది.

"అవును. ఇదేం పట్టించుకోకు తల్లీ! ఎవ్వరికీ చెప్పుకోకుండా దాచిన రహస్యాలు, మన లోపల కూడా ఊరికే కూర్చోవు- అవి మన ఆరోగ్యాన్ని తినేస్తాయి. అందుకని ఈలాంటి ఆలోచనలన్నీ వదిలేసెయ్యి. నీ‌ చదువులమీద మనసు పెట్టి, బాగా చదువుకో" అన్నాడు వాళ్ల నాన్న.

ఆ తర్వాత బడికి వెళ్ళిన స్వాతి సమయం చూసుకొని బడిలో తన స్నేహితురాళ్ళందరికీ నిజం చెప్పేసింది. వాళ్లంతా తనని అర్థం చేసుకున్నారు, తప్పిస్తే ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. దాంతో ఆ పాప మనసు కూడా తేలికైంది.