అనగనగా ఒక ఊళ్లో రాజు, రాము, సోము, రవి అనే నలుగురు అన్నదమ్ములు ఉండే-వాళ్ళు. వాళ్ళకు ఓ చిన్న పొలం, కొన్ని కోళ్ళు, మేకలు ఉండేవి.

ఒకసారి వాళ్ళ అమ్మ-నాన్నలు "ఇదిగో! మేం మళ్ళీ ఓ వారం రోజుల్లో‌ వచ్చేస్తాం. ఆలోగా అన్నదమ్ములు నలుగురూ 'ఏదో ఒకటి' చేసుకొని తినండి!" అని చెప్పి పొరుగూరు వెళ్ళారు.

"ఏదో ఒకటి అంటే ఏంటి?" అని వాళ్ళకి అనుమానం వచ్చింది.

"ఇదిగో, మనం 'ఏదో ఒకటి' చేసుకొని తినాలి. అందరం తలా ఒక దారిన వెళ్ళి 'ఏదో ఒకటి ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. తలా కొంచెం ఏదో ఒకటి తేకుండా వెనక్కి రావద్దండి' అన్నాడు పెద్దన్న రాజు. దాంతో నలుగురు అన్నదమ్ములూ నాలుగు దిక్కుల్లో వెళ్లారు.

పెద్దవాడు రాజు, కొందరు బాటసారులతో పాటు తూర్పు దిక్కుకు పోతూంటే ప్రక్కనున్న పొదలోంచి అకస్మాత్తుగా ఏదో గుడగుడమన్నది. "ఏంటది?" అని అడిగాడు రాజు, తోటివాళ్లని. "ఏదో ఒకటి, ఏదైతేనేం, మన దారిన మనం‌ పోదాం" అన్నారు వాళ్ళు.

"దొరికిందిరా! ఏదో‌ ఒకటి దొరికింది!" అని వాడు ఆ పొద చుట్టూ తిరిగి, జాగ్రత్తగా దాని లోపల ఉన్న ప్రాణిని పట్టుకున్నాడు. తీరా చూస్తే అది ఓ అడవి కోడి. "మరి ఏదో ఒకటి అన్నారేంటి?" అని ఆశ్చర్యపోయాడు వాడు.

"ఇది కోడే గదా! మరేంటో అనుకొని చాలా భయపడ్డాను" అనుకొని వాడు దాన్ని పట్టుకొని వెనక్కి తిరిగాడు. ఆలోగా రెండవవాడు రాము పడమర దిక్కుకి పోయే భక్త బృందంతో కలిసాడు. వాళ్ళు దేవర కొలుపు కోసం మేకపోతును నొకదాన్ని పట్టుకొని పోతున్నారు. దారిలో అంతా అది "మే, మే" అని మొత్తు-కుంటోంది. ఆ అరుపులు విని, చుట్టూ ఉన్న అడవిలోంచి అడవి గొర్రెలు కొన్ని వాళ్ల వెంట పడటం మొదలెట్టాయి. "త్వరగా పోండి! ఎక్కువైనాయంటే మనకి సమస్య" అని నడక వేగం పెంచారు వాళ్ళు.

రాము వాళ్ల వెంట పరుగు పెడుతూ "ఏంటది, మన వెంట పడుతున్నది?!" అని అడిగాడు. "ఏదో ఒకటి! మనం త్వరగా పోవటం మేలు" అన్నారు వాళ్ళు.
"ఓహో! 'ఏదో‌ ఒకటి' దొరికింది!" అని రాము అక్కడే ఆగి, నానా తంటాలూ పడి ఒక అడవి గొర్రెను పట్టుకొని, ఇంటి దారి పట్టాడు.

మూడవ వాడు సోము ఉత్తరం వైపుకు రైతులతో కలిసి పోసాగాడు. వాళ్లలో ఒకాయన తన దగ్గర రకరకాల విత్తనాలు ఉన్నాయని చెప్పటం మొదలెట్టాడు.

"మాకూ కొన్ని ఇవ్వరాదూ" అని అతన్ని అడిగారు ఇతరులు. "ఏం రకం విత్తనాలు కావాలి మీకు?" అనడిగాడు ఆయన.

"ఏదో ఒకటి! మొలిస్తే చాలు" అన్నారు వాళ్ళు. అతను వాళ్లందరికీ తలా కొన్ని విత్తనాలు ఇచ్చాడు. సోము కూడా వాటిని తీసుకొని సంతోషంగా వెనక్కు తిరిగాడు.

ఇక నాలుగోవాడు రవి, ఒట్టి పని దొంగ. అన్నలంతా ఏదో ఒకటి తెచ్చేందుకు పోగానే, వాడు బయలుదేరి, ఈత కోసమని చెరువు దగ్గరికి పోయాడు. అక్కడ కొద్దిసేపు ఈదులాడాక, వాడికి చేపలు పట్టేవాళ్ళు కొందరు కనబడ్డారు. వాళ్లతో‌ కలిసి సంతోషంగా కొన్ని చేపలు పట్టాడు వాడు.

"వీటిని ఇంటికి తీసుకువెళ్తే మా అన్నలు సంతోషపడతారు; అందరం చేపలకూర చేసుకోని తినచ్చు" అనుకొని, ఆ చేపల్ని పట్టుకొని ఇంటికి బయలు దేరాడు.

అందరూ ఇల్లు చేరుకున్నారు గానీ, 'ఆరోజు ఏం వండుకోవాలి' అనేది తేలలేదు.

చిన్న తమ్ముడు రవి చెప్పాడు తెలివిగా: "మీరు ముగ్గురూ 'ఏదో ఒకటి' తెచ్చారు; నేను ఒక్కడినే కదా, చేపలు తెచ్చింది? అవి సరిగ్గా నిలవ ఉండవు కూడాను. కాబట్టి ఏం చేద్దామంటే, మీరు తెచ్చిన వాటిని మనం పెంచుదాం!

పెద్దన్నయ్య తెచ్చిన కోడిని పెంచితే మనకు ఉన్న కోళ్ళు ఇంకా ఎక్కువ అవుతాయి. అట్లాగే రెండో అన్నయ్య తెచ్చిన గొర్రె కూడా. దాని వల్ల మనకున్న గొర్రెలు పెరుగుతాయి. మూడో అన్న తెచ్చిన గింజల్ని తోటలో వేస్తే కూరగాయలు వస్తాయి. అవి అన్నీ పెరిగాక, అప్పుడింక రోజూ 'ఏదో‌ ఒకటి' తినచ్చు!

ఆలోగా నేను రోజూ చెరువుకు వెళ్ళి చేపలు తెస్తాను. మీరు కోళ్ళను, మేకలను, పెంచుతూ తోటపని చేసుకొని రండి, అంతలోకే నేను మీకు మంచి చేపల కూర వండి పెడతాను.." అని. అందరూ వాడి తెలివిని, ఆలోచనను మెచ్చుకున్నారు.

అట్లా నలుగురూ తమకు ఇష్టమైన పనులు చేసుకుంటూ సంతోషంగా గడిపారు.