అనగనగా ఒక ఊళ్ళో రాజు, రవి అనే మిత్రులు ఇద్దరు ఉండే వాళ్ళు. చిన్ననాటి నుండి ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు, కలిసి చదివేవాళ్ళు, ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసేవాళ్ళు.
పెద్దవుతున్న కొద్దీ ఇద్దరి మీదా బాధ్యతలు పడ్డాయి. బ్రతుకు తెరువుగా రాజు కిరాణా దుకాణం పెట్టుకున్నాడు; రవి బట్టల వ్యాపారం పెట్టుకున్నాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. "వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి" అనుకునేసరికల్లా, బట్టల వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి రవికి. "ఆదాయం తక్కువైంది; అప్పులు ఎక్కువయ్యాయి- అప్పులవాళ్ళు ఇంటి మీదికి వస్తున్నారు!" అని విచారపడుతున్న రవిని ఓదార్చాడు రాజు:
"దుకాణం అమ్మేసెయ్యి. వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీర్చెయ్యచ్చు. 'ఆ తర్వాత ఏం చేయాలి' అనేది మళ్ళీ చూసుకుందాం" అన్నాడు.
దుకాణాన్ని అమ్మాక, అప్పులన్నీ తీర్చగా ఇంకొన్ని డబ్బులు మాత్రం మిగిలాయి రవి దగ్గర. రాజు వాటికి సమానం మొత్తాన్ని తన వంతుగా తీసి ఇస్తూ, "నీ డబ్బులతోబాటు దీన్నీ పెట్టుబడిగా పెట్టి, పట్నంలో, ఈసారి కూడా బట్టల వ్యాపారమే కొత్తగా మొదలెట్టు. ఇప్పుడు ఇంక అన్నీ లాభాలే వస్తాయిలే; మేలవుతుంది" అని ప్రోత్సహించాడు.
"ఇప్పటికే ఊరంతా అప్పులంటే, పైన ఇంకా నీకు కూడా అప్పు పడమంటావా? ఏం వద్దు!" అన్నాడు రవి.
"నేను నీకు ఇస్తున్నది అప్పుగా కాదు. స్నేహితుల మధ్య అప్పులు ఉండవు. ఈ డబ్బుల్ని నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు" అంటూ బలవంతంగా ఆ డబ్బుల్ని రవి జేబులో పెట్టి, స్నేహితుడిని పట్నం పంపాడు రాజు.
పట్నంలో రవి బట్టల వ్యాపారం బాగానే నడిచింది. మిత్రులిద్దరి మధ్యా కొంత కాలం పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చక్కగా నడిచాయి. ఆపైన మెల్లగా అవీ తగ్గాయి; చివరికి పూర్తిగా ఆగాయి; ఎవరి జీవితం వారిదైంది.
రాజుది సంతృప్తి కరమైన జీవితం. కానీ పెద్దగా ఎదుగుదల లేదు. రాజు భార్యకు ఏమంత చదువు రాదు. పల్లెటూరు మనిషి. వాళ్ల కొడుకు శివ పల్లెలోనే చదివాడు.
రవి మటుకు కొన్నేళ్ళకు ధనవంతుడు అయ్యడు. అయితే మళ్ళీ ఏనాడూ అతను ఊరికి రాలేదు; ఊరి గురించి తలుచుకోలేదు. రవి భార్య ఇంగ్లీషు నేర్చుకున్నది. కొడుకు పట్నంలో చదవటం మొదలెట్టాడు.
అంతలోనే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. పల్లెలో ఉండే రాజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. కుటుంబానికి దిక్కు లేకుండా అయ్యింది.
రాజు కుటుంబం కిరాణా దుకాణాన్ని అమ్మేసి, పట్నం చేరుకున్నది. అక్కడ రాజు భార్య శాంతమ్మ ఒక కంపెనీలో పని చేసుకుంటూ, కొడుకు శివని చదివించసాగింది. పట్నంలోనే ఉన్న రాముకు ఆ సంగతి తెలీదు.
కాలేజీలో చేరిన కొత్తల్లో శివ దగ్గర అసలు ఏమాత్రం డబ్బులు ఉండేవి కావు. అప్పుడొకసారి కాలేజీ ఫీజు కట్టటం ఆలస్యమైనప్పుడు, వాళ్ల తరగతిలోనే చదివే రమేష్ వాడికి సాయం చేసాడు. రమేష్ వాళ్ల నాన్న పేరున్న పెద్ద వ్యాపారి. త్వరలోనే శివ రమేష్ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకరి ఇంటికొకరు అనేకసార్లు వెళ్ళి వచ్చేవాళ్ళు; కలిసి చదివేవాళ్ళు.
ఆ సంవత్సరం రమేష్ పుట్టిన రోజు పార్టీ ఇస్తూ, శాంతమ్మని కూడా గట్టిగా ఆహ్వానించాడు. సరేనని శివ, శాంతమ్మ ఇద్దరూ రమేష్ వాళ్ల ఇంటికి వెళ్ళారు.
అక్కడ రమేష్ వాళ్లకి తన తల్లిదండ్రుల్ని పరిచయం చేయబోయాడు- కానీ ఆ సరికే వాళ్ళు శాంతమ్మని చూసి నిశ్చేష్టులైపోయి ఉన్నారు! రమేష్ వేరెవరో కాదు- రాము కొడుకే!
రాము, అతని భార్య వంగి శాంతమ్మ కాళ్లకి నమస్కరించి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.
'రాజుకి ఇలా అయిందని మాకు తెలీనే లేదు' అని నొచ్చుకున్నారు. "రమేష్ మా రాజు కొడుకేననమాట! పులికి పులి బిడ్డ పుట్టింది" అని మెచ్చుకున్నాడు రాము.
"నీకు తెలుసుకదా వదినా, నా వ్యాపారానికి సగం పెట్టుబడి రాజుదే. రాజు మంచితనం వల్ల, దేవుడి దయవల్ల నా వ్యాపారం ఇలా సాగుతున్నది. నేను ఏనాడో భాగాలు పంచి ఉన్నాను- ఈ ఆస్తిలో సగం వాటా మా రాజుదీ-మీది!" అంటూ పత్రాలను తెచ్చి శాంతమ్మ ముందుంచాడు రాము.
చూస్తున్న శివ, రమేష్‌లకు అసంకల్పితంగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.