ముసలి కొమరప్ప కిరాణా కొట్టులో పనిచేసేవాడు. చివరికి ఒకరోజున యజమాని అతనితో "చూడు కుమరప్పా, నీకు ఇప్పుడు కళ్ళు సరిగా కనపడట్లేదు; చెవులు సరిగా వినపడట్లేదు; చెప్పిన పనులు సరిగా చేయట్లేదు. నువ్వు ముసలివాడివి ఐపోయినావు; ఇంక వల్ల కాదు గానీ, విశ్రాంతి తీసుకో" అని చేతిలో కొంత డబ్బు పెట్టి, పని నుంచి తీసేసి, ఇంటికి పంపాడు.

తను ముసలివాడైపోయిన సంగతి కొమరప్పకు తెలుసు. యజమాని తనని తీసేసినందుకు అతనేమీ నిర్ఘాంతపోలేదు కానీ, కొంత చిన్నబోయాడు. "పని లేకపోతే భవిష్యత్తు లేదు- అయినా యజమాని తప్పు కూడా ఏమున్నది ఇందులో..?! తనకు వయసు ఎక్కువైంది; శక్తి ఉండట్లేదు; పని చేయలేకపోతున్నాడు.." ఇట్లా రకరకాలుగా పోయినై, అతని ఆలోచనలు.

అట్లా ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంటే, దారిలో ఒక ఇంటి ముందు చాలామంది గుమిగూడి ఉండటం కనిపించింది అతనికి. షావుకారు గారి మనుషులు కొందరు ఆ ఇంట్లోని సామానులు బయటికి విసిరేస్తూ నానా రభసా చేస్తున్నారు. ఆడవాళ్ళు గట్టిగా‌ ఏడుస్తున్నారు. అప్పు చేసిన ముసలాయన తలవంచుకుని ఇంటి బయట, షావుకారు ముందు నిలబడి ఉన్నాడు. ఆ ముసలాయన కొమరప్పకు దగ్గరి బంధువు. చూడగానే సంగతి తెలిసిపోయింది కొమరప్పకు.

దాంతో ఇంక ఆగలేక, అతను వాళ్ల దగ్గరికి వెళ్ళి, వివరాలు తెలుసుకొని, తన చేతిలో ఉన్న డబ్బంతా షావుకారుకు ఇచ్చేసి, గొడవను సర్దుబాటు చేసాడు. ఆపైన ఒట్టి చేతులతో ఇంటికి వచ్చి, జరిగిన విషయం అంతా చెప్పాడు భార్య కుమరమ్మతో.

కుమరమ్మ ఉత్తమురాలు; భర్తకు చేదోడు వాదోడైనది. ఆమె భర్తను తిట్టలేదు. పైగా మెచ్చుకుని, "పోతే పోయిందిలే, పాడు డబ్బు. కష్టాల్లో‌ ఉన్నవాళ్లని ఆదుకోకపోతే ఇంక ఆ డబ్బెందుకు, బంధుత్వాలెందుకు?!" అనేసింది.

అయితే వాస్తవం కఠోరంగా ఉంటుంది. కొన్నాళ్ళు గడిచేసరికి వాళ్లకు ఇల్లు జరగటంలో కష్టం తెలిసి వచ్చింది. ముసలి భార్యాభర్తలు ఇద్దరూ చిన్న చిన్న కూలి పనులు చేస్తూ, చాలీ చాలని ఆదాయంతో, ఒంటి పూట తింటూ కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది.

ఒక రోజున ఉదయాన్నే వంటచెరకు కోసం దగ్గరలో ఉన్న అడవికి పోయాడు కుమరప్ప. కట్టె పుల్లల కోసం‌ అడవంతా తిరిగాడు; చాలా అలసిపోయాడు. ఆకలిగా ఉంది- రాత్రంతా‌ ఏమీ‌ తిని ఉండలేదు. చివరికి పుల్లలు మోపు కట్టుకునే సరికి అతని కళ్ళు తిరిగినై; అక్కడికక్కడే‌ పడి మూర్ఛ పోయాడు.

సాయంత్రం అయినా మెలకువ రాలేదతనికి. చీకటి విస్తరిస్తూంది. అతను వచ్చినప్పటి నుండీ అతన్నే గమనిస్తున్న కుందేళ్ల జంట ఒకటి మెల్లగా అతని దగ్గరకు వచ్చింది. ఒక కుందేలు అతని ముఖం మీదికి ఊదింది. రెండోది అతని చేతులు పట్టుకొని ఊపింది. కుమరప్పలో ఎలాంటి చలనమూ లేదు.

అప్పటికే క్రూర జంతువుల సంచారం మొదలైంది. ఆగి ఆగి వాటి అరుపులు వినిపిస్తున్నాయి. నక్కలు కూడా కూస్తున్నాయి.

కుందేళ్ళు ఏమనుకున్నాయో, ఏమో; రెండూ చకచకా ఆకులు-అలములు తెచ్చి అతనిమీద పోసి అతన్ని కప్పేసాయి.

అక్కడే తిరుగుతూ ఉండిన ఉడుత ఒకటి, వాటికి సాయపడింది. ఆ‌ ప్రక్కనే చెట్టుమీద కూర్చున్న నెమలి అవి జంతువులు చేసే‌ పనిని చూస్తూ‌ , నక్కలు-తోడేళ్ళ సంచారాన్ని గమనిస్తూ, వాటికి హెచ్చరికలు అందించింది.

తెల్లవారింది. అతను మేలుకున్నాడు.

కుందేళ్లు ఎర్రగా మాగిన పండునొకదాన్ని తెచ్చి అతని ముందుంచినై. ఉడుత పిల్ల తన వంతుగా చిన్న పండు ఒకటి తెచ్చి అతని ముందు ఉంచింది. నెమలి ఏవో ఆకుపచ్చ ఆకులు మూడింటిని తెచ్చి అతని ముందు వేసింది.

కొమరప్పకు చాలా ఆకలిగా ఉంది. చకచకా పండ్లు తినేసాడు. చూస్తూండిన నెమలి గరగరమని ఏదో శబ్దం చేసి, కాళ్ళు నేలమీద రాసింది: అతను నవ్వి, "ఓహో! నువ్వు తెచ్చిన ఆకులు కూడా తినాలా?!‌ సరే" అని నవ్వుకుంటూ‌ ఆ ఆకుల్ని కూడా తినేసాడు.

ఆకులు తియ్యగా‌ ఉన్నాయి. వాటితోటి కొమరప్ప ఆకలి తీరింది. దాహం తగ్గింది. నిద్ర ముంచుకొచ్చింది. మరుసటి రోజు వరకూ తెలివి లేదు అతనికి. మేలుకోగానే అవి పండ్లు, ఆకులు తెచ్చి ఇచ్చాయి. అతను వాటిని తినేసి నిద్రపోయాడు మళ్ళీ.

మూడవ రోజు కూడా అంతే జరిగింది.

అయితే అతనికి ఆరోజు సాయంత్రానికల్లా మెలకువ వచ్చేసింది. అతన్ని చూసి నెమలి, ఉడత, కుందేళ్ళు సంతోషంతో గంతులు వేశాయి.

ఇప్పుడతనికి మత్తు వదిలింది. ఆకలి తీరింది. సత్తువ కూడా బాగా వచ్చింది. వాటికి ధన్యవాదాలు చెప్పుకొని, కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరాడు.

అతను ఇల్లు చేరేటప్పటికి చీకటిపడింది. కొమరప్ప తలుపు తట్టగానే తలుపు తీసిన కుమరమ్మ అతడిని వింతగా చూస్తూ "ఎవరు నాయనా, నువ్వు? ఏం కావాలి?" అని అడిగింది.

కుమరయ్య కోపంగా "ఏమే! గుర్తుపట్టలేదా?! ఎకసెక్కాలు ఆడుతున్నా-వా?!" అనగానే ఆమె అతడి స్వరం గుర్తుపట్టి ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది!!

"ఏమయ్యో! ఎక్కడికి పోయినావు, ఇన్ని రోజులు? ఎందుకయ్యా, నువ్వు ఇట్టా అయినావు?" అనటం మొదలు పెట్టింది.

అతను బిత్తరపోతూ "ఏమైనానే?! నాకేమైతాది?" అనగానే ఆమె ఇంక మాట్లాడకుండా ఇంట్లోకి పోయి, అద్దం తెచ్చి చూపించింది:

కొమరప్ప తనని తాను గుర్తు పట్టలేకపోయాడు! తను పూర్తిగా యువకుడైపోయాడు!

అందుకేననమాట, తను కట్టెలమోపును అవలీలగా తేగలిగింది!

అతను అబ్బురపడుతూ ఈ మూడు రోజుల్లోనూ ఏం జరిగిందో చెప్పాడు కుమరమ్మకు. అంతా విని ఆమె నవ్వి "బాగుందిలే మన జోడీ: నువ్వు యువకుడివి; నేను ముసలిదాన్ని! ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే నవ్విపోతారు. కానీ ఏంచేస్తాం?!" అంది.

కొమరప్ప కొంచెం ఆలోచించి "కాదులే, రేపు ఉదయం నువ్వూ రా. నీకు ఆ తావు చూపిస్తా. ఆ కుందేళ్లు, ఉడత నెమలి ఇంకా అక్కడే ఉండచ్చు" అన్నాడు.

తెల్లవారగానే ఇద్దరూ బయలుదేరి అడవిలోకి వెళ్ళారు. వాళ్లని చూడగానే కుందేళ్ళు, ఉడత, నెమలి దగ్గరికొచ్చి పలకరించాయి. కుమరమ్మ చుట్టూ తిరిగి, ఆమెకు కూడా పళ్ళు, ఆకులు తెచ్చి ఇచ్చాయి. మూడు రోజులు గడిచే సరికి కుమరమ్మ కూడా అందమైన యువతిగా మారిపోయింది! ఇద్దరూ తలా ఒక కట్టెల మోపు ఎత్తుకొని ఇల్లు చేరారు.

వాళ్ళను చూసి అందరికీ ఆశ్చర్యమైంది. "ఎట్లా జరిగింది, ఇలా?" అని అడిగినవాళ్ళందరికీ "మేము చచ్చిపోవాలని అడవిలోకి వెళ్ళి, కనిపించిన ఆకులు అలములు తిన్నామా, తినగానే ఇట్లా అయిపోయినాం!" అని చెప్పారు వాళ్ళు. కొందరు నమ్మారు; కొందరు నమ్మలేదు. అయినా ఇప్పుడు ఇద్దరూ కుర్రవాళ్ళే కాబట్టి, ఇద్దరికీ పని దొరికింది, మళ్ళీ వాళ్ల సంసారం సజావుగా సాగిపోసాగింది.

ఈ సంగతి షావుకారికి తెలిసింది. అతడు వచ్చి వీళ్ల నెత్తిమీద కూర్చున్నాడు "మీరు తిన్నలాంటి పండ్లు, ఆకులు నాక్కూడా తెచ్చి ఇవ్వండి" అంటూ.

"అయ్యో, అవి ఎక్కడున్నాయో కూడా మాకు తెలీదు- కుందేళ్లు, ఉడత, నెమలి తెచ్చి ఇచ్చాయి మాకు" అని నోరుజారాడు కుమరప్ప. దాంతో షావుకారు వీళ్ళను బెదిరించి, పూర్తి సమాచారం బయటికి లాగాడు.

"ఓహో! ఇదన్నమాట, సంగతి!" అని అతను కొమరప్ప దుస్తులు వేసుకొని, ఆ గుర్తుల ప్రకారం అడవిలోకి పోయాడు.

అతన్ని చూడగానే అడవిలో పక్షులు-జంతువులు అన్నీ భయపడ్డాయి. అయినా కొమరప్ప మీది అభిమానంతో అతనికి కూడా మూడు రోజుల పాటు పండ్లు, ఆకులు తెచ్చి ఇచ్చాయి.

అట్లా మూడు రోజులు గడిచే సరికి ముసలి షావుకారి కాస్తా మధ్య వయసువాడు అయిపోయినాడు. చివరి రోజున నిద్ర లేవగానే, అతను తన దగ్గరికి వచ్చిన కుందేళ్లనీ, ఉడతనీ, నెమలినీ అక్కడినుండి తరిమేసి, ఆ చుట్టుప్రక్కల అంతా వెతుక్కున్నాడు. కొద్ది సేపటికే అతనికి అట్లాంటి పళ్ళు, ఆకులు ఉన్న చెట్లు కనిపించాయి. వాటిలోంచి అందినన్ని ఆకులు మూట కట్టుకుని, అతను గబగబా ఇల్లు చేరుకున్నాడు.

ఇంటికి వచ్చి అద్దం చూసుకున్నాక, అతను సంతోషపడలేదు; ఏడుపు ముఖం పెట్టాడు- “నాకు మధ్యవయసే ఎందుకు వచ్చింది? ఇంకా కుర్రవాడిని కావాలి!" అని.

షావుకారు భార్య మంచిది. దురాశ పూనిన తన భర్తను చూసి ఆమె బాగా నవ్వింది. “ఎక్కువ ఆకులు తింటే ఇట్లా అయిపోతారేమో. మీరు కొన్ని తక్కువ ఆకులు తిని ఉండాల్సింది" అన్నది.

అయినా షావుకారి "ఇవన్నీ తింటే నేను ఇరవై ఏళ్ళ కుర్రవాడినైపోతాను" అంటూ తను తెచ్చిన ఆకులు, పండ్లు అన్నీ ఒకేసారి తినేసాడు! ఆ వెంటనే మూడు రోజులపాటు గాఢనిద్ర క్రమ్ముకున్నది అతనికి! లేచి చూసే సరికి, అతను కాస్తా పండు ముసలివాడు ఐపోయి ఉన్నాడు!

దాంతో షావుకారు పరుగు పరుగున కొమరప్ప దగ్గరకు వెళ్ళి, "నా ఆస్తులన్నీ రాసిస్తా; నీ మిత్రులకెవరికో చెప్పి ఈ ముసలితనం ఒక్కటీ పోగొట్టు!" అని కాళ్ళావేళ్ళా పడ్డాడు.

కొమరప్ప, అతన్ని పట్టుకొని అడవంతా తిరిగాడు గానీ, ఎంత వెతికినా ఇంక ఆ జంతువులు, ఆ మొక్కలు ఇంక అసలు కనబడనే లేదు!!

అట్లా ముసలి షావుకారు మరింత ముసలివాడైపోయాడు. కొత్తగా వచ్చి పడిన ముసలితనంతో కొంత, అవమానభారంతో ఇంకొంత కృంగిపోయాడు.