మైనంపాడు గ్రామంలోని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో 25 సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులంతా ఆ రోజున "గెట్‌ టుగెదర్‌" ఏర్పాటు చేసుకున్నారు. ఆ "ఆత్మీయ కలయిక" లో అందరూ తమ అనుభవాలను నెమరు వేసుకున్నారు.

వాళ్ళు అక్కడ చదివిననాడు పని చేసిన ఉపాధ్యాయులందరూ విచ్చేసారు. అందరూ మాట్లాడాక, ప్రిన్సిపాల్‌ చౌదరి గారు చెప్పారు, మనసుకు హత్తుకునేట్లుగా:

"మీరంతా జీవితంలో చాలా ఎదిగారు. మీలో చాలా మంది టీచర్లయ్యారు. మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అట్లాంటి మీనుండి నేను ఆశించేది ఒకటి ఉన్నది: అదిగో, అక్కడ- వేదిక వెనుకవైపున బ్యానర్‌లో మీరు ఏర్పాటు చేసిన సూక్తి ఉన్నదే, "మహోన్నత విజయాల కన్నా మానవత్వపు విలువలు మిన్న!” అని- అది నాకు చాలా నచ్చింది. మీరంతా మరెన్నో విజయాలను సాధించండి- అయితే మీ జీవితాలలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, మానవత్వపు విలువలను మాత్రం మరువకండి.

అంతేకాదు- మానవులుగా సమాజం పట్ల మీకు ఉన్న బాధ్యతను నెరవేర్చండి. మీకు సమాజం చాలా ఇచ్చింది. ఆ ఋణాన్ని మీరు తీర్చుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించండి" అని.

ఆయన మాటలు విద్యార్థులందరిలోనూ స్పూర్తిని ఇంకా పెంచాయి. ఎవరికి వాళ్ళు ఆయన మాటల్నే గుర్తు చేసుకుంటూ స్వస్థలాలకు ప్రయాణమయ్యారు.

వాళ్ళలో ఒకడు- ఎన్నారై పరశురామ్‌- తను ఆ రాత్రికి అక్కడే ఒక మిత్రుని వద్ద బస చేశాడు. మరుసటి రోజు తన కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. కారు రోడ్డు మీద పరుగులు తీస్తుంటే, మనసు ప్రిన్సిపల్ గారి మాటలమీదికి మళ్ళింది… 'నేను ఇప్పటికి చాలా డబ్బు సంపాదించాను. కానీ మంచిపనులు ఎన్ని చేసాను? ఆయన అన్నట్లు, నిజంగా ఏదైనా ఒక మంచి పని చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది?' అని.

అంతలో కారు ఆగింది- "డ్రైవర్‌! ఎందుకు కారు ఆపావు?'' అంటూ ఈ లోకంలోకి వచ్చాడు పరశురామ్‌.

"ట్రాఫిక్‌ సిగ్నల్ సర్" డ్రైవర్‌ సమాధానం.

చుట్టూ చూశాడు పరశురాం. అది బెంజిసర్కిల్‌ సెంటర్‌. ట్రాఫిక్‌ చాలా ఉంది. "ఓహో! విజయవాడ వచ్చేశామా!” అనుకున్నాడు.

అంతలో ఒక బిచ్చగత్తె కారు కిటికీ మీద టకటకా కొట్టింది వ్రేళ్లతో. ఆమె చంకలో చిన్న బిడ్డ ఉన్నాడు.

"ధర్మం చేయండి బాబూ!" దీనంగా అడిగింది.

పరశురామ్‌కు బిచ్చం వేయటం ఇష్టం లేదు. అడుక్కునే వాళ్ళంటే తనకు పడదు.

కిటికీ అద్దం క్రిందికి జార్చి, "కాళ్ళూ చేతులూ బాగానే ఉన్నాయిగా?! ఏదైనా పని చేసుకోలేవూ?! వెళ్ళు..వెళ్ళు.." అంటూ కోప్పడ్డాడు.

గొణుక్కుంటూ వెళ్ళింది బిచ్చగత్తె. పావుగంట గడిచింది. ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ పడలేదు.

"ష్‌! అబ్బా, ఈ బెంజి సర్కిల్‌లో ఎప్పుడూ ఇంతే- ఎంతసేపు ఆగాల్సి వస్తుందో ఎవరికీ తెలీదు"

విసుక్కున్నాడు పరశురాం. అంతలోనే మరో చిన్న పిల్లవాడు వచ్చాడు కారు దగ్గరికి.

వాడికి నిండా పదేళ్ళు కూడా లేవు; అడుక్కుంటున్నాడు!

"ఇంత చిన్న పిల్లవాడు అడుక్కోవటం ఏమిటి?!” అనిపించింది. బయటికి మటుకు "పోరా, పో!" అన్నది నోరు.

ఆ వెంటనే మరొకడు- ఇతనికి యాభై ఏళ్ళు దాటి ఉంటాయేమో, అంతే- ముసలి బిచ్చగాడు. ఈసారి పరశురాం కిటికీ అద్దం పైకి వేసేశాడు. అడిగి అడిగి వెళ్ళిపోయి ఉంటాడు ముసలివాడు.

గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. వాహనాలు కదిలాయి. పరశురాం ఇల్లు చేరేలోగా ఇలా నాలుగైదు జంక్షన్లలో కారు అగింది: ఆగిన ప్రతిచోటా బిచ్చగాళ్ళ గోల...

పరశురామ్‌ చిరాకు తారస్థాయికి చేరింది. "ప్రతివాడికీ ఇదో సులభ సంపాదన అయిపోయింది. ఛీ..ఛీ... మొన్న పేపర్లో కూడా వేశారుగా?! హైదరాబాదులో 95% మంది డమ్మీ బిచ్చగాళ్లున్నారని?! దొంగలు! ఏదో ఒక పని చేసుకొని చావచ్చుగా?! ఏమిటో, ఈ దరిద్రపు బతుకులు?!” అనుకుంటూ ఇల్లు చేరాడు. ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్నాడు ఫ్రీలాన్స్ రిపోర్టర్ శేషు. “గుడ్మార్నింగ్ సర్" విష్ చేసాడు పరశురామ్‌ని.

“ఇదిగో శేషూ, నాకో పని చేసి పెట్టు, అర్జంటుగా. అసలు ఈ బిచ్చగాళ్ళు ఎవరు? ఎందుకు అడుక్కుంటారు? ఏదైనా పని ఎందుకు చేసుకోరు?” వివరంగా కనుక్కో. అన్ని గణాంకాలతోటీ, అన్ని ఇంటర్వ్యూలతోటీ వీలైనంత త్వరగా నాకొక రిపోర్టు కావాలి!” పని అప్పగించాడు.

కొద్ది రోజుల్లోనే శేషు రిపోర్టు పట్టుకొచ్చాడు- "భర్తలు వదిలేసిన అడవాళ్ళు. తల్లిదండ్రులు చనిపోయిన అనాధలు, పిల్లలు వదిలేసిన ముసలివాళ్ళు, మోసపోయిన ఆడవాళ్ళు,.. ఇలా రకరకాల వాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు. 'మరి పని చేసుకోవచ్చు కదా?’ అంటే "అందరూ ఆమాట అనే వాళ్ళే కానీ, నిజానికి పని ఇచ్చే వాళ్ళు లేరు..” రిపోర్టును చదివిన పరశురామ్‌ కళ్ళు చెమ్మగిల్లాయి.

"ఆదరించే వారు, పట్టించుకునే వారు, చెప్పేవారు లేక ఇలాగ అవుతున్నారు.." ప్రిన్సిపాల్‌ గారి మాటలు గుర్తుకొచ్చాయి పరశురామ్‌కు.

వెంటనే బాల్యమిత్రుడు విజయ్‌ని రమ్మన్నాడు. విజయవాడలోనే ఓ చిరుద్యోగి విజయ్. పరశురాం అతనికి తన ఆలోచన చెప్పాడు- “నీ కుటుంబానికి జీవితాంతం ఏ లోటు లేకుండా ఏర్పాటు చేస్తాను" అన్నాడు. విజయ్ సరేనన్నాడు.

ఆ వెంటనే నగరానికి దూరంగా ఓ ముప్ఫై ఎకరాల స్థలాన్ని కొన్నాడు పరశురాం. అందులో ఒక అనాధాశ్రమం కట్టడానికి కావలసిన ఏర్పాట్లు, అనుమతులు సాధించాడు. నమ్మకమైన ఒక డాక్టర్‌, వివిధ రంగాల ఇంజినీర్స్... డ్రైవర్...ఇలా అవసరమైన సాంకేతిక నిపుణులను ఉద్యోగులుగా తీసుకున్నాడు.

విజయ్‌ని ట్రస్టీగా ఉంచి, ఆశ్రమ నిర్మాణం పూర్తి చేయించాడు. దానికయ్యే ఖర్చునంతా తనే స్వయంగా భరించాడు. పూర్తి అయిన తర్వాత తాననుకున్న విధంగా పనిచేసేందుకు అవసరమయ్యే సామగ్రిని, వాహనాలను సిద్ధం చేసుకొన్నాడు.

పేదవారికి పలు ఉపాధి అవకాశాలను ఇచ్చే చక్కని ఆశ్రమం ఒకటి తయారైంది. విజయ్, తదితరులు అప్పటికే చాలా మంది బిచ్చగాళ్లను కలిశారు. ఆశ్రమం గురించి వాళ్లకు అర్థమయ్యే భాషలో వివరించారు.

ఆశ్రమం ఇచ్చే ఉపాధి అవకాశాల గురించి, జీవన భృతి గురించి, వాహన సౌకర్యం గురించి చెప్పారు. "మీకిష్టమైతేనే రావచ్చు" అంటూ చిరునామా ఇచ్చారు.

త్వరలోనే ప్రిన్సిపాల్‌ చౌదరి గారి చేతులమీదుగా, విజయ్, పరశురాం ట్రస్టీలుగా "మానవతా నిలయం" ప్రారంభమైంది. ఆపైన ఎందరికో అది ఉపాధి నిలయంగా మారింది.

"మహోన్నత విజయాల కన్నా మానవత్వపు విలువలు మిన్న" అన్న సూక్తి ఆ ఆశ్రమంలోని అన్ని గదులలోనూ కనబడుతుంది!