అనగనగా ఓ హంస. ఆ హంస ఒకసారి ఓ చక్కని చెరువులో ఈత కొడుతూ తిరుగుతున్నది, తోటి హంసలతో బాటు.
సరిగ్గా ఆ సమయానికే అ దేశపు మహారాజు ఏదో పని మీద వెళుతూ ఉన్నాడు ఆ త్రోవలో. వెళుతూ వెళుతూ దాహం తీర్చుకోవటంకోసం ఆయన చెరువులోకి దిగాడు.
ఆయన్ని చూడగానే హంసలన్నీ ఎగిరిపోయాయి- కానీ మన హంస మాత్రం, పరధ్యానంలో ఉండి రాజు దగ్గరకే ఎగిరి వచ్చి, ఆయన చేతచిక్కింది.
ఆ మహారాజు కూడా పాపం మంచివాడు- ఆ హంసను ఏమీ చేయలేదు. ఊరికే దాని రెక్కలను దువ్వి విడిచి పెట్టేశాడు.
దానికి ఆ హంస చాలా ఆనందపడి "ఓ మహారాజా! నీ చేత చిక్కినా కూడా నాకు ఏ ఆపదా కలిగించకుండా విడిచి పెట్టావు. అందుకు కృతజ్ఞతగా నేను నీకొక సహాయం చేస్తాను. మా దేశంలో మహారాజుకు ఓ కుమార్తె ఉంది.
ఆ అమ్మాయి చాలా చక్కనిది, మంచిది, అనేక శాస్త్రాలు చదివింది. నువ్వూ మంచివాడివే కనుక, నేను ఏం చేస్తానంటే- ఆమెకు నీ గురించి చెబుతాను. ఎలాగైనా ఆమెకు నువ్వంటే ఇష్టమయ్యేలా చేస్తాను. మరి నువ్వు కొన్ని రోజుల తర్వాత మా దేశానికి వచ్చి ఆ అమ్మాయిని పెళ్ళాడు!" అన్నది. రాజు అంగీకరించాడు.
ఆ హంస అన్నంత పనీ చేసింది. తమ దేశపు యువరాణి దగ్గరకు వెళ్ళింది. ఆ యువరాణికి అందకుండా పరిగెత్తింది, మళ్ళీ ఆమె చేతికి చిక్కింది, ఆమెను మురిపించింది, ఆపైన 'త్ర-త్ర' అనుకుంటూ ఇట్లా మాట్లాడింది:
సహస్ర పత్రాసన పత్రహంస వంశస్య పత్రాణి పతత్రిణః స్మ !
అస్మాదృశాం చాటురసామృతాని స్వర్లోకలోకేతరదుర్లభాని
"అమ్మాయీ! నేను బ్రహ్మవాహనమైన హంసల కుటుంబానికి చెందిన దాన్ని. నేను మాట్లాడే చమత్కారమైన మాటలు వినటం దేవతలకు కూడా సాధ్యంకాదు" అని దీని అర్థం.
అట్లా తన పాండిత్యంతోటి ఆమెను మెప్పిస్తూ, మెల్లగా మాటలు కలిపింది; తను మాట యిచ్చిన మహారాజు రూప లావణ్యాల గురించి, శౌర్య ప్రతాపాల గురించి చెప్పింది; ఇలా చక్కటి దూతగా తన పని చేసింది.
ఆపైన ఆ మహారాజు, వీళ్ల రాజ్యానికి రావటం, స్వయంవరంలో పాల్గొని యువరాణిని పెళ్ళాడటం జరిగిపోయింది!
ఆ మహారాజు పేరు నలుడు. యువరాణి దమయంతి!
ఈ కథలో హంసను చేర్చి, అందంగా తీర్చిన కవి పేరు 'శ్రీహర్షుడు'. ఆయన సంస్కృతంలో వ్రాసిన కావ్యం పేరు 'నైషధీయచరితమ్'.
ఈ కావ్యాన్నే కవిసార్వభౌముడైన శ్రీనాథుడు 'శృంగారనైషధమ్' అన్న పేరుతో తెలుగులోకి అనువదించాడు.