కంబాలపల్లి ప్రాంతంలో పెద్ద అడవి ఒకటి ఉండేది. అనేక పక్షులు, జంతువులు ఆ అడవిలో సంతోషంగా‌ జీవించేవి. ఆ అడవి అందాన్ని మాటల్లో చెప్పలేం. పూల మొక్కలు, గడ్డి మొక్కలు, కాయలతోటీ, పళ్ళతోటీ తులతూగే పచ్చని చెట్లు...

అయితే ఒకసారి వరసగా రెండేళ్లపాటు వానలు పడలేదు. దాంతో అడవి మొత్తం చిన్నబోయింది. కరువు తాకిడికి అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అన్నీ విలవిలలాడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లే ఎండిపోతున్నాయంటే, ఇక చిన్న మొక్కల గురించి చెప్పేదేమున్నది?!

జంతువులన్నీ వేటికవి వానదేవుడిని ప్రార్థించాయి. "నాదేమీ లేదు, నేను ఇదివరకటిలాగానే వస్తున్నానుగానీ, గాలి నన్ను సరిగా కురవనీయట్లేదు. వచ్చిన మబ్బునల్లా ఎగరేసుకు పోతున్నది!" అన్నాడు వానదేవుడు.

అవకాశం ఉన్న జంతువులు గాలిదేవుడిని అడిగాయి. "లేదే, నేనూ ఇదివరకటిలాగానే వీస్తున్నాను.. అడవి అవతల మనుషులు ఏమైనా చేస్తున్నారేమో" అన్నాడు వాయుదేవుడు.

జంతువులకు ఏం చేయాలో తోచలేదు. చివరికి అవి అన్నీ కలిసి మాట్లాడుకున్నాయి.

"ఇంతకుముందు మన అడవిలోంచి చాలా ఏర్లు పారేవి. అన్నీ మన అడవిలోని నీళ్లను నదిలోకి తీసుకెళ్లేవే. అయితే నా చిన్నప్పుడు ఓసారి ఇట్లాగే పెద్ద కరువు వచ్చింది. అప్పుడు ఏనుగులు ఆ ఏర్లు పారకుండా అడ్డు గోడలు కట్టినై. దాంతో ఆ అడ్డుకట్టల వెనక నీళ్ళు నిలిచి, మడుగులు ఏర్పడ్డాయి " చెప్పింది ఒక ముసలి తాబేలు.

"ఎప్పటి సంగతో చెబుతావెందుకు? ప్రస్తుతం ఆ మడుగులు అన్నీ ఎండిపోయినై, పైగా ఏ ఏరులోనూ చుక్క నీళ్ళు లేవు! ఇప్పుడేం చేయాలో అది చెప్పు!" అన్నదొక కోతి అసహనంగా.

"అదే చెబుతున్నాను. అప్పట్లో మనవాళ్లంతా కలిసి ఇంకో పని చేసారు.

నదినుండి అడవిలోపలి వరకూ ఓ కాలవను త్రవ్వారు. అయితే రాను రాను మనుషులు ఇసకను త్రవ్వుకెళ్లటంతో ఆ నది మట్టంకూడా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మన కాలవే నది కంటే ఎత్తులో ఉంది, వృధాగా, ఎండిపోయి! కాబట్టి ఇప్పుడు మీరంతా పూనుకొని, ఆ కాలవ పూడిక తీయండి. దాని లోతు పెంచారంటే, నదిలో ఉండే కాసిని నీళ్ళూ ఇటు అడవిలోకి వస్తాయి; మన కష్టాలు తీరతాయి" చెప్పింది తాబేలు.

"అవునవును. ఇదేదో బాగుంది. నిజానికి మనకు వేరే మార్గం కూడా ఏదీ లేదు.. ఎవరు చేయగలిగినంత

పని వాళ్ళు చేయటమే!" అన్నాయి చాలా జంతువులు.

దాంతో ఏనుగుల నాయకత్వాన జంతువులన్నీ కాలవను లోతు చేసే పని మొదలు పెట్టుకున్నాయి.

ఎలుకలు సొరంగాలు త్రవ్వాయి. అడవి పందులు నేలను గుల్ల గుల్ల చేసాయి. గాడిదలు బరువులు మోసాయి. ఏనుగులు పెద్ద పెద్ద రాళ్ళను తొలగించటమే కాక, పని చేస్తున్న జంతువులన్నిటికీ నది నుండి తెచ్చిన నీళ్లను అందించాయి.

చివరికి వాటి కృషి ఫలించింది. నదిలోంచి నీళ్ళు కాలవలోకి ప్రవహించాయి. అడవి మధ్యలో పెద్ద జలాశయం కూడా ఒకటి తయారయింది. నీళ్ళ కష్టాలు తీరాయి.

ఆ తరువాత జంతువులన్నీ అడవి చట్టాన్ని జారీ చేశాయి: "మనం ఏ అడవిపై ఆధారపడతామో ఆ అడవిని సంరక్షించుకునే బాధ్యత మనది. ఈ చట్టాన్ని పాటించే జంతువులు జీవిస్తాయి. పాటించనివి మరణిస్తాయి" అని.