రామాపురంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మమ్మ. అతనికి ఇద్దరు కూతుళ్ళు.

సోమయ్యకి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో బంగారు పంటలు పండించవచ్చు. కానీ ఏం లాభం?! ఊళ్ళో త్రాగేందుకు సరిపడ నీళ్ళే లేవు- ఇంక పొలాలకు నీళ్ళెక్కడివి? కరువుకు తట్టుకోలేక ఊళ్ళో రైతులు చాలామంది పట్నానికి వలస పోయారు. కానీ సోమయ్య మాత్రం అక్కడినుండి కదలలేదు. ఏ రైతుకూ తను పెంచిన ఊరిని, తిండి పెట్టిన పొలాన్ని విడిచి ఎక్కడికీ పోవాలని ఉండదు. ప్రతి సంవత్సరం నష్టాలు వచ్చీ, వచ్చీ పాపం, సోమయ్య కాస్తా పేదవాడైనాడు.

సోమయ్యకి 'పొలంలో బోరు వేద్దాం' అని ఆలోచన వచ్చింది. 'బోరులో నీళ్ళు పడ్డాయంటే ఇక ఈ‌ నష్టాలు ఉండవు!'

అయితే అతని దగ్గర బోరుకు సరిపడ డబ్బు లేవు. దాంతో కొంత పొలాన్ని తాకట్టు పెట్టి, జమీందారు దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు సొమ్ముతో బోరు వేయింవాడు; కానీ తనకి అదృష్టం లేదు- బోరులో నీళ్ళు పడలేదు. భూగర్భజలాలు ఇంకిపోయాయి. సోమయ్య చాలా బాధ పడ్డాడు.

ఇక ఆ సంవత్సరం తక్కువ నీళ్లతో పెరుగుతుంది కదా అని పత్తి పంట వేశాడు. పత్తి బాగానే‌ పెరిగింది.

కానీ పంట చేతికి వచ్చే సమయానికి, ఎండిన పొలంలో‌ నిప్పు రాజుకొని, పంట మొత్తం బూడిదైపోయింది. ఆ బాధకి సోమయ్య పాపం, వారం రోజులపాటు అన్నం తినలేదు.

ఆ తరువాతి సంవత్సరం అతను మిరప పంట వేశాడు. పెట్టుబడికోసం మళ్ళీ జమీందారు దగ్గర అప్పు తీసుకున్నాడు. కొన్ని రోజులు గడిచే సరికి, గడ్డి దొరకని ఆవులన్నీ పంటమీద పడి నాశనం చేశాయి.

పెట్టుబడి మొత్తం నష్టమైంది.

"ఈసారి పంటలు వేయద్దు. నీకు వ్యవసాయం అచ్చిరాలేదు" చెప్పారు అందరూ.

కానీ సోమయ్య చెయ్యి ఊరుకోలేదు. ఈసారి అతను ప్రక్క పొలం వాళ్ళతో మాట్లాడుకొని, సగం తోటలో వరి మడి నాటాడు. వరికి నీళ్ళు చాలా అవసరం. "అసలే వానలు లేవు- వరి ఎందుకు వేస్తావు?" అని తిట్టారు అందరూ. వాళ్ళు అన్నట్లుగానే పొలం మంచిగా పండలేదు. పొలంలో చల్లేందుకు బయటినుంచి అప్పుపెట్టి మందులు తెచ్చాడు.

మళ్ళీ ఓసారి జమీందారును డబ్బులు అప్పు అడిగాడు. కూతుర్లకి స్కూలు ఫీజు కట్టాలి... "ఇక తట్టుకోలేను" అనుకున్నాడు. పొలంకోసం తెచ్చిన పురుగుమందులను తాగేద్దామని నిశ్చయించుకున్నాడు.

అంతలో అకస్మాత్తుగా మేఘాలు క్రమ్ముకున్నాయి. 'ఢమ!... ఢమ!...' అంటూ ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లులు పడ్డట్లు వానలు కురిసాయి. వాగులు, వంకలు పారాయి.

చెరువులన్నీ నిండాయి.

ఇక బాధ లేదు. అప్పులు అన్నీ తీరిపోయాయి.

అయితే అప్పుడు వానలు పడకపోయి ఉంటే‌ ఏమయ్యేది? సోమయ్య పురుగుమందుకు బలైపోయేవాడు! అతని కుటుంబం మొత్తం కష్టాలపాలయ్యేది!

వ్యవసాయంలో ప్రధాన సమస్య ప్రకృతి వైపరీత్యాలు. గాలి ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా; వాన ఎక్కువ వచ్చినా,తగ్గినా; ఎండ ఎక్కువ వచ్చినా, తగ్గినా- ఏమాత్రం తేడా వచ్చినా పంటలు పండవు. దానిమీద ఆధారపడిన రైతు పరిస్థితి గాలిలో పెట్టిన దీపం. ఇన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి రైతులు పండించిన పంటల్ని తిని దేశం అంతా బ్రతుకుతున్నది. అందుకని ఆహార పదార్థాలని వృధా చేయకూడదు. దాన్ని పండించిన రైతు శ్రమని అందరమూ అర్థం చేసుకోవాలి.

ప్రకృతి సమస్యల వల్ల రైతులకు నష్టాలు రాకుండా వ్యవస్థల్ని ఏర్పరచాలి. ప్రధానంగా సాగునీటి సమస్యల్ని దూరం చేసేందుకు చెరువులు, వాగులు, వంకల్ని సరిచేసి, నీటికోతని నివారించే చర్యలు చేపట్టి, వాననీటిని ఆపే ఏర్పాట్లు చేయాలి. అన్నదాతకు భద్రత కల్పించవలసిన బాధ్యత మనందరిమీదా ఉన్నది!