అనగనగా ఒక అడవిలో ఇద్దరు మిత్రులు ఉండేవి: ఒకటేమో పంది, రెండవదేమో నక్క.
ఒకరోజున రెండూ కలిసి బయట మాట్లాడుకుంటూ ఉన్నాయి. అంతలో అకస్మాత్తుగా పొదల్లోనుంచి పంది మీదికి దూకింది, ఒక చిరుతపులి!
అది నేరుగా పంది మెడను పట్టుకొని కొరికి చంపెయ్యబోయింది.
అంతలో నక్క చిరుతపులిని వారిస్తూ "చూడు మామా! నీకు ఆకలి వేస్తూన్నది; అయినా కొంచెం మెదడును ఉపయోగించు. ఈ పంది చాలా శుభ్రంగా ఉంది- చూసావు గదా. కానీ అసలు పందులంటే ఎలా ఉండాలి? మురికిగా ఉండాలి. శుభ్రంగా ఉండే పందులు రుచిగా ఉండవు. అందుకని ఆ తినేదేదో దీన్ని బురదలో దొర్లించి తిను! చాలా రుచిగా ఉంటుంది" అని చెప్పింది.
"ఓహో! అట్లాగా!" అని చిరుతపులి పందిని ఆ ప్రక్కనే ఉన్న బురదగుంతలోకి తీసుకు పోయింది- దొర్లించడానికి. నక్క సైగల్ని అర్థం చేసుకున్న పంది, చిరుతపులి తనని బురదలో పడేసేంత వరకూ కదలకుండా ఊరుకొని, ఒకసారి బురదలో పడగానే రెండు కాళ్ళతోటీ టపటపా తన్ని, బురదనంతా చిరుతపులి ముఖాన పడేట్లు కొట్టింది. ఆ వెంటనే అది తుడుచుకునేలోగా తను మురికి గుంతలోంచి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుని, ఇక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది.
"అయ్యో! మోసపోయానే!" అని నిట్టూరింది పులి.
తర్వాత కొన్ని రోజులకు, ఓసారి పంది బురదగుంతలో మునిగి తేలి, సంతోషంగా కళ్ళు మూసుకున్నప్పుడు, అప్పుడే దాన్ని చూసిన చిరుతపులి గబాలున వచ్చి, దాన్ని టక్కున నోట కరచుకున్నది. "ఇప్పుడు దొరికావు. బురద బురదగా ఉన్నావు. చాలా రుచిగా ఉంటావు!" అన్నది పళ్ళు నూరుతూ.
"అయ్యో! మామా! ఇవి ఇప్పుడు ఏం రోజులు? అమావాస్య రోజులు! అమావాస్య రోజుల్లో బురదపందిని తిన్నవాళ్ళు పాతాళానికే పోతారు. నన్ను బాగా కడుక్కొని తిను, కావాలంటే" అన్నది తెలివి మీరిన పంది, దానితో.
"అవునా?! అట్లాగా?!" అని, చిరుతపులి దాన్ని నోట కరచుకొని, పారుతున్న వంకలోకి పోయింది.
అక్కడ దాన్ని వదలకుండానే శుభ్రంగా కడిగింది. అటుపైన దాన్ని నీళ్లలోనే తినబోయింది.
సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చిన నక్క దాన్ని చూసి "హలో! మామా! ఆ పందిని ఎండబెట్టు! వెంటనే! ప్రమాదం!!" అని అరిచింది గట్టిగా.
"ఎందుకు?" అన్నది పులి, ఒకింత అనుమానంగా.
"అమావాస్య రోజుల్లో తడి పందిని తిన్నవాళ్ళు మూడు రోజుల్లో జరం వచ్చి పోతారని వినలేదా, నువ్వు?!" అన్నది నక్క సీరియస్గా ముఖం పెట్టుకొని.
"లేదే?!" అన్నది పులి.
"నిజం! కావాలంటే సాంబుడిని అడుగు- ముందు దీన్ని ఎండలో వెయ్యి. నువ్వు ఆ ప్రక్కనే నిలబడి ఉంటావు కదా, అది ఎక్కడికి పోతుంది? కావాలంటే దాని పొట్టమీద నీ పంజా వేసి పెట్టు!" అన్నది నక్క తెలివిగా.
'సరే' అని పందిని నేలమీద పడేసి, తన పంజాని దాని పొట్టమీద వేసుకొని నిలబడ్డది పులి.
అట్లా కొంచెం సేపు ఆగి, తను కొంచెం ఆరుతూనే, పులి పంజాని పట్టుకొని చక్కలిగిలి పెట్టేసింది పంది, పులి చక్కలిగిలికి తట్టుకోలేక 'కికికి' అంటూ విరగబడగానే, చటుక్కున లేచి ఇంటికి పరుగుపెట్టింది, 'బ్రతుకు జీవుడా' అంటూ!
మరోసారి మోసపోయిన పులికి తను ఎవరివల్ల మోసపోయిందీ అర్థమే కాలేదు!