అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. ఏనుగు, కుందేలు, జింక- ఇట్లా జంతువులు అన్నీ కలిసి మెలిసి ఉండేవి. కష్టసుఖాల్లో ఒకదానికొకటి తోడుగా ఉంటూ సంతోషంగా‌ జీవించేవి. కానీ నక్కమాత్రం వాటితో పూర్తిగా కలిసేది కాదు. ఒక్కోసారి తన మోస పూరిత బుద్ధిని ప్రదర్శిస్తూ ఉండేది.

ఒక రోజున ఎప్పటి మాదిరే ఆహారం వెతుక్కుంటూ ఉన్న ఏనుగుకు ఒక పెద్ద నిధి దొరికింది.

వెంటనే అది ఆ సంగతి మిగిలిన జంతువు-లన్నిటికీ చెప్పి, "దీని ఫలితం అందరికీ లభించాలి- దీన్ని అందరం పంచుకుందామా, ఒకచోట ఉంచి సరిగా నిర్వహించుకుందామా మీరే చెప్పండి" అన్నది. జంతువులన్నీ దాన్ని మెచ్చుకొని, 'ఇది నీకే దొరికింది గనక, దీని నిర్వహణ కూడా నువ్వే చెయ్యి' అన్నాయి.

అయితే అక్కడే‌ కూర్చున్న నక్కకి ఇది అస్సలు నచ్చలేదు. అయినా అది బయట పడకుండా ఊరుకొని, ఆపైన దానికే చిలవలు పలవలు అల్లి, సంగతిని సింహం చెవిన వేసింది.

"మరైతే మనకు ఏ ఏ జంతువులు సహకరిస్తాయి?" అడిగింది సింహం.

"అందరినీ ఏనుగు తన వశం చేసుకున్నది ప్రభూ. దాని మాయలో పడిన జంతువులేవీ మనమాట వినవు. ఆ ఏనుగు కూడా అందరినీ కూడగట్టి అడవికి రాజు అవుదామని అనుకుంటున్నట్లుంది" అంటూ దాన్ని మరింత ఉసిగొల్పింది నక్క.

"మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు?" అడిగింది సింహం.

నక్క దానికి ఓ పథకం చెప్పింది. ప్రతిరోజూ మేత కోసమని ఏనుగు ఒక దారి వెంబడి పోతుంది. ఆ దారిలో లోతైన గుంత ఒకటి త్రవ్వి, ఆకులు అలములతో కప్పి పెట్టాలి. ఏనుగు ఆ గుంతలో పడగానే వాటికి నిప్పంటించాలి" అని. సింహం అందుకు సరేనని తల ఊపింది.

అయితే సరిగ్గా ఆ సమయానికే అనుకోకుండా అటువైపుగా‌ వెళ్తున్న కుందేలు, జింక ఆ మాటలు విన్నాయి.

వెంటనే చెంగు చెంగున గెంతుతూ వెళ్ళి, ఆ సంగతి ఏనుగుకు చెప్పి, "జాగ్రత్త బాబూ! ఈ నక్క మామూలుది కాదు.

ఒకసారి కాకపోతే మరోసారి అయినా నీ ప్రాణం మీదికి తెస్తుంది" అన్నాయి.

"అయ్యో! నాకు ఏమీ పాలుపోవటం లేదే! ఏం చెయ్యను?!" అన్నది ఏనుగు.

"నువ్వేం చేయనక్కర్లేదు- మేం ఉన్నాంగా?" అని జంతువులన్నీ కలిసి వెతికాయి. సింహము, నక్క త్రవ్విన గుంత ఎక్కడుందో కనుక్కొని, దాన్ని పూడ్చివేసాయి. బదులుగా నక్క తిరిగే దారిలో గోతిని ఒకదాన్ని తీసి, అందులో ఒక ఇనప బోనును కూడా తెచ్చిపెట్టి, అది అందులో పడటంకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాయి.

ఏనుగు పని ఐపోయిందనుకుంటూ వచ్చి దబుక్కున గోతిలో పడిపోయింది నక్క. రెండు రోజుల తర్వాత జంతువులన్నీ దాన్ని బయటికి తీసాయిగానీ, అది ఇంక స్నేహితులకు ముఖం చూపించలేక, చిక్కి శల్యమై చివరికి చనిపోయింది.

సింహం కూడా అసలు సంగతి తెలుసుకొని, ఆ దుర్మార్గపు నక్కతో చేతులు కలిపినందుకు పశ్చాత్తాపపడింది.

ఆటు తర్వాత నిధిని చక్కగా వాడుకొని, జంతువులన్నీ మెరుగైన సౌకర్యాలతో సుఖంగా జీవించాయి.