బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బోధిసత్వుడు ఒకసారి ఒక కుక్కగా జన్మించాడు. బలంగా, నిండుగా ఉండిన ఆ కుక్క, వందలాది కుక్కలకు నాయకుడిగా ఉండేది. వాటి దండు అంతా నగరంలోని పెద్ద స్మశానంలో నివసించేది.
ఒకనాడు రాజుగారు ఎప్పటి మాదిరే తెల్లటి గుర్రాలతో పూన్చిన రథం ఎక్కి నగర సంచారం చేసి, సాయంత్రం చీకటి పడుతుండగా తిరిగి వెనక్కి చేరుకున్నాడు. ఆయన ఎక్కి వచ్చిన రథాన్ని రాజ ప్రాసాదం బయటనే నిలిపి ఉంచారు భటులు. గుర్రాలకు వేసే జీను, కళ్లాలు మొదలైన తోలు వస్తువులన్నీ రథంతో పాటు అక్కడే ఉండిపోయాయి. ఆ రోజు రాత్రి వాన కూడా కురిసింది; దాంతో అవన్నీ బాగా నానాయి.
రాజుగారి కోటకి ఒక వైపున, గోడ మధ్యలో సన్నని సందు ఉండేది. చీకటిపడ్డాక, ఊళ్లో కుక్కలు కొన్ని ఆ సందులో నుండి కోట లోపలికి దూరి, ఆహారాన్ని వెతుక్కునేందుకు అలవాటు పడ్డాయి.
అయితే రాజుగారి రథం ఆలస్యంగా కోటలోకి పోవటాన్ని, ఆపైన వాన పడటాన్ని గమనించిన బోధిసత్వుడు తోటి కుక్కలతో "ఒరే! ఇవాళ్ల రాజుగారు ఆలస్యంగా ఇల్లు చేరారు. పనివాళ్ళు ఆయన వస్తువుల్ని వేటినో బయటనే వదిలిపెట్టి ఉండొచ్చు. దానికి తోడు ఇవాళ్ల వాన కూడా పడింది- కాబట్టి నేను చెబుతున్నాను; ఈ రోజున మీరెవరూ కోటలోకి పోకండి- పోతే ప్రమాదం!" అని, బయటి కుక్కలేవీ ఆ రోజున కోటలోకి పోకుండా అడ్డుకున్నాడు.
అయితే కోట లోపల కాపలా ఉండే రాజుగారి ఆస్థాన కుక్కలకు అడ్డు ఏమున్నది? అవి యదేచ్ఛగా తిరుగుతూ, రాజుగారి రథానికి తగిలించి ఉన్న జీనులు, కళ్లాలు, రథపు మెత్తలు మొదలైన తోలు వస్తువులను అన్నిటినీ రాత్రంతా నమిలి, ముక్కలు చేసి ఎంచక్కా తిని పోయాయి!
తెల్లవారాక రథపు దుర్దశను గమనించిన భటులు నాలుకలు కొరుక్కొని, "మహా ప్రభూ! ఊరి కుక్కలు దొంగతనంగా లోనికి ప్రవేశించి, దొరికిన వస్తువునల్లా పాడు చేస్తున్నాయి. నిన్నటి రాత్రి తమరి రథాన్ని కూడా తుక్కు తుక్కు చేశాయి" అని ఫిర్యాదు చేశారు.
రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే "కనిపించిన ఊరకుక్కనల్లా చంపేయండి" అని ఆదేశించాడు. వెంటనే భటులు ఊరంతా తిరుగుతూ కనిపించిన కుక్కనల్లా వలలతో బంధించి, వధ్యశాలకు తీసుకుపోవటం మొదలుపెట్టారు.
వాళ్ల చేతికి ఇంకా చిక్కని ఊర కుక్కలన్నీ బోధిసత్వుడుండే స్మశానానికి చేరుకొని, "అయ్యా! తమరు ముందుగానే హెచ్చరించారు కదా, ఆ ప్రకారమే మేం ఎవ్వరమూ నిన్నటి రాత్రి కోటలోకి అడుగు పెట్టలేదు. అయినా 'తన రథపు తోలు వస్తువులన్నీ నమిలివేసింది మేమే' అన్న అనుమానంతో రాజుగారు మమ్మల్ని అందరినీ చంపేందుకు సమకట్టారు. భటులు ఊరకుక్కల్ని వందల సంఖ్యలో పట్టుకొని పోతున్నారు. మన జాతికి పెను విపత్తు వాటిల్లింది. మీరే ఏదైనా చేయాలి" అని మొరపెట్టుకున్నాయి.
"బయటి కుక్కలేవీ లోనికి పోలేదు- కాబట్టి ఈ పని చేసింది ఖచ్చితంగా కోటలో ఉన్న రాజుగారి కుక్కలే.
అసలైన నేరస్థులు సుఖంగా ఉండగా, అమాయకులైన జీవులకు శిక్ష పడుతున్నది. ఇది తప్పు. నేరస్థులను రాజుకు పట్టించి, అమాయకుల ప్రాణాలను కాపాడుతాను" అని నిశ్చయించుకున్నాడు బోధిసత్త్వుడు.
"భయపడకండి. మీరంతా నేను తిరిగి వచ్చేవరకూ ఇక్కడే ఉండండి" అని వాటి పట్ల కరుణతో నిండిన చిత్తంతో, పది రకాలైన చైతన్యాలను స్మరించుకొని, బోధిసత్వుడు ఒక్కడే- నగర వీధులగుండా నడుస్తూ- రాజు మందిరం చేరుకున్నాడు. బోధిసత్వుని ఉన్నత ఆశయానికి అనుగుణంగా దారిలో ఏ భటుడూ అతనిపై చేయి ఎత్తలేదు.
బోధిసత్వుడు నేరుగా రాజసభకు చేరి, అక్కడ కొలువుదీరిన బ్రహ్మదత్తుడి ముందుకు పోయి నిలబడ్డాడు. అతన్ని అడ్డుకునేందుకు అక్కడ చేరిన వారెవ్వరికీ చేతులు రాలేదు.
బోధిసత్వుడు రాజుకు నమస్కరిస్తూ, మానవ స్వరంతో "ఓ రాజా! ఊళ్లోని కుక్కలన్నిటినీ చంపమని ఆదేశించింది నువ్వేనా?!" అని అడిగాడు.
"అవును-నేనే!" అన్నాడురాజు.
"అవి చేసిన నేరం ఏమిటి?"
"నా రథాన్ని అవి పాడు చేసాయి"
"ఆ పని చేసిన కుక్కలు ఏవో నీకు స్పష్టంగా తెలుసా?"
"లేదు- తెలీదు"
"అయితే మహరాజా! అసలు నేరస్థులు ఎవరో తెలీకుండానే, కనపడిన ప్రతి ఊరకుక్కనల్లా చంపమనటం ధర్మం కాదు"
"కుక్కలు నా రథాన్ని పాడుచేసాయి, కాబట్టి కుక్కలన్నింటినీ నిర్మూలించమని నేను ఆజ్ఞాపించాను"
"తమరి భటులు అన్ని కుక్కల్నీ చంపుతున్నారా, లేక కొన్నింటిని వదిలి పెడతారా?"
"మా రాజప్రాసాదంలోని మేలు జాతి కుక్కల్ని తప్ప, మిగిలిన వాటినన్నింటినీ భటులు నిర్మూలిస్తారు"
"రాజా! 'కుక్కలు నేరం చేసాయి, కాబట్టి వాటిని అన్నింటిని నిర్మూలించాలి' అని పూనుకున్న మీరు, ఆ తర్వాత 'మా ప్రాసాదం లోపల ఉండే కుక్కల్ని మటుకు బ్రతకనిస్తాను' అనటం తప్పు కదా?! 'పక్షపాతం, అయిష్టం, అజ్ఞానం, భయం’- అనే నాలుగు అధర్మ మార్గాలకూ మీ ఆలోచన దోహదం చేస్తున్నది. అటువంటి నిర్ణయాలు తప్పు. రాజులకి తగినవి కావు.
న్యాయ నిర్ణయం చేసేటప్పుడు. తక్కెడపైన ముల్లు మాదిరి- రాజు స్థిరంగా, పక్షపాత రహితంగా నిలవాలి.
కాని మీ ఈ నిర్ణయం అమాయకులైన కుక్కలకు విపత్కరంగా మారటమే కాక, అసలు తప్పు చేసిన వాటిని పూర్తిగా వదిలి వేస్తూన్నది" అన్నాడు బోధిసత్వుడు గంభీరంగా.
"ఇతనెవరో కుక్క వేషంలో వచ్చిన బోధిసత్వుడే తప్ప మరొకడు కాదు" అని నిశ్చయించుకున్న రాజు, గౌరవ పురత్సరంగా సింహసనం దిగి నిలబడుతూ "అయ్యా! మీరు చెప్పిన మాటలు యుక్తియుక్తంగా ఉన్నాయి. కానీ ఒక సంగతి చెప్పండి- మాకు ఇలా నష్టం కలిగించిన కుక్కలు ఏవో మీకు తెలుసా?" అన్నాడు.
"రాజా! నా సలహాను అనుసరించి, బయటి కుక్కలేవీ నిన్నటి రోజున మీ కోటలోకి ప్రవేశించలేదు. కాబట్టి ఈ పనిని చేసింది మీరు పెంచుకునే మేలుజాతి కుక్కలే తప్ప వేరు కాదు. అయినా ఊహలు అవసరం లేదు. ఈ ఊరి చెరువుల్లో ఏపుగా పెరిగే 'కుశ'గడ్డిని, చిలికిన మజ్జిగను తెప్పించారంటే, వాస్తవం ఏంటో మీకు తెలిసేటట్లు చేస్తాను" అన్నాడు బోధిసత్వుడు.
రాజుగారి ఆదేశాన్ని అనుసరిస్తూ, మహల్‌లోని కుక్కలన్నింటినీ అక్కడికి తెచ్చి, వాటిచేత ఆ గడ్డిని నమిలించి, మజ్జిగ త్రాగించారు భటులు. దాని ప్రభావం వల్ల అవన్నీ వాంతులు చేసుకున్నాయి. ఆ వాంతుల్లో అవి నమిలిన తోలు ముక్కలు, ఇంకా అరగకుండా ఉన్న ఇతర పధార్థాలు అన్నీ బయటపడ్దాయి!
తన తప్పును గుర్తించిన రాజుగారు సిగ్గుతో తలవంచుకొని, బోధిసత్వుడికి చేతులు జోడిస్తూ, "తమరు నా కళ్లు తెరిపించారు. అజ్ఞానంతో ఘోరమైన పాపం మూట కట్టుకునే వాడిని" అంటూ రాచరికానికి గుర్తుగా తాను ధరించే ఛత్రాన్ని బోధిసత్వుడికి సమర్పించుకున్నాడు.
"రాజులు న్యాయాన్ని, ధర్మాన్ని నిలపాలి. అందుకుగాను పక్షపాత రాహిత్యాన్ని, సునిశిత బుద్ధిని, కరుణను ఆశ్రయించాలి" అంటూ బోధిసత్వుడు ఐదు రకాలైన ధర్మ సూత్రాలను రాజుకు ఉపదేశించాడు.
అటుపైన రాజు "ప్రాణులన్నింటినీ కాపాడటం మనుషుల ధర్మం" అని, "కుక్కలు మొదలైన జీవులకు తగినంత ఆహారాన్ని మనుషులే ఇవ్వాలి" అనీ ఆదేశించాడు.
జీవితాంతం రాజధనాన్ని 'దాన-దయా-శీల' కార్యకలాపాలకోసం, మంచిని పెంచే ఇతర కార్యక్రమాలకోసం వెచ్చించాడు.
బోధిసత్వుడు కూడా చాలా ముసలితనం వచ్చేవరకు ఆ శరీరంలో ఉండి, అటుపైన తన కర్మలకు తగిన లోకాలకు చేరుకున్నాడు.