అర్థ రాత్రి అవుతుండగా బిట్టుకి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. వరండాలోకి వెళ్లి చప్పుడు చేయకుండా చూసాడు... రెయిన్బో కనిపించలేదు! "ఏమయ్యాడు వాడు?” అని ఒక్క నిముషం ఖంగారు పడినా, లోపలికి వచ్చి చూస్తే తాతయ్య మంచం క్రింద మరింత ముడుచుకుని పడుకుని ఉన్నాడు వాడు.

ఇంతలో ఎవరో దగ్గిన శబ్దం వినిపించింది బిట్టుకి. అందరివైపు చూసాడు. ఎవరూ కదల్లేదు.

తాతమ్మ గదిలోకి వెళ్లి చూసి వచ్చాడు. ఆవిడ నిద్రపోతోంది.. అంతలోనే మళ్ళీ శబ్దం వచ్చింది...బయట వాన శబ్దంలోంచే.. నిద్రపోతున్నవాళ్లకి వినపడకపోయినా, మెల-కువగా ఉన్న బిట్టుకి తెలుస్తోంది.

శబ్దం ఇంటి ప్రక్కన ఉన్న సందులోంచి వస్తున్నట్లుంది... "ఎవరై ఉంటారు? ఏమి చెయ్యాలి?” అని ఆలోచించాడు. "తాతయ్యని కానీ, అమ్మమ్మని కానీ లేపాలా? తనే చూడాలా? లేక దావీదుని లేపాలా?” అని తేల్చుకోకుండానే టార్చి లైటు వేసి వాకిలి ముందు, పెరటి వైపు చూసాడు. ఎవరూ కనిపించలేదు.

"సందులో సన్ షేడ్ లో ఎవరైనా వచ్చి నిలబడ్డారా? అక్కడ చూడాలంటే తలుపులు తాళం తియ్యాలి. ఎలా? చప్పుడైతే తాతయ్య లేస్తారేమో...”

నెమ్మదిగా దావీదుని లేపాడు. సైగలతో వరండాలోకి తీసుకొచ్చి గుసగుసలాడాడు. రెయిన్బోగాడు లేచాడు ఇంతలో. చిట్టి కదులుతోంది. రెయిన్బో గాడు ఎప్పుడూ అనవసరంగా అరవడు. అందులో అందరూ నిద్రపోతున్నప్పుడు. చిట్టి లేచి వరండాలోకి వచ్చింది. ఏమిటన్నట్టు సైగ చేసింది. చుట్టూ చూసి వీధి గేటు గడియ తీసి ఉందని గమనించింది. బిట్టు ఆశ్చర్య పోయాడు. తను కానీ, దావీదు కానీ గమనించనే లేదు. అందుకే అమ్మమ్మ చిట్టిని మెచ్చుకుంటూ ఉంటుంది. ‘ఆడపిల్ల, అన్నీ వివరంగా చూస్తుంది’ అంటూ. తమకి ఏదైనా పని అప్పజెప్తే చేసి వచ్చేస్తారు. కానీ చిట్టి మాత్రం ఆ పని పూర్తిగా చేసి చుట్టూ పరిసరాలు మరోసారి గమనించి మరీ వస్తుంది.

"అయితే ఎవరో ఇంట్లోకి వచ్చారన్న మాట. దొంగలేమో!” ఆ ఆలోచన బిట్టుకి భలే థ్రిల్ ని ఇచ్చింది. "సినిమాల్లో చూసినట్టు ఇప్పుడు తామంతా దొంగని పట్టుకుని పోలీసులకి అప్పగిస్తారా?” గుసగుసగా అన్నాడు ‘పోలీసులకి ఫోన్ చేద్దమా, దొంగ వచ్చాడు మన ఇంట్లోకి, అని?!’ అంటూ.

చిట్టి తల అడ్డంగా ఊపింది. "వానలో దొంగ ఎందుకొస్తాడు? పట్టుబడితే వాడు పరుగెత్తాలన్నాకష్టమే కదా. ఎవరో వానలో తడిసి ఉంటారు, తల దాచుకోవటం కోసం ఇంట్లోకి వచ్చి ఉంటారు" అంది. రెయిన్బో గాడికి ఏమర్థమైందో ఏమోగానీ తోక మాత్రం తెగ ఊపేస్తున్నాడు. అంతలోనే తాతయ్య లేచి వచ్చారు ఈ గుసగుసలకి. వస్తూనే వరండాలో లైటు వేసారు.

‘ఏమిటర్రా, నిద్ర్రపోకుండా ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ?’ అన్నారు.

‘తాతయ్యా, ఎవరో గేటు తీసుకుని మన ఇంటి లోపలికి వచ్చారు. నేను దొంగ అంటుంటే చిట్టి మాత్రం ఒప్పుకోవట్లా. ఎవరో వాన వస్తోందని, నీడ కోసం లోపలికి వచ్చారని అంటోంది’ అన్నాడు బిట్టు.

తాతయ్య ఇంటి చుట్టూ లైట్లు వేసి వరండా తాళం తీసి, ‘ఎవరదీ’ అంటూ బయటకి నడిచారు. పిల్లలు, రెయిన్బో కూడా వెనకే వెళ్లారు.

ఎవరో ఒక అపరిచితుడు- యాభై ఏళ్లకు పైబడి ఉంటాయి- తలమీదుగా దుప్పటి ముక్క కప్పుకుని, చలికి వణుకుతూ, నిలబడి ఉన్నాడక్కడ: ‘అయ్యా, తప్పైపోయింది! చలికి, వానకి తట్టుకోలేక గేటు తీసుకుని లోపలికి వచ్చాను. దొంగని కాదు బాబూ!’ అన్నాడు దీనంగా.

తాతయ్య వెంటనే అతన్ని వరండాలోకి పిలిచి కూర్చోమని చెప్పి, లోపలికెళ్లి పాత పైజమా, చొక్కా తెచ్చి తొడుక్కోమని ఇచ్చారు. వంటింట్లోకెళ్లి అన్నం గిన్నె చూసి అన్నం, కూర తెచ్చి ఇచ్చి, వేడిగా టీ కూడా పెట్టి ఇచ్చారు.

బిట్టు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు: రాత్రి పూట అందరూ నిద్రపోతుంటే గేటు తీసుకుని వచ్చి, సందు గుమ్మంలో షేడ్ క్రింద కూర్చున్న క్రొత్త మనిషిని, 'ఇట్లా లోపలికి ఎందుకు వచ్చావు?’ అని కోప్పడకుండా, అతని ఆకలిని పట్టించుకొని, అన్నం పెట్టి, పొడి బట్టలు ఇచ్చిన తాతయ్య- "బలే గొప్పవాడు కదా!” అనుకున్నాడు. "నేను కూడా అలా తాతయ్యలా గొప్పగా ఉండాలి!" అనుకున్నాడు.

తెల్లవారే సరికి తాతమ్మ కొంచెం కొంచెం దగ్గుతోంది. వాన తగ్గిపోయింది; అయినా కాస్త చల్లగా ఉన్నది వాతావరణం. అదే తాతమ్మకి దగ్గు తెప్పించినట్లుంది.

తాతయ్య ఆఫీసునుంచి వచ్చి ‘అమ్మా, మిరియాల కషాయం త్రాగేవా?’ అని అడిగేరు. ‘తాగేనురా. ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఏదైనా మాత్ర పట్టుకురా’ అంది తాతమ్మ.

తాతయ్య సైకిల్ తీసేసరికి బిట్టు సిద్ధంగా ఉన్నాడు. తాతయ్యతోపాటు తనూ మందుల షాపుకి వస్తానని బయలుదేరాడు. తాతాయ్య షాపులోకి వెళ్లాక, బయట మెట్ల మీద నుంచుని చుట్టూతా చూసాడు. అటుపైన తలెత్తి షాపు పేరు చదివితే ఇంకేముంది- అమ్మో,!! ‘చిన్ని డ్రగ్ హౌస్’ అని ఉంది!

"తాతయ్య ఆరోజు 'డ్రగ్స్ చెడ్డవి' అని చెప్పాడు కదా?! మరి ఇప్పుడు ఇక్కడ ఏదో కొంటున్నాడు ఏమిటి?” అని బిట్టుకి చాలా అనుమానం వచ్చింది.

అంతలోనే తాతయ్య దుకాణం నుండి ఏదో కొనుక్కొచ్చి ‘పదరా’ అన్నారు. వెంటనే బిట్టు ‘తాతయ్యా, మీరు తెచ్చింది డ్రగ్సేనా?” అని అడిగాడు.

"అవును, తాతమ్మకోసం!” అన్నాడు తాతయ్య. ‘ఎందుకు ఇలా అడుగుతున్నాడు?' అని ఆశ్చర్యపోతూ. "వెంటనే ఆ డ్రగ్స్ తీసుకెళ్ళి దుకాణంలో వెనక్కి ఇచ్చెయ్ తాతయ్యా!’ అన్నాడు బిట్టు సీరియస్‌గా. తాతయ్య తెల్లబోయాడు. ‘ఏమైంది బిట్టూ?’ అన్నాడు.

‘తాతయ్యా, నువ్వు ఆరోజు ఏమి చెప్పేవు? 'డ్రగ్స్ చెడ్డవి' అన్నావా లేదా? ఇప్పుడేమో తాతమ్మకి డ్రగ్స్ కొంటున్నావా?’ అన్నాడు బిట్టు అసహనంగా.

తాతయ్య పడీ పడీ నవ్వాడు: ‘సారీ నాన్నా! అసలైతే 'డ్రగ్స్' అంటే 'మందులు' అని అర్థం రా. అంటే వాటిలో ఆరోగ్యానికి పనికొచ్చేవి కూడా ఉంటాయి: అవి 'మంచి డ్రగ్స్' అన్నమాట. ఆరోజు మనం మాట్లాడుకున్నవి మత్తు పదార్థాలు. అవి చాలా చెడ్డవి. వాటిని ఎవ్వరూ అమ్మకూడదు, కొనకూడదు.

అయినా ప్రభుత్వానికి తెలీకుండా వాటిని అన్ని ఊళ్లల్లోనూ అమ్మేస్తూ నేరం చేసే వాళ్లు కొందరున్నారు. పిల్లలు- పెద్దవాళ్లు కూడా, కొందరు వాటికి అలవాటు పడి, చదువులు, ఉద్యోగాలు మానేసి, మత్తులో పడి ఉంటున్నారు. ఆ మత్తులో నేరాలు చేస్తున్నారు. ఆ డ్రగ్స్ వేరురా, బిట్టూ!’ వివరంగా చెప్పాడు తాతయ్య.

అప్పటికి గానీ బిట్టుకి సంగతులు సరిగా అర్థం కాలేదు. 'దావీదుకి కూడా ఇన్ని సంగతులు తెలీదు. వాడికి ఈ వివరాలన్నీ చెప్పాలి' అనుకున్నాడు బిట్టు.

‘తాతయ్యా, అమ్మమ్మకి మాత్రం చెప్పకేం, ఈ సంగతి?! 'ఇంకా తెలుగు రాలేదు' అని నన్ను వేళాకోళం చేస్తుంది’ అన్నాడు బుంగమూతి పెట్టి. ‘అలాగేలేరా, నీ రహస్యం కాపాడతానులే!’ అన్నారు తాతయ్య నవ్వుతూ.