పడమటి కనుమల్లోని దట్టమైన అడవిలో, ఒక రోజున.. అంతకు ముందెన్నడూ కానరాని పంచవన్నెల రామ చిలుక ఒకటి- ఆశపోతు పులి కంటపడింది.
సుదూరంగా ఉన్న దక్షిణ అమెరికా నుండి వచ్చినట్లుంది- నిండైన రంగులతో కనుల- పండువ చేస్తున్నదా చిలుక.
“అద్భుతం! అసాధారణం! ఇలాంటి పక్షి ఈ అడవికి క్రొత్త అయిఉండాలి. నేను చిన్నగా ఉన్నప్పుడెప్పుడో ఇట్లాంటి పక్షినొకదాన్ని చూసినట్లు గుర్తు..మళ్ళీ ఇన్నేళ్లకు..” .. పిట్ట పులికి అందనంత ఎత్తులో చెట్టు మీద వాలి ఉన్నది.
అకస్మాత్తుగా రామచిలుక అరిచింది- అడవిలోని నిశ్శబ్దంలోంచి ఆ అరుపు దూర-దూరాల వరకూ దూసుకుపోయింది. అప్పటివరకూ "క్రిచ్, కిరిచ్, క్రిచ్, కిరిచ్" అంటున్న కీచురాళ్ళుకూడా ఆ ఒక్క అరుపుతో నిశ్శబ్దంలో కూరుకుపోయాయి.
“ఉం...హుం... ఇప్పుడు గుర్తొచ్చింది..” అనుకున్నది పులి ” నేను దీన్ని ఇంతకు ముందు చూసింది ఇక్కడ కాదు- మనుషుల ఇంట్లో! అప్పుడోసారి నేను తిరుగుతూ తిరుగుతూ మనుషులుండే చోటుకు దగ్గరగా వెళ్ళాను..అప్పుడీ చిలుక కూడా వాళ్ల లాగానే మాట్లాడుతూ ఉన్నది! బదులుగా వాళ్ళు దానికి ఏదో తిండి తినిపిస్తున్నారు! 'ఎంత తెలివైన పిట్టో చూడు, ఇది!' అనుకున్నది తను- అప్పుడు!”
చిలుక "క్రీచ్...!" అని మరోసారి అరిచేసరికి పులి తన ఆలోచనల్లోంచి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చింది. దానికి ఉత్సాహం వేసింది- చూస్తుంటే ఈ పిట్ట 'దారి తప్పినట్లు, ఎటు పోవాలో తెలీక మధన పడుతున్నట్లూ తోస్తున్నది. ఈ ఈకల కుప్పని మినహా-యించుకొని చూస్తే.. ఇదేదో మంచి రుచికరమైన టిఫినే అయ్యేట్లుంది!
పులి మెల్లగా చిలుక వైపుకు కదిలింది. అయితే అదే చెట్టుమీద కూర్చున్న కోతి దాన్ని చూసేసింది అప్పుడే. “ఊంఫ్..ఫ్.. ఊంఫ్..ఫ్.. ఊంఫ్..ఫ్” అని ముందుగానే హెచ్చరికలు జారీ చేసేసింది చిలుకకు.
కోతి అరుపులు వినగానే చిలుక అటు తిరిగి చూసింది: నలుపు-పసుపు చారల పెద్ద పులి! మెల్లగా నడుచుకొని వస్తోంది తనవైపే!
“హేయ్! హల్లో! కులాసానా?” అరిచిందది, భయం భయంగానే, పులిని చూస్తూ.
నడుస్తున్నదల్లా ఆగిపోయింది పులి. తల పైకెత్తి చిలుకకేసి చూస్తూ అన్నది- “ఎందుకు, నువ్వు మనుషుల లాగా మాట్లాడు-తున్నావు?” అని.
“ఎందుకంటే నాకు ఆహారందొరుకుతుంది కనుక- మనుషులంటే నాకు చాలా ఇష్టం కనుక!” అన్నది పంచవన్నెల రామచిలుక.
“ప్చ్.చ్..చ్..చ్. వాళ్ళు నీకు తిండి పడేస్తారు కనుక! అంతే!! వాళ్ళు నీకు కాసింత తిండి పడేస్తారు కనుక, నీకు వాళ్లంటే ఇష్టం. అంతే!”
దాన్ని ఉడికిస్తూ అన్నది పులి, అదే సమయంతో తన పంజాని విదిల్చి దాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తూ.
రామచిలుక పై కొమ్మ మీదికి ఎగిరి కూర్చున్నది లేచి నిలబడ్డ తన ఈకల్ని ముక్కుతో సరి చేసుకుంటూ అన్నది: ”వాళ్ళు నేను ఉండేందుకొక నివాసం కూడా ఇస్తారు!” అని.
ఇలా మాట్లాడుతూ వేటాడటం పులికి బాగా నచ్చింది. 'చిలుక అలిసి పోయేంతవరకూ దాన్ని ఒక కొమ్మ మీదినుండి మరో కొమ్మ మీదికి దూకిస్తూ ఉంటే బాగుండేట్లుంది..'
పైకి అన్నదది, చిలుకతో- “అడవిలో కూడా నివాసాలు ఉన్నాయి! మరి అవన్నీ నాకు ఉచితంగానే దొరుకుతున్నాయి- ఏ మనిషీ వాటిని నాకు దానం చెయ్యనక్కర్లేదు!” అని, కొద్దిగా చేతులు చాచి పైకి ఎగురుతూ.
"పులిని ఆలోచనల్లో ఉంచితే తప్ప, నేను తప్పించుకునేందుకు వీలయ్యేట్లు లేదు-” అనుకున్నది చిలుక. పైకి అన్నది-”కనీసం అక్కడ నీలాంటి క్రూరజంతువులనుండి రక్షణ అయితే ఉంటుంది!” అని. అట్లా అనగానే ఎగిరి మరోకొమ్మ మీద వాలింది.
“హుప్..!” అన్నది పులి, మరోసారి పైకి ఎగిరి దూకుతూ, చిలుకను అందుకునేందుకు ప్రయత్నిస్తూ. 'మళ్ళీ తప్పించుకుంది!' అని మనసులోనే కోపగించుకుంటూ.
“వాళ్ళు అక్కడ నీకిచ్చే నివాసం అడవిలో భద్రంగా ఉండటం ఎలాగో నేర్పదు” అన్నది అక్కసుతోటి, మరోసారి చిలుకను అందుకునేందుకు ప్రయత్నించి విఫలమౌతూ.
“అక్కడ వాళ్ళు నన్నెంతో అభిమానిస్తారు! అందరూ నన్ను ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు!” వాదించింది చిలుక, అక్కడి-నుండి ఎగిరి, ఎండిపోయి నిలబడ్డ ఒక మొద్దు మీద వాలుతూ.
"అభిమానించటం అంటే ఏంటి? ఆ అభిమానం నీకు ఎందుకు?” అడిగింది పులి “బ్రతికేందుకు అది అంత అవసరమా?”
“ప్రేమించబడటం అనేది చాలా బాగుం-టుంది!" అన్నది చిలుక, ఎగిరి మరింత దూరంగా వాలేందుకు శ్రమపడుతూ.
“అవునవును. బాగుంటుంది. అయితే బోనులో పెట్టి బంధించేశాక ఇంక ఆ ప్రేమను ఏం చేసుకుంటాం?" అన్నది పులి.
“అంతేకాదు; నీకు నీలాకాశంలో స్వేచ్ఛగా విహరించటం అంటేనూ, పచ్చటి అడవిలో సంతోషంగా ఎగరటం అంటేనూ అసలు తెలీనే తెలీదు!” అన్నది, దగ్గరలో ఉన్న ఒక చెట్టు బెరడును బరబరా గోకి, తన గోళ్లకు పదును పెట్టుకుంటూ.
“అడవిలో ఎగరటమా..? కానీ-.. కానీ-.. నాకు అసలు ఎగరటమే రాదు!” అణచి-పెట్టుకున్న ఆవేదనను ఒక్కసారిగా వెళ్లగక్కింది పంచవన్నెల రామ చిలుక. అలా అరవటంలో అది తను నిలబడ్డ కొమ్మ మీదినుండి దూరంగా ఉన్న ఇంకొక కొమ్మ మీదికి దూకింది బలంగా.
కలగాపులగమైన తన ఈకల్ని మరొకసారి సర్దుకుంటూ అది లోతుగా ఆలోచించింది. అటుపైన విచారంగా అన్నది- “ఊహ తెలిసిన నాటి నుండీ నేను పంజరాల్లోనే ఉన్నాను. పెద్ద పెద్ద పంజరాలు; కాకపోతే చిన్న పంజరాలు. నేను పుట్టిందే ఒక పంజరంలో! కొంచెం దూరం కూడా సొంతగా ఎగిరి పోవలసిన అవసరం కలగలేదు నాకు ఏనాడూ! నా ప్రతి అవసరాన్నీ మనుషులే తీర్చారు; మంచి తిండి పెట్టారు. నేను చేయాల్సిందల్లా ఏవో కొన్ని చిన్న చిన్న కిటుకులు నేర్చుకోవటం; వాటితో వాళ్ళ మనసులకు సంతోషం కలిగించటం. నా పంజరంలో నాకు చక్కని భద్రతా భావం ఉండేది.
దానిలోనుండి బయటికి రావటం ఇదే మొదటిసారి, నాకు. జీవితంలో మొదటిసారి నిలబడ్డాను నేను- ఇలా.. - ఈపొదల మధ్య, చెట్ల మధ్య, ఘోరమైన అడవిలో, నన్ను తినేందుకు పూనుకునే క్రూర జంతువులకు ఎదురుగా! 'తర్వాతి భోజనం ఎలాగ?' అని నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను- అదికూడా నా జీవితంలో మొదటిసారి! నేను ఇన్నాళ్ళూ నేర్చుకున్న కిటుకులు ఏవీ కూడా నాకు ఇక్కడ ఒక్క వేరుశనగ పప్పునూ తెచ్చి పెట్టవు!”
“బాధపడకు, మిత్రమా! నీ ప్రియమైన మనుషుల్ని నువ్వు త్వరలో కలుసు-కుంటావులే. ఇంత సేపూ నేను ఎంత ప్రయత్నించినా నువ్వు నాకు దొరకలేదు- బ్రతికి పోయావు. ఇక నువ్వు ఇప్పుడు చెయ్యాల్సిందల్లా అదిగో- ఆ వెదురు పొదల మీదినుంచి ఎగరటం. అవి దాటావంటే నువ్వు నీ మనుషుల మధ్య ఉంటావు. పో! ఎగురు ఇంక!” అన్నది పులి, వెనక్కి తిరుగుతూ.
రామచిలుకకి నోట మాట రాలేదు. పులి మాటలు నమ్మ శక్యం కాలేదు. కానీ అంతలోనే దానికి మనుషుల గొంతులు, వాళ్ళ అరుపులు, చప్పట్లు, వాళ్ళు నడచి వస్తున్న శబ్దాలు వినబడ్డాయి. "ఓహ్... సుపరి-చితమైన మనుష్య స్వరాలు! “
చెట్టు క్రింద పులి నిశ్శబ్దంగా నడచి పోతున్నది... ఎండిన గడ్డి లోంచి, ఆకుల మధ్యలోంచి- అక్కడ పరచుకున్న వెలుగు నీడల పందిరిలో కరిగిపోతూ. “ఓహ్! చారలు ఉన్నది అందుకే అన్నమాట!” అనుకున్నది చిలుక, దానికేసే అబ్బురంగా చూస్తూ.
ఇప్పుడు గొంతులు మరింత గట్టిగా వినబడుతున్నాయి. చిలుక మళ్ళీ పంజరంలోకి చేరుకోవాలి ఇంక.