సహారా ఎడారిలో పోతూ దారి తప్పారు రాము-సోము.

ఎటెటో తిరిగారు- సరైన దారి చిక్కనే లేదు.

రెండు రోజులు గడిచేసరికి, వాళ్ళ దగ్గరున్న నీళ్ళన్నీ అయిపోయాయి.

దాహం..ఎండ.

ఇంక ఒక్క అడుగు కూడా‌ ముందుకు వేసే పరిస్థితి లేదు.

అప్పుడు వాళ్ళకు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి సాయం చేయగలిగింది ఆయన ఒక్కడే.

మనసులో ఆ దేవుడినే తలచుకున్నారు ఇద్దరూ, ఆర్తిగా..మళ్ళీ మళ్ళీ.

అట్లా మగతలో, ఇసకలో, మండుటెండలో పడిపోయిన వాళ్ళని చూసి జాలిపడ్డాడు దేవుడు.

వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు.

దేవుడిని కళ్ళెత్తి చూసేంత శక్తి కూడా మిగల్లేదు వాళ్ళలో- దేవుడి మాటలు కూడా సరిగ్గా వినబడటంలేదు వాళ్ళకు.

దేవుడు చెబుతూ పోయాడు చాలా సేపు- "చూడండి, అందం పై పైనే ఉంటుంది. మీరు 'అందంగా ఉంది' అనుకునే వస్తువులో నిజానికి పస ఉండకపోవచ్చు. 'అస్సలు బాగాలేదు' అనుకునే వస్తువులో అపార సంపదలు దాగి ఉండవచ్చు. నిజానికి ఎవరికైనా ఉపయోగపడేది మంచి మనస్సే. అదొక్కటి ఉంటే చాలు- అన్నింటా విజయం వరిస్తుంది.."

రాము సోములకు దేవుడి ప్రవచనాలు అక్కర్లేదు- స్వామీ, మాకు కాసిని నీళ్ళు ఇవ్వండి చాలు. మిగతావి మేం సొంతంగా ఆలోచించుకొని నేర్చుకుంటాం" అన్నారు స్వామికి అడ్డొస్తూ.

"అవునవును. అందుకే వచ్చాను నేను. నా వరకూ మీరిద్దరూ ఒకటే- అయినా ఎవరికి ఏది కావాలో ఎంపిక చేసుకొనే అవకాశం మీకిద్దరికీ వేరు వేరుగా ఇస్తాను" అని, దేవుడు రాముని దగ్గరికి పిలిచి, రహస్యంగా రెండు సంచులు చూపించాడు. ఒక సంచీ చాలా బాగుంది. మఖ్మల్ బట్టతో కుట్టి, బంగారు తాళ్ళతో అలంకరించి ఉన్నది. ఇంకో సంచీ ముతకగా, పాత తోలుతో చేసిన తిత్తిలాగా ఉన్నది.

"వీటిలో నీకు ఏది కావాలో తీసుకో" అన్నాడు.

"రెండోది వాడికి ఇస్తావా?" అన్నాడు రాము, సోమువైపు చూస్తూ. "ఉహు, అతనికీ‌ రెండు అవకాశాలు ఇస్తాను" అన్నాడు దేవుడు.

"అన్యాయం. మరి రెండిటిలోనూ ఏది మంచిదో ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా?" అన్నాడు సోము.

"చెప్పలేం. ఎవరు కోరుకున్న సంచిలో ఏముంటుంది అన్నది పూర్తిగా వాళ్ళ రాత మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల రాతను నేనే కాదు, ఎవ్వరూ మార్చలేరు" అన్నాడు దేవుడు.

రాము రెండు సంచులనూ మార్చి మార్చి చూశాడు. రెండూ సమానం బరువు ఉన్నై. చివరికి చూపులే గెలిచాయి. అందంగా ఉన్న సంచీ మీద ఆశ పుట్టింది. మఖ్మల్ సంచిని ఎంచుకున్నాడు రాము.

అదే సమయంలో దేవుడు సోముకూ రెండు సంచుల్ని చూపించాడు. సోము ఎక్కువ ఆలోచించకుండా తోలు తిత్తిని ఎంచుకున్నాడు. దేవుడు ఇద్దరినీ దీవించి మాయం అయిపోయాడు. అయినా ఇద్దరికీ కనిపించకుండా అక్కడే నిలబడి చూడసాగాడు.

రాము హడావిడిగా విప్పి చూశాడు- మఖ్మల్ సంచిలోపల అద్భుతమైన వజ్రాలు ఉన్నై!

సోము తోలు సంచిలో చూసుకున్నాడు- నిండా నీళ్ళు ఉన్నై!!

దు:ఖం కొద్దీ రాము బావురుమన్నాడు- "ఈ వజ్రాలను నేనేం చేసుకోను? రూపానికి ఆశపడద్దని దేవుడు అంతసేపు చెప్పినా వినకపోతినే?! మఖ్మల్ సంచిని ఎంచుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఇక నాకు చావే గతి!" అని.

సోము వాడిని ఓదార్చాడు- "ఎందుకురా, అంత బాధ? మనిద్దరం కలిసే కద, వచ్చింది? కలిసే పోతాం. తోలు సంచీలో నీళ్ళు ఇద్దరికీ సరిపోతాయిలే. త్రాగి నడక మొదలెడదాం. ఏదో ఒక దారి దొరక్క పోదు" అన్నాడు తోలుతిత్తిని అతనికి అందిస్తూ. ఇద్దరూ త్రాగినా, ఇంకా కొన్ని నీళ్ళు మిగిలాయి తిత్తిలో! కొంతదూరం నడిచాక, వాళ్లనే వెతుక్కుంటూ వస్తున్న మనుషులు ఎదురయ్యారు వాళ్ళకు.

ఆ పైన రాము సోములు ఇద్దరూ వజ్రాలను సమానంగా పంచుకున్నారు.

అప్పటివరకూ వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్న దేవుడు చిన్నగా నవ్వి మాయం అయిపోయాడు.

మనుషున్నాక కష్టాలూ సుఖాలూ అన్నీ ఎదురౌతుంటాయి. సరిగ్గా కలిసి బ్రతికితే కష్టాలు తగ్గుతాయి; సుఖాలు అంతకంత పెరుగుతాయి.
రానున్న 2012లో అందరి సుఖాలూ అంతకంత పెరగాలని ఆశిస్తూ,

అభినందనలతో-
కొత్తపల్లి బృందం.