అనగా అనగా ధర్మపురి అని ఒక రాజ్యం ఉండేది. దానికి రాజు ధర్మపాలుడు. పేరుకు తగ్గట్టే రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించేవాడు ఆయన. ధర్మపాలుడి భార్య సునందాదేవి ఆయనకు అన్నివిధాలా తగినది.
"ఎన్ని ఉండీ ఏం లాభం? వారసులు లేరు" అని చెప్పుకునేవాళ్ళు ప్రజలు, వాళ్ల గురించి ఎప్పుడు మాట్లాడినా. వారసులకోసం రాజు- రాణి తిరగని గుడి లేదు, మునగని నది లేదు.
దేవతలు అందరూ కరుణించినట్లు, చివరికి రాణి గర్భం దాల్చింది. రాజుగారి ఆనందానికి మేర లేదు. రాజ్యమంతటా ప్రజలు పండుగలు జరుపుకున్నారు. రాజ్యానికి వారసుడు లభించనున్నాడని మురిసిపోయారు. చూస్తూండగానే రాణికి అందాల బొమ్మవంటి కుమార్తె జన్మించింది.
రాజుగారితో సహా అందరూ చిన్నబోయారు. అందరూ రాజకుమారుడికోసం ఎదురు- చూస్తున్నారు- అమ్మాయి పుట్టేసరికి వాళ్లందరి ఆనందంమీద నీళ్ళు చల్లినట్లు అయ్యింది. రాజ్యాన్ని పరిపాలించవలసింది అబ్బాయే కదా? అమ్మాయిలకి సింహాసన యోగ్యత ఉండదు! రాజకుమార్తె పుట్టుక ఆ రకంగా పెద్ద విషాదమే అయ్యింది. సంబరాలన్నీ మరునాటికల్లా సద్దు మణిగి పోయాయి.
చక్కని చుక్కలాంటి ఆ పాపను చూసుకొని నిజంగా మురిసిపోయింది రాణి ఒక్కతే. రాజుగారైతే అటు తర్వాత రాణిగారి అంత:పురంలో అడుగే పెట్టలేదు. అంతకు క్రితం వరకూ 'మహారాణీ'అని చుట్టూ తిరిగిన ప్రజలెవ్వరూ ఇప్పుడు ఆమెను పట్టించు-కోవటమే లేదు! అయినా రాణి మాత్రం పాపకు ఏమీ తక్కువ చేయలేదు. తానూ ధైర్యం కోల్పోలేదు. ఆ పాపకు పరిమళ అని పేరు పెట్టి తండ్రి లోటు తెలీకుండా అల్లారు ముద్దుగా పెంచసాగిందావిడ.
సునందాదేవి స్వయంగా తానే ఆ పాపకు అనేక విద్యలు నేర్పింది. అటుపైన రాజగురువు సత్యానందులవారి సహకారం తోడవటం పరిమళకు కలిసి వచ్చింది. సత్యానం-దులవారు పరిమళకు అనేక శాస్త్రాలు, యుద్ధ- విద్యలు నేర్పారు. పువ్వు పుట్టగానే పరిమళి-స్తుందన్నట్లు, పరిమళ కూడా అన్ని విద్యలలోనూ ఎంతో ఆసక్తి కనబరచింది. 13ఏళ్ళు వచ్చేసరికి అనేక శాస్త్రాలు నేర్చు-కోవటంతో పాటు, అసమాన యోధురాలు కూడా అయ్యింది.
ఆమె ముందు ఎంతటి పరాక్రమవంతులైనా ఓడిపోయేవాళ్ళు. కానీ పరిమళకు మాత్రం 'ఎప్పుడెప్పుడు బయటి ప్రపంచాన్ని చూద్దామా, ఎప్పుడెప్పుడు తండ్రి ముందు తన విద్యల్ని ప్రదర్శిద్దామా' అని ఉండేది. అయితే ఈ విషయం ఎప్పుడు ప్రస్తావించినా ఆమె తల్లి మాత్రం అంగీకరించేది కాదు.
ఒక రోజున ఆ పాప సత్యానందులవారిచేత సునందాదేవికి చెప్పించింది; తానూ ఎంతో బ్రతిమాలింది- 'మన రాజ్యంలోని ప్రజలను మాత్రమే పరిశీలించి వచ్చేస్తాన'ని. చివరికి ఎలాగో అనుమతి సంపాదించుకున్నది.
ఆపైన వెంటనే సిద్ధంగా ఉంచుకున తన గుర్రం ఎక్కి, రాజ్యంలోకి బయలుదేరింది పరిమళ.
అలా పోతూ పోతూ, కనబడ్డ ప్రతి పల్లెలోనూ ఆగి, గుర్రం దిగి, అక్కడి ప్రజల సామాజిక స్థితిని గమనించటం మొదలు పెట్టింది. ప్రతి చోటా స్త్రీలు ఇంటి పనుల్లో మునిగి ఉన్నారు, లేదా పొలం పనుల్లో మునిగి ఉన్నారు. చాలా చోట్ల కూలికి పోయి ఆడవాళ్ళే ఇంటికి కావలసిన ఖర్చులు సంపాదిస్తున్నారు. అధిక శాతం మంది మగవాళ్ళు ఊరికే రోడ్ల వెంబడి తిరుగుతున్నారు- బాధ్యతా రాహిత్యం మగవారిలోనే ఎక్కువగా కనిపించింది.
రాజ్యంలో స్త్రీల పరిస్థితిని గమనించిన కొద్దీ పరిమళకు ఉద్రేకం కలిగింది . "నా రాజ్యంలో స్త్రీలు ఎందుకు, ఇలా హీనమైన పనుల్లో ఇరుక్కొని ఉండిపోవాలి? తమ సామర్ధ్యాలను వాళ్ళందరూ ఎందుకు గుర్తించలేకున్నారు? రాజ్యంలో పురుషులు ఎందుకు, ఇలా బాధ్యత లేకుండా తిరుగుతున్నారు? స్త్రీలందరికీ నాలాగా యుద్ధ విద్యలు నేర్పించాలి. లేదంటే ఈ రాజ్యానికి రక్షణ ఉండదు " అనుకున్నది.
వెంటనే సునందాదేవిని కలుసుకొని తన ఆలోచనను చెప్పింది. మొదట ఆవిడ నవ్వి, పరిమళను ఏమార్చేందుకు చూసింది. కానీ పరిమళ పట్టు విడువలేదు. చివరికి, పరిమళ ఉత్సాహాన్ని చూశాక, ఆ తల్లికీ అర్థమైంది- తమ కష్టాలు తీరే సమయం దగ్గర్లోనే ఉన్నదని!
ఆవిడ మాట్లాడిన మీదట, నిత్యానందుల-వారు మహారాజుకు చెప్పారు: "మహారాజా! మన రాజ్యంలో అధికశాతం స్త్రీ శక్తి వృధానే అవుతున్నది. స్త్రీ చైతన్యమే రాజ్యానికి శ్రేయస్సు అని చెబుతారు పెద్దలు. మన రాజ్యంలోని స్త్రీలను ఉద్దేశించి పెద్ద స్థాయిలో విద్యా కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నది. వారి శక్తి మేరకు వారికి యుద్ధ విద్యలూ నేర్పాలి. దీనికి మన యువరాణి పరిమళాదేవివారు సరైన నాయకులని మాకు అనిపిస్తున్నది. మీ అభిప్రాయం తెలియజేయండి" అని.
ఆనాటివరకూ రాజుగారు పరిమళ గురించి ఆలోచించనే లేదు! ఒకసారి ఆ పాప ప్రస్తావన రాగానే ఆయన ఈ విషయమై రాణిగారి తోటీ, మహామంత్రి తోటీ సంభాషించారు. మంత్రి-గారికి పరిమళ శక్తి సామర్ధ్యాలు తెలుసు. అందుకని ఆయనకూడా రాజగురువు అభిప్రాయాన్నే బలపరచాడు.
దాంతో రాజుగారు వెంటనే రాజ్యమంతా ఈ విషయాన్ని దండోరా వేయించారు. "మన దేశంలోని స్త్రీ శక్తిని గుర్తిస్తూ, వారికోసం ప్రత్యేక విద్యా కార్యక్రమం ఒకటి తయారు చేయటమైంది. యువరాణి పరిమళాదేవి ఆధ్వర్యంలో వారికి అనేక శాస్త్రాలు, యుద్ధ విద్యలు నేర్పించటం జరుగుతుంది. మరీ చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, రోగులకు తప్ప, మిగిలిన వారందరికీ ఇది తప్పనిసరి. స్త్రీలంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని లబ్ధి పొందాలహో" అని. ప్రజల్లో చాలామందికి, ముఖ్యంగా మగవారికి, ఈ కార్యక్రమం నచ్చలేదు. కానీ రాజాజ్ఞ కనుక, ఎవరికేగానీ ఒప్పుకోక తప్పలేదు.
అయితే పరిమళ ఉత్సాహం, కార్యదీక్ష రాజ్యంలోని స్త్రీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్నడూ ఇల్లు దాటి ఎరుగని స్త్రీలుకూడా వివిధ శాస్త్రాలు చద-వటంతో బాటు క్లిష్టమైన యుద్ధ విద్యలలో శిక్షణ పొందసాగారు. ఇలా ఒక్క ఏడాదిలోనే ఎంతోమంది రకరకాల విద్యలు నేర్చు-కున్నారు. రాజ్యమంతటా చైతన్యం తొణికిస-లాడింది. ఇదివరకటి స్తబ్దత, నిరాశ ఇప్పుడు లేవు. ఇప్పుడు ధర్మపురి రాజ్యం ఒక ప్రత్యేకమైన రాజ్యం- అక్కడ ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తి.
అదే సమయానికి పొరుగు దేశపు రాజు మార్తాండుడు ధర్మపురిపైకి దండెత్తి వచ్చాడు. మార్తాండుని సైన్యం పెద్దది. వారి సైనిక శిక్షణ కూడా విలక్షణమే. వారిముందు తమ సైన్యం ఎందుకూ పనికిరాదు! భయపడుతూనే యుద్ధానికి వెళ్ళిన ధర్మపాలుడు, అనుకున్నట్లే కష్టాలలో పడ్డాడు. మార్తాండుని సైన్యం ఆయన్ని అన్నివైపులనుండీ చుట్టుముట్టింది. అదే సమయానికి ఎక్కడినుండి వచ్చిందో, అసంఖ్యాకమైన సైన్యం ఒకటి మార్తాండునిపై విరుచుకు పడ్డది. ఆ సైనికుల పరాక్రమం ముందు నిలువలేని మార్తాండుని సైన్యం కకావికలైంది. అనుకోకుండా అందిన ఈ సహాయాన్ని ధర్మపాలుని సైన్యం చక్కగా ఉపయోగించుకున్నది. మార్తాండుడిని పూర్తిగా తిప్పికొట్టింది.
తమకు అంతగా సాయం చేసిన సైన్యం ఎవరిదో ధర్మపాలుడిని అర్థంకాలేదు. నిండు సభలో వారి సైనిక శక్తిని కొనియాడి, వారి నాయకుడికి తన కృతజ్ఞత తెలియజేసుకున్నాడు. తీరా చూస్తే అది నాయకుడు కాదు- నాయకురాలు! ఆమె కూడా వేరెవరో కాదు- యువరాణి పరిమళ! ఆ సైన్యం తన రాజ్యపు స్త్రీశక్తే!
ఆశ్చర్యంతోటీ, ఆనందంతోటీ మహారాజు నోటివెంట మాట రాలేదు. ఆడపిల్ల అనగానే పరిమళను తాము ఎంత చిన్నచూపు చూసిందీ, సునందా దేవిని ఎంత అవమానించిందీ, ఇన్నాళ్ల తర్వాత ఆ బిడ్డే తమను ఎలా ఆదుకున్నదీ- అన్నీ గుర్తుకొచ్చి, పశ్చాత్తాపంతో ఆయన కళ్లనీళ్ళు పెట్టుకున్నాడు.
అందరి సమక్షంలో సునందాదేవికి క్షమాపణ చెప్పటంతోబాటు, 'తన తర్వాత రాజ్యాన్ని పరిపాలించేది పరిమళే' అని సభాముఖంగా ప్రకటించాడు ఆయన.
యువరాణి పరిమళ నాయకత్వంతో ధర్మపురి ప్రజల చైతన్యంలో గొప్ప మార్పులే వచ్చాయి!