శ్రీరాముడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు- ఇద్దరూ సీతమ్మను వెతుక్కుంటూ తిరుగుతున్నారు అడవిలో. సీతమ్మనేమో రావణాసురుడు ఎత్తుకుపోయి లంకలో దాచిపెట్టాడు. కానీ రాముడికి, లక్ష్మణుడికి ఇంకా ఆ సంగతి తెలీదు. ఇద్దరూ ఆత్రంగా వెతుకుతూ పోతున్నారు- ప్రతి చెట్టునూ, పుట్టనూ శోధిస్తూ.
అంతలో దూరంగా చిన్న చిన్న గుడిసెలు కనబడ్డాయి. అక్కడేదో ఊరు ఉన్నట్లుంది. 'ఊళ్లోకెళితే సీతమ్మను గురించి అడగొచ్చు.. అట్లాగే ఏమైనా కొంచెం తినేందుకు దొరకచ్చు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు' అనిపించి అటువైపుకు నడిచాయి వాళ్ల పాదాలు. ఇంకా ఊళ్లోకి ప్రవేశించకనే ఒక గుడిసె కనబడింది. చిన్న గుడిసె- ముందొక చక్కని పూలతోట. కంచె చుట్టూతా అల్లుకున్న తీగలు, శుభ్రంగా ఊడ్చి కళ్లాపుచల్లిన లోగిలి.
వాళ్లు ఆ గుడిసె ముందు నుంచి పోతుండగా, వాకిలి దగ్గరే నిలబడ్డ ముసలవ్వ ఒకామె కళ్లపైన చేతులు అడ్డు పెట్టుకొని చూసింది- 'ఎవరు వీళ్లు?' అన్నట్లు.
గబగబా పరుగెత్తుకొని వచ్చి వీళ్లముందు నిల్చున్నది. రాముడి కళ్లలోకే చూస్తూ ఆయన చేతులు పట్టుకొని నిలబడ్డది. పరుగున వచ్చిన ఆయాసం వల్ల కావచ్చు, ఆమె కాళ్లు వణుకుతున్నాయి. ముసలితనం వల్ల చేతులు కూడా వణుకుతున్నాయి. చికిలించిన కళ్లలోంచి, అవి వెలుగునిచూడలేకనేమో- ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి.
"నువ్వు నా దేవుడివే కదూ? నా రాముడివే కదూ? ఈ శబరిని చూసిపోదామని వచ్చావు కదూ? ఎంత దయ స్వామీ, నీకు? కాళ్లకి చెప్పులు కూడా లేకుండా నడిచి వస్తున్నావా, నా కోసం? ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయో పాపం!" అంటూ రాముడి కాళ్లమీద పడ్డది శబరి- ఎట్లా గుర్తు పట్టిందో మరి, రాముడిని!
రాముడు ఆమెను పైకి లేవనెత్తి అన్నాడు "అమ్మా! పెద్దదానివి, నా కాళ్లకి నువ్వు నమస్కరించటం ఏమిటి? నీ కొడుకులాంటి వాడిని కదూ? నేనే నీకు నమస్కరించాలి కదా?" అని.
శబరి కళ్లలో ఎన్ని నీళ్లు నిండాయంటే ఆమెకిక వేరే ప్రపంచం ఏమీ కనిపించలేదు. ఆనందంతోటి ఉబ్బి తబ్బిబ్బైపోయిన ఆ తల్లికి ఏం మాట్లాడాలో తోచలేదు, ఏం చెయ్యాలో కూడా గుర్తుకు రాలేదు. రాముడిని నేలమీదే కూర్చోబెట్టింది. తను ఆయన ఎదురుగా కూర్చున్నది. ఆయన్నే పట్టుకొని తడిమింది కొంతసేపు .
ఆ పైన కొంచెం తేరుకొని అన్నది "నాయనా! నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను- నేను ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న దైవం ఈ రోజున నా ముందుకు నడిచి వస్తుందని ఉదయం నుండి ఎందుకో , అనిపిస్తూనే ఉన్నది. చూడు! నా ఊహ నిజమైంది. నువ్వు నా ఇంటికే వచ్చావు నేరుగా. నా జీవితంలో ఇది ఇక మరచిపోలేని రోజు. రా,రా! ఇంట్లోకి రా! కొంచెం సేపు నా గుడిసెలో విశ్రాంతి తీసుకుందువు. కాళ్లు- చేతులు కడుక్కో . నీళ్లున్నాయి ఇక్కడ-ఇదిగో, త్రాగేందుకు నీళ్ళు.
నేను ఇప్పుడే గబగబా వెళ్లి కొన్ని పళ్లు కోసుకొస్తాను మీకోసం. పాపం ఎప్పుడు తిన్నారో, ఏమో!
మంచి రేగుపళ్ల (రేణికాయల) కాలం కదా, అడవి నిండా రేగుపళ్లు ఉన్నై . నేను ఇట్లా పోయి అట్లా వచ్చేస్తాను కూర్చోండి-" అని హడావిడి పడ్డది.
రాముడు ఆమెను వారించే లోగానే బుట్ట చేతబట్టి బయటికి పరుగెత్తింది శబరి. "తన దేవుడు నడచి వచ్చాడు, తన ఇంటికి! దేవుడికి ఆకలిగా ఉంది. తినేందుకు రేగుపళ్లు కావాలి."
తియ్యటి పళ్లు ఇచ్చే చెట్లు ఏవో తెలుసామెకు. ఆ చెట్లలో దోరదోరగా మాగిన పళ్లను ఏరి ఏరి కోసింది. బుట్ట నిండగానే అతిథులకు ఇచ్చేందుకని వెనక్కి పరుగు పెట్టింది. ఆ బుట్టను రామలక్ష్మణుల ముందు పెట్టింది. రాముడి ముందు కూర్చున్నది. "తినండి నాయనా! బాగున్నాయి రేగుపళ్లు. తియ్యగా ఉన్నాయిలే, తినండి" అని బుట్టను వాళ్లకి దగ్గరగా జరిపింది.
లక్ష్మణుడు కదలలేదు. రాముడు ఒక పండును చేతిలోకి తీసుకున్నాడు. "అయ్యో! ఒక్కటొక్కటే ఏం తింటావు? అంత నాజూకా? గబగబా తినాలి. నేను తినిపిస్తాను ఆగు" అని బుట్టను తన దగ్గరికి జరుపుకున్నది శబరి. బదులుగా నవ్వాడు రాముడు- కేవలం భగవంతుడే నవ్వగలిగేట్లు, చిరునవ్వు నవ్వాడు.
అకస్మాత్తుగా శబరికి అర్థమైంది- తన దేవుడికి తను తినిపించబోతున్నది! దేవుడు తన చేతితో పెట్టిన రేగుపళ్లు తినబోతున్నాడు! "దేవుడికి ఎట్లా తినిపిస్తారు? మంచి పళ్లే పెట్టాలి! మంచి పళ్లేవో ఎట్లాగ, కనుక్కోవటం? పుల్లటి పళ్లు, వగరుగా ఉండే పళ్ళు రాకుండా చూసేదెలాగ?" తడబడి పోయిందామె మనసు.
చేతులు వాటంతట అవే పళ్లను ఒక్కొక్క దాన్నీ ఆమె నోటికి అందించాయి. ఆమె నోరు ఒక్కో పండునూ కొరికి రుచి చూసింది. బాగున్న పళ్లని ఆమె ఒక్కొక్కటిగా ఇవ్వసాగింది, రాముడికి. రాముడు తింటున్నాడు - శబరి ఎంగిలి చేసి ఇస్తున్న పళ్లని సంతోషంగా చప్పరిస్తున్నాడు! లక్ష్మణుడి కళ్లు పెద్దవయ్యాయి, యీ ఘోరాన్ని చూసి- "సర్వ ప్రపంచానికే ఏలిక అయిన శ్రీరాముడు శబరి ఎంగిలిని తినటం ఏమిటి?!" కళ్లతోటే సైగలు చేశాడు రాముడికి - తినద్దని. 'ఎంగిలి పళ్లు ' అన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి చూపించాడు.
రాముడు తమ్ముడి సైగల్ని అస్సలు పట్టించుకోలేదు. శబరి తన నోటికి అందిస్తున్న రేగుపళ్లని ఇష్టంగా తింటూపోయాడు.
ఆయన ముఖం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది- శబరి ఇస్తున్న రేగుపళ్ల రుచి ఆయనకు నిజంగా చాలా నచ్చింది! అమృతం తింటున్నవాడి ముఖం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది రాముడి ముఖం!
కొంచెం సేపు ఆయన్ని తేరిపార చూసాక, ఇక చేసేదేమీ లేక లక్ష్మణుడే తల త్రిప్పుకున్నాడు! శబరికి రాముడి పట్ల ఎంత ప్రేమ కలిగిందో, రాముడికీ శబరి పట్ల అంత ఇష్టం కలిగింది . ఆమె సొంత చేతులతో ఆయనకు తినిపించి సంబరపడితే, ఆయన అమె చేతుల మీదుగా తిన్నందుకు సంతోషపడ్డాడు. తన జీవితంలో ఆనాటి వరకూ అంత రుచికరమైన ఆహారం తినలేదు ఆయన! కడుపు నిండేంత వరకూ తింటూ పోయాడు రాముడు. అటు పైన అంత చక్కని పండ్లని పెట్టినందుకు శబరిని ప్రశంసలతో ముంచెత్తాడు. లక్ష్మణుడు ముఖం మాడ్చుకొని అంతా చూస్తూ నిలబడ్డాడు, ఏమీ అనకుండా.
తర్వాత నెల రోజులకు, వానర రాజు సుగ్రీవుడి ఇంట్లో మంచి విందు ఒకటి జరిగింది. రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ బాగా భోంచేశారు, గొప్ప గొప్ప పిండివంటలతో. భోజనాలైనాక లక్ష్మణుడు అడిగాడు- "అన్నా! భోజనం అద్భుతంగా ఉంది, కదూ?" అని .
"బాగుంది బాగుంది" అన్నాడు రాముడు- "కానీ శబరి పెట్టిన రేగుపండ్లంత గొప్పగా అయితే లేదు" అని జోడించాడు. లక్ష్మణుడికి అర్థం కాలేదు . ఆ తర్వాత వాళ్లు వేరువేరు చోట్ల గొప్ప గొప్ప మహారాజులు పెట్టిన విందు భోజనాలు తిన్నప్పుడల్లా అడిగాడతను అన్నని- "ఈ భోజనం చాలా గొప్పగా ఉంది కదన్నా?!" అని. ప్రతిసారీ, ఆ భోజనం ఎంత అద్భుతంగా ఉన్నాసరే, రాముడు -"శబరి పెట్టిన పళ్లు ఇంకా చాలా బాగున్నాయి" అనే అంటూ వచ్చాడు.
చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది లక్ష్మణుడికి - భోజనాన్ని రుచికరంగా చేసేది దానిలోకి వాడిన నెయ్యి కాదు; అందులో వేసిన జీడిపప్పులు, బాదాములు కాదు- భోజనానికి రుచి ఏర్పడేది ప్రేమ వల్లనే. భగవంతుడు ఇష్టపడేది ఆ ప్రేమనే!