దాదాపు పదేళ్ళ క్రితం, ఈనాడు పత్రికలో పిల్లల పేజీలో ఒక వ్యాసం వచ్చింది. అది "ఎరగాన్" అన్న పుస్తకం గురించి, అది రాసిన క్రిస్టఫర్ పాలినీ గురించి.
నాకు ఎందుకు అది బాగా గుర్తుండిపోయింది అంటే, ఆ పుస్తకాన్ని రాయటం మొదలెట్టే నాటికి పాలినీ వయసు పదిహేనేళ్ళు! వందా, రెండొందల పేజీల పుస్తకం కాదది- ఐదొందల దాకా పేజీలు ఉన్నాయి. పెద్ద పుస్తకమే!
'ఎరగాన్' ఒక పిల్లల నవల. పది-పన్నెండేళ్ళ వయసు పిల్లలకి నచ్చేట్లు రాయబడింది. అంటే, చిన్న పాలినీ తనకన్నా చిన్న వాళ్ళకోసం, తానే ఒక నవల రాసాడన్నమాట! అందుకే అప్పట్లో నాకది బాగా గుర్తుండిపోయింది.
పాలినీ అమెరికాలో పుట్టి పెరిగాడు. పదో తరగతి వరకూ ఇంట్లోనే చదువుకున్నాడు. దూరవిద్య ద్వారా పదో తరగతి పాసయ్యాక, కొంచెం ఖాళీ సమయం చిక్కింది. 'ఆ సమయం అంతా కేటాయించి ఒక నవల రాస్తే ఎలా ఉంటుంది' అనుకున్నాడు. ఇంట్లో అమ్మా, నాన్నా, అక్కా అందరూ బలే ప్రోత్సహించారు. దాంతో పాలినీ నవల రాయడం మొదలుపెట్టాడు. అలా పుట్టింది, 'ఎరగాన్' అనే ఐదొందల పేజీల పుస్తకం! ఇందులో ఎరాగాన్ అనే పిల్లవాడి సాహసాలు, అతని జీవితంలో వచ్చిన మలుపులు ఉంటై. మధ్యలో పిట్టకథల్లా వేరు వేరు కథలు బోలెడు వస్తూ పోతూ ఉంటాయి. పాతకాలపు జానపద కథల్లోలాగా రకరకాల వింత ప్రాణులు, అద్భుత లోకాలు చాలా ఉంటాయి. పాలినీ వాళ్ల అమ్మావాళ్ళకి అది ఎంత నచ్చిందంటే, దాన్ని వాళ్ళే సొంతగా ప్రచురించారు. అది చదివినవాళ్లకల్లా నచ్చింది; అనూహ్య విజయం సాధించింది. పాలినీకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది- నెల రోజుల్లోనే చిన్న పాలినీ 'పెద్ద రచయిత' అయిపోయాడు!
ఐతే ఐదొందల పేజీలు రాసినా, పాలినీ కథ ఐపోనే లేదు! అది మొదటి భాగమేనట! ఒకసారి ఎరగాన్ రాసాక, దానికి కొనసాగింపుగా 2005 లో "ఎల్డెస్ట్" అని ఇంకో నవల, 2008లో "బ్రిసిన్జర్" అని మూడో నవల కూడా రాసాడు పాలినీ. ఇదే కథ కొనసాగింపుగా నాలుగో(ఆఖరు) పుస్తకం "ఇన్హెరిటన్స్ " 2011 నవంబరులో విడుదల కాబోతోంది! ఇప్పటిదాకా ఇతని పుస్తకాలు వివిధ భాషల్లో రెండు కోట్ల కాపీలు అమ్ముడు పోయాయట!
పాలినీ రాసిన కథలు పూర్తిగా కొత్తవేమీ కాదు- అంతకు ముందే వచ్చిన "లార్డ్ ఆఫ్ ది రింగ్స్", "బియోవుల్ఫ్" లాంటి నవలలకు చాలా దగ్గరగా ఉంటాయి ఇవి. పాలినీ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటాడు- 'అవన్నీ చదివాకే, పిల్లల కోసం నవల రాయడం మొదలుపెట్టాను' అని!
అయితేనేమి, పదిహేనేళ్ళ వయసులోనే ఇంత రాసాడంటే వాడు గొప్పవాడన్నట్లే కదా?
ఇంతకీ, అసలు ఇతని గురించి ఎందుకు చెబుతున్నాను అంటే - మనలో అందరికీ రకరకాల ఊహలు వస్తూ ఉంటాయి. "సచిన్ నా దగ్గరికి వస్తే ఏం మాట్లాడాలి?", "బెన్ టెన్ లో నేను కూడా ఒక పాత్రనైతే ఎలా ఉంటుంది?" ఇలా ఏదో ఒక విషయం గురించి అందరం ఊహించుకుంటూనే ఉంటాము కదా, ఆ ఊహలకే మరి కాస్త పదును పెట్టి, కథలు అల్లుతూ, వాటిని తోటివాళ్లతో పంచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది! ఆటకు ఆటా ఆడినట్లు ఉంటుంది, మన ఊహాశక్తికి పదును పెట్టుకున్నట్లూ ఉంటుంది! అందరూ పాలినీలాగా ఐదొందల పేజీల నవలలు రాయనక్కర్లేదు- కానీ, చదువుతో పాటు, మన సృజనకి ఇలా పదును పెట్టుకుంటే తప్పేముంది? సరదాకి సరదా, పదసంపదకి పదసంపద!