చోడవరంలో లింగయ్య కూలిపని చేసు-కుంటూనే మొక్కల్ని పెంచుకునేవాడు. మొక్కల పెంపకం పట్ల అతనికి ప్రత్యేక శ్రద్ధ ఉండేది. అందువల్ల అతని దగ్గర లేని మొక్కలంటూ ఉండేవికావు. ఆ గ్రామంలో ప్రజలు ఎవరికి ఏ మొక్క కావల్సి వచ్చినా లింగయ్య వద్దకే వచ్చి తీసుకెళ్లేవారు.
ఒకసారి త్వరగా ఎదిగి, ఎక్కువ దిగుబడి ఇచ్చే రెండు రకాల పండ్ల మొక్కల్ని తెచ్చాడు లింగయ్య , ఏదో దూర ప్రాంతం నుండి. తన పెరట్లో గుంతలు త్రవ్వి రెంటినీ నాటాడు .
మేకలు, ఆవులు, ఇతర జంతువులు వాటిని పాడు చేయకుండా చుట్టూ కంచె వేయబో-యాడు. అంతలో ఆ రెండిటిలో ఒక మొక్క లింగయ్యతో "అయ్యయ్యో! ఆగు లింగయ్యా! నా చుట్టూ కంచె వేసి నన్ను బంధిస్తావా? నాకు కంచె వద్దు! స్వేచ్ఛగా ఎదగనివ్వు, నన్ను. నన్ను చూస్తే నీకు జాలి కలగటం లేదా?" అన్నది.
"అయ్యో! నా ఉద్దేశ్యం అది కానే కాదు! కంచె లేకపోతే నీకు రక్షణ ఉండదు. ఆవులు, మేకలు అన్నీ నిన్ను తినేస్తాయి!" అని చెప్పాడు లింగయ్య. అయినా ఆ మొక్క వినలేదు. "సరే, నీ ఇష్టమే కానివ్వు" అని , లింగయ్య దాన్ని వదిలేసి, రెండో మొక్కకే కంచె వేశాడు.
ఆ మరునాడే ఒక మేక వచ్చింది. ముందుగా అది కంచె వున్న మొక్కని తినడానికి ప్రయత్నించింది. దానికది సాధ్యం కాలేదు. అంతలో కంచెలేని మొక్క కనబడింది దానికి. దాన్ని చూడగానే సంతోషంగా ఆ మొక్క దగ్గరికి పరుగెత్తిందది. ఆకుల్ని తింటూ మొక్కనే లాగేయటానికి ప్రయత్నించింది. ఆ మొక్కకి ప్రాణాలు పోయినంత పనైంది. అంతవరకూ అలాంటి అనుభవం లేదేమో, గజ గజా వణికిపోయింది పాపం. అంతలోనే ఎక్కడినుండి వచ్చాడో, లింగయ్య పరుగు పరుగున వచ్చి మేకని వెళ్లగొట్టాడు. ఆ అనుభవంతో ఒక్క నిముషంలోనే వడలి-నట్లు అయిపోయింది మొక్క.
"ఇందుకే గద, తల్లీ, నీ చుట్టూ కంచె వేస్తానన్నది? నువ్వు కాస్త పెరిగి, నీ వేళ్లు భూమిలో బలంగా నాటుకుంటే, ఆ తర్వాత నీకు కంచె అవసరం ఉండదు. అప్పుడు నిన్ను ఇంక ఎవరూ ఏమీ చేయలేరు. అప్పటి వరకూ నీకు తగిన రక్షణ ఉండాలి గదా! అంతవరకూ కనీసం, నేను చెప్పిన మాట విను, కంచె వేయనివ్వు" అన్నాడు లింగయ్య దానితో.
'రైతు వచ్చి తరిమి ఉండకపోతే మేక తనను అన్యాయంగా తినేసేది కదా?' సంగతి అర్థమైన మొక్క చాలా సిగ్గుపడ్డది. తనను మన్నించి కంచె వేయమని లింగయ్యను ప్రాధేయపడింది.
లింగయ్య అలాగే చేశాడు. అటుపైన మొక్క బలంగా ఎదిగింది. పెద్ద మానులా తయారైంది. అటుతర్వాత దానికి ఇక కంచె అవసరం రాలేదు మళ్ళీ!