అనగనగా గడ్డంనాగేపల్లిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ పిల్లవాడు చాలా సోమరిపోతు. అతనికి ఏ పని చేయడానికీ ఇష్టం లేదు. ఎప్పుడూ నిద్ర పోవాలనుకునేవాడు.
తల్లిదండ్రులు చెప్పిన చిన్న పని చేయడానికి కూడా చాలా మొండికేసేవాడు. ఇంట్లో వాళ్ళూ, ఊళ్ళో వాళ్ళూ అందరూ అతన్ని సోమరి పోతు అనేవారు. అయినా అతనిలో మార్పు రాలేదు.
ఒక సారి అతడు దేవుణ్ణి ప్రార్థించాడు - తనకు ఒక సేవకుణ్ణి పంపించమని. 'ఈ సోమరిపోతుకు గుణపాఠం చెప్పడానికి ఇదే మంచి సమయం' అనుకున్నాడు దేవుడు. కొంచెం ఆలోచించి, ఒక పిశాచాన్ని అతనికి సేవకుడిగా పంపించాడు.
ఆ రోజు రాత్రి సోమరిపోతు ఇంటికి పిశాచం వచ్చి తలుపు తట్టింది. "అయ్యా! దేవుడు నన్ను మీ సేవకుడిగా ఉండమని పంపాడు. మీరు నాకేమి పని చెబితే ఆ పని చేస్తాను," అని పిశాచం తనని తాను పరిచయం చేసుకున్నది.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేస్తూనే సోమరిపోతు సేవకునికి చాలా పనులు చెప్పాడు. రోజూ తల్లిదండ్రులు చెప్పే పనులన్నీ సేవకుడి చేత చేయించాడు. సేవకుడు వాటిని చక చకా చేసేసాడు. ఇంకా ఏం పనులున్నాయని అడిగాడు.
"మా నాన్న ఊరి చివర ఒక గుడిసె కట్టించాడు. దాన్ని శుభ్రం చేసి, అలికి, సున్నం పూసి, ఇంటి చుట్టూ కంచె వేసి, గేటు బిగించి, దాన్ని ఎవరికైనా ఎక్కువ ధరకు అమ్మేసి, డబ్బు తీసుకురా" అన్నాడు. ఆ పనిని కూడా సేవకుడు తొందరగా చేసేసాడు. 'ఇంకేదైనా పని ఇమ్మని' అడిగాడు.
"సరే, ఇప్పుడు నువ్వు పోయి మా ఊరి చెరువులో ఉండే మొసలిని చంపేసి రా" అని పని చెప్పాడు. పిశాచానికి ఆ పని ఎంత సేపు? చెప్పీ చెప్పగానే పూర్తి చేసుకొని వచ్చింది.
ఇలా సోమరిపోతు యజమాని ఏ పని చెప్పినా పిశాచ సేవకుడు తొందరగా పూర్తి చేసేసి, 'ఇంకా పని చెప్పండి' అని అడుగుతున్నాడు.
సాయంత్రం అయ్యేసరికి పనులు చెప్పడానికి కూడా విసుగేసింది సోమరిపోతుకు. దీని బదులు ఏదైనా పని చేయాలనిపించింది. అంతే-
సోమరిపోతుకి పని చేద్దామని అనిపించేసరికి, పిశాచం కాస్తా మాయమైంది.
సోమరిపోతుకు బుద్ధి వచ్చినందుకు అతని తలిదండ్రులే కాదు, దేవుడు కూడా సంతోషించాడు.