ముందుగా చెప్పాల్సింది, క్రొత్త శీర్షిక- యువకెరటాలు గురించి. సరైన చదువు లేదు; వనరులు లేవు; వెన్నుతట్టి దారి చూపించే పెద్దలు లేరు- ఏవీ లేవు- తన చుట్టూ ఉన్న మనుషులకు ఉపయోగపడే పని చెయ్యాలన్న దృఢ సంకల్పం తప్ప! 'విలియం కంకంబ్వా' వ్యాసం పిల్లలకే కాదు- పెద్దలకీ స్ఫూర్తినిస్తుంది.

మన భాషని ఇంకో భాష మింగేస్తోందని బాధ పడాలా, అన్ని భాషలూ ఒకటవ్వటంలోని సౌలభ్యం గురించి సంతోషించాలా? ఏదైనా, చివరి పేజీలో ఉదహరించిన 'ఇ' భాష- ఇంగ్లీషేనని అనుమానం వచ్చింది, అందరికీ.

గంగమ్మ గారు బొమ్మకి కథ లో పల్లె వాతావరణాన్నీ, ఆత్మీయతలనీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. పల్లెటూర్లలో అమ్మమ్మలు, తాతయ్యలు ఉండే పిల్లలు అదృష్టవంతులు కదా! కాకపోతే ఈ కథ దీనికోసం ఇచ్చిన బొమ్మకు అంతగా సరిపోలేదనిపించింది. కొత్తపల్లిలో కథలు రాయమని ఇస్తున్న పిక్చర్ ప్రాంప్టులు ఏదో ఒక సన్నివేశాన్ని దృఢంగా చూపిస్తూ, తమంతట తాము ఆలోచన రేకెత్తించేట్లుగా ఉంటే బాగుంటుంది- అప్పుడు ప్రక్కన రాస్తున్న ప్రాంప్టింగ్ ప్రశ్నల అవసరమూ ఉండదేమో; పిల్లలు కూడా‌ వ్రాయటానికి మరింత ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది కదా అనిపించింది.

'కొత్తపల్లికో కథ' నిజంగా కొత్త ఆలోచన. గీతికకి భలే తమాషా ఐడియా వచ్చింది. 'మాట తీరు', 'పనీపాట', 'పొరుగింటి చీర', 'నేను సాధించాను', 'గొప్పకుపోతే'- కథలు పిల్లల్లా కనిపించే పెద్దలు వ్రాసినట్లు ఉన్నాయి- పట్టుమని పదిహేనేళ్ళు నిండని వీళ్ళు, మనుషుల్లో ఉండే బలహీనతలను ఎంత చక్కగా గమనించారు! నిర్భయంగా ఎదగటం, మంచి వ్యక్తులుగా రూపొందటం, ఆడంబరాలకు పోకుండా ఉండటం లాంటివి ఎంతో విలువైనవని వీళ్ళు గుర్తించటం చాలా ముచ్చటేసింది. ఈ కథల్లో వీళ్ళు వాడిన వాక్యాలు- 'నా మనసును అలుముకొని ఉన్న భయాల ప్రపంచాన్ని తాత్కాలికంగా మర్చిపోయాను ( 'నేను సాధించాను')', 'అలా తెలిసింది- తామిద్దరూ ఒకే పడవలో ఉన్నామని ( 'గొప్పకుపోతే')' లాంటివి, వీటిని రాసిన ఈ పిల్లల పరిణతినీ, భాష మీద వారికున్న పట్టునీ చూపించాయి.

నీతి_చంద్రిక లో 'విగ్రహం' మొదలవ్వటం బాగుంది. తెలుగు పాఠ్య పుస్తకాల్లోని కొరుకుడు పడని, మింగుడు పడని కంకర్రాళ్లలాంటి తెలుగును చదివీ చదివీ- గ్రాంధిక భాష అంటేనే వికారంగా మొహం పెట్టే పిల్లలకు ఈ కథలు తప్పకుండా మంచి ఊరట! 'మంచి తెలుగు- ఎంత రుచి!'

'నగరానికి దూరంగా' పాటలో తప్పక సవరించుకోవాల్సిన తప్పులు మూడు ఉన్నాయి- ఒకటి: ఈ పాటని రచించింది శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.
రెండు: రెండో చరణంలో 'తోట తెరువున (దారిన) గున్నమావి తోరణాలు కట్టినపుడు' అని ఉండాలి.
మూడు: మూడో చరణంలో 'పొగమంచు అగరు పొగలు'(వాసనగల మంచు పొరలు) అనాలి.
మంచి భాషని నేర్చుకునేందుకు ఇటువంటి అందమైన పాటలు ఎంత చక్కని సాధనాలో గదా?!