రామాపురంలో రంగడు అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ల అమ్మ సుగుణమ్మ; నాన్న రామప్ప. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అయినా రంగడికి ఏ పనీ చేతకాదు. 'ఎందుకూ పనికి రావురా' అని రామప్ప ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు వాడిని. ఊళ్ళో వాళ్ళంతా 'బద్ధకపు మొద్దు' అని ఎగతాళి చేసే వాళ్ళు. కానీ రంగడు ఎవరినీ పట్టించుకునే వాడు కాదు. జులాయిలాగా ఎప్పుడూ ఊరంతా తిరుగుతూ ఉండేవాడు.
కొన్నాళ్ళకి రామప్ప మరణించాడు. సుగుణమ్మ కూలి పనికి వెళ్ళడం మొదలు పెట్టింది. అయితే రంగడిని పోషించడం ఆమెకు పెద్ద కష్టమై పోయింది. వాడికి ఏ పనీ ఇష్టం లేదు; చేతకాదు; పని చేస్తానని వెళ్ళినా ఎవ్వరూ వాడికి పని ఇచ్చేవాళ్ళు కాదు! చిన్నప్పటి నుండీ తను ఏ పనీ చేయలేదు- అసలు ఎప్పుడైనా ఏదైనా చేస్తే కదా, పనులు వచ్చేది?
ఊళ్ళో రంగడి మేనమామ రామాంజన్నకి చాలా పనులొచ్చు. అతని దగ్గరకి వెళ్ళి ఏదైనా పని నేర్చుకోమని సుగుణమ్మ ఎంత చెప్పినా వీడు మాత్రం ఒప్పుకోడు! ఒకరోజు సుగుణమ్మ కి కోపం చాలా వచ్చేసింది: "ఇక నిన్ను పోషించడం నా చేత కాదు, ఇల్లు వదిలి వెళ్ళి పో- అంతే!" అన్నది. అకస్మాత్తుగా రంగడికి చాలా అవమానం అనిపించింది. 'తల్లే కాదన్నాక, ఇంక ఇక్కడ ఉండేది ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళిపోతాను' అని ఇల్లు వదలి బయలు దేరాడు. వాడు అట్లా దిగులుగా పోతూ ఉండగా దగ్గర్లోనే ఒక చింతతోపు కనిపించింది. వాడు అక్కడే బావిలో నీళ్ళు తాగి, ఒక చెట్టు కింద, బండ మీద- కూర్చున్నాడు.
సరిగ్గా వాడు కూర్చున్న చెట్టు మీదే రెండు పిశాచాలు కూర్చొని ఉన్నాయి. రంగడిని చూడగానే అవి లొట్టలేసుకుంటూ క్రిందికి దిగాయి. రంగడు వాటిని చూసాడుగానీ ఏమీ పట్టించుకోలేదు. భయం కంటే వాడికి బద్ధకమే ఎక్కువైంది మరి! వాడి మొహంలో దిగులూ అట్లాగే ఉంది. కొంచెం సేపు వాడి చుట్టూ తిరిగి సంతోషంగా నాట్యం చేసిన పిశాచాలు కూడా చివరికి వాడి మొహం వైపు చూసి జాలితో నీరు కారి పోయాయి.
"ఏం బాబూ! ఎందుకు, అట్లా దిగులుగా ఉన్నావు?" అని అడిగాయి ఆ పిశాచాలు. అప్పుడు రంగడు "పిశాచాలూ, నాకు ఏ పని చేయడమూ చేత కాదు. 'పోనీలే, పని చేద్దాం' అని వెళ్తే కూడా నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. పనికి మాలిన వాడినని ఇంట్లో అమ్మ తిడుతుంది; ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అదే నా దిగులు" అని చెప్పాడు.
"ఓహ్హో హ్హో పిచ్చివాడా! ఇంతేనా!" అని పకపకా నవ్వాయి పిశాచాలు. రంగడికి చాలా కోపం వచ్చింది. వాడి ముఖాన్ని చూడగానే వెంటనే నవ్వటం ఆపేసి, పిశాచాలు “సరే! అయితే నువ్వు మా వెంటరా! నిన్ను మంచి పనివంతునిగా మారుస్తాము!” అన్నాయి.
బద్ధకపు రంగడికి వెంటనే అమ్మ గుర్తుకి వచ్చింది. తను అమ్మ అనుమతి తీసుకొని రాలేదనీ గుర్తుకొచ్చింది. దాంతో "నేను మా అమ్మనడిగి వస్తాను" అన్నాడు వాడు. అయితే అక్కడున్నవి దయ్యాలు గద- ఊరుకుంటాయా? "అమ్మ సంగతి తరువాత చూద్దాం, ముందు నువ్వు వస్తావా? రావా?" అని అవి వాడిని బలంతంగా లాక్కెళ్ళాయి.
కొంచెం సేపు ముళ్ళ దారుల్లో నడిపించాక, అవి వాడిని ఒక పొలం ముందు నిలబెట్టాయి. అక్కడ గుబురు చెట్ల నుండి భయంకరమైన శబ్దాలు చాలా వస్తున్నాయి. అప్పటికి గానీ రంగడికి భయం మొదలవ్వలేదు. పిశాచాలు వాడికి ధైర్యం చెబుతున్నట్లు- “నువ్వు భయపడకు- నిన్ను మేము ఏమీ చెయ్యం! ఏ పనీ రాని నీలాంటి అమాయకుణ్ని తింటే మాకే పాపం! కాబట్టి నిన్ను మేం ఏమీ చెయ్యం. మేమే కాదు, ఇక్కడ చెట్టు మీద ఉన్నవన్నీ చాలా మంచి పిశాచాలే. అవన్నీ నిన్ను చూసేశాయి. వాటికి చాలా పనులొచ్చు. అవన్నీ నీకు ఆ పనులన్నీ నేర్పిస్తాయి. బుద్ధిగా నేర్చుకో. ఏమంటే అవన్నీ మా అంత మెతకగా ఉండకపోవచ్చు. కొన్నిటికి కోపం జాస్తి. చెప్పిన పని చేయకపోతే అవి నిన్ను తినేయచ్చు కూడా. అయితే బుద్ధిగా పని నేర్చుకున్నంత కాలం నీకేం కాదు” అన్నాయి.
రంగడు పొలంకేసి చూశాడు. ఆ పొలంలోనాలుగైదు పిశాచాలు చాలా చక్కగా పనులు చేసుకుంటున్నాయి- సరిగ్గా మనుషుల లాగానే! అంతలోనే రంగడికి తనని ఎవరో పిలిచినట్టు అనిపించింది. చూడగా అది ఎవరోకాదు- పనులు చేసుకుంటున్న పిశాచాలలో ఒకటి! రంగడు భయపడుతూ భయపడుతూ వెళ్ళాడు దాని దగ్గరికి. అయితే ఆ పిశాచం చాలా మంచిగా మాట్లాడింది. ఎంతో ప్రేమగా పని ఎలాచేయాలో నేర్పడం మొదలుపెట్టింది రంగడికి.
పిశాచాల మాటని కాదనేది ఏముంది? రంగడు రెండో రోజుకల్లా రక రకాల పనులు నేర్చేసుకున్నాడు. ఇంకో రెండు రోజులకల్లా 'నేనూ పనులు చేయగలను' అని నమ్మకం కలిగింది వాడికి. ఆ సరికి వాడు పొలం పనులు చాలా వరకు నేర్చేసుకున్నాడు.
ఐదో రోజున రెండు క్రొత్త పిశాచాలు వచ్చి రంగడిని పరీక్షించాయి. ఒకసారి వాడికి పనులన్నీ వచ్చునని నమ్మకం కుదిరాక, వాటి అనుమతి తీసుకొని, రెండు పిశాచాలు రంగడిని నడిపించుకొచ్చి ఊర్లో వదిలాయి. వాడు పిశాచాలకు కృతజ్ఞతలు చెబుదామని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అవి అక్కడ లేవు!
ఇంటికి తిరిగొచ్చిన రంగడిని చూసి సుగుణమ్మకు సంతోషంతో కళ్ల నీళ్ళు వచ్చాయి. వాడు "అమ్మా! నాకిప్పుడు చాలా పనులొచ్చమ్మా! నేనింక బాగా పని చేస్తాను. నిన్ను బాగా చూసుకుంటానమ్మా!" అంటుంటే అమ్మకు పట్టరాని ఆనందం కలిగింది.
మరునాడు సుగుణమ్మ వాడిని రామాంజన్న దగ్గరికి తీసుకెళ్ళింది. రంగడికి ఇప్పుడు అన్ని పనులూ వచ్చని చెప్పి, ఏదైనా పని ఇమ్మని బ్రతిమాలింది. రామాంజన్నకు అంతగా ఇష్టం లేకపోయినా, 'సరే చూద్దాం'అని వాడికి పని ఇచ్చాడు.
ఇంకేముంది? రంగడు ఇప్పుడు తనకు ఇచ్చిన పనులన్నీ చకచకా చేసేయటం మొదలు పెట్టాడు. "సేద్యం పనులు కావాలంటే రంగడి చేతనే చేయించుకోవాలి- వాడు పనులు ఎంత చక్కగా చేస్తాడో!" అని రామాంజన్న ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పసాగాడు. అప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా రంగడిని గౌరవించారు. సుగుణమ్మ వాడిలోని మార్పును చూసి మురిసిపోయింది.
కొన్నేళ్ళ తర్వాతగానీ రంగడికి తెలీలేదు - 'తనకి పనులు నేర్పిన పిశాచాలు నిజానికి పిశాచాలు కావు, మనుషులే! అదంతా అమ్మ, రామాంజి మామ కలిసి ఆడించిన నాటకం!' అని. 'రంగడిని వెతుక్కుంటూ పోయిన రామాంజి మామ నలుగురైదుగురు పని మనుషుల్ని పురమాయించి, ఆ నాటకం ఆడించాడు. నాటకం చివరలో వచ్చిన క్రొత్త దయ్యాలు వేరెవరో కాదు- సుగుణమ్మ, రామాంజిమామలే!
ఇప్పుడు పెద్దయిన తర్వాత, రంగడు ఈ సంగతిని ఇంకా తన పెళ్ళాం పిల్లలకు చెప్పుకొని నవ్వుతూనే ఉన్నాడు!