"టీచర్! ఆ రోజున చాచా నెహ్రూ గురించే మాట్లాడాలా, టీచర్!?"

"అవును. నవంబరు పధ్నాలుగు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు కదా? అందుకనే మనం ఆ రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజున మనం అందరం నెహ్రూజీని గుర్తుచేసుకోవాలి"

పిల్లలందరూ తలలూపారు. ఎవరికి వాళ్ళు వాళ్ల అమ్మా నాన్నలతో చాచా నెహ్రూ గురించి పదో-ఇరవయ్యో వాక్యాలు రాయించుకొని బట్టీ పట్టారు.

రాము తల్లిదండ్రులిద్దరికీ చదువురాదు; వాడు కొంచెం బద్ధకస్తుడు కూడా.

అందుకని పదమూడో తేదీ వరకూ ఏమీ చెయ్యలేదు. ఆరోజు సాయంత్రం గుర్తుకొచ్చింది.. ఏం చెయ్యాలి?

వాళ్ల బడిలో టీచర్లు ఎవ్వరూ ఊళ్ళో ఉండరు- అందరూ పట్నంనుండి వచ్చిపోయేవాళ్ళే. వేరే పిల్లల్ని అడుగుదామంటే అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. అందుకని చాచానెహ్రూ గురించి తనకు తెలిసిన నాలుగు వాక్యాలే చెబుదామనుకున్నాడు:

"చాచా నెహ్రూ అసలు పేరు జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన చాలా గొప్ప నాయకుడు. ఆయన గొప్ప స్వాతంత్ర్య యోధుడు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకనే ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం" అని రాసుకున్నాడు ఓ కాగితం మీద. వాటిని చదువుకుంటే వాడికి చాలా ఉత్సాహం వచ్చింది. నెహ్రూ గురించి తనకు అంతా తెలుసుననిపించింది.

తెల్లారి బడికి వెళ్ళగానే సీనుని అడిగాడు-"నువ్వేం చెబుతావురా, చాచా నెహ్రూ గురించి?" అని.

"చాచా నెహ్రూ భారతదేశపు తొలి ప్రధాని" అన్నాడు వాడు.

"అది నాకు తెల్సు" అన్నాడు రాము బింకంగా.

"చాచానెహ్రూ చాలాసార్లు జైలుకెళ్ళాడు" అన్నాడు సీను.

"ఆ సంగతి ఎవరికి తెలీదు?" అన్నాడు రాము, మనసులోనే ఆ రెండు వాక్యాలనూ గుర్తుంచుకుంటూ.

ఓసారి సీను అటు వెళ్ళగానే తన జేబులోంచి కాగితం తీసి ఆ రెండు అంశాలనూ రాసుకున్నాడు నవ్వుకుంటూ.

ఈ పద్ధతి నచ్చింది వాడికి.

తర్వాత సుజాత చెప్పింది- "నెహ్రూ తల్లిదండ్రులు స్వరూపరాణి, మోతీలాల్" అని.

రోజా చెప్పింది- "నెహ్రూ భార్య పేరు కమలానెహ్రూ" అని.

రాము వీటిని అన్నింటినీ జాగ్రత్తగా రాసిపెట్టుకున్నాడు తన కాగితంలో.

కార్యక్రమంలో ఎవరో మాట్లాడుతూ చెప్పారు- "మన తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఎవరో కాదు, నెహ్రూ గారి కుమార్తే!" అని.

రాముకి ఆ సంగతి చాలా ముఖ్యమనిపించింది- రాసి పెట్టుకుందామని జేబులోంచి కాగితం తియ్యబోయాడు.

చూస్తే కాగితం లేదక్కడ!

హడావిడిగా జేబులన్నీ తడుముకున్నాడు .

ఉహుఁ..లేదు. ఎక్కడో పడిపోయి ఉండాలి. అన్నివైపులా వెతికాడు రాము. ఎక్కడెక్కడో పడి ఉన్న కాగితాలన్నిటినీ ఏదో ఒక వంకతో విప్పి చూశాడు.. ఎక్కడా కనబడలేదు, తన కాగితం.

అంతలోనే మైకులో ప్రకటన వినవచ్చింది- "ఇప్పుడు రాము చెబుతాడు మనకు- బాలల దినోత్సవం గురించి" అని.

రాము బిక్క మొఖం వేసుకొని స్టేజీ ఎక్కి మైకు ముందు నిలబడ్డాడు. "చాచా నెహ్రూ అసలు పేరు జవహర్‌లాల్ నెహ్రూ...మరే, మరే,..ఆయన చాలా గొప్ప నాయకుడు.."

"చాలాసార్లు జైలుకెళ్ళాడు.." అందించారు ప్రక్కనే కూర్చున్న సోషల్ అయ్యవారు. ఆయనకెట్లా తెలుస్తుంది, సరైన వరస ఏమిటో?

"అవునవును, చాలా సార్లు జైలుకెళ్ళాడు" పూరించాడు రాము, మైకులో.

ఆ తర్వాత వాడికి ఇంక ఏం చెప్పాలో తెలీలేదు. ఎక్కడో వరస తప్పిపోయినట్లుంది- ఇంకేమీ గుర్తుకు రావట్లేదు. నీళ్ళు నముల్తూ నిలబడ్డాడు.

"నాకీ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు" అందించారు అయ్యవారు, ఇంకేమీ రాలవని గుర్తించి.

రాము ఆ ముక్కనీ అనేశాడు గబగబా. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు.

రాము వగర్చుకుంటూ క్రిందికి దిగి ఊపిరి పీల్చుకున్నాడు. గర్వంగా అటూ ఇటూ చూశాడు, కూర్చోబోతూ.

వాడు కూర్చునే చోటనే పడి ఉంది, వాడు రాసుకున్న కాగితం!

వాడు ఓసారి దానికేసి కోపంగా చూసి, గబుక్కున దాని మీద కూర్చున్నాడు.

అటుపైన అరిచాడు అందరితోబాటూ- "భారత్ మాతాకీ..జై!" అని.

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం.