అడవిని ఆనుకొని ఒక గులాబి తోట ఉండేది. అక్కడ ఒక సీతాకోకచిలుక ఉండేది. అది చాలా అందంగా, రకరకాల రంగులతో ఉండేది. దాని రెక్కలు అనేక రంగులతో మెరిసిపోతూ ఉండేవి. అయితే ఆ అందం దానికి ఎక్కడ లేని గర్వాన్ని తెచ్చిపెట్టింది. ఆ గర్వంతో దాని మూర్ఖత్వమూ పెరిగిపోయింది.

ఒక రోజు ఆ తోటలోకి ఒక ఏనుగుపిల్ల వచ్చింది. సీతాకోకచిలుక ఏనుగు చెవి మీద వచ్చి వాలింది.

"ఎవరు నా చెవిమీద ఉన్నది?" అన్నది ఏనుగు.

"నేను ఎవరినో కూడా తెలియదా, నీకు?! నేను దేశ దేశాలకే అందగత్తెను. అందమైన సీతాకోకచిలుకను నేను!" అని సీతాకోకచిలుక బదులిచ్చింది.

అప్పుడు ఏనుగు చాలా సంతోషంగా “ఓ నువ్వా! నిన్ను కలుసుకోవటం నిజంగా నా అదృష్టం. నిజానికి మన ఇద్దరం ఒకటే: నాకూ తొండం ఉంది; నీకూ తొండం ఉంది. నేనూ శాకాహారినే, నువ్వూ శాకాహారివే. మనం ఎంచక్కా కలిసి మెలసి ఆడుకోవచ్చు ఎప్పుడూ. ఏమంటావు?" అన్నది. అప్పుడు సీతాకోక చిలుక తన తొండాన్ని అటూ ఇటూ తిప్పుతూ, రెక్కల్ని రెపరెపలాడిస్తూ, చాలా గర్వంగా- "ఏనుగూ, నువ్వెక్కడ? నేనెక్కడ? నేను పువ్వులలోని తేనె త్రాగగలను, గాలిలో ఎగరగలను, నీకంటే ఎంతో అందంగా ఉంటాను. నాతో కలసి ఉండటానికి నీకు ఏం గొప్పతనముందని?" అన్నది.

ఈ మాటలు విని ఏనుగు కోప్పడలేదు. "అవును సీతాకోకచిలుకా, నువ్వు నాకంటే ఎంతో గొప్పదానివి. గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తే మంచిది కదా, అందుకనే నేను నీ స్నేహం కోరాను"-అని ఏనుగు అనేసరికి, సీతాకోకచిలుక గర్వం ఇంకా పెరిగిపోయింది.

అంతలో ఉన్నట్టుండి ఒక పెద్దగాలి వచ్చింది. గాలికి తట్టుకోలేక సీతాకోక చిలుక బర్రున కొట్టుకు పోయింది. కొంచెం ఉంటే అది ఎదురుగా ఉన్న ముళ్ళ కంచెలో ఇరుక్కుపోయేదే. అందమైన దాని రెక్కలు చినిగి పీలికలయ్యేవే. భయంతో‌ సీతాకోకచిలుక, "కాపాడండి,కాపాడండి" అని అరవటం, మరుక్షణం ఏనుగు తన తొండంతో దాన్ని పట్టుకొని కాపాడటం- రెండూ ఒకేసారి జరిగాయి.

సీతాకోకచిలుకకు తన పరిమితులు తెలిసాయి. బుద్ధి వచ్చింది. ఇక మీద ఎప్పుడూ తన అందాన్ని గర్వంగా మార్చుకోకూడదని అనుకుంది.

ఏనుగుతో స్నేహం చేసింది. అటుపైన ఏనుగు, సీతాకోక చిలుక రెండూ సంతోషంగా రకరకాల ఆటలాడుకున్నాయి.