ఒకానొక ఊరిలో ఒక కుటుంబం. ఆకుటుంబం చాలా బీద కుటుంబం. రాజయ్య చెప్పు లు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వాళ్ల పిల్లలు- సరళ, రాజు- ఇద్దరూ చాలా చురుకైనవాళ్లు. కానీ పేదరికం మూలాన, వాళ్ళిద్దరికీ చదువుకొనేందుకు వీలయ్యేది కాదు. రోజూ కూలికి పోవలసి వచ్చేది.
ఒకరోజు ఆ ఇద్దరు పిల్లలు, "నాన్నా! మన కుటుంబం ఇట్లా ఉండటానికి కారణం ఏమిటి? మన జీవితాలు ఎందుకిలా ఉన్నాయి? మేము ఎందుకు చదువుకోవటం లేదు?" అని బాధగా అడిగారు రాజయ్యను. అతను ఏం సమాధానం చెప్పగలడు?
కొన్ని రోజులు గడిచాయి. వాళ్ళ కుటుంబం మరిన్ని కష్టాలలో కూరుకు పోయింది. అనారోగ్యం పాలై రాజయ్య అకస్మాత్తుగా మరణించాడు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించే దిక్కు కూడా లేదు. "అమ్మ ఒక్కతే మనల్ని ఎలా పోషిస్తుంది?" అన్న ప్రశ్నలు మొదలయ్యాయి ఆ పిల్లలిద్దరి మనసులో.
అలాంటి సమయంలో ఒకసారి, గాంధీ జయంతి రోజున, ఆ అక్కా తమ్ముళ్లిద్దరూ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అక్కడి స్కూలు ఒక దానిలో పిల్లలు ఏదో నాటకం వేస్తుండటం కనబడింది. ఆ నాటకంలో ఒక పిల్లవాడు తెల్లగా మెరిసే పెయింటు పూసుకొని గాంధీగారి వేషం వేసుకొని కనబడ్డాడు వాళ్లకు. వాళ్ళిద్దరూ కొంతసేపు అక్కడే నిలబడి నాటకం చూశారు.
తర్వాత వెనక్కి వస్తూ రాజు అన్నాడు అక్కతో- "అక్కా! నాకొక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి గాంధీ వేషం వేస్తున్నాడు కదా. నేను అదే వేషం వేసుకొని రోడ్డు మీద నిల్చుంటాననుకో, అటూ-ఇటూ వెళ్ళేవాళ్ళు ఎవరైనా డబ్బులు వేస్తారు- అలా అమ్మకు సహాయం చేసినట్లూ ఉంటుంది; మిగిలిన డబ్బుతో మనం చదువుకోవచ్చేమో కూడాను" అని.
"అట్లా చేయడం తప్పు కదురా?! అమ్మ ఒప్పుకోదేమో" అన్నది సరళ.
"అది తప్పు ఎందుకు అవుతుందక్కా? మనం ఏమీ దొంగపనులు చెయ్యం కద!" అన్నాడు రాజు.
ఇద్దరూ తమ పథకాన్ని అమ్మకు చెప్పి, ఒప్పించారు . "నా పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి?" అని చాలా బాధపడింది వాళ్ళమ్మ. కానీ, పరిస్థితులు అలా ఉన్నాయి- ఆమె ఏమీ అనలేకపోయింది.
ఆనాటినుండీ రాజు రోజూ గాంధీగారి వేషం వేస్తున్నాడు. సరళ వాడికి మేకప్పు చెయ్యటంతోపాటు పాటలు పాడటం, కంజీర, ఢోలక్లు వాయించటం చేసేది. రోడ్డుమీద అటూ ఇటూ వెళ్ళేవాళ్ళు వాళ్లని చూసి జాలిపడి ఏవో కాసిని పైసలు ఇచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళిద్దరికీ రోజూ కొంత డబ్బు చేతికి రావటం మొదలెట్టింది.
కష్టాలు మూకుమ్మడిగా వస్తాయన్నట్లు, వాళ్ళ అమ్మ కూడా అకస్మాత్తుగా చనిపోయింది. ఇద్దరూ అనాధలయ్యారు- కానీ అప్పటికే గాంధీగారి వేషంలో నిలదొక్కుకున్న పిల్లలిద్దరూ అదే పనిని కొనసాగించారు- రోజూ ఒక పూట బడికి వెళ్ళటం, మరో పూట రోడ్డున పడి, వేషం వెయ్యటం. మొదట్లో బడికి సక్రమంగా రావట్లేదని టీచర్లు వాళ్లని మందలించేవాళ్ళు. కానీ కొన్ని రోజులకు వాళ్ల పరిస్థితిని తెలుసుకున్నాక ఏమీ అనకుండా ఊరుకున్నారు.
వాళ్ల బడిలోనే 'చింటు' అనే కుర్రాడు ఒకడు ఉండేవాడు. వాడు రోజూ రాజుని ఏడిపించేవాడు- "నువ్వేంటి? ఇలా ఒంటినిండా కలర్ పూసుకొని, చేతిలో కర్ర పట్టుకుని అడుక్కుంటున్నావు?" అని. సరళ చేతిలో డబ్బులు లాక్కునేవాడు వాడు; కానీ అటుగా వెళ్తున్న పెద్దవాళ్ళుకాని, పిల్లలు కాని- ఎవ్వరూ వాడిని ఏమీ అనేవాళ్ళు కాదు. 'ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో' అని కొంతకాలం ఎదురు చూశాక, రాజు సరళలు పరిస్థితిని తమ అదుపులోకి తీసుకోవటం నేర్చుకున్నారు. ఇద్దరూ కలిసి ధైర్యంగా పోరాడే సరికి చింటూ వాళ్ళ జోలికి రావటం మానేశాడు.
బాగా చదువుకున్న రాజు సరళలు ఇద్దరూ తాము పోగుచేసుకున్న డబ్బుతో లాయర్లయ్యారు. అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
'రోడ్డు మీద అడుక్కున్న పిల్లలు లాయర్లవుదామని ఎందుకు అనుకున్నారు?' అని అందరూ ఆశ్చర్యపోయారు. దానికి వాళ్ళిచ్చిన సమాధానం- "ధర్మం రోడ్డున పడినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు- దాని మానాన అది తన్నుకులాడి ధర్మం చివరికి ఎలాగో నిలబడింది. అందుకని, ఇప్పుడిక మా వంతు కృషి చేస్తాం. మాలాగా ధర్మాన్ని రోడ్డు మీద నిలబెట్టి ఇక ఎవ్వరూ గొప్పవాళ్ళవ్వనవసరం ఉండదు. ఇప్పుడిక ఏ పిల్లవాడూ రోడ్డున పడకుండా చూస్తాం. ధర్మాన్ని కాపాడుతాం!" అని.
పేదరికపు కష్టాలనుండి పైకి ఎదిగిన వాళ్ళు తమ మూలాలని మరువకపోతే ఎంత మందికి ఆసరా అవ్వగలరో చూపిన సరళ, రాజు నిజంగా ధన్యజీవులు.