'రూత్ ఏమోస్' అని ఇంగ్లండులో ఒక అమ్మాయి ఉండేది. చాలామందిలాగే, ఆ పాప కూడా చక్కగా స్కూలుకు వెళ్లి చదువుకునేది. అయితే అలా అందరిలాగే మామూలుగా కొనసాగి ఉంటే, ఇప్పుడు ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే వాళ్ళం కాదు: ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం పెద్దదైంది- అయినా నిండా పాతికేళ్ళు లేని రూత్ సొంతంగా ఒక కంపెనీని నడుపుతోంది! అదీ అట్లా ఇట్లా కంపెనీ కాదు- పదిమందికి ఉపయోగపడే వస్తువునొకదాన్ని, గొప్పగా తయారు చేసి అందిస్తోంది.
ఆ మధ్య ఇంగ్లండుతో సహా అనేక దేశాల్లో ఆర్ధిక మాంద్యం వచ్చింది. ఎన్నెన్నో గొప్ప గొప్ప కంపెనీలు మూతపడిపోయాయి. అలాంటి గడ్డు రోజుల్లో కూడా దాన్ని తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు కొందరు. ఆ తర్వాత అలాంటి మహిళా వ్యాపారవేత్తల గురించి "మేనేజ్‌మెంట్ టుడే" అనే పత్రిక వాళ్ళు ఒక జాబితా తయారు చేసారు. "35 under 35- '35ఏళ్ళ లోపున్న 35మంది' " అన్న పేరుతో. అప్పటికి రూత్ వయసు పందొమ్మిది సంవత్సరాలే- ఆమె కూడా ఈ జాబితాలో ఉంది! ఆ జాబితాలో ఉన్న అతి చిన్న వయస్కురాలు ఈ అమ్మాయే!! అంతే కాదు, 2006లో 'యంగ్ ఇంజినీర్స్' అనే సంస్థ రూత్ ఏమోస్‌కి - "Young Engineer of the year" అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇలా, రూత్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అసలు ఇంత పేరు రావడానికి తను ఏమి చేసిందో తెలుసుకుందాం.
మనకు పదోతరగతిలో 'యస్.యస్.సి' ఉన్నట్లుగా, ఇంగ్లండులో పదోతరగతి స్థాయిలో 'జీ.సి.ఎస్.ఈ' ఉంటుంది. పదిహేను-పదహారేళ్ళున్న రూత్ లాంటి పిల్లలు చదువుతుంటారు 'జి.సి.ఎస్.ఈ'ని. ఆ తరగతిలో ఉన్న పిల్లలంతా ఏదో ఒక ప్రాజెక్టు చేసి చూపించాలి. సరిగ్గా అదే సమయంలో రూత్ వాళ్ళ టీచరుగారి నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ఆ పరిస్థితిలో ఆయన్ని మెట్ల మీదినుంచి క్రిందికి నడిపించుకు రావటం పెద్ద సమస్యే అయ్యింది. ఇంకేముంది, టీచరుగారు రూత్‌కు పని అప్పజెప్పారు- ముసలితనం వల్ల కావొచ్చు, గుండెపోటు వల్ల కావచ్చు, మరే ఇతర కారణం వల్లనైనా కావచ్చు- సొంతగా నడిచేందుకు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు- అలాంటి వాళ్ళు కూడా సులభంగా మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా ఉండే పరికరం ఒకటి తయారు చెయ్యాలి. మరి ఆ పరికరం కూడా అందరికీ అనువుగా ఉండాలి; దానివల్ల కొత్తగా ప్రమాదాలేవీ తలెత్తకూడదు!
రూత్ చురుకైన అమ్మాయి. తనకు సైన్సు పాఠాలు చదవటం ఎంత బాగా వచ్చో, పరిసరాల్ని గమనించటమూ, వాటిని తనకు అనువుగా మలచుకోవటమూ కూడా అంత బాగా వచ్చు! సరే, ఆమె ఏమి చేసిందంటే, మెట్ల ప్రక్కనే రెయిలింగు ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని నిలిచేట్లు ఇనుముతో ఒక కర్రలాంటి పరికరాన్ని తయారు చేసింది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దాన్ని ముందుకి తోసామంటే అది ముందుకు జరుగుతుంది. అయితే దానిమీద కొంచెం బరువు మోపామంటే చాలు- అది కదలకుండా ఉన్న స్థానంలోనే బిగుసుకు పోతుంది! దీనికి బ్యాటరీలూ అక్కర్లేదు; కరెంటూ అక్కర్లేదు! అర్థమైందా, దీన్ని ఎలా చెయ్యాలో? ఎటొచ్చీ దీనికోసం వాడే లోహం కొంచెం గట్టిగా, వంకరపోకుండా, అరిగిపోకుండా ఉండాలి. కొంచెం ఆలోచించారంటే ఇది ఎలా చెయ్యచ్చో మీకూ తెలిసిపోతుంది బహుశ:.
దీన్ని తయారు చేశాక రూత్ కు అర్థమైంది- తన ఆవిష్కరణ ఎంత ఉపయోగకరమైనదో. వెంటనే వాళ్ల ఇంట్లోవాళ్ళు దీనికి "Stairsteady" అని పేరు పెట్టారు. "మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు ఇది ముసలివాళ్లకి చేతి కర్రలా ఆసరాగా ఉంటుందన్నమాట . వృద్ధులకనే కాదు, రక రకాల రోగులకు- ఆసుపత్రులకు, దెబ్బలు తగిలి సరిగ్గా నడవలేకపోతున్న వాళ్లకు , ఇలా రకరకాల జనాలకు ఈ పరికరం చాలా ఉపయోగం!"
వెంటనే రూత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ పరికరాన్ని తయారు చేసే కంపెనీని ఒకదాన్ని మొదలు పెట్టేశారు. ఇళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు- ఎక్కడని ఏముంది, మెట్లంటూ ఉన్న ప్రతిచోటా- పెద్దవాళ్ళు, రోగులు ఉండే ప్రతిచోటా- ఈ పరికరానికి పని పడుతోందట! ఇప్పుడు ఈ కంపెనీలో చాలామంది ఇంజినీర్లు ఉన్నారు! తమ దగ్గరికి వచ్చే వినియోగదారుల అవసరాలను బట్టి, ఆ పరికరంలో మార్పులు-చేర్పులు చేస్తూ ఉంటారు! ఇంగ్లండులోనే కాక, ఈ కంపెనీ పని ఇప్పుడు మరో రెండు మూడు దేశాలకు విస్తరించింది!
నిజానికి, ఈ పరికరాన్ని చూస్తే, దాని పని తీరు గురించి వింటూ ఉంటే- "ఓస్ ఇంతేనా!" అనిపిస్తోంది కదూ? అట్లా, 'మామూలు ఆలోచనలతోనే ఒక అమ్మాయి ఇలా పదిమందికీ ఉపయోగపడే ఒక పరికరాన్ని రూపొందించి, దాని ఆధారంగా ఒక కంపెనీనే నడుపుతోంది' అంటే గొప్పదే కదూ?!
రూత్ కి ఒక బ్లాగు-వెబ్సైట్ ఉంది. అందులో తన ఆలోచనలు రాస్తూ ఉంటుంది ఆమె. 'ఏం రాస్తోంది?' అని కుతూహలం కొద్దీ చూసాను. ఒక కంపెనీ అధినేతగా ఆమె రాసిన సీరియస్ వ్యాసాలు కొన్ని ఉన్నై, అందులో. అయితే వాటికంటే ఎక్కువగా ఆ వయసులో ఉన్న అందరు అమ్మాయిలూ రాస్తున్నట్లే - కొటేషన్లు, తాను ఇష్టంగా చేసుకునే వంటల విశేషాలు, తనకు ఇష్టమైన టీవీ సీరియళ్లవంటి సరదా విషయాలు- బోలెడు ఉన్నాయి. 'రూత్ ఆకాశం నుండి ఊడిపడ్డంత సీరియస్ అమ్మాయి కాదు' అని అర్థమైంది దాన్ని చూస్తే.
రూత్ కథ నాకు ప్రత్యేకం ఎందుకు నచ్చిందీ, అంటే - తనంత చిన్న వయసులో అంత బాధ్యతగా ఒక కంపెనీని నిర్వహించగలిగే వాళ్లు తక్కువ. అలాగని, ఆ అమ్మాయి తన ఇష్టాల్ని వేటినీ చంపుకోనూ లేదు; తన ఈడు వాళ్లు చేసే పనులేవీ చేయకుండానూ లేదు. చదువు ఆపెయ్యనూ లేదు- ఈ మధ్యే యూనివర్సిటీలో చేరిందట! అట్లా ఒక పక్క తన జీవితం; మరో పక్క తన వృత్తి -రెండింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు నాకు తోచింది.
అందరూ సరిగ్గా ఇలాంటిదే చెయ్యాలని లేదు: మన పరిసరాలను బట్టి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఫలానా వస్తువు, ఫలానా యంత్రం, ఫలానా పరికరం అవసరం అనిపిస్తే, దాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించడమే. రూత్ చేసింది అదే కదా - వాళ్ళ టీచర్ గారి నాన్నకి బాలేనందుకే కదా, ఈ ఆలోచన పుట్టింది? అందుకే రూత్ నుండి స్పూర్తి పొంది, స్కూలు పాఠాల మధ్య నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు అక్కడే వదిలేయక, ఎవరన్నా ఇంకాస్త ముందుకు వెళ్తారని ఆశిద్దాం.