తాతయ్య మొదలు పెట్టాడు- "అపాయంలో ఉపాయం అంటే 'యుక్తి' అని అర్థంరా, పిల్లలూ. అంటే 'తెలివి' అన్నమాట. మనం ఏదన్నా ప్రమాదంలో చిక్కుకున్నామనుకోండి, అప్పుడు మన తెలివితేటల్ని వాడి, అపాయంలోంచి తప్పించుకోవాలన్నమాట! మీకో కథ చెబుతాను వినండి..

ఒక అడవిలో ఓ నక్క ఉండేది. ఒకసారి అది ముళ్ళదారిలో నడుచుకుంటూ వస్తున్నది. చెప్పులు వేసుకోదుగదా, దాని కాలులో పాపం, రెండు ముళ్ళు దిగబడ్డాయి. అది వాటిని పీకేసింది, కానీ ముళ్ళు లోతుగా దిగాయేమో, లోపలే విరిగాయి.

మరుసటి రోజుకల్లా నక్క కాలు వాచింది. అది ఇక వేటకు వెళ్ళలేకపోయింది. అంతలో అటుగా వచ్చిందొక పిల్లి. పిల్లిని చూడగానే నక్కకు నోరూరింది. 'ఎలాగో ఒకలాగా దీన్ని అందుకుంటే చాలు' అనుకున్నది.

బాధతో గట్టిగా మూలిగినట్లు ఓ అరుపు అరిచింది. "పిల్లి బావా! పిల్లిబావా! ఓ సారి ఇటు రావా! నా కాల్లో ఎక్కడలేని ముళ్ళూ గుచ్చుకున్నట్లున్నై..నీ కోరపళ్ళతో‌వాటిని పీకి పెడుదువు కొంచెం" అన్నది.

"అయ్యో! నీకు నేనే దొరకాలా? నేను ముసలిదాన్ని, చూపు అసలే సరిగ్గా ఆనదు. ఇంక ముళ్ళెక్కడ కనిపిస్తాయి?" అన్నది పిల్లి విచారంగా, అక్కడే నిలబడి.

"అయ్యో! దానిదేముంది? నేను నీ మెడ వంచి పట్టుకొని, ముళ్ళు ఎక్కడ ఉన్నాయో ఆ భాగాన్ని నీ నోటికే అందిస్తాగా?" అంది నక్క, గడుసుగా.

పిల్లి ఏం తక్కువ తినలేదు. అది అన్నది "అబ్బ! నీకు ఏం చెప్పేది, నక్క బావా! నువ్వు ముల్లును అందించినా, దాన్ని పెరికేటట్లు లేదు నా నోరు! మొన్ననే తోడేలన్న వచ్చి 'నీ కోరపళ్ళొకసారి ఇవ్వు తమ్ముడూ' అని నా పళ్ళు ఎత్తుకు పోయాడుగా? అయినా దానిదేముందిలే, తోడేలన్న ఇల్లు ఇక్కడికి దగ్గరే. నేను పిలిస్తే అన్న పరుగున వచ్చి, నీ కాలి ముళ్ళు స్వయంగా తన పళ్ళతోటే పెరికి పెడతాడు" అని, గట్టిగా "అన్నా! ఓ..తోడేలన్నా, ఓసారి ఇటురా. నీకోసం నక్కబావ ఎదురుచూస్తున్నాడు" అని కేకలువేయటం మొదలు పెట్టింది.

తోడేలన్న మాట వినగానే నక్కకు విపరీతమైన భయం పట్టుకున్నది. "ఒద్దులే బావా! అంత పెద్ద వాళ్ళని ఇబ్బంది పెట్టటం‌ ఎందుకులే! కొంచెం కష్టపడ్డానంటే నా అంతట నేనే తీసేసుకోవచ్చు వీటిని- చిన్న ముళ్ళేగా, ఏమీ పరవాలేదు" అని కుంటుకుంటూనే వెనక్కి పరుగెత్తిందది.

అర్థమైందా, అట్లా లేని స్నేహితుడి పేరు చెప్పి తన ప్రాణాలు కాపాడుకున్నదర్రా, పిల్లి! అపాయంలో‌ఉపాయం అంటే ఇదే- యుక్తితో ప్రమాదం నుండి బయటపడటం!" అంటూ కథని ముగించాడు తాతయ్య.

కథనే తలచుకొని మురిసిపోతూ ఇళ్ళకు పరుగెత్తారు పిల్లలు.