ఈ బొమ్మను చూడండి:
పాపం.. ఎవరో మెట్ల మీద పడిపోయి ఉన్నారు. ఎందుకో, మరి ఆ కథ ఏమిటో?! ఈ సమస్యను పరిష్కరించాల్సిన తెలివైన పోలీసు అధికారి మీరే.. ఆ వివరాలన్నీ చక్కని కథలాగా మాకు రాసి పంపండి. బాగుంటే రెండు నెలల తర్వాత మీ కథని కొత్తపల్లిలో ప్రచురిస్తాం.
మా చిరునామా:
కొత్తపల్లి బృందం, యం.ఆర్.వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా- 515 101, ఫోన్లు: 08559 240222, 7702877670. ఈ మెయిలు: team at kottapalli dot in.
సొరంగం
కొత్తపల్లి పత్రిక సెప్టెంబరు సంచికలో "బొమ్మకు కథ రాయండి" శీర్షిక క్రింద ఇచ్చిన బొమ్మకు ఓ స్పందన, ఈ కథ: దీన్ని చదివి ఎలా ఉందోచెప్పండి. రచన: నారాయణ, కొత్తపల్లి బృందం
"ఒరేయ్, రాజూ! హంపీకి వెళ్తున్నారు కదూ, మీ బడి పిల్లలందరూ? ఇంతకీ మీకు హంపీగురించి ఏమైనా తెలుసా అసలు?" అడిగాడు తాతయ్య, రాజువాళ్ళు ఇంకాసేపట్లో బయలుదేరుతారనగా.
"అబ్బ ! తెలుసులే తాతయ్యా! మా టీచర్ గారు అన్నీ చెప్పారు" విసుక్కున్నాడు రాజు.
"కృష్ణదేవ రాయలవారి సమయంలో హంపీ వీధుల్లో రత్నమాణిక్యాలు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళట, తెలుసా, అంత సంపద ఉండేది అక్కడ" చెప్పాడు తాతయ్య.
"నాకు తెలుసులే తాతయ్యా, మా టీచర్ చెప్పింది" అసహనంగా కదిలాడు రాజు. తాతయ్య కొనసాగించాడు-"ఆగరా, మీకు తెలీని సంగతీ వస్తోంది" అంటూ.
"అయితే కృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యం నశించిపోయింది. చివరికి అది బహమనీ సుల్తానుల వశం అయ్యింది. ఆ సమయంలో డబ్బులున్నవాళ్ళు వాటిని జాగ్రత్తగా దాచి పెట్టుకునేందుకు నానా తిప్పలూ పడ్డారు. ఎవరికి వాళ్ళు బంగారాన్ని, రత్నాలను, వజ్రాలనూ తమకు తోచిన చోట్ల త్రవ్వి దాచుకున్నారు. వాటిలో అధికభాగం అక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ అదృష్టవంతులకి ఆ నిధులు దొరుకుతూనే ఉన్నాయి!" "హంపీలోనా! నిధులా!!" ఉత్సాహంగా అరిచారు రాజు స్నేహితులు ముగ్గురు-సంజయ్, సతీష్, రిత్విక్ . "ఎక్కడ దొరుకుతై తాతయ్యా, అవి ఎక్కడుంటాయో తెలిసేదెలాగ?" అడిగాడు సంజయ్, కళ్ళజోడును ముక్కుపైకి నెట్టుకుంటూ.
"ఏమోరా, ఏ గుహల్లోనో, సొరంగాల్లోనో, గోతుల్లోనో, భూగృహాల్లోనో ఉంటాయేమో.. పెద్ద పెద్ద భవనాల అడుగున కూడా ఉండచ్చు. మనకెలా తెలుస్తుంది?" అన్నాడు తాతయ్య.
"నువ్వూ రారాదు, తాతయ్యా! కనీసంఒక నిధైనా వెతికి పెడుదువు?" అన్నాడు రిత్విక్, తాతయ్యకు దగ్గరగా జరిగి.
"భూమిలోపల దొరికే సంపద మొత్తం ప్రభుత్వానికేరా, చెందేది. నిధులను ఎవ్వరూ సొంతానికి అట్టే పెట్టుకోకూడదు" అన్నాడు తాతయ్య.
అంతలో బడి టీచరుగారు విజిల్ ఊదారు. పిల్లలందరూ తాతయ్యకు వీడ్కోలు చెప్పి బస్సు దగ్గరికి నడిచారు.
హంపీ మామూలుగా చాలా వేడి ప్రదేశం. అయితే కొన్నాళ్ళుగా వానలు పడుతున్నట్లున్నాయి; పచ్చటి గడ్డి పరచుకొని ఉన్నది కొండల్లో అంతటా . మధ్యాహ్నం భోజనాలు కాగానే చుట్టు ప్రక్కల ప్రాంతాన్ని అలాగ చుట్టి వచ్చేందుకు పిల్లలకు కాస్తంత సమయం చిక్కింది. ఇంకేముంది, రాజు, సతీష్, సంజయ్, రిత్విక్- నలుగురూ బయలు దేరారు. అంగళ్ళు దాటుకొని, వరాహ స్వామి గుడి వెనకగా, ముళ్ళ పొదల్ని తప్పించుకుంటూ, కాలిబాట వెంబడి గబగబా నడుస్తూ పోయారు- ఓ చిట్టికొండను ఎక్కుకుంటూ.
"ఒరేయ్, చూస్తూంటే ఈ దారిన చాలామంది నడుస్తూ ఉన్నట్లున్నదిరా, ఇక్కడేమీ నిధులు ఉండవు" అన్నాడు రిత్విక్ నిరాశ పడుతున్నట్లు. "ఎక్కడైనా ఉండచ్చురా, అవి- అటు చూడు- ఆ ఎలుక? ఎంత పెద్దగా ఉందో చూశావా? అది ఒక నిధికి కాపలా కాస్తూ ఉండచ్చు- ఎవ్వరూ ఇంతవరకూ గమనించి ఉండక పోవచ్చు-" అన్నాడు సతీష్, ఆ ప్రక్కనే ఓ పెద్ద బండ చాటున నిక్కినిక్కి చూస్తున్న ఒక ఎలుకను చూపిస్తూ. పిల్లలంతా దానికేసి చూశారు. ఆ ఎలుకకూడా కొంచెం సేపు వీళ్లకేసే చూసింది, కళ్ళార్పకుండా. "ఒరేయ్! ఎట్లా చూస్తోందో చూడండ్రా, ఇది? నిజంగానే నిధిని కాపలా కాస్తున్నట్లుంది" అన్నాడు సతీష్, పెదిమలు కదిపీ కదపకుండా. రిత్విక్ నవ్వాడు, కానీ రాజు, సంజయ్‌లు మాత్రం ఆ ఎలుకను పట్టుకోవటం కోసం ముందుకు దూకారు.
వీళ్ళు అటు కదలగానే ఎలుక బండ వెనగ్గా మాయమైంది. రాజు సంజయ్‌లు ఆ పెద్ద బండను ప్రక్కకు నెట్టటంలో మునిగారు. కొంచెం సేపు చూశాక సతీష్, రిత్విక్ కూడా వాళ్లకు సాయం వెళ్ళారు.
మెల్ల మెల్లగా బండ ప్రక్కకు జరిగింది- వెంటనే ఓ నాలుగు ఎలుకలు హడావిడిగా బయటికి పరుగెత్తాయి. అయితే పిల్లలు నలుగురూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నది ఆ ఎలుకల్ని కాదు! బండరాయి వెనకగా ఉన్నది-
ఒక సొరంగం!
పిల్లలు నలుగురూ బాగా వెనక్కి జరిగి చూశారు. చిన్నపాటి గుహలాగా ఉన్నదా సొరంగం. లోపలంతా చీకటి- ఏమున్నదో తెలీటం లేదు. కానీ లోపలికి చాలా దూరమే పోతున్నట్లుంది అది.
రిత్విక్ దానిముందు నిలబడి "ఓయ్!" అని అరిచాడు. "ఓ..య్.." అని మెల్లగా వినబడింది ప్రతిధ్వని. కొంచెంసేపు అందరూ దాని ముందు నిలబడి "ఓయ్..ఓయ్.." అని అరిచారు ఉత్సాహంగా.
"లోపలికి వెళ్ళి చూద్దాంరా!" అన్నాడు రాజు మెల్లగా. "చూద్దాం..రా!" అన్నది సొరంగం, కొంచెం ఆలస్యంగా.
నలుగురూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
"మాట్లాడే సొరంగం!" అన్నాడు సతీష్ గుసగుసగా.
సొరంగంలోంచి గుసగుసలు వినబడ్డాయి.
"నిధి!" అన్నాడు సంజయ్ ఆగలేనట్లు.
"..ధి!"అన్నది సొరంగం.
"వద్దులేరా, నాకు భయంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదాం. లోపల ఏమున్నాయో, ఏమో. పాములుండచ్చు; గబ్బిలాలు; భూతాలేమైనా.. " ఆగిపోయి గుటకలు మింగాడు రిత్విక్.
మిగిలిన ముగ్గురూ ఒకళ్ల మొహాలొకళ్ళు చూసుకున్నారు.
రాజు అందరికంటే ముందు వంగి సొరంగం లోపలికి దూరాడు. సొరంగంలో నడిచేంత ఎత్తు లేదు. సంజయ్, సురేష్, రిత్విక్‌లు రాజుని అనుసరించారు, ఒకళ్ళ చొక్కాలొకళ్ళు పట్టుకొని, తడుముకుంటూ, నాలుగు కాళ్ళమీద పాక్కుంటూ.
సొరంగం నిజంగానే బాగా పెద్దది. చుట్టూ చిమ్మ చీకటి. ఏమీ కనబడటంలేదుగానీ, నేల శుభ్రంగానే ఉన్నట్లుంది. అక్కడక్కడా గోడలకున్న చిన్న చిన్న అరలు చేతికి తగుల్తున్నాయి.
నలుగురూ సొరంగం ఎన్ని మెలికలు తిరిగితే అన్ని మెలికలు తిరుక్కుంటూ పోతున్నారు. "ఎక్కడా బూజుకూడా లేదేమి?" అని ఆలోచిస్తూ పోతున్న రాజు చేతికి ఒక అరలో అగ్గిపెట్టె ఒకటి దొరికింది. "ఏయ్! ఆగండి! ఇక్కడో అగ్గిపెట్టె ఉంది!" మెల్లగా అరిచి చెప్పాడు రాజు.
అగ్గిపుల్ల వెలుగులో అందరూ ముందుకు చూశారు. సొరంగం ఇంకా ముందుకి పోయి, అకస్మాత్తుగా క్రిందికి వాలి ఉన్నది. "ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ముందు ఏదోగుంత ఉన్నట్లుంది" అన్నాడు సంజయ్, "రాయలవారి కాలంలో అగ్గిపెట్టెలు ఉండేవా, రాజూ?" అని గుసగుసగా అడుగుతూ.
"ఏమో, మనమైతే ముందుకే పోతున్నాం. జాగ్రత్తగా రండి. అగ్గిపుల్లల్ని వృధా చేసేందుకు లేదు" అని రాజు ముందుకు పాకాడు ఇంకా. నిజానికి వాళ్ళ ముందున్నది గుంత కాదు- మెట్లు!
ఇప్పుడు వాళ్ళు నలుగురూమెట్లు దిగి, లేచి నిలబడ్డారు. అడుగులో అడుగులు వేసుకుంటూ ముందుకు పోయారు. అంతలో సొరంగం ఒక పెద్ద భూగృహంలోకి తెరుచుకున్నది! చూసేందుకు అదేదో పెద్ద సభాగృహం లాగా ఉన్నది. పైన ఎక్కడినుండోవెలుతురు ప్రసరిస్తున్నది దాని మధ్యభాగాన. ఆ సభాగృహం చుట్టూతా పెట్టి ఉన్న ఇత్తడి భోషాణాలు మనక వెలుతురులో మెరుస్తూ కనబడుతున్నాయి. వీళ్లంతా ఆ సభాగృహానికి ఒక మూలన నిలబడి అద్భుతంగా చూస్తున్నారు ఆ దృశ్యాన్ని.
"ఓయ్! ఇది నిజంగా నిధే!" నలుగురూ అరిచారు ఒకేసారి.
"ఈ పెట్టెలన్నిటికీ తాళాలున్నై..ఏవైనా పెట్టెలు తెరచి ఉన్నాయేమో చూడండి" అన్నాడు రాజు జాగ్రత్తగా, ఆలోచిస్తూ. వెతికితే ఒక పెట్టెతాళం తెరచే ఉన్నది- నలుగురూ కలిసి ఆ పెట్టె మూతను ఎత్తారు- దాని లోపల, నిండా నోట్ల కట్టలు!
"రాయలవారి కాలంలో కూడా నోట్ల మీద గాంధీ తాత బొమ్మే ఉండేదా?" అడిగాడు సంజయ్, ఆశ్చర్యపోతున్నట్లు.
"ఊరుకోండిరా! ఇక్కడ అంతా ఎంత పరిశుభ్రంగా ఉందో చూశారుగా? ఎవరో ఇక్కడికి తరచు వస్తూపోతూ ఉన్నట్లుంది. బహుశ: ఇక్కడికి వచ్చేందుకు ఇంకోదారి కూడా ఉండి ఉండచ్చు..ఇదంతా ఒకప్పటి రాయలవారి భూగృహమే అయినా, ఇప్పుడు మాత్రం ఎవరోదొంగలు డబ్బు దాచుకున్న చోటు అయిఉండచ్చని నా అనుమానం. మనం వెంటనే వెనక్కి వెళ్ళాలి; పదండి. ఈ పెట్టె మూత వేసేయండి గబగబా.." రాజు అందరినీ హెచ్చరించాడు.
నలుగురూ త్వరత్వరగా పెట్టెని మూసేశారు. ఆపైన గబగబా వెనక్కి తిరిగి మెట్లెక్కి సొరంగంలో పాక్కుంటూ పోయారు. తిరుగు ప్రయాణం మరింత సులభంగా సాగింది. ఇప్పుడు దారి బాగా తెలిసింది గద!
సొరంగంలోంచి బయటికి రాగానే పిల్లలందరూ బండను యథాస్థానంలోకి నెట్టారు. రాజు తన చేతి రుమాలును ఒక కట్టెపుల్లకు గుచ్చి సొరంగం ముందు జెండాలాగా నిలబెట్టాడు గుర్తుగా. అటుపైన నలుగురూ పరుగెత్తుకుంటూ ఊళ్ళోకి పరుగెత్తారు.
వాళ్ళు చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. బడి టీచర్లు వీళ్ళు నలుగురూ లేరని గుర్తించి కంగారు పడి, పోలీసులకు కబురు చేశారు కూడానూ. వీళ్ళు వెళ్ళేసరికి పోలీసుల బృందం ఒకటి, చేరుకొని ఉన్నదక్కడికి!
వీళ్లను చూడగానే అందరూ చిందులు వేశారు కాసేపు. అయితే వీళ్ళు తాము చూసిన "నిధి" వివరాలు, ఆ సొరంగం ముందు తాము ఉంచిన గుర్తులు చెప్పేసరికి, అందరూ నిర్ఘాంతపోయి నిశ్శబ్దం అయిపోయారు. ఇన్స్పెక్టరుగారు వెంటనే పై అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళేం చెప్పారోగాని, పోలీసులందరూ పిల్లల బృందాన్ని అక్కడే వదిలేసి హడావిడిగా వెళ్ళిపోయారు.
మరుసటి రోజున పత్రికల్లో అంతటా పెద్ద వార్త వచ్చింది:
దొరికిన బ్యాంకు దోపిడీ దొంగల ముఠా
పిల్లల సాహసంతో బయట పడ్డ నిక్షేపం
హంపీ: ఆరు నెలల క్రితం హంపీలో జరిగిన బ్యాంకు దోపిడీ పాఠకులకు విదితమే. అలా మాయమైన కోట్లాది రూపాయలు నేడు తిరిగి లభించటంతో పాటు; ఆ దోపిడికి కారణమైన దొంగల ముఠా పూర్తిగా పట్టుబడిందని పోలీసు అధికారులు తెలియజేశారు. సాహసులైన పిల్లలు నలుగురు హంపీ యాత్రకు వచ్చిన రోజునే ఈ నిక్షేపాన్ని కనుగొనటం విశేషం. వారికి ఈ సంపదలో ఒక శాతాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు..."
దాన్ని చూడగానే ఉండబట్టలేక తాతయ్య ఫోన్ చేసేశాడు: "ఒరేయ్ పిల్లలూ! నేను ఊరికే ఏదో అంటే మీరంతా నిజంగానే నిధిని కనుక్కున్నట్లున్నారే!" అని ఆశ్చర్యపోయాడు.
"నువ్వేదైనా చెబితే అది నిజం కాక మరేమౌతుంది తాతయ్యా!" అన్నారు పిల్లలు నలుగురూ, ఇకిలిస్తూ.