రోగంతో ఉన్నవాడికి సరైన ఆహారం రుచించనట్లు, నేను చెప్పిన మంచిమాటలు 'కోపం' అనే వ్యాధికి గురైన ఆ పక్షుల చెవుల్లో పడి అసూయనే పుట్టించాయి. ముఖాలు కోపంతో ముడుచుకు పోగా ఆ పక్షులన్నీ వెటకారంగా నవ్వుతూ, కళ్లతో నిప్పులు చెరుగుతూ, నావైపు అసహ్యంగా చూస్తూ నన్ను, తమరిని చాలా చెడ్డ మాటలన్నాయి. నిండు సభలో చెప్పదగిన మాటలు కావు, అవి. ఆ కుక్కలు అట్లా మొరిగినంత మాత్రాన తమ గౌరవానికి ఏమీ మచ్చరాదు- ఆ మాటలతో అవి తమ స్వభావాన్నే బయటపెట్టుకున్నాయి.

పాములకు పాలుపోస్తే విషం పెరిగినట్లు, వివేకం‌ లేనివాళ్లకు మంచిమాటలు చెబితే మదం ఎక్కుతుంది. పాములకు ఒకేనోరు గాని, దుర్మార్గులకు నిలువెల్లా విషపు నోర్లే అని పెద్దలు చెబుతారు. అందువల్ల , తెలివి తక్కువ వారికి మంచి చెప్పటంవల్ల నోటిదురద తీరుతుందేమో గానీ, ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదు. అలాంటి ఉపదేశాలవల్ల పంతం పెరుగుతుంది తప్పిస్తే, ఇసుమంత మేలుకూడా జరగదు. కాబట్టి తెలివైన వాడు ఎప్పుడైనా వివేకం ఉన్నవాళ్లకే బోధించేందుకు ప్రయత్నించాలి. అలా కానివాడు కొండముచ్చులకు నీతి చెప్పబోయిన కుందేలు మాదిరి తప్పక కష్టాలపాలౌతాడు" అన్నది.

"ఏమా కథ?" అని హంసలరాజు అడిగింది, అప్పుడా కొంగ 'కొండముచ్చులు-కుందేలు' కథను ఇలా చెప్పసాగింది.
మాల్యవంతం దగ్గర ఒక అడవి ఉండేది. ఆ అడవిలోని చెట్ల నుండి మిగులపండిన పండ్లు ఎప్పుడూ వ్రేలాడుతూ కనువిందు చేసేవి. ఎండాకాలంలో ఒకనాటి మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు ఎండలు మండిస్తుంటే, ఆ అడవిలోని కొండముచ్చులకు బాగా దప్పికైంది. అంతలో వాటికి దూరంగా ఎండమావి ఒకటి కనబడింది.

వేడి వల్ల ఆ ప్రాంతంలో గాలి తరగలు అటూ ఇటూ కదులుతున్నాయి. దానిని చూసిన కొండముచ్చులు అది ఒక 'నదీప్రవాహం' అని భ్రమపడ్డాయి. అవన్నీ అటువైపుగా నడుస్తుంటే, ఎండవేడికి వాటి పాదాలు పాపం, బొబ్బలెక్కాయి. అయినా ఎంత దూరం పోయినా ఎండమావి ఇంకొంచెం దూరంలో కనిపిస్తూ ఊరిస్తున్నది తప్పిస్తే, ఆ కొండ ముచ్చుల చేతికి మాత్రం అందలేదు. అవి అట్లా చాలా దూరం నడిచీ నడిచీ, ఎక్కడా గ్రుక్కెడు నీళ్లు కూడా దొరక్క పూర్తిగా అలసిపోయాయి. ఆ సమయంలో వాటికి మర్రిచెట్టొకటి కనబడింది. అవన్నీ ఆ చెట్టు నీడకు పరుగులెత్తి, దాని నీడ వల్ల చల్లగా ఉన్న ఇసుక తిన్నెల మీద చేరగిల పడి, తమ బరువును తామే మోయలేమన్నట్లు ఆ మర్రి ఊడలను ఊతగా పట్టుకున్నాయి.

అప్పుడు వాటితో ఒక కొండముచ్చు మిగిలిన వాటితో " చూశారా, మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చామో!? మనం ఉండే చోటు నుండి యీ మర్రిచెట్టు ఒక యోజనం దూరంలో ఉంటుందని చెబుతుంటారు పెద్దలు. ఎండదెబ్బకు చాలా అలసిపోయినా, 'నీళ్లు దొరుకుతాయి కదా' అన్న ఆశకొద్దీ "ఇదిగో వచ్చేసింది" "ఇదిగో వచ్చేసింది" అనుకుంటూ ఆశలను తరుముకుంటూ నడిచి వచ్చాము. మనం నడిచిన కొద్దీ నీళ్లు ఇంకా ఇంకా దూరమే ఔతున్నట్లు అనిపిస్తున్నది నాకు. ఇప్పటి మన పరిస్ధితి చూస్తే, అడుగు తీసి అడుగు పెట్టేటట్లు లేదు. మిట్టమధ్యాహ్నపు సూర్యుడి వేడికి మన కాళ్లు కాలి చాలా బొబ్బలెక్కాయి. నాలుకలు తడి ఆరి పిడచగడుతున్నాయి. ఇప్పుడు యీ దప్పిక ఎట్లా తీరుతుంది? ఏం చేద్దాం?" అన్నది బాధగా.

ఆ మర్రిచెట్టు తొర్రలో నివసిస్తున్న కుందేలు ఒకటి ఆ మాటలు విన్నది. కొండ ముచ్చుల కష్టాన్ని తలచుకొని దాని మనస్సు కరుణతో నిండిపోయింది. మనసు పట్టలేక , దాని ఖర్మకొద్దీ అది తొర్రలోంచి బయటికి వచ్చి, దాపులనే నిలబడి, చెవులు రిక్కించి అన్నది "వెర్రి వాళ్లల్లారా! మీరు ఆ ఎండమావులను చూసే కాబోలు, జలాశయాలని భ్రమపడుతున్నారు. వాటితో ఎండతప్ప, ఒక్క నీటి బొట్టుకూడా లేదు. ఇదిగో , ఆ తగ్గులో కొంచెం దూరం వెళ్లారంటే , అక్కడొక సరస్సు కనిపిస్తుంది. పోయి,ఆ నీళ్లు తాగి మీ దాహం‌ తీర్చుకోండి, పొండి" అన్నది.

ఆ మాటలు వినగానే కొండముచ్చొకటి వెటకారంగా నవ్వి మరుక్షణం ప్రళయకాలంలో ఎగసిపడే అగ్నిశిఖ మాదిరి కణకణా మండిపడ్డది. పటపటా పళ్లు కొరుకుతూ, నొసటి మీద ముడతలు భయం గొల్పగా అది ఒక్క ఉదుటున లేచి ఆ కుందేలు మీదికి ఉరికింది. గబుక్కున అది అట్లా లేచేసరికి ఆకాశంలో మిణుగురులు అన్నీ చెల్లా చెదరై పరుగులెత్తాయి.

అంతలో ఆ కొండముచ్చు కుందేలు వెనక కాళ్లు రెండింటినీ పట్టుకొని దాన్ని తలక్రిందులుగా పైకెత్తి చూపుతూ - "విన్నారా ! పనికిరాని యీ కుందేలు నోరు అరిగి పోయేట్లు మనల్ని ఎన్నెన్ని మాటలన్నదో ! మనందరం వెర్రివాళ్లమట! దానికి ఉన్నంత తెలివి ఉంటేగద, మనకు? మనకు సుద్దులు చెప్పేందుకు అదిగాక ఎవరున్నారు?! చూశారా, దీని పొగరు!" అని వెటకరిస్తూ , మిగిలిన కోతులతో ఆడుతూ , ఎగతాళి చేస్తూ , దయలేనట్లు ఆ కుందేలును గట్టిగా నేలకు విసిరికొట్టి , కాళ్లతో తొక్కి దాన్ని యమసదనానికి పంపింది.

అటుపైన ఆ కొండముచ్చులన్నీ కదిలి, కుందేలు చెప్పిన సరస్సుకు వెళ్లి , కడుపునిండా నీళ్లు త్రాగి, తమకు నచ్చినట్లు పోయాయి. కాబట్టి , మూర్ఖులకు మంచి మాటలు చెప్పేందుకు అసలు ప్రయత్నించనే కూడదు. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేశామంటే తప్పకుండా కష్టాలు పైన పడతాయి.

సరే , నన్ను ఆ విధంగా తిట్టి, ఆ పక్షులన్నీ నన్ను కళ్లెర్ర జేసి చూస్తూ, రోషంతో కరకుదేలిన మాటలు చాలా మాట్లాడాయి. "ఓరేయ్ ! దుర్మార్గుడా! నీకు మతి చలించింది. అందుకనే మీ రాజు వైభవాన్ని గోరంతలు కొండతలు చేసి చెప్పటం మొదలుపెట్టావు. అంతటితో ఆగక, భయం ఏ మాత్రం లేనట్లు మమ్మల్ని , మాదేశాన్ని కించపరచావు. నీది పాపపు బుద్ధి. దాన్ని పోనిచ్చుకున్నావు గాదు. నీ వాళ్లంకాని మాలాంటి వాళ్లను పట్టుకున్ను సహజదోషాలు అసలు ఏనాటికైనా విడిచిపోతాయటరా?

పక్షపాత బుద్ది తో నీ బుర్ర శూన్యం‌ అయిపోయి ఉన్నది. నీ మనసులోని వెలితిని అందరికీ చెప్పి తేటతెల్లం చేసుకున్నావు, అందరికీ గౌరవపాత్రుడైన చిత్రవర్ణుడు నీ కంటికి కూడా ఆనలేదు కదూ! వ్యతిరేక బుద్ధి ఉన్నవాళ్లకు పూజనీయులు కూడా తక్కువగానే తోస్తుంటారు. అనుభవ శూన్యుడివి అవ్వటం చేత, నువ్వు నీకంటే పెద్దవాళ్లను తీసి పారేసి మాట్లాడుతుంటావు. నీకింత దుష్టత్వం‌ పనికిరాదు. ఆకాశంలో తేలియాడే మబ్బుని చూచి పారిపోయే పిరికితనం హంసలకు సహజం. అలాంటి పిరికిపందనేనా, నువ్వు సిగ్గువిడిచి ఇంతసేపూ "గొప్ప పరాక్రమవంతుడు" అని వర్ణించింది?! అంత పిరికి దానికి రాజ్యాధికారాన్నిచ్చిందెవరు? ఇచ్చినా, అతను ఆ రాజ్యభారాన్ని ఎలా మోస్తున్నాడు?! ఎవరికి ఏ పని చేపట్టే అర్హత ఉందో, వాళ్లే ఆ పనిని చేపట్టాలి. అట్లాకాకపోతే నవ్వులపాలైపోతారు. మబ్బుల్లో నీటిని చూసి , చెరువులో నీళ్లను ఖాళీ చేసుకునేంత తెలివిమంతులు ఇక్కడ ఎవ్వరూ లేరు. మీ రాజులాంటివాళ్లు వెయ్యిమంది కలిసినా మా రాజుకు సాటి రాగలరా? చాలుచాలు! నీ గొప్పలు చెప్పుకోవటం మానెయ్యి. మాకుకాదు; నీకే మేం ఒక హితోపదేశం చేస్తాం. నీతి ఉన్నవాడివైతే మా మాటను విని, ఆ ప్రకారంగా చెయ్యి .

మీ రాజులాంటి వాళ్లను నూరుగురిని కాపాడగల సమర్ధత మారాజుకు ఉంది. మా మాటవిని, నువ్వు, మీ రాజు కూడా మా ప్రభువుని ఆశ్రయించుకొని బ్రతకండి"

అని ఆ పక్షులన్నీ తమరిని నిందించేటప్పుడైతే, ఇక నేనేం చెప్పను? నాకు ఆకాశాన్నీ భూమినీ ఒక్క గ్రుక్కలో మింగెయ్యాలన్నంత కోపం వచ్చింది.

అయినప్పటికీ నేను ముందువెనుకలు ఆలోచించి, చేసేదేమీ లేక, ఆ కోపం మొత్తాన్నీ మనస్సులోనే అణచుకొని, పొంగివస్తున్న పరుషపు మాటలు నాలుకదాటకుండా త్రొక్కిపట్టి, కొంత శాంతం‌ అవలంబిస్తూ, మనస్సులో భయపడుతూనే, లేని గాంభీర్యం తెచ్చుకొని అన్నాను- "ఆc ఇవెక్కడి మాటలు!? మీరందరూ కలసి గౌరవంకొద్దీ ప్రార్ధించి అడిగినట్లడిగితే , లోక రీతిలో ఏదిమంచిదో దాన్ని, నాకు తోచినట్లు చెప్పాను. మీ మనసుకది నచ్చిచేస్తే మేలు; చేయకపోతే ఇంకా మేలు- అంతేకానీ, ఇంత మాత్రానికే కోపం తెచ్చుకొని, ఇలా పద్ధతి కాని మాటల్ని నోరు జారనివ్వటం సరైన విధానం తెలిసిన మీలాంటి వారికి ధర్మమో?! మా రాజు గొప్పదనాన్ని వర్ణించేందుకు మీరు ఏపాటి వాళ్లు? అసాధారణమైన గౌరవమూ, ఉదారత్వమూ కల మా రాజుని ఎందుకు , ఇలా నిష్కారణంగా తూలనాడి, లేని పాపం మూట గట్టుకుంటారు? ప్రపంచంలో మంచి వారిని తిట్టటాన్ని మించిన పాపం వేరే ఉంటుందా? వృధాప్రయాస వద్దు - నోటి చేటు ఎందుకు ? నా మాట విని ఇకనైనా మృదుమార్గాన్ని అవలంబించండి. మాటలోని పరుషత్వం ఎంత గొప్పవారికైనా లోకంలో కష్టాలనే తెచ్చిపెడుతుంది. రాళ్లు రువ్వేవాడి పైకి ఎవ్వరూ పూలు విసరరు! కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఒక సంగతి అడగవలసి వస్తున్నది - తైతక్కలాడే పిట్టకొకదానికి మీ పక్షిరాజ్యాన్ని యావత్తు కట్టబెట్టిన ఆ తెలివిమంతుడెవరో చెప్పండి ముందు, మరి" అన్నాను.

ఆ-నా మాటలు నోట్లో ఉన్నవి ఉన్నట్లు ఉండగానే వాటిలోని దుష్టకాకి ఒకటి కోపంతో కనుసైగ చేయటం; దాన్ని గ్రహించిన ఆ అడవి పక్షులన్నీ చెలరేగి పోరాటానికి దిగటం జరిగిపోయాయి.

"గౌరవాన్నిచ్చే చోట శాంతము, అగౌరవమైన చోట పరాక్రమము గొప్పవారికి అలంకారం " అని పెద్దలు చెబుతుంటారు కదా; ఆ సంగతి గుర్తు చేసుకొని, నేను కూడా వెనుకంజవేయకుండా యుద్ధానికి సిద్ధపడి నిలిచాను.." అని అది ఇంకా ఏదో‌ చెప్పబోయింది.

అంతలో హంసరాజు నవ్వి, ఇలా అన్నది- (తర్వాతి కథ మళ్ళీ...)