కొత్తపల్లిలో చంద్రశేఖర్ , రాకే ష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఆడుకునేవాళ్ళు. అయినా వాళ్ళిద్దరి మనస్తత్వాలూ చాలా భిన్నంగా ఉండేవి. ఏ పనైనా సరే, చెయ్యాలంటే చాలు- రాకేశ్‌కు వెయ్యి ఆలోచనలు మొదలయ్యేవి. ఇంకా మొదలైనా పెట్టకుండానే 'ఆ పని అవుతుందా, కాదా' అని గబగబా ఆలోచించేసేవాడు; వెంటనే 'అవ్వదు' అని తేల్చేసేవాడు కూడా. చంద్రశేఖర్‌దేమో పోటీ‌ తత్వం. ఎవరైనా 'పని అవ్వదు' అన్నారంటే చాలు- 'అవుతుంది' అని చేసి చూపించే రకం.

కొత్తపల్లిలో పెద్దకొండ ఉంది కదా, ఆ కొండమీద రకరకాల పండ్ల చెట్లు ఉంటాయి. ఒకసారి వేసవికాలం వచ్చింది. పిల్లలందరూ రోజూ కొండ ఎక్కేందుకు పోతున్నారు. చంద్రశేఖర్ , రాకే ష్‌తో అన్నాడు. "ఒరేయ్! కొండ మీద చాలా మామిడి చెట్లు ఉన్నాయి కదా! వేసవికాలం వచ్చింది. మామిడి చెట్లకి బాగా మామిడికాయలు కాసాయట; అందరూ చెప్పుకుంటున్నారు. రోజూ ఎవరెవరో కొండనెక్కి మామిడి కాయలు కోసుకొచ్చుకుంటున్నారు. మనంకూడా వెళ్ళి తెచ్చుకుందాం పా!" అని.

రాకేశ్ అన్నాడు "ఒరేయ్! కొంచెం తెలివిగా ఆలోచించు. ఊరికే ఎందుకు, శ్రమ పడతావు? రోజూ ఎందరెందరో పిల్లలు వెళ్ళి మామిడికాయలు కోసుకొచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడ ఒక్క కాయకూడా ఉండదు. మనం ఎక్కీ ప్రయోజనం ఉండదు. ఇంక, మన కాళ్ళు చూడు- ఎంత బలహీనంగా ఉన్నాయో! మనకు కొండ ఎక్కటమే రాదు అసలు. ఒకవేళ మనం కష్టపడి కొండ ఎక్కినా, దిగటం రాక అవస్థల పాలవుతాం. అందుకని ఇదంతా మానెయ్. కావాలంటే ఎవరినైనా అడిగి కొన్ని కాయలు తెచ్చిపెట్టమందాం" అని.

చంద్రశేఖర్ ఎంత చెప్పినా వినలేదు రాకేశ్. అయితే అదే సమయానికి రాకేశ్ వాళ్ల మామయ్య ఒకాయన ఊరినుండి వచ్చి, సంగతంతా విన్నాడు. "మీరైనా చెప్పండంకుల్! ఏం చేద్దామన్నా వీడు అడ్డమే చెబుతుంటాడు ఎప్పుడూ" ఫిర్యాదు చేశాడు చంద్రశేఖర్. "వాడు అంతగా చెబుతున్నాడుగా , పోయి చూడరాదురా, రాకేశ్!" అని మామయ్యకూడా అన్నాక, రాకేశ్ అయిష్టంగానే బయలు దేరాడు.

ఇద్దరూ కలసి కొండ ఎక్కటం ప్రారంభించారు . సగం కొండ ఎక్కగానే రాకే ష్‌కు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి.

"ఒరేయ్! కొండ మీద మామిడి కాయలు ఉన్నాయో , లేవో? మనకి తెలీదు కదా?! నువ్వేమో 'బాగా కాసాయి' అంటున్నావు. నీ మాటలు నేను ఎలా నమ్మను? నాకు కాళ్ళు విరిగిపోతున్నాయి. నేను ఇంక నడవలేను బాబూ" అంటూ అక్కడే ఒక చెట్టుకి చేరగిల బడ్డాడు రాకేశ్. సరిగ్గా అదే సమయానికి నాగుబాబు వాళ్ళిద్దరినీ దాటుకొని పోతున్నాడు. వాడు కూడా వీళ్ళిద్దరి తరగతే. బక్కగా, పీలగా, బలహీనంగా ఉండే నాగుబాబంటే తరగతిలో అందరికీ అలుసే. "ఒరేయ్! నాగూ! ఎటురా, పోతున్నావ్!" పిలిచాడు చంద్రశేఖర్.

నాగుబాబు వీళ్ళని చూడనట్టే పోతున్నాడు "నులగక్క ఎనునే..నులగక్క ఎనునే" అని ఏదో‌మంత్రం చదువుకుంటూ.
"ఒరేయ్! ఎటురా?" అని మళ్ళీ కేక వేసిన మీదట, వాడన్నాడు "పైకి..నులగక్క ఎనునే.." అని. "నువ్వు పైకె ఎక్కుతున్నావా? నీకు అంతబలం ఎక్కడినుండి వచ్చింది?" అడిగాడు రాకేశ్.

వాడు ఒకసారి ఆగి, "మీ మామయ్యే కద, నాకు ఈ మంత్రం చెప్పింది! లేకపోతే నేను ఇంత పైకి ఎలా ఎక్కాననుకుంటున్నావు?..నులగక్క ఎనునే " అన్నాడు.

రాకేశ్ ముఖం ఒక్కసారిగా విప్పారింది. "ఆగురా, నేనూ వస్తాను. మామయ్యకు మంత్రాలు వచ్చని నాకు చెప్పనే లేదు. ఏంటా మంత్రం?..

నులగక్క ఎనునే" అంటూ తనూ లేచి నాగు వెంట పరుగెత్తాడు.

అటుపైన వాళ్ళు ముగ్గురూ మంత్రం చదువుకుంటూ‌ చాలా సులభంగా కొండనెక్కేశారు!

చూడగా అక్కడ చెట్లకి చాలా కాయలు ఉన్నై. ముగ్గురూ కలిసి సంతోషంగా తమకు తోచినన్ని కాయలు కోసుకొని తిన్నారు. ఇంకొన్ని కాయల్ని మూటగట్టుకున్నారు; ఇంటికి తెచ్చుకునేందుకు.

"కొండ దిగటం చాలా కష్టంరా! మోకాళ్ళు నొప్పులు పుడతాయి. నేను దిగలేను అనిపిస్తున్నది. ఇక్కడే‌ కూర్చుంటాను" అన్నాడు రాకేశ్, సరిగ్గా దిగే సమయానికి.

"మామయ్య దానికీ ఒక మంత్రం చెప్పాడురా- 'నునే గది నులగ'- ఒక నూట పదహారు సార్లు జపించేసరికి దిగేస్తాం అన్నాడు. రా, ఇంక" అని బయలు దేరాడు నాగ.

చూస్తూండగానే మిత్రులు ముగ్గురూ కొండ దిగేశారు.

"మంత్రాలు భలే పని చేశాయి నీకు మంత్రాలు వచ్చని నాకు చెప్పనే లేదేమి, మామయ్యా?" అడిగాడు రాకేశ్, మామయ్యని చూడగానే. మామయ్య నవ్వి, "దానిదేముందిరా, మీరూ చెయ్యచ్చు మంత్రాలు- ఏ పనికైనా పనికొచ్చే మంత్రం ఒకటి ఉన్నది నా దగ్గర- చెప్పనా?" అన్నాడు. చంద్రశేఖర్ అరిచాడు- "నాకు తెలుసు మామయ్యా! నేను చెబుతాను- 'నునే యచే నులగ!' అంతేనా?" అని.

మంత్రాల్లో కిటుకు అర్థమైన రాకేశ్, నాగలు కూడా‌ నవ్వారు.

మామయ్య వాళ్ళని మెచ్చుకుని చెప్పాడు- "అంతేరా! "నేను చేయ గలను" అని అనుకుంటే‌ మనం దేన్నైనా సాధిస్తాం. అవసరమైతే దాన్నే మార్చి 'నునే యచే నులగ' అని మంత్రంగా చేసుకోవచ్చు!" అన్నాడు నవ్వుతూ.

అటుపైన రాకేశ్ ఈ మంత్రాన్ని బాగా వాడినట్లున్నాడు; వాడిలో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేం! అప్పటినుండి కొత్తపల్లి బడి పిల్లలంతా ఏ పని చెప్పినా 'మేము చేయగలం' అంటూ ఆ పనిని పూర్తి చేసేస్తున్నారు!