అనగనగా ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఒక మనవరాలు. ఆ పాపకు ఒక రోజు పాయసం తినాలనిపించింది. వెంటనే అవ్వ దగ్గరకెళ్ళి, "అవ్వా! అవ్వా! నాకు పాయసం తినాలనుంది. పాయసం చెయ్యవా!" అని అడిగితే, "అయ్యో! మనింట్లో పాయసం చేసేకి కట్టెలు లేవే! నీవు అడవికెళ్ళి కట్టెలు తేపో, నీకు పాయసం చేసి పెడతాను!" అని అవ్వ చెప్పింది.

పాప అడవికి వెళ్ళింది. ఒక చెట్టు మీదికెక్కి ఎండు కొమ్మలు కొట్టుకుంటా ఉంది.

అదే సమయానికి, వాళ్ళ ఊళ్ళో గాడిద ఒకటి తప్పించుకొని వచ్చి అడవిలో మేస్తా ఉంది. అంతలో ఒక నక్క అక్కడికి వచ్చింది. దానికి చాలా ఆకలిగా ఉంది. "నా అడవిలోకొచ్చి మేస్తున్నావా! నిన్ను ఇప్పుడే తినేస్తాను చూసుకో!" అని నక్క గాడిదతో అనింది.

గాడిద కొంచెం ఆలోచించి, "దానిదేముందిలే నక్క బావా! నువ్వు నన్ను తింటానంటే ఎంత భాగ్యం! అయితే నేను ఇప్పుడు బాగా మేత మేసి ఉన్నాను కదా, చాలా బలంగా ఉన్నాను. మరి, నువ్వేమో చాలా ఆకలితో, బలహీనంగా ఉన్నావు. అందుకని, మొదట నువ్వు నన్ను మూడు తన్నులు తన్నావంటే నా బలం పోతుంది. ఆ తర్వాత నేను నిన్ను మూడు తన్నులు తంతాను. దాంతో నీకు ఆకలి బాగా పెరుగుతుంది. అప్పుడు నువ్వు నన్ను తిన్నావంటే చాలా బాగుంటుంది" అని నక్కతో చెప్పింది.

తెలివి తక్కువ నక్క సంతోషంగా సరేనన్నది.

అనుకున్న ప్రకారమే ముందు నక్క గాడిదను మూడు తన్నులు తన్నింది. గాడిద ఒంటి ముందు నక్క శరీరం ఏపాటిది? గాడిదకు ఏమాత్రం దెబ్బ తగల్లేదు.

అటుపైన "నన్ను నువ్వు మూడు తన్నులు తన్నేశావు గదా! నా బలం అంతా తగ్గిపోయింది. ఇప్పుడు నేను నిన్ను తన్నాలి, నీ‌ ఆకలి పెరిగేందుకు" అని గాడిద వెనక్కి తిరిగింది.

"వెనక్కెందుకు తిరుగుతున్నావు?" అని నక్క అనేంతలోనే గాడిద తన వెనక కాళ్ళతో ఒక్క తన్ను తన్నేసరికి, నక్క చాలా దూరం ఎగిరి పడింది. "ఇంకా రెండు ఉన్నాయి ఆగు" అని గాడిద వెళ్ళి రెండో తన్ను తన్నింది. ఆ తన్నుకి నక్కకి నక్షత్రాలు కనిపించాయి. అంతలో గాడిద పరుగెత్తుకొచ్చి మూడో తన్ను తన్నేసరికి, నక్క ఎగిరి వెళ్ళి పాప ఉండే చెట్టుకాడ పడి మూలగటం మొదలు పెట్టింది. ఇక నక్క భయం లేదని, గాడిద అక్కడే హాయిగా మేసుకుంటూ ఉండింది.

ఇక అక్కడ చెట్టు కింద కూర్చొని నక్క మూలుక్కుంటూ, "గాడిద నన్ను మొదటి సారి ఇక్కడ తన్నింది, రెండో సారి ఇక్కడ తన్నిందే . . . " అని లెక్క పెట్టుకుంటూ ఉంటే, చెట్టు పైనున్న పాప విని పక పక నవ్వింది.

అప్పుడు నక్కకి చాలా అవమానం అయ్యింది. అది పళ్ళు బయటపెట్టి పాపని బెదిరిస్తూ "ఈ విషయం గానీ నువ్వు ఊర్లో ఎవరికైనా చెప్పావంటే, నిన్ను చంపి తినేస్తాను- చూస్తూండు" అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళి పోయింది.

పాప కట్టెలతో ఇల్లు చేరుకుంది. అవ్వ పాయసం చేస్తా ఉంటే‌ పాప మాత్రం దిగులుగా కూర్చుంది. అవ్వ పాయసం ఇస్తే తాగింది గానీ పాప ముఖంలో సంతోషం లేదు. పాపను చూసి అవ్వ "ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు?" అని అడిగింది. అవ్వ ఎన్ని సార్లు అడిగినా బదులివ్వలేదు. "పాపా! నీకు పావలా ఇస్తాను, చెప్పు . . . అర్ధ రూపాయి ఇస్తాను, చెప్పు . . . రూపాయి ఇస్తాను , చెప్పు . . . రెండు రూపాయలు ఇస్తాను, చెప్పు " అని అవ్వ బతిమాలేసరికి, పాప జరిగిందంతా చెప్పేసింది.

అది విన్న అవ్వ కూడా పకపకమని గట్టిగా నవ్వింది. ఆ నవ్వు విని ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి 'ఏమయిందవ్వా' అని అడిగితే విషయం మొత్తం చెప్పేసింది అవ్వ!

తనకు జరిగిన అవమానం గురించి ఊర్లో వాళ్ళందరికీ తెలిసి పోయిందని ఇప్పుడు నక్కకు తెలిసిపోయింది. దానికి ఇప్పుడు పాపమీద విపరీతమైన కోపం వచ్చేసింది. "నేను చెప్పొద్దంటే అందరికీ ఎందుకు చెప్పాలి?" అని, అది ఆ రోజు రాత్రి పాప ఇంటికి వచ్చింది.

నక్క వచ్చే సమయానికి పాప ఒక మంచం మీద పడుకొని ఉంది; ప్రక్కనే అవ్వ ఇంకో మంచం మీద పడుకొని ఉంది. నక్క ఏమాత్రం అలికిడి చెయ్యకుండా, పాప పడుకున్న మంచాన్ని ఎత్తుకొని అడవి వైపు పోతా ఉంది. కొంచెం దూరం పోయాక పాపకు మెలకువ వచ్చింది. ప్రక్కన చూసుకుంటే అవ్వ లేదు! వెంటనే పాపకు విషయం అర్థమయిపోయింది.

ఏం చెయ్యాలి అని ఒక్క నిముషం ఆలోచించి "అబ్బో! ఎన్ని గాడిదలున్నాయో ఇక్కడ!" అని గట్టిగా అరిచింది తెలివైన ఆ పాప. అది విని, మంచాన్ని క్రింద పడేసి, నక్క పరుగో పరుగు!