మన కడుపులో అన్నాశయానికి వెనుకగా, దానికీ-వెన్నెముకకీ మధ్యన ఇరుక్కొని- ఉంటుంది, పలచగా ఉండే 'క్లోమ గ్రంధి'. ఈ గ్రంధిలోంచి విడుదల అయ్యే రసం మనం తిన్న ఆహారంలో కలిసి, ఆ ఆహారం శక్తిగా మార్పుచెందేందుకు దోహదం చేస్తుంది.



ఈ క్లోమగ్రంధి (పాంక్రియాస్) సరిగ్గా పనిచెయ్యకపోతే, అవసరమైనంత క్లోమరసం తయారు కాదు. అప్పుడు మనం తినే ఆహారంలోని పిండి పదార్థం అంతా చక్కెరగా మారి రక్తంలో కలవనైతే కలుస్తుంటుంది; కానీ ఆ చక్కెర తిరిగి 'శక్తి'గా రూపాంతరం చెందదు! అంటే ఎంత తిన్నా మనకు శక్తి రాదన్న మాట; ఎన్ని గ్లూకోజులు తీసుకున్నా నీరసంగానే ఉంటుందన్నమాట!

అంతేకాదు- దీని వల్ల మరో రెండు సమస్యలు కూడా ఎదురవుతాయి: రక్తంలో పెరిగిన చక్కెర ను తగ్గించేందుకు, మన మూత్రపిండాలు చాలా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. అవి అలసిపోతే ఎలాగ? ఇక రెండవది, రక్తంలో తీపిశాతం పెరిగినప్పుడు, అట్లా తీపిని ఇష్టపడే రకరకాల సూక్ష్మజీవులు మన శరీరంలోనే పెరగటం మొదలు పెడతాయి. రాను రాను అవి అనేక రోగాలను తెప్పిస్తాయి! 'క్లోమగ్రంధి సరిగా పనిచెయ్యకపోవటం' అనే ఈ సమస్యని వైద్యులు 'డయాబెటిస్- చక్కెర వ్యాధి' అని పిలుస్తారు.

క్లోమ గ్రంధిని తిరిగి పనిచేసేట్లు చెయ్యటం ఆధునిక వైద్యులకు పెద్ద సవాలు అయి కూర్చున్నది. రాను రాను ప్రపంచంలో ఇంకా ఇంకా ఎక్కువమందిలో ఈ సమస్య కనబడుతున్నది. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంలో దీనికి తగిన మందులు ఉన్నప్పటికీ అవి ఏమంత మందికి అందుబాటులోకి రావటంలేదు.

మారిపోతున్న జీవనశైలి, అసహజ వాతావరణం చక్కెర వ్యాధిని ప్రేరేపిస్తున్నాయి. సమతులమైన ఆహారం, తగినంత శరీరశ్రమ, సంతోషంతో కూడిన పరిశుభ్రమైన జీవనం మన ఆరోగ్యానికి మూలస్తంభాలు.