తొగరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా ఇంద్రజాల పదర్శన జరుగుతోంది. ప్రముఖ మెజిషియన్ "ఉత్తమ్" వేదిక పైకి వస్తూనే గాలిలో చేతులూపి జేబురుమాలును సృష్టించాడు. మరో క్షణంలో దాన్నే "జాతీయ జెండా"గా మార్చి అందరి చేతా చప్పట్లు కొట్టించాడు.

"మేధ" తొమ్మిదవ తరగతి చదువుతోంది. మేజిషియన్ చేస్తున్న ప్రతి అంశాన్నీ ఆసక్తితో గమనిస్తోంది.

అంతలో ఉత్తమ్ వేదిక పై నుండి అన్నాడు- "అమ్మాయిల్లో ఒకరు రండి, ఇక్కడికి!" అని.

క్షణం ఆలస్యం చెయ్యకుండా వెళ్ళింది మేధ. వెళ్ళింది. "నీ పేరు ఏంటి?- మేధనా, సరే- ఎన్నో తరగతి? ఒకె- తొమ్మిదవ తరగతి" మైకులోనే పరిచయం చేసుకున్నాడు మేజిషియన్. అటుపైన ఆయన ప్రధానోపాధ్యాయుడ్ని ఉద్దేశించి "సార్! డజను గుడ్లు తెప్పించండి సార్! వాటితో మ్యాజిక్ చేద్దాం" అన్నాడు.

ప్రధానోపాధ్యాయులవారు వెంటనే తెప్పించి ఇచ్చారు.

"సారు గుడ్లు తెప్పించారు- వీటిని చక్కగా పేర్చి ఇవ్వు నాయనా" అన్నాడు ఉత్తమ్‌ వాటిని తన అనుచరుడికి అందిస్తూ. అతను వాటిని ఒక పళ్ళెంలో చక్కగా అమర్చి తెచ్చి ఇచ్చాడు. "మేధా! ఇటు రామ్మా!" అన్నాడు. మేజిషియన్. మేధ అతని ముందు నిలబడింది.

"ఈ గుడ్లలోంచి నువ్వు ఒకటి, నేను ఒకటి తీసుకుందాం- సరేనామ్మా?" అన్నాడు ఉత్తమ్. మేధ ముందుకెళ్ళింది- ఇద్దరూ చెరొక గుడ్డునూ చేతులోకి తీసుకున్నారు.

"నేను చేసినట్లు నువ్వూ చెయ్యాలి- జాగ్రత్తగా చూడు పాపా" అన్నాడు ఉత్తమ్. "సరే" అంది మేధ.

"అబ్రకదబ్రా" అంటూ మెజిషియన్ తన మంత్రదండాన్ని తన చేతిలోని గుడ్డుకు తాకించాడు.

"నాకూ‌ ఇవ్వండి మంత్రదండాన్ని-" అని మేధ ఆ మంత్ర దండాన్ని తీసుకొని "అబ్రక దబ్రా"అంటూ తన గుడ్డు చుట్టూ తిప్పింది.

"నువ్వు చాలా తెలివైన పాపవి మేధా! ముందు నీ గుడ్డుని కూడా మంత్రంతో నింపేశావు. ఇదిగో ఇప్పుడు చూడు- ఈ గుడ్డును ఎలా తిప్పుతానో " అంటూ మెజీషియన్ తన చేతిలో ఉన్న గుడ్డును బల్ల పైన నిలబెట్టి, వేళ్ళతో‌ బొంగరంలా తిప్పాడు- అది నిజం బొంగరంలాగే గిరగిర తిరుగుతూంది.

"మేధా! ఇప్పుడు నీ గుడ్డును తిప్పు!" అన్నాడు ఉత్తమ్‌.

మేధ తన చేతిలోని గుడ్డును టేబుల్ మీద పెట్టి తిప్పాలని చూసింది- కానీ‌ గుడ్డు నిల్చోలేదు, తిరగలేదు! ఎంత ప్రయత్నించినా దబ్బున క్రింద పడిపోతున్నది!

మేజిషియన్ చేతిలోని గుడ్డు మాత్రం ఎన్నిసార్లు తిప్పినా తిరుగుతోంది చక్కగా!

"చాల్లేమ్మా! నీ మంత్రం ఏదో పనిచేసినట్లు లేదు- ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టి, ఇంకో పని చేద్దాం" అన్నాడు మెజీషియన్. సహాయకుడు వచ్చి వీళ్ళ చేతుల్లోని రెండు గుడ్లనూ తీసుకెళ్ళాడు.

"మనం ఇద్దరం మళ్ళీ చెరొక గుడ్డు తీసుకుందాం" అంటూ మెజీషియన్ తన ముందున్న ప్లేటులోంచి ఒక గుడ్డును చేతిలోకి తీసుకున్నాడు. మేధ గుడ్లన్నిటినీ బాగా పరిశీలించి తనకు నచ్చిన గుడ్డునొకదాన్ని తీసుకున్నది.

"అబ్రకదబ్రా" అంటూ మంత్రదండాన్ని గుడ్డు చుట్టూ‌ తిప్పాక- "ఇప్పుడు నాలాగే చెయ్యమ్మా, చూద్దాం" అని మేజిషియన్ ఆ గుడ్డుని తన చెవి వెనుక భాగాన పెట్టి గట్టిగా ఒత్తాడు. ఆ తర్వాత అతను చేతిని తీసినా గుడ్డు మటుకు చెవి వెనకే అతుక్కొని ఉండిపోయింది! చెవి వెనక వైపున ఎటువంటి ఆధారం కాని, జిగురు కాని లేదు- కానీ గుడ్డు మాత్రం కమ్మలాగ అతుక్కుని వేలాడుతోంది.

వెంటనే మేధా తన చేతిలోని గుడ్డునూ చెవి వెనక పెట్టుకొని ఒత్తింది. మెల్లగా చెయ్యి తీసేసరికి, గుడ్డు కూడా చేతిలోకే వచ్చింది! మరో రెండు సార్లు ప్రయత్నించాక, మూడోసారికి అది కిందపడి పగిలిపోయింది!

మేధ చిన్నబోయింది- కానీ అక్కడ చేరినవాళ్ళు అందరూ మెజీషియన్‌ను మెచ్చుకుంటూ చప్పట్లు చరిచారు.

ఇంద్రజాల ప్రదర్శన ముగిసింది. మేధ ఇంటికి చేరింది.

ఆ రోజు రాత్రి మేధాకు నిద్రపట్టలేదు. ఒకటే ఆలోచన- "ఎందుకు? ఏమిటి? ఎలా జరిగినై ఇవన్నీ?" అని. "ఎలాగైనా వాటి వెనక ఉన్న రహస్యం తెలుసుకోవాలి... ఎవరు చెబుతారు?" అని ఆలోచించింది. "ఆ...!" ఆలోచన తట్టింది-

గత సంవత్సరం జనవిజ్ఞాన వేదిక సభ్యుడు శివరాం తమ బడికి వచ్చాడు. "సైన్సా? మహిమలా?" అని ఒక మ్యాజిక్ కార్యక్రమం నిర్వహించాడు. ఆయనైతే చెప్పగలడు- అప్పట్లో తను ఆయన ఫోను నంబరును పుస్తకంలో రాసి పెట్టుకున్నది కూడాను-"
నంబరు వెతికి శివరాం గారికి ఫోన్ చేసింది మేధ. శివరామ్ స్పందిస్తూ "ఆదివారంనాడు మీ బడికి వస్తాను పాపా, మీ తరగతిలో ఉత్సాహం ఉన్న పిల్లలందరినీ తీసుకునిరా! అందరికీ ఆ మ్యాజిక్ నేర్పిస్తాను అన్నాడు".

అన్నట్టే వచ్చారు శివరాం గారు. యాభైమంది దాకా పిల్లలు వచ్చి కూర్చున్నారు. "మ్యాజిక్ నేర్చుకుందామా?" అడిగారు శివరాంగారు.

"ఓ..!" అన్నారు పిల్లలు ఉత్సాహంగా.

డజను గుడ్లు తెమ్మన్నారు శివరాంగారు. "మ్యాజిక్ చేసే ముందు కొంత హోమ్ వర్క్ చేసుకోవాలి!" అన్నారు.

"ఈ గుడ్లను ఉడక బెట్టుకొని తీసుకునిరా!" అని నాలుగు గుడ్లు ఇచ్చారు.

మేధా బడి కిచెన్ లోకి వెళ్ళి గబుక్కున వాటిని ఉడక బెట్టి తెచ్చింది. వాటిని ఒక పక్కగా పెట్టించారు శివరాం గారు.

ఆ తర్వా త మరో రెండు గుడ్లను తీసుకున్నారు. "ఇదిగో, వీటికి నిలువుగా- కింద ఒక రంధ్రం , పైన ఒక రంధ్రం చేయాలి సూదితో- జాగ్రత్త! పగలకూడదు సుమా!" అన్నారు.

మేధ తెలివైన పాప. జాగ్రత్తగా రెండు గుడ్లకూ రంధ్రాలు చేసింది.

"ఇదిగో, ఇప్పుడు ఈ సిరంజి తీసుకొని, ఆ రంధ్రాల్లో దూర్చి, గ్రుడ్లలోని సొన మొత్తం బయటికి తీసెయ్యాలి- గుడ్డు పగలకూడదు- జాగ్రత్తగా కొంచెం కొంచెంగా తీస్తే సరి" అంటూ ఒక ఇంజక్షన్ సిరంజిని ఇచ్చారుశివరాం గారు.

రెండు గ్రుడ్లలోకీ సిరెంజి గుచ్చి, లోపలున్న సొనలను లాగేసి, డొల్లలుగా చేసింది మేధ.

"ఇప్పుడు గ్రుడ్లను శుభ్రంగా తుడిచి, రంధ్రాలు కనపడకుండా "వైట్‌నర్" తో మూసివేయాలి..."

"భలే బాగుంది ఐడియా!" అంటూ సంబరపడింది మేధ.

శివరామ్ మేధకు రహస్యంగా చెవిలో ఏదో చెప్పాడు.

"సరే ..సరే! అర్థమైంది" అంటూ మురిసిపోయింది ఆ పాప.

"పిల్లలు! ఇప్పుడు మేధ మనకు రెండు మ్యాజిక్కులు చూపిస్తుంది- దానితోబాటు అవి ఎలా చెయ్యాలో కూడా నేర్పుతుంది.

నేర్చుకోండి" అన్నారు శివరాం గారు.

పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

"మైడియర్ స్టూడెంట్స్! ఇవిగో ఇక్కడ గుడ్లు చూడండి- ఎవరైనా ఒకరు రండి!" అంది మేధ.

గబుక్కున వచ్చి నిల్చున్నది ఇందు.

ఈ పళ్లెంలో ఉన్న గుడ్లలోంచి నువ్వు ఒకటి తీసుకో, నేను ఒకటి తీసుకుంటాను" అని చెప్పి ఉడికిన గుడ్డును తను తీసుకున్నది మేధ.

ఇందు చేతికి మామూలు గుడ్డు వచ్చింది.

"అబ్రక దాబ్రా" అంటూ తన చేతిలోని ఉడికిన గుడ్డును బల్లమీద పెట్టి బొంగరంలాగా తిప్పింది మేధ. అది నిజం బొంగరం లాగే గిరిగిరా
తిరిగింది. ఇందు చేతిలోని మామూలు గుడ్డు మాత్రం తిరగలేదు.

"ఎందుకు తిరగలేదు?" అడిగారు పిల్లలు.

"ఇందు చేతిలో‌ఉన్నది ఉడకని గుడ్డు. దాని సొన ద్రవంలాగా ఉంటుంది. ఆ గుడ్డును నిలబెట్టి తిప్పినప్పుడు భూమ్యాకర్షణ వల్ల దానిలోని సొన అంతా వేరువేరుగా తిరగటం వల్ల, గుడ్డు స్థిరత్వం కోల్పోయి, క్రింద పడిపోతుంది- తిరగదు.

అయితే నా చేతిలో ఉన్నది ఉడికిన గుడ్డు- దీనిలో సొన అంతా గడ్డ కట్టి ఉంటుంది. ఇంకేముంది? అది చక్కగా తిరుగుతుంది" వివరించింది మేధ. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. కొందరు వచ్చి ఉడికిన గుడ్డునూ, ఉడకని గుడ్డునూ వేరువేరుగా త్రిప్పి చూసారు.

కేరింతలు కొట్టారు.

"ఇదిగో, రెండవ అంశం చూడండి" అని ఇందు, మేధ ఇద్దరూ చెరొక గుడ్డునూ తీసుకున్నారు.

మేధ తన దగ్గరున్న గుడ్డును చెవి వెనుక భాగానికి అతికించు కుంది. ఇందు చేతిలోని గుడ్డు మాత్రం జారి కింద పడింది; పగిలిపోయింది!

రహస్యం చెప్పమన్నారు పిల్లలు.

"ఇదిగో, నా దగ్గరున్నది డొల్లగా ఉన్న గుడ్డు. ఇందులో సొన లేదు, కనుక ఇది చాలా తేలికగా ఉంటుంది. కోడిగుడ్డు ఆకారం వల్ల, దాని అంచు చెవి వెనుక అతుక్కుంటుంది- ఇదిగో ఇలాగ.

అయితే ఇందూకి ఇచ్చింది నిజమైనగుడ్డు. అది బరువుగా ఉంటుంది; దానిలోని సొన ద్రవంలాగా కూడా ఉంటుంది. అది చెవికి అంటుకొని నిలవలేదు- జారి పడిపోతుంది.." చెప్పింది మేధ.

"మరి గుడ్లు తీసుకునేప్పుడు కన్‌ఫ్యూజ్ అయితే ఎలాగ?" అడిగాడు సునీల్.

"కన్‌ఫ్యూజ్ అయితే అంతే సంగతులు. జాగ్రత్తగా ఉండాల్సిందే. వీటిని గుర్తు పెట్టుకొని, తామే తీసుకోవాలి మెజీషియన్‌లు- ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకమైన గ్రుడ్లు ప్రేక్షకులకు అందకూడదు- అదే కిటుకు ఇందులో.." నవ్వారు శివరాం గారు సభను ముగిస్తూ.