పూర్వం గంగానదీ తీరంలో అమరాపురం అనే ఊరు ఒకటి ఉండేది. కాశీ రాజు రాజశేఖరుడు దేశసంచారం చేస్తూ ఒకనాడు ఆ గ్రామం చేరుకున్నాడు. గంగానదిలో స్నానం చేసి అక్కడి దేవతలను పూజించాడు. నదీ తీరంలో ఎవరో పండితుడు పురాణం చెబుతూంటే వింటూ కూర్చున్నాడు. అంతలో నది దగ్గరినుండి కేకలు, ఏడుపులు వినబడ్డాయి- అందరూ అటువైపు పరుగుతీశారు. "నదిలో స్నానం చేస్తున్న నా భర్తను మొసలి పట్టుకొని నీటిలోకి లాక్కుపోయింది. ఎవరైనా తొందరగా వచ్చి రక్షించండి, రక్షించండి!" అంటూ కేకలు వేస్తున్నది, ఒకావిడ.

సాహసవంతుడైన రాజశేఖర్ నీటిలోకిదూకి, మొసలిని చంపి , అతన్ని కాపాడాడు. అందరూ కలిసి పరిచర్యలు చేసి, అతన్ని తిరిగి స్పృహలోకి తెచ్చారు. ఆ మనిషి, అతని భార్య

రాజశేఖరునికి నమస్క రించి "అయ్యా! నువ్వు చాలా సాహసవంతుడివి, పరోపకార గుణం ఉన్నవాడివి- కనుకనే మమ్మల్ని కాపాడావు. మేం సామాన్యులం- కృతజ్ఞతలు తెలపడం కంటే నీకేమి ప్రత్యుపకారం చేయగలం?" అన్నారు.

అప్పుడు రాజశేఖరుడు వాళ్ళతో‌మర్యాదగా "చింతించకండి, దీన్ని నేను నా బాధ్యతగా భావిస్తున్నాను. మీనుండి నేను ఏలాంటి ప్రత్యుపకారాన్నీ కోరటంలేదు" అన్నాడు.

అంతలో మొసలిబారిన పడిన వ్యక్తి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా "అయ్యా! జ్ఞాపకం వచ్చింది- నా దగ్గర ఒక మంత్రముంది. దాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు- అప్పటి వరకూ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మహాద్భుతమైన చక్రవర్తి యోగం ప్రాప్తిస్తుంది.

అంతేకాదు- కోరుకున్నప్పుడు దేవలోకంనుంచి విమానం వచ్చి తీసుకువెళ్తుంది వాళ్లని. అయితే దాన్ని వేరే ఎవ్వరికీ ఉపదేశించ కూడదు- అట్లా ఉపదేశించినట్లయితే మొదటివారికి ఇక ఆ మంత్రం పనిచేయదు. ఆ మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఈపాటి మేలయినా మీకు చేసే అవకాశమియ్యండి" ఆంటూ ఆ మంత్రాన్ని రాజుకు ఉపదేశించాడు. ఆ తర్వాత తమ దారిన తాము వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ.

రాజశేఖరుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అతను అలా వింధ్యపర్వత ప్రాంతానికి చేరుకొనే సరికి చీకటి పడింది. ఆ సమయంలో అక్కడ ఒక పాడుబడిన దేవాలయం కనబడే సరికి, రాజశేఖరుడు అక్కడే విశ్రమించాడు.

ఆ దేవాలయం ముందున్న మర్రి చెట్టు మీద ఒక రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు. వాడికి కొంత కాలంగా ఆహారం దొరక్క, చాలా నీరసించి పోయి ఉన్నాడు. ఇప్పుడు కండలు తిరిగిన యోధుడొకడు తన పరిధిలోకే వచ్చేసరికి వాడి ఆనందానికి మేరలేకపోయింది. బాగా చీకటి పడనిచ్చి, వాడు గబుక్కున రాజు ముందుకు దూకి నిలబడ్డాడు. ఆ శబ్దానికి మెలకువ వచ్చిన రాజశేఖరుడు తేరుకునేలోగానే బ్రహ్మరాక్షసుడు వచ్చి మీద పడ్డాడు.

ఇద్దరూ చాలా సేపు హోరా హోరీగా పోట్లాడాక, రాక్షసుడు ఓటమిని అంగీకరిస్తూ రాజశేఖరుడి కాళ్లమీద పడ్డాడు- "అయ్యా, మీరేనా మా గురుదేవులు చెప్పిన రాజశేఖరులవారు?" అంటూ.

రాజశేఖరుడు అవునన్న మీదట, వాడు సంతోషంతో‌ కొంతసేపు గంతులు వేసి, అటుపైన తన కథ చెప్పసాగాడు- "అయ్యా! నేను ఇంతకుముందు మాళవదేశపు రాజపురోహితుడిగా ఉండేవాడిని. మా రాజు పండితులను అభిమానించేవాడు. వచ్చిన పండితుల విద్వత్తును పరీక్షించేందుకు నన్ను నియోగించేవాడు ఆయన. రాను రాను నేను చెప్పిన పండితులకే రాజుగారినుండి భూరి బహుమానాలు దొరకటం మొదలయింది. ఇట్లా జరుగుతుండేసరికి, కొంతకాలానికి ఈ పండితులకంటే 'నేనే గొప్ప వాడిని' అని నాలో గర్వం పెరిగింది. ఎంతటి పండితుడినైనా చులకనగా చూసేవాణ్ణి. ఒకరోజున గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుకొన్న మహా పండితుడు ఒకాయన మా ఆస్థానానికి వచ్చాడు- తనను పరీక్షించి, తగిన బహుమానమిప్పించమంటూ. నేను, ఆయన్ని పరీక్షించకనే గర్వంతో ఎగతాళి చేసి అవమానించాను.

ఆయన కోపగించి "నా అంతటి శక్తి శాలినే ఇలా అవమాన పరచావు. నాకంటే ముందు ఎందరిని అవమానించావో! ఆ పాపం మొత్తం ఫలించుగాక! నువ్వు బ్రహ్మ రాక్షసుడివైపోదువుగాక!" అని శపించాడు. మరుక్షణం నేను ఇలా బ్రహ్ర్మరాక్షసుడినైపోయాను.

భయంతో వణుకుతూ ఆయన కాళ్లపై పడి శాపవిమోచనం ఇమ్మని వేడుకున్నాను.

అప్పుడు ఆ పండితుడు నన్ను అనుగ్రహించి "మహిమాన్వితమైన మంత్రాన్నొకదాన్ని సాధన చేస్తే ఎనలేని లాభం ఉంటుందని తెలిసి కూడా సొంతానికి ఉపయోగించుకోని రాజశేఖరుడొకడు నీదగ్గరికి వచ్చి, నీపైన దయతో దాన్ని నీకు దానం చేస్తే తప్ప నీకు విముక్తి లేదు" అని సెలవిచ్చాడు. తమరు నాపైన దయ చూపండి. తమరికి తెలిసిన మంత్రాన్ని నాకు ఉపదేశించండి" అన్నాడు వాడు.

రాజశేఖరుడు తనకు తెలిసిన మంత్రాన్ని సునాయాసంగా ఆ రాక్షసుడికి ఉపదేశించాడు.

మరుక్షణం ఆ రాక్షసుడి స్థానంలో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై, "రాజా! జయం!‌జయం! నీ త్యాగబుద్ధి సహజమైనదో, కాదో తెలుసుకునేందుకు మేం పెట్టిన పరీక్ష ఇది- నువ్వు ఇందులో గెలిచావు. నీవంటి అద్భుత శీలం గలవాడికి మానవాతీత శక్తులతో‌ పనిలేదని నిరూపించావు. జయోస్తు" అని మాయం అయిపోయాడు!