చెప్పింది చెప్పకుండా చెప్పద్దు!

రక్షిత: ఆమెకు చెప్పవద్దని నేను నీకు చెప్పిన రహస్యాన్ని తనకు చెప్పావని ఆమె చెప్పింది.
వందన: హు! ఆమెకు నేను చెప్పిన విషయాన్ని నీకు చెప్పవద్దని నేను ఆమెకు చెప్పాను.
రక్షిత: ఆమె నాకు చెప్పేసిందని నేను నీకు చెప్పిన విషయం ఆమెకు చెప్పద్దు- సరేనా?

మేం మాత్రం అలా చెయ్యం!

గిరీష్: ఆ చిన్న పతకం నీకు ఎందుకిచ్చారు?
హరీష్: పాట పాడినందుకు.
గిరీష్: మరి ఆ పెద్దపతకం ఎందుకిచ్చినట్టో?
హరీష్: నేను పాటలు పాడటం ఆపివేసినందుకు.

తెలివి మరీ ఎక్కువైంది!

జాన్: నాన్నా, ఇతరులకు సహాయం చేయడానికీ మనం ఇక్కడ ఉన్నామని ఫాదర్ మాథ్యూ చెప్పారు ఇవాళ్ల.
నాన్న: అవును- నిజంగా మనం అందుకోసమే ఉన్నాం జాన్.
జాన్: మరి ఇతరులు అందరూ ఇక్కడ ఎందుకున్నట్లో ?

ఆకళింపు ఎక్కువ!

టీచర్: నా కుడి చేతిలో ఏడు ఆపిల్ పళ్ళు, ఎడమ చేతిలో ఎనిమిది ఆపిల్ పళ్ళు ఉన్నాయనుకో.. నీకు ఏమనిపిస్తుంది?
రోషన్: మీకు పెద్ద చేతులు ఉన్నాయనిపిస్తుంది టీచర్.

దొందూ దొందే!

అమ్మ: ఏం చేస్తున్నావు భానూ?
భాను: చిన్నారి షానూకు లెటెర్ రాస్తున్నా నమ్మా
అమ్మ: ఎలా? నీకు రాయడం తెలీదు కదా?
భాను: అయితే ఏమిటి? షానుకూ చదవటం తెలీదు కదా!

కాకి పిల్ల కాకికి ముద్దు

తల్లి కాకి పిల్లకాకితో అంటోంది: ఎక్కువగా ఎండలో తిరగకమ్మా, నల్లబడి పోతావు!

బడంటే కచ్చ ఉన్న పిల్లలు ఇద్దరు :

రాహుల్: ఇవాళ్ళ తరగతి గదిలో ఏమయిందో‌ తెలుసా? గోడ గడియారం కిందపడిపోయింది. ఒక్క క్షణం ముందు గనక పడి ఉంటే, అది సూటిగా మనీషా టీచర్ తల పై పడి ఉండేది!
మనోజ్: హూ! ఆ గడియారం ఎప్పుడూ నిదానమే మరి?

ఐస్ వాటర్!

కస్టమర్: ఏమయ్యా , సర్వరూ? 'ఐస్‌క్రీం' తెమ్మంటే 'ఐస్ వాటర్' తెచ్చావేంటి?
సర్వర్: ఏమో సార్, నేను తెచ్చేటప్పుడు క్రీమ్‌గానే ఉండింది; కానీ, ఇప్పుడు వాటరయ్యింది ఎందుకనో.

మంచి మద్రాసు కాఫీ!

కస్టమర్: తినేందుకు ఏమున్నాయి బాబూ?
సర్వర్: బెంగాల్ బజ్జీ, మైసూరు మసాలావడ, ఆంధ్రా అట్టు, కెనడా కాఫీ, టిబెట్టు టీ- మీకు ఏం తెమ్మంటారు సార్!?
కస్టమర్: అవేమీ వద్దు నాయనా, కాసిన్ని మచిలీపట్నం మంచినీళ్ళు తెచ్చివ్వు చాలు.

గురువుకు నామాలు!

టీచర్: కిరణ్, నువ్వెందుకు హోమ్‌వర్క్ చెయ్యలేదు?
కిరణ్: క్షమించండి, టీచర్.
టీచర్: "క్షమించండి" అనే మాట నా డిక్షనరీలో లేదు.
కిరణ్: లైబరీలోని డిక్షనరీలో తప్పకుండా ఉంటుంది టీచర్- చూసి పెట్టమంటారా?

తెలుగుబాల పద్యాలు

బ్రతికినన్నినాళ్లు ఫలములిచ్చుటెగాదు
చచ్చికూడ చీల్చి ఇచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల! తెలుగుబాల!

పరమ సుందరములు ఫలములు, సంసార
విష మహీజనమునకు వెలయు రెండు
సాధు సంగమంబు, సత్కావ్యపఠనంబు
లలిత సుగుణజాల! తెలుగుబాల!

హంసలందు బకము హాస్యాస్పదంబగు
మణుల గాజుపూస గణుతి గనదు
చదువురానిమొద్దు సభల రాణించడు
లలిత సుగుణజాల! తెలుగుబాల!

అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాల మానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శృతిలేని పాటరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
-జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 'తెలుగు బాల' పద్యాలు