ప్రపంచంలో అన్ని చోట్లా మనుషులూ, ప్రభుత్వాలూ ఒకలా ఉండరు. ఒక్కొక్క చోట కొన్ని కొన్ని ప్రవర్తనా నియమావళులు ఉంటాయి.

మనం చేత్తో తిన్నట్లే కొన్ని దేశాల్లో ఫోర్కు-కత్తీ వాడి తింటారు, అలాగ. కొన్ని దేశాల్లో, ప్రజలపై ఆంక్షలు కూడా ఉంటాయి - ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని. తాలిబాన్ల రాజ్యంలో స్త్రీలు చదువుకోవడం నిషిద్ధం (ఇప్పటికీ కొన్ని చోట్ల అమలులో ఉంది).

అలాంటి ప్రాంతాలలో పాకిస్తాన్ లోని స్వాట్ లోయ ప్రాంతం ఒకటి. మలాలా అక్కడ ఉండే ఒక పదిహేనేళ్ళ అమ్మాయి. విశేషం ఏమిటి అంటే, ఇంత చిన్న వయసులోనే తను మహిళల చదువు కోసం ఇతర హక్కుల కోసం విశేషంగా పోరాడి అంతర్జాతీయంగా ఎంతో పేరు సంపాదించింది. తన ప్రాంతపు "జిల్లా పిల్లల అసెంబ్లీ" కి చెయిర్ పర్సన్గా కూడా పనిచేసింది. ఆ అమ్మాయి గురించే ఇప్పుడు పరిచయం చేయబోతున్నది.

చిన్నప్పటి నుండే విద్యావేత్త అయిన తండ్రి ప్రభావంలో మలాలా రాజకీయాల గురించి తెలుసుకుంది. పదకొండేళ్ళ వయసులోనే "చదువు అనే నా ప్రాథమిక హక్కును వద్దనడానికి తాలిబాన్లకి ఎంత ధైర్యం?" అని ప్రశ్నించింది. ఆ సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రసంగం టీవీల్లో, పేపర్లలో కూడా వచ్చింది. పన్నెండేళ్ళ వయసులో - తాలిబాన్ పాలనలో అమ్మాయిగా తన జీవితాన్ని వర్ణిస్తూ బి.బి.సి(బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్) వారి ఉర్దూ విభాగంలో తన తొలి రచనను ప్రచురించింది. భద్రతా కారణాల వాళ్ళ మారుపేరుతో వచ్చింది ఆ వ్యాసం. ఈ క్రమంలో తమ జీవితాలని, అమ్మాయిలుగా తమపై ఉన్న ఆంక్షల గురించీ చెబుతూ రాసిన ఆ వ్యాసాలు చాలా పేరు తెచ్చి పెట్టాయి మలాలా కు. 2009లో తాలిబాన్లు ఆడపిల్లలు స్కూళ్ళకి వెళ్ళకూడదు అని ఒక రూల్ వేశారట. అంతే కాక, చాలా అమ్మాయిల స్కూళ్ళను నాశనం చేసేశారట కూడా. ఈ సమయంలో, మలాలా వాళ్ళ స్కూల్లో వాళ్ళంతా తెలివిగా, తాలిబాన్లకి అనుమానం రాకూడదని యూనిఫారాలు వేసుకోకుండా మామూలు బట్టలేసుకుని వెళ్ళేవాళ్ళంట. దానితో అక్కడ స్కూల్ ఉన్నట్లు కాక, ఏదో పిల్లలున్న ఇల్లు ఉన్నట్లుగా కనిపించేదట! ఇలాగ కొనసాగుతూ ఉండగా మధ్యలో ఎలాగో ఒకలా పరీక్షలయితే రాయగలిగారు కానీ, అమ్మాయిల మీద ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి. ఈ దశలో, తన తండ్రి స్పూర్తితో, రాజకీయ నాయకురాలు కావాలని నిర్ణయం తీసుకుంది మలాలా, డాక్టర్ కావాలన్న కోరికను పక్కన పెట్టి.

2009 చివరి నుండి క్రమంగా మలాలా పేరు అందరికీ తెలియడం, ఆమె కూడా తాలిబాన్లకి వ్యతిరేకంగా బహిరంగ ప్రసంగాలు ఇవ్వడం మొదలైంది. స్వాత్ జిల్లా పిల్లల అసెంబ్లీ కి నేతృత్వం వహించి రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగింది.

ఈ మధ్య కాలంలో అమ్మాయిల చదువు గురించి దాని అవసరం గురించి కూడా ప్రచారం చేసింది. 2011లో అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి కి నామినేషన్ అందుకుంది. ఆపై కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే జాతీయ యువత శాంతి బహుమతి అందుకుంది. మలాలా క్రుషి కి గుర్తుగా, స్వాత్ ప్రాంతాల్లోని ఒక అమ్మాయిల స్కూలుకి ఆమె పేరు కూడా పెట్టారు. అయితే, ఇలా పేరు తెచ్చుకునే కొద్దీ, తాలిబాన్లు, వారి సపోర్టర్ల నుండి మలాలాకు వార్నింగులు రావడం మొదలైంది. అయినా కూడా, మలాలా తన కార్యక్రమాలు ఆపకపోవడంతో, చివరికి కొన్ని రోజుల క్రితమే, తాలిబాన్ల గన్ మాన్ ఒకడు మలాలా ని బహిరంగ ప్రదేశంలో తూపాకీతో కాల్చాడు. తీవ్రమైన గాయాల మధ్య, అనేక ఆసుపత్రులు, సర్జరీలు అయ్యాక ఇప్పుడు క్రమంగా మళ్ళీ ఆరోగ్యవంతురాలు అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మలాలాకి సపోర్టుగా ప్రముఖులు ఎందరో ముందుకొచ్చారు. మలాలా పై జరిగిన దాడిని ఖండించారు.

మలాలా ధైర్యానికి మెచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం సితారా-ఎ-షుజాత్ అన్న ప్రబుత్వ బ్రేవరీ అవార్డు కూడా ప్రకటించింది.

ఇన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య కూడా అధైర్యపడకుండా, తాలిబాన్లని ఎదిరిస్తూ మలాలా ముందుకు సాగుతున్న తీరు స్పూర్తివంతంగా లేదూ?