'సరే అయితే, ఇక సభకు పదండి ' అని హంస రాజు ఆనతి ఇవ్వటంతో చక్రవాక మంత్రి బయట సభాగృహానికి నడచి వెళ్లాడు. ఆలోగా హంసరాజు వేరే మార్గం ద్వారా సభా గృహంలోకి ప్రవేశించటం, తన ఆసనాన్ని అలంకరించటం, ఇతర మంత్రులందరూ నిలచి ఆయనకు నమస్కరించి తమ తమ స్థానాలలో కూర్చొనటం జరిగాయి.

చక్రవాకం కావలి వాడి నొకడిని పిలిచి, "నువ్వు ఆ చిలుకను, కాకిని వెంటనే ప్రభువుల వారి దగ్గరకు తీసుకొనిరా" అని చెప్పింది. అతను 'సరే, మహా ప్రసాదం' అని పోయి, చిలుకను, కాకిని, వెంట బెట్టుకొని సభా గృహంలోకి ప్రవేశించాడు.

హిరణ్య గర్భుడు తన చేతి సైగతో వారినిద్దరినీ తగిన ఆసనాలతో కూర్చోబెట్టి, యోగక్షేమాలు అడిగి, వాళ్లు ఎందుకు విచ్చేశారో చెప్పమన్నాడు. అప్పుడు ముందుగా చిలుక హంసకు ఎదురుగా నిలబడి, నిర్భయంగా ఇలా అన్నది - "ప్రభూ! నేను వచ్చిన సంగతిని తమకు స్పష్టంగా విన్నవించుకుంటాను. జంబూద్వేపానికి అధిపతి అయిన 'చిత్రవర్ణుడు' అనే నెమలిరాజు పంపిస్తే మీతో మీతో దూతగా మాట్లాడి పోదామని వచ్చాను. నేను చెప్పబోయే దాని స్థిర చిత్తంతో వినవలసినది. బాగా మనసుపెట్టి, ఏకాగ్ర చిత్తంతో మా రాజు చెప్పిన పలుకులను తమరు చెవిన వేసుకోండి- "మీ కర్పూర ద్వీపంతో సహా ఇక్కడున్న చిన్న చిన్న దీవులన్నీ మా జంబూద్వీపం క్రిందికే వస్తాయి. గనుక, మీరంతా యీర్ష్యా సూయలు మాని, మాకు పన్ను చెల్లించుకోవాల్సి ఉన్నది. అందువల్ల, మాన-ప్రాణాలపై ఏ మాత్రం ఆశ ఉన్నా, నువ్వు కూడా ఔను -కాదు అనే సంకోచం మాని, వెంటనే మా దేశానికి వచ్చి, మా పాదాలను శరణువేడి, యీ సంవత్సరం మొదలుకొని ప్రతి ఏడూ కప్పం చెల్లించు. ఇట్లా మెల్లగా చెబితే నీ మనస్సుకు అంగీకారం కుదరకపోతే, ఇదిగో - నేను వస్తున్నాను - యుద్ధంలో నీ మదాన్ని అణచివేసి, యీ భూమిని కాపాడేందుకు వేంచేస్తున్నాను. దమ్ముంటే ఎదురు నిలచి పోరాడు" -అని మీకు తెలియపరచి, మీ సమాధానం ఏమిటో కనుక్కొని రమ్మని నన్ను ఇక్కడికి పంపాడు. నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండేందుకు వీలు లేదు. వెంటనే సమాధానం‌ ఇచ్చి నన్ను సాగనంపేది. మా నెమలి రాజు అసాధారణ బలశాలి. అంతులేని శత్రు సమూహాల గర్వాన్నైనా పాతాళానికి అణగద్రొక్క గల ధైర్య సాహసాలు ఆయన సొంతం. ఎవరినైనా శిక్షించాలన్నా, క్షమిం‌చాలన్నా ఆయనకే చెల్లుతుంది. కనుక నా మాట విని ఆ నెమలిరాజును శరణు వేడండి. ఆయన మాట వినకపోతే ఇక తమరికి నూకలు చెల్లినట్లే - తమరి కీర్తి క్షణంలో నశించిపోతుంది" అన్నది.

దాని మాటలు విని హంసరాజు తోక త్రొక్కిన త్రాచు మాదిరి చర్రున లేచి నిలబడ్డాడు. రోషంతో ఆతని పెదవులు అదిరాయి. అతని శరీరం అద్భుతంగా వన్నెలీనింది - మేఘం ఉరిమినట్లు ఉరుముతూ అతను "ఎట్టెట్టా! ఇవాళ్ల ఏవో క్రొత్త సంగతులు వింటున్నామే!" అంటూ సభ నలువైపులా కలియజూస్తూ "ఆహా! చూశారా, అందరూ?! ఇవాళ్ల ఎట్లాంటి వింతలు పుట్టుకొచ్చాయో! ఒక పనికిమాలిన నెమలి ఎక్కడో ఉన్నదట, దానికి రాజపక్షి అయిన హంస పాదాక్రాంతం కావాల్సి ఉన్నదట! ఔరా! ఏమి వింత మాటలు! అట్లా జరిగితే ఇక ప్రపంచంలోని సింహాలన్నీ శాశ్వతంగా కోతుల పాదసేవ చేసుకుంటూ తమ జీవితాల్ని పావనం చేసుకుంటాయి కాబోలు! తన శక్తి ఏపాటిదో తెలీక అజ్ఞానాంధకారం అలుముకోగా చిత్రవర్ణుడు అసాధ్యపు కోరికలు కోరుతున్నాడు. ఇంతకు ముందెన్నడో 'వాళ్లను-వీళ్లను గెలిచానుగా' అనుకొని, క్రొవ్వెక్కి, ఇక్కడా అట్లా కొద్దిలోనే పోతుందను కొని విర్రవీగుతున్నాడు గాని, 'హిరణ్యగర్భుని ప్రతాపం' అనే మంటకు తన ప్రాణాలను ఆహుతి చెయ్యాల్సి వస్తుందని కొంచెం కూడా ఆలోచిస్తున్నట్లు లేడు" అని అరిచాడు.

అట్లా కోపంతో కరకుగా మాట్లాడుతున్న రాజువైపుకు చూడలేక, ఆ సభలోని వారంతా భయావహులైపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోవటం మొదలుపెట్టారు.

అంతలో ముఖంలోకి ఉత్తుత్తి కోపాన్ని తెచ్చుకొన్న కాకి- చిలుక ప్రక్కనే కూర్చొని ఉన్నది కాస్తా హంసరాజు మనోభావానికి తగినట్లు తటాలున లేచి నిలబడి, ఆ చిలుకమీదికి దూకేందుకు సిద్ధమైనట్లు నటిస్తూ హంసరాజుతో సవినయంగా "మహారాజా! చావు దగ్గరపడి, యీ మూర్ఖుడు నిండు సభలో కన్నూమిన్నూ కాననట్లు, లేని చనువు తెచ్చుకొని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే, వినలేక నా చెవులు బ్రద్దలౌతున్నాయి. వీడికి ఎన్ని గుండెలు లేకపోతే, ఇట్లాంటి దుష్టపు మాటలు వెలువరించే సాహసం చేస్తాడు?! ఇట్లాంటి వాడిని 'దూత' అని దయచూడకూడదు.

అధములలోకెల్లా అధముడైన వీడు ఖచ్చితంగా మరణశిక్షకు పాత్రుడు. నేను తమరి సేవకుడిని - ఇక్కడ నిలచి ఉండగా ఇక తమరికి వేరు శ్రమ లేదు. తమరిక మాట్లాడకండి - యీ తుంటరిని నేను ఇదిగో - క్షణాల్లో అంతమొందిస్తాను. నా యీ విన్నపాన్ని అంగీకరించి తమరు నాకు అనుజ్ఞ ఒక్కటీ ఇవ్వండి చాలు" అన్నది.

అట్లా కాకి కదిలి చిలుక మీదికి దూకబోగా, దానికి అడ్డు వస్తూ, చక్రవాక మంత్రి ఇట్లా అన్నది. "ఆగు, ఆగు - ముందు చూపులేని అవివేకపు పని కూడదు. ధర్మాన్ని బూడిదలో కలుపకు. దూతగా వచ్చిన వాడి ప్రాణాలు తీయటం సరైన పనికాదు. 'సరైన దానిని విడచిన రాజు దగ్గర సంపదే నిలువదు'అని ధర్మం తెలిసిన పెద్దలు చెబుతుంటారు.

మనస్సు, మాట, పని - యీ మూడింటిలోనూ ప్రాణుల పట్ల ఏకొంచెం కూడా చెడు భావనా లేకుండా ఉండటాన్నే 'శీలం' అంటారు. సమస్తానికీ ఆధారం శీలమే. శీలం వల్లనే ధర్మం నిలబడుతుంది, ధర్మం వల్ల సత్యము, సత్యం వల్ల మంచి నడవడి కలుగుతాయి. మంచి నడవడిక వల్ల బలం‌ వస్తుంది. బలం వల్ల సంపద లభిస్తుంది. దానివల్ల కోరినవన్నీ లభిస్తాయి. 'ఆవు -ఆవు కొట్లాడి మధ్యలో లేగదూడ నడుము విరిచినట్లు, 'రాజు - రాజు పోట్లాడి నడుమున దూత ప్రాణాలకు ఎసరు పెడతారా? ఇట్లా చేస్తే అన్ని అనర్థాలూ సంభవిస్తాయి. దూత అన్నవాడు ఎప్పటికీ అవధ్యుడే (-చంపకూడని వాడే). అతడు 'తనని ఎవరూ చంపరు ' అన్న భావనతోనే కదా, తనకు చెప్పి పంపిన పలుకులను నోరుదాచుకోకుండా బయటికి చెప్పేది? అంతే తప్ప, తన తక్కువదనాన్ని ఇతరుల గొప్పదనాన్ని సొంతగా చెబుతాడా? ఇతని మాటలలో తప్పునెంచకు, దూత మాటలకు కోపం తెచ్చుకోవటాన్ని మించిన అవివేకం మరొకటి లేదు. మూర్ఖులకు కోపం ముక్కుమీదే ఉంటుందట. కోపం వచ్చిన వాడు 'ఏది చేయదగిన పని-ఏది చేయరాని పని' అన్న జ్ఞానం కోల్పోయి, చంపకూడని వాళ్లను కూడా చంపుతాడు; చివరికి తనకు తానే కష్టం కొని తెచ్చుకుంటాడు.

అన్ని పాపాలకూ ఆధారం కోపమే, అందుకనే కదా, పెద్దలు చెప్పేది- "బుద్ధిమంతుడు క్షమాజలాలతో కోపపు అగ్నిని ఆర్పాలి" అని?! క్షమా గుణమే అన్ని విధాలైన సమృద్ధికీ ఆధారం. కోపాన్ని మెచ్చుకొనటం సరైనది కాదు. క్రూరమైన పని వీరులకు తగినదెలా అవుతుంది?" అని మందలించింది.

ఆ విధంగా నీల వర్ణుడి ఆవేశాన్ని కొంచెం తగ్గించే సరికి అతడు గట్టిగా శ్వాసను వదిలి - కుండలోకి నొక్కిన పాము మాదిరి రోజుతూ నిలబడ్డాడు. తన మృదువచనాల వల్ల తేరుకొని, కోపాన్ని కొంత అదుపులోకి తెచ్చుకున్న హంసరాజుతో మంత్రి ఇలా అన్నది- (ఏమన్నదో మళ్ళీ చూద్దాం...)