రాజు కి ఏడు ఏళ్లు. రెండో తరగతి చదువుతున్నాడు.

ఒక రోజు వాళ్ళ మాస్టారు హోమ్‌వర్క్ ఇచ్చారు. తరువాతి రోజున " రాజూ హోమ్‌వర్క్ చేసావా?" అని అడిగారు మాస్టారు. నిజానికి రాజు హోమ్‌వర్క్ చేయలేదు. కానీ "మాష్టారు ! హోమ్‌వర్క్ చేసాను- కానీ పుస్తకాలు తేవడంమర్చిపోయాను" అని అబద్ధం చెప్పాడు.

"సరే, రేపు మర్చిపోకుండా తీసుకురా!" అని చెప్పారు మాస్టారు.

ఆ తరువాత రోజు కూడా పుస్తకం మర్చిపోయానని అబద్ధం చెప్పాడు రాజు. అయితే మాస్టారు ఆ మాటని నమ్మలేదు- రాజు బ్యాగుని తెప్పించి దానిలో హోంవర్కు పుస్తకం కోసం వెతికారు. పుస్తకం అందులోనే దొరికింది! మాస్టారు పుస్తకం తెరచి చూడగానే అర్థం అయిపోయింది- రాజు హోంవర్క్ చేయనేలేదు! పైపెచ్చు చేశానని అబద్ధం ఆడాడు!

అప్పటి నుంచి అందరూ రాజుని నమ్మటం మానేశారు.

ఇంకో రోజు అమ్మకి బాగోలేక "రాజూ!నాకు ఆరోగ్యం బాగా లేదు- కాస్త బయట చెత్త ఊడ్చు"అంది. బుద్ధిగా "సరేనమ్మా" అన్న రాజు, చెత్త ఊడవకుండానే బయటికెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాడు. చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చిన రాజుని అడిగింది అమ్మ- "బయట ఊడ్చావా,లేదారా రాజూ.. అసలు ఊడ్చినట్లే లేదు?" అని.

"ఊడ్చానమ్మా" అని జవాబిచ్చాడు రాజు ఠకీమని. ఇట్లా అతనికి అబద్ధాలు ఆడటం అలవాటయిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులతోటీ, బడిలో మాస్టారుతోటే కాక, వాళ్ళ స్నేహితులతోటి కూడా అబద్ధాలు ఆడసాగాడు అతను.

ఇంక అతనిని ఎవరు నమ్ముతారు? ఎవ్వరూ అతన్ని ఆటలలోకి చేర్చుకో వటం లేదు.

కొంత కాలానికి అర్థమైంది రాజుకు- తను చేస్తున్నది తప్పు. అబద్ధాలు ఆడకూడదు. అట్లా తన తప్పు తాను తెలుసుకున్న రాజు ఆ నాటినుండి అన్నీ నిజాలే చెప్పసాగాడు. అయినాగానీ అతన్ని ఎవరూ నమ్మడం లేదు. తను ఎంత నిజం పలికినా అందరూ "ఊరుకోరా, అబద్ధాలు చెప్పకు" అనే అంటున్నారు.

దాంతో‌ అతనికి చాలా బాధ వేసింది. ఏడుపొచ్చింది. చివరికి ఒకరోజున రాజు ఏడుస్తూ వాళ్ల అమ్మ దగ్గరికి వచ్చి "అమ్మా! నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు. నేను 'అబద్ధాల కోరు' అంటున్నారు అందరూ. నాకు ఏడుపొస్తున్నది" అన్నాడు.

రాజు వాళ్ళ అమ్మ అతన్ని ఓదార్చుతూ అతనికి 'నాయనా పులి వచ్చె ' కథని గుర్తుచేసింది. "చూసావా రాజూ? నాయనా పులి కథలో లాగానే నిన్ను ఎవరూ నమ్మడం లేదు. కానీ నువ్వు నిరాశ పడకు-ఎవరేమన్నా సరే బాధ పడకుండా నిజాలే చెబుతూండు. కొన్ని రోజులకు అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు- ఏం కాదు " అని చెప్పింది అమ్మ.

రాజు అమ్మ చెప్పినట్లు చేశాడు. తన స్నేహితులు ఎవరు ఏమన్నా కూడా తను నిజాలే చెబుతూ‌పోయాడు. కొన్నాళ్ళకి "రాజు నిజాయితీ పరుడు " అని అందరికీ అర్థమైంది.