
అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దాని పేరు శశకం. ఒక రోజున అది మెల్లగా షికారుకు బయలుదేరింది.

"ఓయ్.. శశకం, జాగ్రత్త! మన అడవిలోకి భల్లూకం అని ఓ ఎలుగుబంటి కొత్తగా చేరుకున్నది. అది నీలాంటి చిన్న జంతువుల్ని చాలానే ఏడిపిస్తున్నదని విన్నాను" అన్నది చెట్టు మీదున్న కోతి- మర్కటం మామ.
"అది నన్నేమీ అనదులే, మామా! అయినా నేను ఎక్కువ దూరం పోను" అన్నది శశకం.
అంతలోనే తడుముకుంటూ దాని మీదికి వచ్చేసింది భల్లూకం. వికటంగా నవ్వుతూ "దొరికావు! రెండు రోజులనుండీ నీ కోసమే చూస్తున్నాను. ఇవాళ్ళ నా ఆహారం నువ్వే!" అన్నది.
కుందేలు గజ గజ వణికింది. దానికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చేతుల్తో విసురుకోవటం మొదలు పెట్టింది. గబ గబా ఆలోచించింది.

"నువ్వు ఏ కుందేలు కోసం చూస్తున్నావు? చెమట పట్టిన కుందేలు కావాలా, చెమట లేని కుందేలు కావాలా, నీకు?" అని అడిగింది ఎలుగుబంటిని.
"చెమట పట్టింది నాకెందుకు? చెమట లేని మంచి కుందేలే కావాలి నాకు!" అన్నది భల్లూకం.

"మరైతే ఈ చెట్టును ఊపు. కొంచెం గాలి తెప్పించు. నిన్ను చూసేసరికి భయంతో నాకు చెమటలు పట్టిపోతున్నాయి" అన్నది కుందేలు, చెట్టుమీద ఉన్న మర్కటం మామకు సైగ చేస్తూ.
ఎలుగుబంటి తన బలం చూపించుకుందామనుకున్నది. కొబ్బరి చెట్టు మొదలును పట్టుకొని దబగబా ఊపింది.
చెట్టు జుయ్ జుయ్ మని ఊగింది. చెట్టుమీద ఉన్న మర్కటం మామ కూడా చెయ్యి చేసుకున్నాడు.

దాంతో కొబ్బరి బోండాలన్నీ జలజలా రాలాయి. మూడునాలుగు కాయలు వచ్చి నేరుగా భల్లూకం తలమీదే పడ్డాయి. దెబ్బకు ఎలుగుబంటి దిమ్మ తిరిగి పడిపోయింది.
తేరుకున్న శశకం పరుగో...పరుగు!