అనగనగా దట్టమైన ఒక అడవి ఉండేది. చాలా‌ పెద్ద అడవి అది. పెద్ద పెద్ద చెట్లు, రకరకాల పక్షులతో అది ఎప్పుడూ‌ కళకళలాడుతూ ఉండేది.

అందులో ఒక పెద్ద చెట్టు మీద నివసించేవి, నెమలి, చిలుక, కోడి. ఆ మూడూ మంచి మిత్రులు.

ఆ సంవత్సరం విపరీతమైన ఎండలు కాసాయి. జంతువులు త్రాగే నీళ్ళకు కూడా సమస్యగా ఉంది. అట్లాంటి ఆ సమయంలో దూరంగా- అడవికి అటు ప్రక్కన- దట్టంగా పొగ వెలువడటం గమనించింది నెమలి.

"ఏమిటా పొగ? మంట కాదుగదా?!" అన్నది అనుమానంగా.

"అయిఉండచ్చు..." అన్నది చిలుక

"మన దగ్గర కాదులే, పట్టించుకోకండి!" అన్నది కోడి.

"కాదు. వెళ్ళి చూసి రావాలి! అది నిజంగానే మంట అయి ఉండచ్చు. గాలి ఇటే వీస్తున్నది. కొంచెం వెచ్చగా, కమురు వాసనతోటి ఉన్నది గాలి!" అన్నది నెమలి.

"కానీలే, అది మన వరకూ‌ వచ్చినప్పుడు చూసుకుందాం!" అన్నది చిలుక.

అయినా నెమలి ఆగలేదు. పొగ వెలువడుతున్న ప్రాంతం చాలానే దూరంగా ఉన్నది. అయినా అది అక్కడి వరకూ ఎగిరి వెళ్ళి చూసింది. నిలువెత్తు మంటలతో, రేగిన కార్చిచ్చుతో అక్కడ అంతా భీభత్సంగా ఉన్నది.

వెనక్కి తిరిగి వచ్చిన నెమలి పెట్టే బేడా సర్దుకుంటూ చిలుక, కోడిలతో‌ అన్నది: "మీరు కూడా బయలు దేరండి. మనం ఇక ఇక్కడ ఉండటం భద్రం కాదు. ఏ రోజునైనా మనం ఉండే ఈ ప్రదేశం అంతా తగలబడిపోతుంది. ఇక్కడ ఉంటే మనం, మన పిల్లలు అందరం మాడి మసి ఐపోతాం!" అని.

"అయ్యో! అంత తొందరేమీ లేదులేమ్మా! సమస్య అసలు ఇక్కడి వరకూ రాకపోవచ్చు. మన ప్రాంతం ఖచ్చితంగా తగలబ-డుతుందని నమ్మకమేంటి? ఊరికే పిల్లల్నీ జెల్లల్నీ వెంట వేసుకొని కాని ప్రాంతాలకు వలస పోవటం బరువు కదా; అంతదాకా వస్తే అప్పుడు చూడచ్చులే!" అన్నది చిలుక.

"అవును. అసలు మన ప్రాంతం ఏనాడూ తగలబడలేదు. ఇప్పుడూ ఏమీ కాదు!" అన్నది కోడి.

"లేదు. నేను మాత్రం నిలిచేది లేదు. మా పిల్లల్ని తీసుకొని ఆ కొండల అవతల ఉన్న సరస్సు దగ్గరికి పోతున్నాను. మీరూ నాతో పాటే రావాలని నా కోరిక. రండి. కలిసి పోదాం!" అన్నది నెమలి.

చిలుక, కోడి కదలలేదు. నెమలి గట్టిగా నిట్టూర్చి, తన పిల్లల్ని తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్ళిపోయింది.

కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం అవుతుండగా చిలుక తన గూటి చుట్టూ నీళ్ళు చల్లి, గబగబా సామాన్లు సర్దటం మొదలు పెట్టింది.

"ఏమైంది?!" అన్నది కోడి.

"అడవి తగలబడుతున్నది! మన ప్రాంతానికి ఇంకా రాలేదు గానీ, అటు గుట్ట అవతల మొత్తం తగలబడుతున్నది. రాత్రి ఏదో‌ ఒక సమయానికి మంట ఇటు వచ్చేస్తుంది!! గాలి కూడా బలంగా ఉంది. పద- పిల్లల్ని కదుల్చు! రెండు మూడు సార్లు తిరిగితే తప్ప అందరం‌ అవతలికి చేరుకోలేం! ఇప్పటికే ఆలస్యం అయింది!" అన్నది చిలుక హడావిడి పడుతూ.

"ఊరుకో. మంట ఇటు వైపుకు రాదు. కావాలంటే నువ్వు పో!" అన్నది కోడి, నిద్రకు ఉపక్రమిస్తూ.

చిలుక గూటి చుట్టూ‌ నీళ్ళు చల్లి, తన పిల్లల్లో కొన్నిటిని తీసుకొని ఎగిరింది. వాటిని దూరంగా వదిలి వెనక్కి వచ్చేసరికి మంటలు చుట్టూతా బాగా క్రమ్ముకున్నాయి. మిగిలిన పిల్లల్ని పట్టుకుని ఎగరబోయిన చిలుకకు ఎటు పోయినా మంటలే ఎదురయ్యాయి. అయినా పిల్లల్ని వదలక, అది ఎలాగో ఒకలాగా, సగం కాలిన రెక్కలతో బయటపడిందది.

మొండి తనం కొద్దీ, బద్ధకానికి లోనై గూటిలోనే కునుకుతూ కూర్చున్న కోడి మటుకు మంటల్లో మాడి మసైపోయింది! ప్రాణాంతకమైన సమస్యల గురించి ముందుచూపుతో వర్తించటం ఉత్తమం.

సమస్యలు వచ్చి చుట్టుముట్టాక బుద్ధిచాతుర్యంతో బయట పడటం మధ్యమం.

ఇక 'ఏమీ కాదులే' అని అలసత్వంతో చేతులు ముడుచుకొని కూర్చోవటం అధమం.

ఉత్తమమైన పనులు చేద్దాం. తప్పకపోతే మధ్యమంగా‌ ఉందాం. అధములుగా మటుకు ఏనాడూ ఉండద్దు.