1 ఒకప్పుడు 'యాంకా' అనే పిల్లవాడొకడు ఉండేవాడు. అతనికి అమ్మానాన్నలు ఇద్దరూ లేరు. అడవికి దగ్గరగా ఉన్న పూరి గుడిసెలో ఒంటరిగా నివసించేవాళ్ళు అతను, అతనికి తోడుగా ఒక పిల్లి. ఆ పిల్లి అతనికి బాగా మాలిమి కూడా అయింది. అతను ఎక్కడికి వెళితే అది కూడా అతని వెంట వెళ్ళేది.

ఒకరోజు యాంకా కట్టెల కొట్టేందుకు బయలుదేరాడు. ఎండిన చెట్లను వెతుక్కుంటూ అడవిలో చాలా లోపలికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం పిల్లి కూడా అతన్ని అనుసరించింది.

యాంకా కొన్ని పుల్లలను ఏరుకుని కట్ట కట్టి తీసుకు వస్తున్నాడు. మధ్య దారిలో అలిసిపోయి మోపుని క్రింద పడేసి అక్కడున్న ఒక మొద్దుపైన కూర్చున్నాడు. "ఓహ్! ఓహ్!” అంటూ గాలి పీల్చు-కున్నాడు.

ఆ మాటలు అతని నోటినుండి వెలువడటమే తరువాయి, పొడవాటి గడ్డపు ముసలాయన ఒకడు ఆ చెట్టు ప్రక్క నుండి వచ్చి యాంకాకు ఎదురుగుండా నిలబడ్డాడు.

ఆశ్చర్యపోయి చూస్తున్న యాంకాతో “యువకుడా, నన్నెందుకు పిలిచావో చెప్పు!" అన్నాడు ముసలాయన.

యాంకా ముసలాయన వైపు చూసి బెరుకు గొంతుతో "తాతా! నేను నిన్ను పిలవలేదే!" అన్నాడు.

“ఏంటీ, పిలవలేదా? నాకేమీ వినికిడి లోపం లేదు! నువ్వు 'ఓహ్, ఓహ్' అని నా పేరుతో రెండు సార్లు పిలిచావు! ఇప్పుడు నీ కోరిక ఏమిటో చెప్పెయ్యి త్వరగా. తీర్చేసి వెళ్ళిపోతాను- పనులున్నై" అన్నాడు తాత.

“కోరికలా? నాకు అట్లాంటివేమీ లేవు గాని, బాగా ఆకలిగా ఉంది. నీ దగ్గరేమైనా రొట్టె ముక్కలుంటే ఇవ్వు చాలు" అన్నాడు యాంకా.

ముసలాయన చెట్టు ప్రక్కకి వెళ్ళిపోయి మరునిమిషంలోనే ఒక పాత్రలో రొట్టెలు, మరో పాత్రలో క్యాబేజీ పులుసు తెచ్చి ఇచ్చాడు. యాంకా ఆవురావురుమంటూ తిన్నాడు వాటిని.

"తాతా నీ విందుకు శతకోటి వందనాలు. ఇంత మంచి పదార్థాలను నేను నా ఏనాడూ తిని ఉండలేదు!" అన్నాడు యాంకా. ముసలాయన నవ్వుకుంటూ చెట్టు వెనక్కి వెళ్ళి కనపడకుండా పోయాడు. యాంకా తన కట్టెల మోపును తీసుకుని ఇంటికి చేరాడు.

కొన్ని రోజుల తర్వాత అతనికి మళ్ళీ ఆ తాతని పలకరించి, అతనిచ్చే రొట్టెలు తినాలనిపించింది. 'వెళ్ళి పిలుస్తాను; వస్తే వస్తాడు; నా అదృష్టాన్ని బట్టి' అనుకుని, మళ్ళీ ఒకసారి ఆ మొద్దు ఉన్న ప్రదేశానికి వెళ్ళి. “ఓహ్, ఓహ్" అని పిలిచాడు.

వెంటనే చెట్ల ప్రక్కనుండి బయటకి దుమికాడు ముసలాయన. “యువకుడా, నన్నెందుకు పిలిచావో చెప్పు!" అంటూ.

“తాతా! చాలా ఆకలిగా ఉంది, ఒక రొట్టె ఉంటే ఇస్తావా?” అడిగాడు యాంకా.

రెప్పపాటులో మాయమై మళ్ళీ ప్రత్యక్షమైన ముసలి వాడు రొట్టెలు, క్యాబేజీ పులుసు తెచ్చి ఇచ్చాడు మళ్ళీ

ఇలా చాలా సార్లు యాంకా ముసలివాడి దగ్గరకి వెళ్ళటం, రొట్టెలు తినటం జరిగాక, చివరికి తాత చెప్పేసాడు- "చూడు యువకుడా! విను, నన్ను ఇక మీదట కలత పెట్టవద్దు. ఇప్పటికే ముసలి-వాడిని అయ్యాను. మోకాళ్ళు సహకరించటం లేదు. ఇదిగో, నా ఈ ముక్కుపొడుం భరిణ తీసుకో. దీనిలో నా సేవకుడు ఉంటాడు. నీకు ఏం కావాలన్నా ఇది తెరువు. లోపల నుండి అతనొస్తాడు. నీకు ఎట్లాంటి కోరిక ఉన్నా అతనికి చెప్తే చాలు- తీరుస్తాడు" అని ఒక భరిణ ఇచ్చాడు.
యాంకా ఆ భరిణని తీసుకుని గుండెనిండా తాతని తల్చుకుంటూ ఇంటికి చేరాడు.

ఇంటికెళ్ళాక దాన్ని తెరవగానే అందులో నుండి ఒక చిన్నవాడు బయటకి దూకాడు. చాలా చురుగ్గా, తెలివైనవాడిలా ఉన్నాడతను- “అన్నా, నీకేం కావాలో చెప్పు" అన్నాడు.

“తమ్ముడూ, తినడానికి ఏమైనా పెడతావా?” అన్నాడు యాంకా. రెప్పపా-టులో అతనికి భోజనం తయారుచేసి ఇచ్చి, మళ్ళీ భరిణలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు చిన్నవాడు. 2 జీవితం హాయిగా జరిగిపోతోంది యాంకాకి. ఉన్నవాడు ఊరుకోక, 'ఈ విశాల ప్రపంచం అంతా తిరిగి వస్తాను' అనుకున్నాడు. అంతకు ముందు అతనెప్పుడూ ఆ అడవి చుట్టు ప్రక్కలు దాటి ఎక్కడకీ వెళ్ళలేదు.

అయితే ఒకసారి అలా నిర్ణయించుకోగానే తన భరిణని, పిల్లినీ తీసుకుని బయలుదేరి పోయాడు; చాలా గ్రామాలు, నగరాలు తిరిగాడు; చాలా వింతలు చూశాడు.

ఒకరోజు అతను అట్లా సముద్రం అంచున నడుస్తుండగా ఒక చిన్న చేపపిల్ల ఒకటి, అలల తాకిడికి బయటకి వచ్చి పడింది. యాంకాకి కనబడే సరికే అది చనిపోయే స్థితిలో ఉన్నది. యాంకా గభాల్న ఆ చేపపిల్లని తీసి నీళ్ళలోకి వదిలాడు.

ఆ చిన్ని చేప తోకని ఆడిస్తూ కొద్దిగా నీళ్ళు తాగి, తల పైకెత్తి- "ఓ యువకుడా, నన్ను కాపాడినందుకు దండాలు. ఎప్పుడో నీకు నేను సహాయం చేసే రోజు వస్తుంది. అప్పుడు బాకీ తీర్చుకుంటాను" అంది.

ఆ మాటలు విన్న యాంకా పిల్లి చేప పిల్లను చూస్తూ "మ్యావ్, మ్యావ్" అంది. చేపపిల్ల కిలకిలా నవ్వింది. నాకు భరిణలో నా చిన్ని తమ్ముడున్నాడుగా సహాయానికి! అయినా ఈ చేపపిల్ల నాకేం సహాయం చేయగలదు!? అని అనుకున్న యాంకా ఆ చేప మాటలకి నవ్వుకుని తన యాత్ర కొనసాగించాడు.

పోగా పోగా ఒక పట్టణం వచ్చింది. అప్పటికి సాయంకాలం దాటింది.. చీకట్లు అలుముకుంటున్నాయి..

యాంకాకు చాలా అలసటగా ఉంది. విశ్రాంతి కోసం చుట్టూ చూశాడు. కొండ మీద పెద్ద మహలు కనిపించింది. "ఆహా, ఆ మహల్ ఎంత బాగుంది? కానీ వాళ్ళు నన్నెందుకు రానిస్తారు? ఏదైనా సత్రం కోసం చూసుకోవాలి..” అనుకుంటూ ముందుకు వెళ్ళాడు.

సత్రం యజమానితో "ఇక్కడ నేను బస చేయవచ్చా?!” అని అడిగాడు.

“ఎందుకు చేయకూడదు? మీలాంటి వాళ్ళ కోసమే కదా మా రాజుగారు ఇది కట్టించింది?!" అన్నాడు సత్రం యజమాని.

“ఓ, అయితే దారిలో నేను చూసిన ఆ మహల్ మహారాజుగారిదేనా?!" అన్నాడు యాంకా.

“అవును కాని మా రాజుగారు ప్రస్తుతం చాలా దిగులులో ఉన్నారు. ఆయన ఒక్కగానొక్క కూతురును 'మాయాదీవి భూతంగాడు పట్టుకుని పోయాడు. ఎవరైతే తన బిడ్డని ఆ మాయావి నుండి కాపాడి తీసుకొస్తారో వాళ్ళకి రాజ్యంతోబాటు ఇచ్చి తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్ళి చేస్తానని రాజుగారు ప్రకటించారు. అయినా ఇంతవరకూ ఆమెని ఎవ్వరూ తీసుకు రాలేకపోయారు. రాజేమో దిగులుతూ మంచం‌ పట్టాడు.. యాంకాకి చెప్పాడతను.

“నేను ప్రయత్నిస్తాను" అన్నాడు యాంకా.

“వద్దు, ప్రయత్నించి ఎంతో మంది యువకులు సముద్రం పాలయ్యారు. మాయాదీవి భూతం సముద్రంలో తాడిచెట్టంత ఎత్తున్న అలలని సృష్టిస్తుంది. ఎంత గజ ఈతగాడు పోయినా ఆ అలల క్రింద పడి మునిగిపోవలసిందే!" చెప్పాడు సత్రం యజమాని.

'నా బంగారు ముక్కు పొడుం భరిణ తమ్ముడుంటే ఏదైనా సాధించవచ్చు' అనుకున్నాడు. సత్రం యజమానికి చెప్పాడు- "నువ్వు రేపు వేకువనే మహల్‌కి వెళ్ళి రాజుగారితో చెప్పు- పొద్దు పొడిచే-టప్పటికి రాకుమార్తె ఆయన ముందు ఉంటుందని!" అని.

3

వేకువనే లేచి, రాజుగారికి యాంకా గురించిన వార్తను చేరవేయడానికి వెళ్ళాడు సత్రం యజమాని. అతను వెళ్ళిపోయాక యాంకా తన భరిణని తెరిచాడు: చిన్నవాడు బయటకి గెంతి "అన్నా, నీ కోరికేమిటో చెప్పు!" అన్నాడు.

“రాజభవనం నుండి మాయాదీవిలో రాజకుమార్తె ఉన్న చోటికి ఒక వంతెన నిర్మించు తమ్ముడూ! ఆ వంతెన మీదుగా నేను ప్రయాణించేందుకుగాను ఆరు గుర్రాలతో కూడిన బండి కూడా ఒకటి తెచ్చిపెట్టు" అన్నాడు అతనితో.

కళ్లు మూసి తెరిచేంతలో అక్కడొక వంతెన ప్రత్యక్షమైంది. ఆరు గుర్రాల బండి ఒకటి ఆ వంతెన ముందు కాచుకుని ఉంది. చిన్నవాడు కోరికలు తీర్చగానే భరిణలోకి వెళ్ళిపోయాడు.

తక్షణం బండి ఎక్కి ప్రయాణమైపోయిన యాంకా త్వరలోనే మాయాదీవికి చేరుకు-న్నాడు. అక్కడ ఒక ఒంటి స్తంభపు మేడ కిటికీలో నుండి రాజకుమారి సముద్రంలో ఏర్పడిన వంతెనను, బండిలో ఉన్న యాంకాను వింతగా చూస్తున్నది! ఆ మేడ వాకిలికి అడ్డంగా పడుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు మాయావి!

“రాజకుమారీ! నేను నిన్ను మీ తండ్రిగారి వద్దకు చేర్చడానికి వచ్చాను. వచ్చి బండి ఎక్కండి" అన్నాడు యాంకా, కిటికీ దగ్గర నిలబడి.

"నేను రాలేను! తలుపు దగ్గర అడ్డంగా పడుకుని ఉన్నాడు, మాయావి!" అంది రాకుమారి.

"కిటికీలో నుండి దూకు! నేను ఇటునుండి పట్టుకుంటాను" అని చేతులు చాపాడు యాంకా.

ఆమె సరేనన్నది. అయితే సరిగ్గా దూకే సమయంలో‌ ఆమెకు ఎక్కడలేని భయం వేసింది. ఆ భయంలో ఓ వెర్రికేక వేసింది! అది వినగానే మాయావి నిద్రలేచి అటూ ఇటూ చూసాడు. ఈలోగా రాకుమారిని ఎక్కించుకొని మెరుపు వేగంతో గుర్రపు బగ్గీని తోలసాగాడు యాంకా.

అయితే మాయావి వెంటనే వాళ్ల వెనకనే పరిగెత్తుకు రాసాగాడు! వాడి అరుపులకు వంతెన మొత్తం అల్లాడసాగింది. వాడి నోటి నుండి పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి!

అయితే వాడికంటే చాలా ముందు ఒడ్డుకు చేరుకున్నాడు యాంకా. వెంటనే రాజకుమారిని క్రిందకి దించి రాజభవనంలోకి పంపేసి తలుపు వేసేసాడు. వెంటనే తన ముక్కుపొడుం భరిణ తెరిచి, "వంతెనని కూల్చేయ్" అని అరిచాడు. భరిణలోని చిన్నవాడు ఒక్క క్షణంలో వంతెనని కూల్చేసాడు. వంతెన కూలిపోయింది; మాయావి సముద్రంలో పడి కొట్టుకుపోయాడు!

అయితే ఆ హడావిడిలో ఒక తప్పు జరిగిపోయింది: యాంకా చేతులోంచి భరిణ జారి సముద్రంలో పడిపోయింది!

4 ఒడ్డునే దిగాలుగా కూర్చుని బాధపడు-తున్న యాంకా దగ్గరకి వచ్చారు- రాజుగారు, రాజకుమారి.

రాజుగారు అన్నారు ఆనందంతో- "బాగు బాగు, యాంకా! నువ్వు గొప్ప సాహసవంతుడివి. నా రాజ్యానికి వారసుడివి నువ్వే. ఇక రాకుమారిని వివాహమాడు; రాజ్యాన్ని పరిపాలించు" అన్నాడు.

అయితే యాంకా మనసు మనసులో లేదు. అతని మనసంతా సముద్రంలో మునిగిపోయిన ముక్కుపొడుం భరిణ మీదనే ఉన్నది. అంతలో అకస్మాత్తుగా అతని పిల్లి సముద్రంలోకి చూస్తూ మ్యావ్, మ్యావ్" అని అరిచింది. మరుక్షణం యాంకా కాపాడిన బుల్లిచేప బయటకి వచ్చింది, సముద్రంలోంచి!

“యాంకా! పాపం, నీ భరిణ నీళ్ళల్లో పడిందటగా, పిల్లి మామ చెప్తున్నాడు. అయితే నా దగ్గర బోలెడన్ని భరిణలు ఉన్నాయి. నీదేదో నాకు తెలియదు కాబట్టి ఒక్కొక్కటీ బయటకి విసిరేస్తాను, నీ భరిణేదో నువ్వు గుర్తించి తీసుకో" అని నీటిలోకి వెళ్ళిపోయింది చేపపిల్ల.

అట్లా పోయిన ఆ చేపపిల్ల రకరకాల భరిణల్ని బయటకి విసిరింది: వెండివి, బంగారపువి, వజ్రాలవి, వైఢూర్యాలవి.... ఆఖరున యాంకా పొడుం పెట్టె బయటకి వచ్చింది. దాన్ని తీసుకుని మిగిలిన పెట్టెలన్నింటినీ మళ్ళీ సముద్రంలోకి విసిరేస్తూ “నీకు అనేక కృతజ్ఞతలు, చిట్టి చేపా! 'నువ్వు నాకేం సహాయం చేయగలవులే' అని చిన్న చూపు చూసాను. నన్ను క్షమించు" అన్నాడు యాంకా. బుల్లిచేప కిలకిలా నవ్వుతూ నీళ్ళ లోపలకి వెళ్ళిపోయింది.

అటుపైన రాకుమారిని వివాహమాడిన యాంకా ముక్కుపొడుం పెట్టెలోని తమ్ముడి సహాయంతో ఎన్నో ఘనకార్యాలను సాధించాడు.

ప్రతి సంవత్సరం యాంకా ఒక్కసారైనా అడవిలోకి వెళ్ళి "ఓహ్ఓహ్" చేత్తో రొట్టెలు, క్యాబేజీ పులుసు తిని కృతజ్ఞతలు చెప్పుకుని వస్తాడు. వస్తూ వస్తూ చేపపిల్లని కూడా చూసి, ధన్యవాదాలు చెప్పుకుంటాడు!