సూర్యుడు తన కిరణాలను బాస్కెట్ బాల్ ఆటస్థలం మీదకు సూటిగా వదులుతున్నాడు. మా ప్రాంగణంలో ఉన్న బాస్కెట్ బాల్ ఆటస్థలం చాలా‌ పెద్దది. దాని చుట్టూ కంచె కూడా లేదు. అందుకని అక్కడ సూర్య దేవుడే కాదు; వాయుదేవుడు కూడా చాలా బలంగా వీస్తూ ఉంటాడు.

నేను ఆరోజు ఉదయాన్నే అక్కడ బాస్కెట్ బాల్ సాధన చేస్తున్నాను. బాస్కెట్ చాలా ఎత్తులో ఉంది- నేనేమో‌ ఇంకా చిన్నదానినే; అందుకని బంతిని బాస్కెట్ లో పడేట్లు వేయటం పెద్ద పనిగా ఉంది. ఒక్కోసారి బంతి బాస్కెట్ వరకూ పోకుండానే క్రింద పడిపోతున్నది. ఒక్కోసారి అది బాస్కెట్టును దాటి బయటికి పడి పోతున్నది.

'ఇట్లా కుదరదు' అని గట్టిగా అరిచి నేను బంతిని బలంగా విసిరాను. ఆ బంతి వేగంగా పోయి బాస్కెట్ ఉన్న బల్లకు తగిలింది- అంతే వేగంగా వెనక్కి తిరిగి వస్తూ ఓ చెట్టుకు కొట్టుకున్నది- ఎగిరి మరో వైపున ఉన్న కాలవలో పడింది!

నేను గబుక్కున పోయి కాలువలోకి చూశాను.. కాని అక్కడ నా బంతి కనబడలేదు! "ఏమైందది, ఇక్కడే పడిందే?"

అంతలో నాకు అక్కడ ఒక ఎర్ర కాగితం కనబడ్డది- దాని మీద ఏదో రాసి ఉన్నది..

తీసుకొని చదివాను. అందులో ఇలా ఉంది:

"నియతీ, నువ్వు నీ బంతి కోసం వెతుకుతున్నావు కదూ?! నాకు తెలుసు. నేను దాన్ని చూశాను, తీసుకు వెళ్తున్నాను. నీకు నీ‌ బంతి అంటే చాలా ఇష్టం కదూ?! మరి అంత మంచి బంతి, నీ బంతి నీకు కావాలంటే ఏం చేయాలి? శివుడి గుడికి రా, ఇవాళ్ల రాత్రి పదింటి కల్లా. పది కంటే ముందుగా వస్తే లాభం ఉండదు- ఎందుకంటే తొమ్మిది గంటల సమయంలో అక్కడ చాలా మంది మనుషులు ఉంటారు కదా, అంతమంది మనుషుల్లో నేను ఎవరో నీకు తెలియదు మరి. అందుకని పది గంటలకే రావాలి.

అక్కడ చాలా చెట్లు ఉంటాయి తెలుసుగా? అయితే వాటిలో కేవలం ఒకే ఒక చెట్టు మీద సముద్రం రంగు గాలిపటం ఒకటి ఎగురుతూ ఉంటుంది. దాని దగ్గరకు రా.

ఇంకో సంగతి- అక్కడంతా నల్ల పిల్లులు, పాములు తిరుగుతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండు- ఎక్కువ కదలకు మరి, ఉంటాను"

నేను విచారంగా ఇంటికి నడిచాను. నడుస్తూ నడుస్తూ దారిలో చాలాసార్లు ఊరికెనే నిలబడిపోయాను. ఉత్తరం గురించి ఆలోచించాను. మొదట ఒకసారి "ఆ ఉత్తరాన్ని ఎవరో నవ్వులాటకు వదిలిపెట్టి ఉంటారు- వేరే ఎవరికోసమో అయి ఉంటుంది.." అనుకున్నాను.

తర్వాత అనిపించింది: "కాదు- ఉత్తరం రాసిన వాళ్ళకు నేను తెలుసు. నా పేరు తెలుసు. నా బంతి పోయిన సంగతీ తెలుసు.." ఒక విషయం నన్ను చాలా చికాకు పెట్టింది: "వీళ్ళెవరోగానీ నా బంతిని ఎత్తుకుపోయారు- అంటే దొంగలన్నమాట. మరి ఆ దొంగ మనుషులకి నా పేరు ఎలా‌తెలిసింది?!.."

కానీ మళ్ళీ ఓసారి ఉత్తరం చదివినప్పుడు వాళ్లెవరో మంచివాళ్లలాగానే అనిపించారు- ఏమంత దొంగలు కాదేమో. నా బంతిని ఊరికే నవ్వులాటకి తీసుకున్నారేమో..!"

"నా బంతి నాకు కావాలమ్మా" అనుకున్నాను గట్టిగా "నా బంతి-నా హక్కు. దానికోసం నేను ఎక్కడికైనా వెళ్తాను"

ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ "బంతి ఏది?" అని అడిగింది. చెప్పక తప్పలేదు. నేను ఉత్తరం సంగతి చెప్పేసరికి మా అమ్మ తల చేతుల్లో పెట్టుకుని కూర్చుంది: "నాకు చాలా భయంగా ఉంది నియతీ! నువ్వు అస్సలు వెళ్లటానికి లేదు!" అంది.

నాకు చాలా కోపం వచ్చింది. "ఏమీ అవ్వదు- నేను వెళతాను!" అనుకున్నాను.

ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయేవరకు ఆగాను.

తరువాత మెల్లగా బీరువాలోనుండి ఫ్లాష్ లైట్ తీసుకున్నాను. చప్పుడు చేయకుండా వెళ్ళి, నా స్టేషనరీ అలమారలోకి చూసాను. నా‌ ప్రత్యేకమైన స్టేప్లర్‌ను బయటికి తీశాను. నిజంగానే అది చాలా ప్రత్యేకమైన వస్తువు. దానిలో స్టేప్లర్ ముక్కలు ఉండవు- పొడవాటి వైరుచుట్ట ఒకటి ఉంటుంది. దాన్ని నొక్కగానే ఆ వైరు కొస ఒకటి మెరుపు వేగంతో ముందుకు దూకుతుంది. కాగితాల దొంతర ఎంత లావున్నా సరే, దాన్ని పొడుచుకుంటూ‌ ముందుకు సాగుతుంది. చివరికంటా పోగానే, మనం‌ లాగినప్పుడు మళ్ళీ అంత వేగంతోటీ వెనక్కి వచ్చి తెగిపోతుంది!

నేను గుడి దగ్గరికి మెల్లగా నడిచాను. అక్కడ అంతా చాలా చీకటిగా ఉంది. నా ఫ్లాష్‌లైటు వెలుతురును అక్కడి చెట్లన్నిటి మీదికీ‌ ప్రసరింపజేసాను.

అంతలో అకస్మాత్తుగా అక్కడ ఒక మనిషి కనిపించాడు- అతని చేతిలో నా బాస్కెట్ బాల్ బంతి ఉన్నది! "ఇతనెప్పుడు వచ్చాడు, ఇక్కడికి? ఇంతవరకూ నాకు కనిపించలేదేమి?-"

ఆ మనిషి వెనక ఉన్న చెట్టు మీద సముద్రం రంగు గాలిపటం ఒకటి ఎగురుతూ కనిపించింది. "ఇతనే. ఉత్తరంలో రాసాడు ఇవన్నీ?!" అనుకున్నాను.

నేను అతని దగ్గరికి వెళ్ళి ఏమాత్రం భయం లేకుండానే అతనితో కొంచెం సేపు మాట్లాడాను. అతని చేతిలో ఉన్న బంతిని అందుకోబోయాను. అంతలోకే ఒక గోతాం సంచీ లాంటిదేదో నా తలమీదకు పడింది. కొంచెం సేపు నేను దాన్ని తీసేసేందుకు ప్రయత్నించాను.. "ఆ తర్వాత ఏమైంది?"

ఏమో తెలీదు- కొంతసేపటి తరువాత చూసుకుంటే నేను ఒక గదిలో ఉన్నాను. నా తలమీద ఇంకా గోతాం సంచీ అలానే ఉంది. అంతలో అడుగుల శబ్దం అయ్యింది. ఆ మనిషి నా దగ్గరికి వచ్చాడు. నా తల మీదినుండి గోతాన్ని తీసేసాడు.

"ఎందుకు, ఇట్లా చేస్తున్నావు?" అని అరిచాను నేను.

"లేకపోతే నీకు గాలి సరిగ్గా ఆడట్లేదు; చెమట పోస్తున్నది; నువ్వు ఏమీ మాట్లాడట్లేదు- అందుకని!" అన్నాడు అతను నింపాదిగా. అతని ముఖంలో‌ ఒకలాంటి విషం కనిపించింది. "నువ్వు 'పోయావు' అని మీ తల్లిదండ్రులకు రాస్తాను. వాళ్ళు నాకు రెండు కోట్లు ఇస్తేనే నేను నిన్ను వదిలేది!" అని పెద్దగా నవ్వాడు.

"నేను ఊరుకునేది లేదు. నిన్ను జైల్లో పెట్టిస్తాను. ఏం చేస్తానో చూడు" అని నేను కోపంతో అరిచాను.

అతను మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. "నువ్వంటే నాకు చాలా ఇష్టం నియతీ! ఎందుకంటే నువ్వే కద, నా రెండు కోట్లు?!" అని మళ్ళీ నవ్వాడు గట్టిగా.

'వాడు నన్ను చంపేస్తాడేమో' అని భయం వేసింది నాకు. "కానీ అట్లా చెయ్యడు- ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి. అమ్మానాన్నలకి ఫోన్ చేసి ఉంటాడు వాడు. వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేంతవరకూ నన్ను జాగ్రత్తగానే చూసుకుంటాడు" అనుకున్నాక కొంచెం నిద్రరావటం మొదలైంది. నేను మెల్లగా వెతుక్కున్నాను- నా ఫ్లాష్‌లైటు కనిపించలేదు గానీ స్టేప్లర్ మటుకు నా జేబులోనే భద్రంగా ఉన్నది- అంతవరకూ మేలే.

నేను పొద్దున్నే లేచే సరికి ఒక అబ్బాయి ఎవరో నా గదిని శుభ్రం చేస్తున్నాడు. వాడి చేతిలో ఒక పళ్ళెమో ఏదో ఉన్నది. "మీ అమ్మా, నాన్నా మంచివాళ్ళు. వాళ్లు డబ్బుతో వస్తున్నారట. వీడు నన్ను పట్టుకొచ్చినప్పుడైతే మా అమ్మా-నాన్నా అసలు రానే లేదు. దాంతో వీడు నన్ను ఇట్లా పనిమనిషి లాగా పెట్టుకున్నాడు. పనివాడి అవసరమే లేకపోతే అసలు చంపేసి ఉండేవాడేమో" అన్నాడు వాడు. నేను అసహ్యించుకుంటూ "హుఁ!" అన్నాను.

ఐదు నిముషాల తరువాత మళ్ళీ మొదటివాడు వచ్చాడు- "నీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నువ్వు అంత బుర్ర లేనిదానివని తెలియలేదు. ఒక్క చిన్న బంతికోసం నా దగ్గరికి వస్తావని అస్సలు అనుకోలేదు నేను. ఉత్తరం చూసుకొని వచ్చినందుకు థాంక్స్. ఇప్పుడు నేను కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు; కొత్త ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు- అంతా నీవల్లే!" అని పెద్దగా నవ్వాడు.

అకస్మాత్తుగా నాకు ఓ ఐడియా తట్టింది. నేను కూడా నవ్వుతూ ఆయన దగ్గరికి వెళ్లాను- "నీకు కూడా ధన్యవాదాలు చెప్పాలి- నువ్వు నన్ను ఏమీ చేయలేదు" అని అనేసి, వాడు ఇంకేదో అనేలోగా నా స్టేప్లర్‌తో వాడి పొట్టకు గట్టిగా ఒక పిన్ను వేసేసాను. స్టేప్లర్లోంచి బయటికొచ్చిన వైరు వాడి పొట్టలోంచి దూరి, వీపులోంచి బయటికొచ్చింది; మళ్ళీ వీపులోంచి దూరి పొట్టలోకి...!

కళ్ళుమూసి తెరిచేంతలో జరిగిపోయిన ఈ పనికి వాడు కళ్ళు తేలేసాడు. రాక్షసుడిలాగా అరుస్తూ, అటూ ఇటూ గెంతుతూ, వాడిలోకి దూరిన వైరును లాక్కునే ప్రయత్నం చేసాడు. వాడెంత ప్రయత్నం చేస్తే వైరు అంత గట్టిగా బిగుసుకున్నది.

ఆ టైములో వాడి చేతికి దొరికి ఉంటే నా పని అయిపోయేది. నేను తప్పించుకొని ఒక్క దూకున కిందికి వెళ్ళి రోడ్డు వరకూ‌ పరుగెత్తాను. అటుగా పోతున్న ఓ ఆటోను పిలిచి, తొందర తొందరగా నా అడ్రస్స్ చెప్పేసి ఆటో ఎక్కాను.

ఆటోలో పోతూ నేను అమ్మ గురించి ఆలోచించాను. "తన మాట విని ఉంటే ఇదంతా జరిగేది కాదు.."

అంతలో మా ఆటోకి అటువైపుగా ఒక కారు పోతూ కనిపించింది. మా అమ్మా-నాన్నా అందులో ఉన్నారు. నేను ఆటోలోంచి కేకలు పెట్టే సరికి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. నన్ను చూసి సంతోషంతో ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్లకి సంగతంతా చెప్పగానే నాన్న పోలీసులకు ఫోను చేసి సంగతంతా వివరించాడు. "మీ అమ్మాయి స్టేప్లర్ వేసి మంచిపని చేసింది. వాడిప్పుడు ఎక్కడికీ పోడు. మిగిలిన సంగతి మేం చూసుకుంటాం-మీరు ఇంటికి పోండి" అన్నారు పోలీసులు.

ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు అమ్మ వాళ్ళు. ఇల్లు చేరాక క్షమించమని అడిగాను మా అమ్మను. "నేను ఎప్పుడూ నీమాట వింటానే, ఇంకెప్పుడూ ఇట్లా చెయ్యను" అని మా అమ్మకు చెప్పాను.