అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఈ నలుగురిలో ఒకరు మేస్త్రీ, ఒకరు చిత్రకారుడు, ఒకరు శిల్పి, ఇక నాలుగోవాడు పూజారి.

అయితే పాపం వీళ్ళకు సొంత వూరిలో పని లేకుండా అయ్యింది. దాంతో "ఉన్న ఊళ్ళో‌ బ్రతకటం‌ అనే యోగం‌ అందరికీ‌ ఉండదు- మనకు ఇక్కడ నప్పేటట్లు లేదు. వేరే ఎక్కడికైనా పోతే నయం" అన్నాడు పూజారి.

"ఎక్కడైనా పెద్ద పెద్ద పనులు జరిగే చోట ఉండాలి. రాజుగారు గొప్ప నిర్మాణాలు చేపట్టుతుంటారు. అక్కడికి వెళ్తే మనందరికీ పనులు చిక్కుతై" అన్నాడు శిల్పి.

"నిజమే- రాజాస్థానంలో‌ తప్ప నేను గీసే చిత్రాలకు గుర్తింపు ఉండదు- అక్కడికి వెళ్దాం" అన్నాడు చిత్రకారుడు. "రాజధానిలో‌ పెద్ద పెద్ద ఇళ్ళు కడుతుంటారు- నాకూ‌ అక్కడేదో‌ పని దొరక్కపోదు. పదండి" అన్నాడు మేస్త్రీ.

పూజారి నిర్ణయించిన ముహూర్తానికి నలుగురూ బయలుదేరి రాజధాని బాట పట్టారు. ఆ రోజుల్లో‌ ఇప్పటిలాగా బస్సులూ, స్కూటర్లూ లేవు- నలుగురూ అడవి దారుల్లో నడుచుకుంటూ పోసాగారు. పగలంతా నడక; అలసట; సాయంత్రం ఏదో‌ ఒక పల్లెలో బస; విశ్రాంతి. ఇలా చాలా రోజులు సాగింది. దారిలో తిందామని వాళ్ళు తెచ్చుకున్న సామాన్లన్నీ దాదాపు ఖాళీ అయిపోయాయి. ఎక్కడైనా ఏమైనా కొనుక్కుందామన్నా చేతిలో‌ డబ్బులు లేని స్థితి.

ఆ సమయంలో ఒక రోజున వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తుండగానే సాయంత్రం అయ్యింది. దాంతో వాళ్ళు నలుగురూ‌ అక్కడే వంట చేసుకొని, సమీపంలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని భోజనం చేసారు. ఆ సరికి చీకటి పడింది. "అందరం తలా ఒక చెట్టు చూసుకొని పడుకుందాం" అన్నాడు పూజారి, చీకట్లోకి చూస్తూ.

"చెట్టు క్రింద పడుకుంటే అంతే బాబయ్యా, పైకెక్కాలి" అన్నాడు మేస్త్రీ.

"అందరం నిద్రపోతే సమస్య కావొచ్చు- క్రూరమృగాలూ అవీ వస్తే కష్టం" అన్నాడు చిత్రకారుడు.

"వంతులు వేసుకొని కాపలా కాద్దాం. మిగతావాళ్లంతా నిద్రపోవచ్చు. పుల్లలు తెచ్చి నెగడు వేస్తే ఏ మృగాలూ రావు. అది ఆరిపోకుండా చూసుకుంటే చాలు" అన్నాడు శిల్పి.

మొదటి వంతు మేస్త్రీకి వచ్చింది. మేస్త్రీ మేలుకుని వున్నాడు; మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారు. నెగడు బాగా వెలుగుతున్నది. కొద్దిసేపటికి మేస్త్రీకి నిద్రరావటం మొదలైంది. “ఇట్లా ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని ఉంటే నిద్ర మేలుకోవడం కష్టం! ఏదో ఒకటి చేస్తుంటే తప్ప శరీరం సహకరించదు” అని చుట్టూ చూసాడు అతను. అక్కడికి దగ్గర్లో మంచి మంచి రాళ్ళు కనిపించాయి. వాటిని తీసుకొచ్చి, ప్రక్కనే ఉన్న వేపచెట్టు క్రింద ఒక చిన్న అరుగు, దానిపైన ముద్దుగా ఓ చిన్న ఇల్లు కట్టాడు అతను. ఆ సరికి తన వంతు సమయం గడిచింది- శిల్పిని నిద్రలేపి తను పడుకున్నాడు.

శిల్పి చూసాడు- మేస్త్రీ నిర్మించిన ఇల్లు ముచ్చటగానే ఉంది- కానీ "పూర్ణత్వం‌ లేదు" అనుకున్నాడు. "ఖాళీగా ఉంటే బాగా లేదు" అని అటూ ఇటూ చూసాడు. దగ్గర్లోనే ఒక మంచి రాయి కనిపించింది. దాన్ని చెక్కటం మొదలెట్టాడు- అద్భుతమైన గణపతి బొమ్మ ఒకటి తయారైంది. దాన్ని ఆ ఇంటిలో‌ ఉంచాడు. "ఇప్పుడు బాగుంది" అనుకున్నాడు. ఆ సరికి తనవంతు సమయం అయిపోయింది- చిత్రకారుడిని నిద్రలేపి, తను పడుకున్నాడు.

చిత్రకారుడు చూసాడు- నెగడు వెలుగు-తున్నది. ఆ వెలుగులో‌ కొత్తగా కట్టిన చిట్టి ఇల్లు, అందులోని గణపతి విగ్రహం కనిపించాయి. "చాలా చక్కగా ఉన్నై" అనుకున్నాడు. "అయినా ఎంత బాగున్నా, రంగులు వేస్తేనే కదా, వీటికి అందం?! అప్పుడింక ఇవి చాలా చాలా బాగుంటాయి" అని తన ప్రతిభతోటి వాటికి అద్భుతమైన రంగులు వేశాడు. ఇక దాంతో అతని వంతు సమయం అయిపోయింది- పూజారిని నిద్రలేపి తను పడుకున్నాడు.

పూజారి లేచి చూసే సరికి అక్కడో చక్కని చిట్టి ఇల్లు, అందులో నెలకొని ఉన్న అద్భుతమైన గణపతి, వాటికి సజీవత్వాన్ని ఇచ్చే ఆకర్షణీయమైన రంగులు కనిపించాయి. "ఇకనేమి, ఈ అడవి తరించింది! ఇక్కడ భగవంతుడు మూర్తీభవించాడు" అని అతను అడవి పూలు, అడవి పండ్లు తెచ్చి, రకరకాల స్తోత్రాలతో పూజలు చేయటం‌ మొదలు పెట్టాడు.

అయితే అక్కడికి దగ్గర్లోనే ఓ గ్రామం ఉంది. గ్రామస్తులు ఉదయాన్నే‌ అటుగా వెళ్తూ విన్నారు- "ఇదేందబ్బా! ఇక్కడేవో‌ మంత్రాలు వినిపిస్తుండాయి?" అని అక్కడికి వచ్చి చూస్తే "రాత్రికి రాత్రి వెలిసిన గణపతి!" ఇంక అందరూ అక్కడికి వచ్చి మొక్కుకున్నారు. ముచ్చటగా ఉన్న ఆ గుడినీ, ప్రాణం ఉట్టిపడేట్లున్న మూర్తినీ, చక్కని ఆ రంగుల్నీ, పవిత్ర వాతావరణాన్నీ చూసి మైమరచి పోయారు. వాళ్ళని చూసి ముచ్చటపడిన నలుగురు మిత్రులూ "ఇవాల్టికి ఇక్కడే ఉండి, రేపు ఉదయాన్నే వెళ్దాం" అని అక్కడే ఆగిపోయారు.

అయితే "అడవిలో వెలిసిన గణపతి" కథ ఒకరినుండి ఒకరికి అందింది- సాయంత్రం అయ్యేసరికి ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఊళ్ళన్నిటి నుండీ జనాలు కుప్పలు తెప్పలుగా, తిరనాళ్ళకు వచ్చి పడ్డట్లు వచ్చారు. అందరూ బారులు తీరి దేవుడిని దర్శించుకున్నారు. "అయ్యలూ, మీరు ఇంత శక్తి గలవాళ్ళు- మీరు ఇక్కడే ఉండాల, కొంతకాలం" అని ఎవరికి వాళ్ళు పండ్లు, తినే పదార్థాలు, బియ్యం, డబ్బులు ఇంకా ఏవేవో కానుకలు ఇచ్చారు మిత్రులకు. చీకటి పడేసరికి ఆ పల్లెల పెద్దలంతా కలిసి వచ్చారు- "మా ఊళ్ళన్నీ మీ వల్ల పావనమైనాయి. మీరు సరేనంటే మేమందరం చందాలు వేసుకొని ఇక్కడే ఓ గొప్ప గుడిని నిర్మిస్తాం. దానికి మీరే సారధులు!" అన్నారు.

మిత్రులు నలుగురూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, సంతోషంగా సరేనన్నారు.

ఆరోజు రాత్రి చక్కగా భోంచేసాక, నలుగురూ మాట ముచ్చట్లు చెప్పుకుంటూండగా "..కానీ- నేనెప్పుడూ గుడిని కట్టలేదు" అన్నాడు శిల్పి.

"నేను ఎన్నడూ గుడిలో ఉంచే విగ్రహాలను చెక్కలేదు- ఇప్పుడు ఒక్కసారిగా భవ్యమందిరపు విగ్రహాలు అన్నీ చెక్కమంటున్నారు- ఎట్లాగో ఏమో.." అన్నాడు మేస్త్రీ.

"ఏదో ఊరికే రంగులు వేసాను గానీ, ఇంత పెద్ద నిర్మాణానికి రంగుల నిర్ణయం- నావల్ల అవుతుందా?" అన్నాడు చిత్రకారుడు.

"సరిగా పూజ చేయాలంటే నేను చదవాల్సిన శాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలీదు- అందుకని మనం ఒకసారి మనం ఊరికి వెళ్ళొద్దాం. మనకు విద్య నేర్పిన గురువులను సంప్రతిద్దాం- పని పరంగా వాళ్ళిచ్చే సలహాలను పాటిస్తే తప్పులు జరగవు-" అన్నాడు పూజారి.

మిత్రులందరికీ ఆ ఐడియా నచ్చింది. "ఒక్కసారి మా పెద్దల్ని కలిసి వచ్చేస్తాం- రాగానే పని మొదలెడతాం. ఆలోగా మీరు విరాణాలు సేకరిస్తూండండి" అని పల్లె పెద్దలకు చెప్పి నలుగురూ సొంత ఊరు చేరుకున్నారు.

శిష్యులు చెప్పిందంతా విన్నారు వాళ్ల గురువులు. "నువ్వు చదివిన స్తోత్రాలు తప్పు- క్రొత్తగా కట్టిన మందిరం అభివృద్ధిలోకి రావాలంటే ఫలానా మంత్రాలు చదవటం, ఈ ఈ తంతులు చేయటం తప్పని సరి- అవన్నీ తెలీకుండా నువ్వసలు పూజలెలా చేసావు?" కసిరాడు పూజారికి విద్య నేర్పిన గురువు.

"గుడి నిర్మాణానికీ, ఇంటి నిర్మాణానికీ చాలా‌ తేడాలుంటాయి. వాస్తు లెక్కలు ఉంటాయి- నువ్వు అన్నింటా తప్పావు!" అన్నాడు మేస్త్రీకి విద్య నేర్పిన గురువు.

"చుట్టూ పచ్చని వాతావరణం ఉన్నప్పుడు ముదురు రంగులు బాగుంటాయి- నువ్వు అన్నీ తేలిక రంగులు వేసావు- చాలా వికారంగా ఉండి ఉంటుంది" అన్నాడు చిత్రకారుడి గురువు.

"గుడిలో ఉంచే విగ్రహానికుండాల్సిన లక్షణాలు లేశ మాత్రంగానైనా లేవు, నువ్వు చెక్కిన బొమ్మలో. విగ్రహాలు నాట్యశాస్త్రానికి అనుగుణంగా కదా, ఉండాల్సింది?" అన్నాడు శిల్పికి విద్య నేర్పిన గురువు.

కొంచెం చిన్నబుచ్చుకున్న మిత్రులు నలుగురూ "మీరూ మాతో రండి- అందరం కలిసి మందిరం‌ నిర్మించి వద్దాం" అన్నారు గురువులతో.

వాళ్ళెవరూ ఒప్పుకోలేదు- "లేదు- మీకు అర్థం అయినట్లు లేదు. మమ్మల్నడిగితే అసలు ఇట్లా సొంతగా పని చేసేది ఏదీ పెట్టుకోకండి. పోయి రాజుగారి దగ్గర ఏవైనా చిన్న పనులు వెతుక్కోండి" అన్నారు.

మిత్రులు నలుగురూ కొంచెం సేపు ఆలోచించి, వచ్చిన త్రోవనే వెనక్కి తిరిగి వెళ్ళారు.

సంవత్సరం తిరిగే సరికి, వాళ్ల సారధ్యంలో నిజంగానే చాలా గొప్ప మందిరం ఒకటి తయారైంది. చుట్టు ప్రక్కల పల్లెల్లోంచే కాక, సుదూరంగా ఉన్న రాజధాని నుండి కూడా, అనేకమంది ఆ గుడిని, విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. అందరూ వాళ్ళ పనితనాన్ని, మందిర నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకుంటుంటే మిత్రులు "ఇదంతా మా గురువుల గొప్పతనమే- మాదేమీ లేదు" అనేవాళ్ళు వినయంగా.

విక్రమ్‌కు ఈ కథ చెప్పిన బేతాళం "ఇంతకీ విక్రమ్‌- అసలు ఈ నలుగురు మిత్రుల సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. పనులన్నీ తప్పుగా చేసినవాళ్ళు, గురువుల మాట వినకుండా వెనక్కి పోయి మందిర నిర్మాణం ఎందుకు తలపెట్టినట్లు- గురువులు చెయ్యమన్నది అది కాదు గదా? ఇకపోతే, వాళ్ళు అన్ని తప్పులు చేసినా జనాలు వాళ్ళని శ్లాఘించటం ఏమిటి? పనితనంతో బాటు సరైన కళను మెచ్చేవాళ్ళూ తగ్గిపోతున్నారనటానికి ఇది ఒక తార్కాణం కాదా?! చేసేదంతా చేసాక, మరి వాళ్ళు 'ఇదంతా గురువుల గొప్పతనమే' అనటమేమిటి?" అని అడిగాడు.

విక్రం చిరునవ్వు నవ్వి "శిష్యులకు విద్య గరపటం, వాళ్ళ పనిలో తప్పొప్పులు గుర్తించి చెప్పటం గురువుల ధర్మం. ఈ కథలో నలుగురు గురువులూ తమ శిష్యుల తప్పుల్ని ఎత్తి చూపటమే కాక, సరైన మార్గదర్శనం కూడా చేసారు. తెలివైన శిష్యులు తమ తప్పుల్ని ఆ క్షణంలోనే గుర్తించారు; సరైన పద్ధతులేమిటో కూడా అర్థం చేసుకున్నారు. కనుకనే ధైర్యంగా వెళ్ళి మందిర నిర్మాణం చేపట్టారు. తమ పని ఎలా ఉండాలో తెల్సుకున్నారు కనుక అటుపైన వాళ్ళు మందిరాన్ని పూర్తిగా శాస్త్రబద్ధంగా నిర్మించి ఉంటారు. అలాంటప్పుడు అది అందరి ప్రశంసలనూ అందుకోవటంలో‌ ఆశ్చర్యమేమీ లేదు" అన్నాడు.

అలా విక్రంకు మౌనభంగం కలగటంతో బేతాళం అతని పట్టు నుండి చటుక్కున విడివడి, మళ్లీ చెట్టుకొమ్మ మీదికి చేరుకున్నది!