అనగనగా ఒక ఇంట్లో‌ ముగ్గురు పెద్దవాళ్ళు- నాన్న, అమ్మ, నానమ్మ ఉన్నారు.

అదే ఇంట్లో ముగ్గురు చిన్నవాళ్ళు- రవి (అన్న), మాయ (అక్క), శీల (చెల్లి) కూడా ఉన్నారు.

నాన్న న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఆఫీసు గదిలో.

"నేను కూరగాయలు కొనడానికి మార్కెట్‌కి వెళ్తున్నాను" అందరికీ చెప్పింది అమ్మ.

"నాకు కాన్ఫరెన్సు ఉంది. నన్ను మాట్లాడించకండి" అన్నాడు నాన్న ఆఫీసు గదిలోంచి. ఇంకో విషయం గుర్తుకువచ్చినట్లుగా చెప్పాడు- "ఇంకో సంగతి- ఇవాల్టి దినపత్రికలో వార్త చూసారా? పులిపిల్ల ఒకటి ఏదో మన ఇంటి వెనకనే ఉన్న జంతు ప్రదర్శనశాల నుండి తప్పించు-కున్నదట. మన ఇంటికే ఏమైనా వస్తుందేమో, చూస్కోండి మరి!" నాన్న ఈ సంగతి చెప్పి గట్టిగా నవ్వాడు.

"అవునా?! నిజంగానా?!" అన్నది శీల, ఆట మొదలుపెడుతూ.

"దానికేమీ‌ పని లేదా? మనింటికే ఎందుకొస్తుంది? మాయ కోసమో, శీల కోసమో రావాలి వస్తే-" అన్నాడు రవి, తలుపు తీసుకొని క్రికెట్ ఆడుకునేందుకు పోతూ.

నానమ్మ గదిలో పడుకొని మొద్దు నిద్ర పోతున్నది. మాయ పోయి నానమ్మ-తోబాటు మంచం మీద పడుకున్నది.

శీల తన బొమ్మలన్నింటినీ ఒక్కటొక్కటిగా నానమ్మ గదికి చేరుస్తూ "నా టిగ్గర్ బొమ్మ ఏదీ?" అని ఇల్లంతా వెతుక్కున్నది.

శీల దగ్గర ఒక పెద్ద పులి బొమ్మ ఉంది. అది మెత్తగా, బొచ్చు బొచ్చుగా, బరువుగా ఉంటుంది. దానికి 'టిగ్గర్' అని పేరు పెట్టుకున్నదది.

"ఇదిగో, బంగారూ!‌ మాట్లాడకుండా వెతుక్కోమ్మా, ఎక్కడో‌ ఉంటుంది అది" అరిచాడు నాన్న, ఆఫీసు పనిలోంచే. కొంచెం సేపటికి ముందుగదిలో పడి ఉన్న టిగ్గర్ కనిపించింది శీలకు. "ఉన్నదిలే, దొరికింది" చెప్పింది అందరికీ. అయినా వినేందుకు అక్కడ ఎవ్వరూ లేరు.

మిగిలిన బొమ్మలన్నిటినీ నానమ్మ గదిలోకి చేర్చాక శీల మళ్ళీ టిగ్గర్ కోసం చూసింది-

అది ముందు గదిలో లేదు! "నా టిగ్గర్ మళ్ళీ ఎక్కడికో పోయింది" అరిచింది శీల.

"ఊరుకోమ్మా, ఎక్కడో‌ ఉంటుంది చూడు, కొంచెం వెతుక్కో, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్!" అరిచాడు నాన్న.

మిగిలిన బొమ్మలన్నిటితోపాటు టిగ్గర్ కూడా నానమ్మ గదిలో కనిపించింది శీలకు.

"ఉన్నదిలే, దొరికింది" చెప్పింది గట్టిగా.

"ఉండక ఎక్కడికి పోతుంది? పాపా, ఆ బొమ్మలన్నిటినీ తీసి అలమరలో క్రింది అరలో పెట్టేయమ్మా. ఇంటికి బంధువులు వస్తారు" అరిచాడు నాన్న.

శీల నానమ్మ గదిలో అలమార తలుపు తీసి, ఒక్కొక్క బొమ్మనీ అందులోకి చేర్చింది.

"నా టిగ్గర్ మళ్ళీ కనబడటం లేదు" అరిచింది.

"ఊరుకో శీలా. అలమర క్రింది అరలో‌కి చేరుకొని ఉంటుంది అది కూడా. చూడు" అరిచాడు నాన్న ఆఫీసులోంచి.

శీల వంగి చూసింది. టిగ్గర్ కూడా మిగిలిన బొమ్మల్తో పాటు అలమర క్రింది అరలో కనిపించింది.

"ఉన్నదిలే, దొరికింది" చెప్పింది గట్టిగా.

"అదేనమ్మా, నేను అనేది! సరిగ్గా వెతుక్కోవాలి అంతే" అరిచాడు నాన్న.

"టిగ్గర్ ఇన్నిసార్లు ఎందుకు పోతున్నది? ఆలోచించాలి" అన్నది మాయ, నానమ్మ మంచం మీదే లేచి కూర్చొని.

ఇంతలో ఎక్కడినుండో 'గుర్ గుర్ గుర్..' అని శబ్దం వస్తున్నది.

మంచం మీద కూర్చొని ఉన్న మాయ హటాత్తుగా అరిచింది "నాన్నా!"అని.

శబ్దం టక్కున ఆగిపోయింది.

అంతలోనే మళ్ళీ మొదలైంది. ఈసారి "ఠక్..ఠక్..ఠక్.." మని గట్టిగా తలుపు కొడుతున్నట్లు శబ్దం కూడా‌ తోడైంది. "గుర్ గుర్.. ఠక్... ఠక్..."

మాయా చాలా సీరియస్‌ అయిపోయింది. తరువాత "శీలా! ఇటురా! నీ టిగ్గర్ ఏది?" అడిగింది.

"నానమ్మ అలమరలో ఉంది- తీయాలా?" అని అటువైపుకు పోబోయింది.

మాయ టక్కున తనని ఆపింది. "శీలా ఇదిగో- అలమర తలుపు తీయకు. నీ మంచి కోసమే చెబుతున్నాను. ఇక్కడే ఆగు. నాన్న చెప్పినట్లు, పులిపిల్ల మన ఇంట్లోకే దూరింది. అది ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలుసు" అంటూనే గట్టిగా అరిచింది "నాన్నా! జూ వాళ్లకి ఫోన్ చేయండి నాన్నా! మన ఇంట్లో పులిపిల్ల ఉన్నదని చెప్పండి. గబుక్కున రమ్మనండి. అది బయటికి వచ్చేస్తే కష్టం!" అని.

"అవునా, ఎక్కడ ఉంది పులిపిల్ల?" అడిగింది శీల ఉత్సాహంగా.

"అది నా బల్ల కింద ఉంది!" అన్నది మాయ, ఒక్క క్షణం ఆలోచించి.

శీల వెతికి చెప్పింది. "ఇక్కడ లేదు- నాకు తెలుసు, ఎక్కడ ఉంటుందో! అది అమ్మమ్మ మంచం కింద ఉండి ఉంటుంది!" అని. "అవును. నువ్వెళ్ళి అక్కడ వెతుకు- నాన్నా! ఫోన్ చేసారా?"

"చేసాను. రెండు నిముషాలలో చేరుకుంటారు. ఇక్కడే ఉన్నారట, మన ఇంటి ప్రక్కనే" నాన్న అరిచాడు ఆఫీసులోంచి.

ఆలోగా శీల నానమ్మ మంచం దగ్గరికి వెళ్లి వెతికింది. మాయతో గుసగుసలాడింది. "అరె! ఇక్కడ కూడా లేదే!" అని. "ముందు గదిలో ఉండి ఉంటుంది- పోయి చూడు!" అన్నది మాయ.

శీల ముందు గదిలో అంతా వెతికింది. తర్వాత అమ్మవాళ్ల గదిలో వెతికింది. "పులి అక్కడెక్కడా లేదు- అలమారలో ఉండి ఉంటుంది" అలమార తలుపు తీయబోయింది.

మాయ చటుక్కున దానికి అడ్డం వచ్చి నిలబడింది. "కాదు. కిచెన్ సింక్ కింద వెతుకు- కనిపిస్తుంది" అన్నది. "నాకు తెలిసి పైన ఉండవచ్చేమో కూడా! "

తరువాత కొంత సేపటికి బయటి నుండి ఎవరో వింతగా అరిచిన శబ్దం ఒకటి వినిపించింది. "భం-ప-భం-ప-భం... పూ-ఫ-పూ-ఫ-పూ!" వెంటనే నానమ్మ గది అలమార తలుపు 'ఠకఠక' మని కొట్టుకోవటం మొదలెట్టింది.

అయితే ఆలోగానే జంతు ప్రదర్శనశాల వాళ్ళు ఇంట్లోకి వచ్చేసారు. "ఇక్కడికి రండి- ఇక్కడికి!" అరిచింది మాయ. వాళ్ళు నేరుగా నానమ్మ గదిలోకి వెళ్ళి, అలమార తలుపు ముందు ఒక గోతం పెట్టి, అలమార తలుపులు తీసారు టక్కున. లోపల ఉన్న పులిపిల్ల గబుక్కున వాళ్ల సంచీలోకి దూరింది.

చటుక్కున సంచీ మూతి బిగించి కట్టి, తీసుకెళ్ళిపోయారు వాళ్ళు- "ఫోన్ చేసినందుకు థాంక్స్ సర్!" అని నాన్నకు చెబుతూ. శీల నానమ్మ గది అలమార తలుపులు తీసి చూసుకున్నది. "నా టిగ్గర్ ఏది? మళ్ళీ కనబడట్లేదు" అన్నది.

"సరిగ్గా వెతుక్కో పాపా!‌ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది!" ఒకేసారి అరిచారు మాయ, నాన్న.

అంతలో వాళ్లమ్మ కూరగాయలు తీసుకొచ్చింది. ఇంటి పరిస్థితిని చూసి "ఏమైంది ఇక్కడ?" అన్నది.

నాన్న అన్నాడు అమ్మ కళ్ళలోకే చూస్తూ "నాకు పులిపిల్లకు వేసేంత ఆకలి వేస్తోంది- భోజనం కావాలి!" అని.

"నేను అందరినీ ఇవాళ్ల పులిపిల్ల బారినుండి రక్షించాను!" మాయ చెప్పింది అమ్మతో గుసగుసగా.

"పులిపిల్ల?! టిగ్గర్?!" అమ్మ నోరు తెరిచింది ఆశ్చర్యంగా.

"నా‌ టిగ్గర్ కనిపించట్లేదు. జంతు ప్రదర్శన శాలవాళ్ళు ఎత్తుకుపోలేదు కద?!" అడిగింది శీల అనుమానంగా. అందరూ నవ్వారు.

తరువాత రోజు ఉదయం వార్తా పత్రికలో ఒక సింహంపిల్ల కూడా జంతు ప్రదర్శనశాల నుండి తప్పిపోయిందని చదివిన మాయ అరిచింది- "శీలా! నీ లయన్ బొమ్మ ఎక్కడికీ పోలేదు కద, చూసుకో ఓసారి!"అని.