అనగనగా ఇంగ్లండులోని 'లవ్నియా' అనే మారుమూల గ్రామంలో ఒక డాక్టరుగారు ఉండేవారు.

ఆయన చాలా మంచివాడు, నెమ్మదస్తుడూనూ. "రోగులు పాపం రోగపు బాధతోటి కష్టపడుతుంటారు కదా, వాళ్ళని డబ్బుకు అడిగితే ఏం బాగుంటుంది?" అని వాళ్ళను డబ్బులు కూడా అడిగేవాడు కాదు. అయినా దేవుడి దయవల్ల ఆయన అనసరాలకు తగినట్లు డబ్బు సమకూరుతూఉండేది.

ఒకసారి వాళ్ళ అమ్మాయి పెళ్ళి సందర్భంగా డాక్టరుగారికి చాలా డబ్బులు అవసరమైనాయి. "ఇన్నాళ్ళుగా ఏమీ కూడబెట్టలేదు. ఇప్పుడేం చెయ్యాలి?" ఆయన భార్య పోరటం మొదలుపెట్టింది. ఆయనకూ ఏం చేయాలో పాలుపోలేదు.

ఆరోజు రాత్రి చీకటి పడ్డాక డాక్టరుగారి ఇంటి తలుపునుదబదబా బాదారెవరో. గబుక్కున మేలుకున్న డాక్టరుగారు పైజామా నాడాలు కట్టుకుంటూ బయటికొచ్చారు- 'ఎవరది?' అంటూ. ఇంటి ముందు ఖరీదైన గుర్రపు బండి ఒకటి ఆగి ఉంది. బాగా పాలిష్ పట్టిన మహగొని చెక్కతో చేసిన ఆ బండికి అన్నివైపులా మఖ్మల్ తెరలు వేలాడుతున్నాయి. నడిపే కుర్రాడు సన్నగా, మరుగుజ్జులాగా వింతగా ఉన్నాడు.

బండిలోపల జమీందారులాంటి పెద్ద మనిషి ఒకాయన కూర్చొని ఉన్నాడు. డాక్టరు గారిని చూడగానే అతను బండి దిగి వచ్చాడు- అతని వేళ్ళన్నింటి మీదా రకరకాల ఉంగరాలు మెరుస్తున్నాయి. " అయ్యా , డాక్టరుగారూ! త్వరగా రావాలి. మీ కోసం అంత దూరం నుండి వచ్చాం. పెద్దావిడ ఆరోగ్యం అకస్మాత్తుగా పాడైంది. మీరు తప్ప ఇంకే డాక్టరూ వద్దంటున్నది. దయచేసి మీరే రావాలి. ఇదిగో మీకోసం ఈ బండిని కూడా తీసుకొచ్చాను" అని ప్రాధేయపడ్డాడు.

డాక్టరుగారు చకచకా తయారై బండెక్కి కూర్చున్నారు. "రండి-రండి. వాయువేగంతో బండిని పోనిస్తాడు. తమరు ఏమీ అనుకోరాదు. అసౌకర్యం లేకుండా ఈ తెరలు వెసేస్తాను" అని తెరలు మూసేసాడు జమీందారు గారు.

గతుకుల రోడ్డు మీద బండి గడగడలాడుతూ పరుగు మొదలు పెట్టింది. అయితే ఆశ్చర్యం, కొద్దిసేపటికే ఏదో రాజవీధినెక్కినట్లు, గతుకులన్నీ పోయాయి! బండి ఎంత సుతిమెత్తగా పోసాగిందంటే, అసలది ఆగిపోయిందేమో అని డాక్టరుగారికి అనుమానం వేసింది! ఊరికే తెరల సందులోంచి బయటికి చూసిన డాక్టరుగారు ఆశ్చర్యంతో నోరు తెరిచారు. బండి నేలమీద నేలకు ఇంతెత్తున, గాలిలో పరుగుపెడుతున్నది!!

అంతలోనే ప్రక్కన కూర్చున్న జమీందారు గారు చిరునవ్వుతో, చాలా మర్యాదగా ఆయన్ని తనవైపుకు త్రిప్పుకొని తెరలు వేసేశాడు- "భలేవారు, డాక్టరు గారు! మీరు చాలా మంచివారు- ఇట్లా నా ప్రక్కన కూర్చోండి; ఓ పది నిమిషాలు ఏం జరుగుతున్నదీ పట్టించుకోకండి; మిమ్మల్ని నేను భద్రంగా చేరుస్తానుగా, మీకెందుకు బాధ!" అంటూ. "కాదు, మనం అప్పుడే నది ఒడ్డుకు వచ్చేసినట్లున్నాం కదా, మరి పడవ మాట్లాడుకోవాలేమోనని.." అన్నారు డాక్టరుగారు అసౌకర్యంగా.

"ఏమీ అవసరం లేదు సర్. మా యీ గుర్రాలు నీళ్లలోనూ పోతాయి. అయినా కొంచెం గట్టిగా పట్టుకోండి- పడేరు!" అన్నాడు ఆ వింత వ్యక్తి. "అవునులే, బండి చక్రాలు అసలు నేల మీద, నీళ్ల మీద ఆనితేనే గద!" అనుకున్నారు డాక్టరుగారు.

అంతలోనే గుర్రాలు చకా చకా నీళ్ల మీదుగానే బండిని లాగేశాయి. అప్పుడు వచ్చే శబ్దానికి, ఆ సంగతి అర్థమైపోయింది- "భలే ఉన్నదండి, మీ బండి!" నవ్వారు డాక్టరు గారు "ఇంతకీ పేషంటుది ఎలాంటి సమస్యో చెప్పనే లేదు!" అంటూ.

"అయ్యో! నేను చెప్పనేలేదు కదూ, మీరు వస్తున్నది 'డన్విచ్' రాణి గారి కోసం. రాణి గారికి బాగా కడుపు నొప్పిగా ఉన్నది. మీరు తప్ప మరెవ్వరూ ఆ బాధని తగ్గించలేరని ఆవిడ నమ్మకం" చెప్పాడు అతను.

"మరి మీరు-" అన్నారు డాక్టరుగారు.

"మమ్మల్ని డన్విచ్ రాజావారు అంటారు" చెప్పాడాయన.

అంతలోనే గుర్రపు బగ్గీ ఓ కొండ మీదికి ఎక్కసాగింది. కొన్ని కొన్ని సందర్భాలలో రోడ్డు చాలా నిటారుగా, దాదాపు అసాధ్యంగా ఉన్నట్లు తోచింది. అయినా గుర్రపు బండికి అవేమీ ఒక లెక్క కాలేదు.

డాక్టరు గారికి ఇదంతా చాలా గందరగోళంగా తోచింది. వీళ్లు ఎవరో, తనని ఎటు తీసుకువెళ్తున్నారో ఏమీ అర్థం కాలేదు. అయినా ఆయన తన ప్రశాంతతని కోల్పోకుండా కూర్చున్నాడు.

ఆలోగా బండి కొండమీద ఓ భవంతి ముందు ఆగింది. వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్లు, కొందరు పరిచారకులు పరుగున వచ్చి, మర్యాదగా బగ్గీ తలుపులు తెరిచి పట్టుకున్నారు.

డాక్టరు గారు బండి దిగి అటూ ఇటూ కలయ చూశారు. చుట్టూతా చిమ్మ చీకటి అది అసలు నరమానవుల సంచరించే చోటులాగే లేదు. ఆయనకెదురుగా ఉన్న భవంతి కూడా వింతగా ఉన్నది. ఎక్కడా వెలుతురు, లైట్లు ఉన్న జోడీలేదు. అంతలోకే బండిలోంచి దిగిన రాజావారూ, పరిచారకులూ అందరూ "రండి లోనికి" అంటూ ఆ చీకట్లోకి దారి తీసారు.

వాళ్ల వెంట తడుముకుంటూ పోయారు డాక్టరు గారు. వాళ్ల ప్రయాణం సస్నటి, పొడవైన, తక్కువ ఎత్తు కప్పులున్న చీకటి దారుల వెంట సాగింది. ఏమంటే మిగిలిన వాళ్లంతా అలవాటు కొద్దీ అలవోకగా వేగంగా పోతే, డాక్టరు గారు మటుకు పడుతూ లేస్తూ గబగబా నడవాల్సివచ్చింది!

"ఇరుక్కుపోయానే! ఎంత గొప్ప రాజావారు! ఎంత గొప్ప కోట!" అనుకున్నారు డాక్టరుగారు.

అంతలో పరిచారకులు ప్రక్కనే ఉన్న ఓ గది తలుపులు తెరిచి డాక్టరు గారిని సున్నితంగా లోనికి నెట్టారు: లోపల చక్కని, వెలుతురు పరచుకొని ఉన్నది. గది వాతావరణం వెచ్చగా, ఆహ్లాదకరంగా ఉన్నది. క్రింద పర్షియా దేశపు తివాచీ పరచుకొని ఉన్నది. విశాలమైన గదికి అనేక కిటికీలూ, ఎత్తైన తలుపులూ, ఎక్కడ చూసినా కర్టెన్లు- గదికి ఒక ప్రక్కగా పెద్ద పాన్పు, దానిమీద అటు తిరిగి కూర్చొని ఉన్న చక్కని ఓ యువతి-

"నమస్కారమమ్మా! నాకోసం మనుషుల్ని పంపారు, నేను చేయగల్గిన సేవ?!" అన్నారు డాక్టరు గారు, అక్కడే నిలబడి. "ఓ డాక్టరు గారు! వచ్చారా?! మీకోసమే ఎదురు చూస్తున్నాను. రాగలరో, లేరో అని ఆందోళన పడుతున్నాను" అన్నదామె ఇటు తిరిగి.

మెరుపు తీగలాంటి సౌందర్యం ఆమెది. ఆమెని చూడగానే తనని ఎందుకు పిలిచారో అర్థమైంది డాక్టరు గారికి. ఆమె గర్భవతి- నెలలు నిండాయి. ప్రసవ సమయం.

డాక్టరు గారు రాజావారి కేసి చూస్తూ తనకు ఏమేం వస్తువులు కావలసి ఉంటాయో తెలియజేశారు. ఆయన తల ఊపి మరుక్షణం ఒక సంచీని డాక్టరు గారికి అందించాడు. అందులో డాక్టరుగారు అడిగిన వస్తువులన్నీ ఉన్నాయి!

డాక్టరు గారికి చాలా ఆశ్చర్యమూ, భయమూ ఒకేసారి కలిగాయి. అయినా ఆయన బయట పడక, తన పని మొదలు పెట్టాడు. రాణీ గారిని మంచం మీద పడుకొమ్మన్నాడు, ఆమె తలకు నడుముకు ఏవో మందు పట్టీలు వేశాడు. ఒక ఇంజక్షన్ ఇచ్చాడు, రక్తపోటును పరీక్షించాడు-ఆశ్చర్యంగా, ఎన్ని రకాలుగా చూసినా, ఆమె రక్తపోటు ఎంతున్నదీ తెలీనే లేదు ఆయనకు! అయినా పరవాలేదన్నట్లు పనిలోకి దిగారు డాక్టరుగారు.

కొద్ది సేపు అక్కడే నిలబడి చూసిన రాజావారు డాక్టరు గారు పని మొదలు పెట్టగానే మర్యాదగా బయటికి నడిచారు. ఆయనతో బాటు ఆయన అనుచరులంతా బయటికి వెళ్లారు.

కొద్దిసేపటికి రాణీ గారికి ప్రసవమైంది. మగ బిడ్డ పుట్టాడు. పిల్లవాడి గుండె శబ్దమూ, ఊపిరీ అన్నీ సరిగానే ఉన్నాయని పరీక్షించి, వాడిని తల్లి ప్రక్కనే పడుకోబెట్టి, దుప్పట్లు అవీ చుట్టారు డాక్టరు గారే, స్వయంగా.

ఆ సరికి తేరుకున్న రాణీగారు నీరసంగా నవ్వి-"ధన్యవాదాలు, డాక్టరు గారు! నాకోసం మీరు చాలా శ్రమపడ్డారు. అయితే మిగిలిన వాళ్లంతా వచ్చేలోగా మీకు కొన్ని సంగతులు చెప్పాలి-"అన్నది.

"చెప్పండి" అన్నాడు డాక్టరు గారు.

చూడండి-ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. మేం మనుషులం కాదు. మేమందరం యక్షులం. ఈనాటి వరకూ మా దగ్గరికి వచ్చినవాళ్ళెవరూ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. అందుకని చెబుతున్నాను- మా వాళ్లు మీ మీద మంత్రం ప్రయోగించాలని చూస్తారు- కానీ నేను చెప్పే ఈ సంగతులు విని, జాగ్రత్తగా మసలుకుంటే మటుకు మీరు క్షేమంగా బయటపడగల్గుతారు-"ఇక్కడ మీరు ఒక్క చుక్క మంచి నీళ్లు కూడా తాగద్దు; ఒక్క మెతుకు అన్నం కూడా తినద్దు- గుర్తుపెట్టుకోండి.

-దానితో బాటు ఇంకో సంగతి-ఇక్కడ ఏం జరిగినా మీరు ఆశ్చర్యపోయినట్లు కనిపించకూడదు; దేనికీ అడ్డు చెప్పద్దు. అయితే వాళ్లు మీకు డబ్బులు ఇవ్వ జూసినప్పుడు- కేవలం ఐది బంగారు నాణాలు మటుకు తీసుకోండి- వాళ్లు మీకు ఏ ఐదు వందలో, ఐదువేలో ఇవ్వ జూపినా తిరస్కరించండి" అన్నది.

"ధన్యవాదాలు తల్లీ! నా ప్రాణాలు కాపాడారు. తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాను " అన్నారు డాక్టరు గారు ఊపిరి పీల్చుకుంటూ.

అంతలోనే ఆయన్ని తీసుకువచ్చిన యక్షుల రాజు లోనికి వచ్చాడు. ఇప్పుడతను రాజోచితమైన దుస్తులు ధరించి మెరసిపోతూ ఉన్నాడు. "ఏడీ పిల్లాడు?! ఏడీ నాకొడుకు?!" అని సంతోషంగా పోయి పిల్లవాడిని చేతుల్లోకి తీసుకున్నాడతను. "ఉంఁ.. బాగున్నాడు! నాకు తగినట్లే ఉన్నాడు!! డాక్టరు గారూ, చాలా ధన్యవాదాలు! మీ రుణం ఉంచుకోం!" అని అతనోసారి చుట్టూ కలయజూశాడు.

గదిని వెచ్చగా ఉంచేందుకు ఒక మూలగా పొయ్యి ఒకటి రగుల్తూ ఉన్నది. రాజావారు ఇప్పుడు ఆ పొయ్యి దగ్గరికి వెళ్లి, ప్రక్కనే ఉన్న సాధనంతో దానిలోని నిప్పుల్ని ముందుకు జరిపారు. బూడిద అంతా కదిలేసరికి పొయ్యిలో మండుతున్న బొగ్గులన్నీ ఎర్రటి మాంసం ముద్దల్లాగా మెరవసాగాయి. రాజుగారు చకచకా ఆ బొగ్గులన్నిటినీ ముందుకు లాగి కుప్పచేసారు. డాక్టరుగారు చూస్తుండగానే ఆయన మళ్లీ మంచం దగ్గరికి వచ్చాడు. పిల్లవాడిని ఎత్తుకొని, ప్రేమగా ముద్దాడుతూ తీసుకెళ్లి, చటుక్కున పొయ్యిలో ఏర్పడ్డ ఖాళీలో పడుకోబెట్టారు!

నిశ్చేష్టులైన డాక్టరు గారు తేరుకునే లోపు నిప్పులన్నీ వెనక్కి జరిపి పిల్లవాడి మీదంతా నిప్పులు కప్పేశారు!

డాక్టరు గారు ఆందోళనగా రాణిగారి వైపు చూశారు, కానీ ఆవిడ 'అదంతా మామూలే' అన్నట్లు చిరునవ్వు ముఖంతో చూస్తున్నది! "దేనికీ అడ్డుచెప్పవద్దు" అని గుర్తు చేసుకున్న డాక్టరుగారు ఏడుపును దిగమ్రింగి, ముఖాన్ని ప్రశాంతంగా పెట్టుకునే ప్రయత్నం చేశాడు.

అంతలో వాళ్లున్న ఆ గది ఇంకా అందమైన మరో పెద్ద గదిలా మారిపోయింది! పైన ఊగిసలాడే షాండ్లియర్లు, దీపాలు పెట్టుకునే నిలువెత్తు ప్రమిదెలు, మెరిసే తోరణాలు, రకరకాల చెక్క వస్తువులు!!

ఆ గది మధ్యలో డాక్టరు గారు అంత వరకూ ఏనాడూ చూడనంత పెద్ద టేబులు పరచి ఉన్నది! దాని మీద వందలాది వంటకాలతో చవులూరించే చక్కని భోజనం! రకరకాల మాంసాలూ, పానీయాలు, పండ్లు, పండ్ల రసాలు, సారాయాలు!!

'రండి డాక్టరుగారూ! మీసాయానికి కృతజ్ఞతలతో మేమిచ్చే యీ చిన్నపాటి విందును స్వీకరించండి. మీకు నచ్చినవేంటో తెలీదు కనక, ఇలా రకరకాలు చేయించాం. రండి" అన్నారు రాజావారు, ఆయన్ని ఆహ్వానిస్తూ.

"అయ్యా! మీరేమీ అనుకోకండి-నేను ఇవాళ్ల, రేపు రెండ్రోజులు ఉపవాసం- మళ్లీ ఇల్లు చేరేంతవరకూ ఏదీ తినేందుకు, తాగేందుకు లేదు- అందుకని నన్ను క్షమించండి; వీలైనంత త్వరగా నన్ను మా ఇల్లు చేర్చే ఏర్పాటు చేయిస్తే చాలు- ఇంకేమీ వద్దు" అన్నారు డాక్టరు గారు తల అడ్డంగా ఊపుతూ.

"ఓ తప్పకుండా! అయితే ముందు మీ సాయానికి ఈ చిన్నపాటి బహుమానం-" అంటూ బంగారు నాణాల మూటనొకదాన్ని ఆయన ముందుకు జరిపారు రాజుగారు, దాన్ని విప్పి నాణాలను చూపిస్తూ.

డాక్టరు గారు నవ్వి-"ధన్యవాదాలు రాజువారూ! అయితే వీటిలోంచి నాకు చెందాల్సిన డబ్బే నేను తీసుకుంటాను" అంటూ ఐదు నాణాలను ఎంచి పర్సులో పెట్టుకొని మిగతా మూటను అక్కడే టేబుల్ మీద ఒదిలారు- "మరి ఇక సెలవా, నన్ను వెనక్కి తీసుకెళ్లేందుకు బండి ఏర్పాటు.. ఆలస్యం అవుతున్నది.. బయలుదేరతానిక! వెళ్లొస్తానమ్మా..! జాగ్రత్త..!" అంటూ.

ఈ మాటలు విని రాజావారు గట్టిగా నవ్వారు- "ఓహో! అర్థమైంది! మా రాణీ గారు మీకు రహస్యంగా జ్ఞానబోధ చేసేసారన్న మాట!-అయినా పర్లేదులే, మీరు గొప్ప హృదయంతో, మాకు నిజంగానే‌ సాయం చేశారు. అందుకని మీరు క్షేమంగా ఇల్లు చేరుకుంటారు- పర్లేదు" అంటూ గట్టిగా చప్పట్లు కొట్టారు.

వెంటనే మళ్లీ గుర్రపు బండి వచ్చింది; నీళ్ల గుండాను, గాలిలో తేలుతూనూ పోయింది. తెల్లవారు జాముకల్లా డాక్టరు గారు ఇల్లు చేరుకొని ఊపిరి పీల్చుకున్నారు. జరిగిందంతా ఓ పీడ కల అన్నట్లు, దాన్ని ఇక గుర్తు చేసుకోకుండా వేరే పనుల్లో మునిగిపోయారు.

తర్వాత, కొన్ని రోజులకి, ఆయన బిడ్డ పెళ్లి బాగా దగ్గర పడ్డాక, "వాళ్లిచ్చిన్న బంగారు నాణాలు అమ్ముకుంటే తప్ప వీలవదు" అని తన పర్సును తెరచి చూసిన డాక్టరు గారు నిర్ఘాంతపోయారు- దానిలో తను ఎంచుకున్న బంగారు నాణాలతో బాటు నిండా విలువైన వజ్రాలు అనేకం ఉన్నై!!

వాటితో బాటు ఒక చిన్న కాయితం.. మడత పెట్టి ఉన్నది. డాక్టరుగారు ఆ కాగితం తీసి చదివారు- "మీ అమ్మాయి పెళ్ళి శుభాకాంక్షలు! మీ ఖర్చులకోసం ఈ బంగారు నాణాలు; మీరు చేద్దామనుకుంటున్న మంచి పనులకోసం ఈ వజ్రాలు. మీ మంచి పనుల పుణ్యంతో మాకు యీ జన్మ నుండి విముక్తి తప్పక కలుగుతుంది- సందేహం లేదు!"

బంగారు నాణాలతో డాక్టరు గారి బిడ్డ పెళ్లి ఘనంగా జరిగింది. అటుపైన, మిగిలిన వజ్రాల డబ్బులతో డాక్టరుగారు ఆసుపత్రిని పెద్దగా చేసారు; లెక్కలేనంతమంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఆయన మంచి పనుల వల్ల యక్షులందరికీ పుణ్యలోకాలు లభించాయి. అందుకనే, ఇప్పుడు మనకెవ్వరికీ యక్షులు అసలు కనిపించటమే లేదు!