లక్ష్మమ్మ-రామయ్యలకు ఒక్కడే కొడుకు. పేరు బాలు. లక్ష్మమ్మ, రామయ్య ఇద్దరూ కూలికి పోయేవాళ్ళు. వాళ్లది చాలా పేద కుటుంబం. ఇంట్లో దరిద్రం తాండవం చేసేది. తాము తినేందుకు తిండి ఉన్నా, లేకున్నా బాలు మాత్రం బాగుండాలని ఆశించేవాళ్ళు తల్లిదండ్రులిద్దరూ. దాంతో వాడిని ఆ ఊరిలోనే ఉన్న కాన్వెంటులో చేర్చారు.
అయితే వాడికి ఐదేళ్ళు వచ్చేసరికి రామయ్య కాలం చేశాడు. లక్ష్మమ్మ ఒక్కతే ఎంతో కష్టపడి వాడిని అదే బడిలో మూడవ తరగతి వరకు చదివించింది. ఇక ఆ తరువాత వాడిని ప్రైవేటు బడిలో చదివించే స్తోమత లేక, గవర్నమెంటు స్కూల్లో చేర్పించింది. పాత బడిలో పిల్లలంతా చక్కగా ఇస్త్రీ చేసిన యూనిఫాములు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ పిల్లల బట్టలు చాలా మాసిపోయి, మురికి మురికిగా ఉండేవి. "ఎందుకమ్మా, ఇట్లా?" అని అడిగేవాడు బాలు. "అది ధనవంతుల బడి నాయనా! మనది పేదవాళ్ళ బడి!" అనేది లక్ష్మమ్మ.
రేషన్ షాపులో పేద ప్రజలకు చవక ధరలో సరుకులు అమ్ముతారు. లక్ష్మమ్మ నెల సరుకుల్ని ఎప్పటికప్పుడు రేషన్ షాపులోనే తీసుకునేది. ఆ దుకాణంలో పెద్ద పెద్ద వరసల నిండా జనాలు ఉండేవాళ్ళు. రవి గంటల తరబడి నిలబడేవాడు ఆ లైన్లలో.
ఒక్కోసారి కొత్తగా వచ్చిన వాళ్ళు కొందరు లైన్లోనే ముందుకెళ్ళి సామాన్లు తీసుకునేవాళ్ళు. "వీళ్ళెవరు, మనకంటే ముందు వెళ్తున్నారు?" అని అడిగితే "వాళ్ళు ధనవంతులు బాబూ, మనం పేదోళ్ళం ఆగాల్సిందే" అనేవాళ్ళు అందరూ. అట్లాంటి వాళ్లతో పోరాడలేక, వరుసలో కూడా వెనకపడి, బిక్కు, బిక్కు మంటూ నిలబడేవాడు రవి.
చివరికి వ్యాపారి తక్కువ తూకంతో ఇచ్చినా కూడా, 'ఇదేమి' అని అడగలేక, 'అదే మహాభాగ్యం' అని తీసుకెళ్ళేవాడు.
లక్ష్మమ్మ రవి ఇద్దరూ ప్రొద్దున్న నాలుగు గంటలకు లేచి, చన్నీటి స్నానం చేసి, గుడికి వెళ్లి, దర్శనం కోసం నిలబడేవాళ్లు. గంటల తరబడి నిలబడ్డా వీళ్ల లైను ముందుకు కదిలేది కాదు. అయితే వాళ్ల ప్రక్క వేరే వరసలో ఉన్న వాళ్ళు మాత్రం అలా వచ్చీ రాగానే దర్శనానికని ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు- వీళ్లకేసి గర్వంగా చూసుకుంటూ. "అదేంటమ్మా! వాళ్లు మన తర్వాత కదా..." అని అడిగేవాడు బాలు.
"మనది ధర్మ దర్శనం బాబూ! వాళ్ళేమో డబ్బు ఉన్నవాళ్లు. ఎక్కువ డబ్బు పెట్టి టికెట్టు కొనుక్కుంటారు. 'స్పెషల్ దర్శనం' చేసుకుంటారు" అన్నది వాళ్ళ అమ్మ.
బళ్ళో పుస్తకాల సంచి చిరిగినప్పుడు కూడా ధనికులు-పేదలు అన్న తేడాను ఎదుర్కొన్నాడు బాలు. తోటి పిల్లవాడు ఎగతాళి చేస్తుంటే ఏమీ అనలేక గుడ్లలో నీరు కుక్కుకున్నాడు.
వీధి కుళాయిల దగ్గర నీటి కోసం కుక్కల్లాగా పోట్లాడుకునేటప్పుడూ అంతే. అట్లా ఒక్క చోట కాదు- అనేక చోట్ల; కండ బలం, నోటి బలం రెండూ లేక, గొడవలంటే భయపడి, అమ్మ చెప్పినట్లు అర్థించటమే తప్ప, అరవటం ఎలాగో- ఆజ్ఞాపించడం ఎలాగో తెలీక- ప్రతి విషయంలోనూ ధనిక-పేద వర్గ వివక్షను భరిస్తూ పెరిగాడు బాలు. రాను రాను అతనిలో ఆలోచన పెరిగింది. పేదరికం అంటే నిరసన మొదలైంది. 'డబ్బులుండాలి- లేకపోతే లాభం లేదు' అనిపించసాగింది.
"పేదరికపు బాధ పోవాలంటే ఏంచేయాలి?" అని ఆలోచించాడు. వాళ్లమ్మ చెప్పినట్టుగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు.
ఉద్యోగంలో బాగా రాణించి, అటుపైన సొంత వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు. ఒకప్పుడు ఏ అబ్బాయి అయితే తనని వెక్కిరించాడో అతన్నే తన అసిస్టెంటుగా పెట్టుకున్నాడు!