దక్షిణాఫ్రికాలో నల్ల జాతివారికి ఎలాంటి హక్కులూ ఉండేవికావు. "మమ్మల్ని కూడా సమానంగానే చూడాలి" అని అక్కడ గొడవ మొదలుపెట్టాడు గాంధీ. ఆయన పోరాటానికి నేటాలులోని భారతీయులు అనేకమంది మద్దతు పలికారు.

ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్‌వారి చేతుల్లో ఉండింది. "మాకు హక్కులు ఇవ్వాలి" అని మీటింగులు పెట్టేవాళ్ళు కాంగ్రెస్ నాయకులు. "దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు బాగుంటుంది" అనుకున్నాడు గాంధీ. కలకత్తాలో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభల్లో దక్షిణాఫ్రికా గొంతుని వినిపించాలని ఉత్సాహంగా ఇండియాకు వచ్చాడు.

కాంగ్రెస్ మహాసభ ఓ పెద్ద బహిరంగ స్థలంలో జరుగుతూ ఉండింది. సభల్లో పాల్గొనేందుకు దూరదూరాల నుండి ఎవరెవరో మహా నాయకులు వచ్చి ఉన్నారు. వారందరి మధ్యా పిట్టలాంటి గాంధీని ఎవ్వరూ పట్టించుకోలేదు.

సభ మొదలయిన కొద్దిసేపటికే గాంధీ ముక్కులు పనిచేయటం మొదలుపెట్టాయి: ఏదో కంపు! మరుగుదొడ్ల కంపు!!
సభ కోసం తయారు చేసిన మరుగుదొడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పలేం. కొందరు సభ్యులైతే తమ గదుల ముందే దొడ్డికి పోయారు. వాళ్లకి అడ్డు లేదు. సభల కోసం వచ్చిన వాలంటీర్లను గాంధీ అడిగాడు- "చాలా కంపుగా ఉంది. మరుగుదొడ్లే అనుకుంటాను. అసౌకర్యం కదా? ఏమైనా చేయరాదూ?” అని.

"ఓయ్ ఇది మా పని కాదు- పాకీ వాళ్ల పని అది" అన్నారు వాళ్లు.

సభలో మాట్లాడేందుకు ఇంకా గాంధీ వంతురాలేదు. చాలా మంది వ్యక్తులు వేదికనెక్కేందుకు పోటీ పడుతున్నారు. అందరూ చెప్పేవాళ్లే తప్ప, వినేవాళ్ళు లేరు.

సామాన్యంగా గాంధీ సమయాన్ని వృథా చేసుకోడు. ఆ రోజుల్లో ఆయన సూటూ బూటూ వేసుకొని దర్జాగా ఉండేవాడు. అయినా అప్పటికప్పుడు చాట-పరక చేత పట్టుకొని, సభ కోసం కట్టిన మరుగుదొడ్లను అన్నింటిని పూర్తిగా శుభ్రం చేశాడు.

సభకు వచ్చిన వాళ్లంతా ఆయన చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూశారు- కానీ ఒక్కరు కూడా ఆయనకు సహాయం చేసేందుకు ముందుకురాలేదు!

తర్వాత అనేక సంవత్సరాలకు- అదే గాంధీజీ కాంగ్రెస్‌కు దారి చూపించే వెలుగు దివ్వె ఐనాడు, శక్తివంతుడైన నాయకుడిగా ఎదిగాడు. అప్పుడిక కాంగ్రెస్ సభలలో "మరుగుదొడ్ల పరిశుభ్రతా బృందాలు" తయారయ్యాయి.

ఆ రోజుల్లో అంటరానితనం ప్రబలంగా ఉండేది. 'పరిశుభ్రత' అనేది కేవలం నిమ్న జాతులకే ఉద్దేశించిన పనిగా ఉండేది. గాంధీ చేసేటప్పటికి, అట్లాంటి పనులను కూడా చాలా ఇష్టంగా చేశారు, గాంధీ అనుయాయులు. తర్వాత ఒకసారి హరిపురంలో జరిగిన కాంగ్రెస్ సభల్లో ఏకంగా 2000 మంది టీచర్లు, విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేశారు!

"మురికిని, గలీజుని శుభ్రం చేయడం ఒక పవిత్ర కార్యం. పవిత్ర కార్యాన్ని నెరవేర్చేవాళ్ళు అసలు అంటరానివాళ్లు ఎలా అవుతారు, భగవంతుని బిడ్డలౌతారు గాని?!” అని గట్టిగా నమ్మాడు గాంధీ.

ఒక్క టాయిలెట్లలోనే కాదు- మన జీవితపు అన్ని రంగాలలోనూ పేరుకుపోయిన మురికిని, చెత్తను ఏరిపారేయటం అసలు ఎవరికి వాళ్ళుగా, మనందరం ఎప్పటికీ చేస్తూ ఉండాల్సిన పని. ఏమంటారు?

గాంధీ జయంతి శుభాకాంక్షలతో

కొత్తపల్లి బృందం