మదనపల్లిలో పల్లవి, అమర అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరిదీ ఒకే వయస్సు. ఇద్దరి ఇళ్ళూ ఒకే వీధిలో. అందుకని ఇద్దరూ చక్కని స్నేహితులు అయి ఉండాలి- కానీ కారు! ఇద్దరికీ అసలు ఎప్పుడూ పడేది కాదు.
పల్లవి ఎప్పుడూ చదువుకుంటూ ఉండేది. అమర ఎప్పుడూ ఆటలు ఆడుతూ ఉండేది.
"ఎప్పుడూ చదువేనా?!" అని ముఖం విరిచేది అమర. "చదువురాని మొద్దు!" అని ఈసడించేది పల్లవి.
అయితే వీళ్ళుండే సందులోనే మరో పాప ఉండేది. ఆ పాప పేరు అంజన. ఆ పాప పల్లవి దగ్గరికెళ్ళి చదువుకునేది; అమర దగ్గరికెళ్ళి ఆటలాడేది. ఇద్దరినీ కలిపేందుకు తనకు చేతయినంత ప్రయత్నించేది; కానీ పల్లవి, అమర ఇద్దరూ ఆ పాప మాటలు పట్టించుకునేవాళ్ళు కారు.
అట్లా చాలా ఏళ్ళు గడిచాయి. పల్లవి బాగా చదువుకొని చాలా పేరున్న న్యాయవాది అయ్యింది. అమరేమో చాలా పేరున్న క్రీడాకారిణి అయ్యింది. ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉంటారు; కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. పల్లవి కనబడితే తల తిప్పుకొని వెళ్ళిపోతుంది అమర. అమర ఫొటో వచ్చిన పేపరు కూడా చదవదు పల్లవి.
అయితే ఒక రోజున పల్లవి కోర్టులో తన పని ముగించుకొని వస్తుంటే చక్కగా, పొందికగా, హుందాగా ఉన్న ఒకావిడ ఆమె దగ్గరికొచ్చి పలకరించింది. "నీ పేరు పల్లవి కదూ? ఇప్పుడు నువ్వు లాయరువా?" అని.
అకస్మాత్తుగా ఎదురయ్యేసరికి ఆమెను పల్లవి గుర్తు పట్టనే లేదు. "ఏయ్! నేను! అంజనను! గుర్తు పట్టలేదా? మీరుండే వీధిలోనే ఉండేదాన్ని; నీతో కలిసి చదువుకునేదాన్ని?!" అన్నదావిడ.
పల్లవి చాలా సంతోషంగా ఆమెను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది- "ఏయ్! ఎన్నేళ్లయింది, నిన్ను చూసి? ఇప్పుడు ఏం చేస్తున్నావు?" అన్నది.
నేను ప్రభుత్వోద్యోగం. నువ్వు? మంచి లాయరువైనట్లున్నావే?" అన్నది అంజన.
"పద, మా ఇంట్లో భోజనం చేద్దువు. అన్నం తింటూ మాట్లాడుకుందాం" అని అంజనను తమ ఇంటికి తీసుకుపోయింది పల్లవి. మాటల సందర్భంలో అమర ప్రసక్తి వచ్చింది. "అమర క్రీడల్లో బలే పేరు సంపాదించుకున్నది గదా? నాకు ఆ రోజుల్లోనే అనిపించేది, ఆ పాప బలే ఆడేది! మీరిద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారుగా, కలుస్తుంటారా, ఎప్పుడైనా?" అడిగింది అంజన. "ఇదిగో, చూడు! నీకు తెలుసు కదా, మేము ఎప్పుడూ స్నేహితులం కాదు. నేను చక్కగా చదువుకునేదాన్ని. అది ఊరికే ఆటలాడి కాలం వృధా చేసే పిల్ల. మేమిద్దరం ఎందుకు కలుస్తాం? నేను తనతో మాట్లాడనే మాట్లాడను. అమె పేరే ఎత్తకు, నా దగ్గర!" విసురుగా అన్నది పల్లవి.
అంజన కొంచెం ఆశ్చర్యపోయింది. "ఇదేంటి, ఇంత పెద్దయ్యాక కూడా చిన్నపిల్లలాగా చికాకు?!" అనుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజులకు అమర ఎదురుపడింది అంజనకు. "ఏయ్! అమరా! కులాసానా? నన్ను గుర్తు పట్టావా?" పలకరించింది అంజన.
అమర తనని ఒకింతసేపు తేరిపార చూసి "వావ్! అంజన! ఏంటే, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు?!" అంది సంతోషంగా.
"నాదా, గవర్నమెంటు పని. మరి నీ సంగతులేంటే, నువ్వేమో ఇప్పుడు గొప్ప క్రీడాకారిణివి కదూ? నీ పేరు పేపర్లో చూస్తుంటాను ఎప్పుడూ!" అన్నది అంజన.
"అవునే, ఆటలంటే నాకిష్టం- అప్పుడూ, ఇప్పుడు కూడాను. నా ఉద్దేశం ప్రకారం అసలు ఈ బడులు, చదువులు ఇవన్నీ అవసరమే లేదు. పిల్లల్ని వేధించటానికి తప్ప, ఈ చదువులు అసలు ఎందుకూ పనికి రావు" అన్నది అమర. "అదేంటే అట్లా అంటావు? మన సందులో పాప- పల్లవి- చక్కగా చదువుకునేది గుర్తుందా, అది ఇప్పుడు గొప్ప లాయరు అయ్యింది!" అన్నది అంజన.
అమరకు చటాలున కోపం వచ్చేసింది. "దాని పేరు ఎత్తకు! అది, దాని చదువు! లోకం ఏమాత్రం తెలీదు దానికి. ఎప్పుడూ చదివి చదివి దాని కళ్ళు, ఒళ్ళు ఎలా తయారయ్యాయో చూశావా?" అన్నది.
"ఓహో! వీళ్ళిద్దరూ ఇంకా పిల్లల్లాగే ఉన్నారనమాట. వీళ్లని కలిపే విధానం ఒకటి ఏదైనా కనుక్కుంటే బావుంటుంది" అని నవ్వుకున్నది అంజన.
"నేను మటుకు నీదగ్గర నేర్చుకున్న ఆటల వల్ల నా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూనే ఉన్నాను" అన్నది అమరతో. తర్వాతి రోజున హైకోర్టు జడ్జి వెంకట్రాం గారు పల్లవిని తమ ఇంట్లో ఏర్పాటు చేస్తున్న విందుకు ఆహ్వానించారు. అదే విధంగా మహిళా బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మగారు అమరను తమ ఇంట్లో విందుకు ఆహ్వానింవారు. విందులో పల్లవి, అమర ఒకరికొకరు ఎదురు పడ్డారు- "ఇదేంటి, నువ్విక్కడ?" అసంకల్పితంగా అన్నారు ఇద్దరూ, ఒకేసారి.
అప్పుడే అక్కడికి వచ్చిన జడ్జిగారు నవ్వుతూ "మన కొత్త పోలీసు కమిషనర్ గారికి మీరు మిత్రులట కదా? వారికి చదువులు, ఆటలు మీరే నేర్పారట!" అన్నారు.
"నాకు ఆటలంటే మహా చిరాకు. నేనెందుకు నేర్పుతాను?" అన్నది పల్లవి.
"నాకు చదువులంటేనే సరిపోదు-నేనెందుకు నేర్పుతాను?" అన్నది అమర.
అది విని పల్లవి రెచ్చిపోయింది. ఆవేశంతో అమర మీద అరిచింది-" ఏమి అనుకుంటున్నావే అమరా, నువ్వు? ఇంక చాలు ఆపు! నువ్వు అర్థం చేసుకునే సమయం వచ్చింది. చదువే అన్నింటికంటే ముఖ్యమైనది! ఆడుకోనక్కర్లేదు. తెలిసిందా?" అని.
వెంటనే అమర కోపం పట్టలేక అరిచింది-"చదువుకుంటే చదువురావచ్చేమో- కానీ ఆడుకోకపోతే అసలు తిన్నది ఎలా అరుగుతుంది?" అని.
"పల్లవీ, అమరా- నా మాట వినండి- చదువు, ఆట రెండూ మంచివే. ఎక్కువ ఆటా, తక్కువ చదువు పనికిరావు. అలాగే ఎక్కువ చదువు, తక్కువ ఆటా కూడా మంచిది కాదు. నాకు రెండింటినీ సమ పాళ్ళలో అందించారు మీరు. మీవల్లనే నేను ఈ రోజున పోలీస్ కమిషనర్ అయ్యాను. చదువులు, ఆటలు వేరు వేరు కాదు. సంపూర్ణంగా బ్రతికేందుకు రెండూ వేటికవి అవసరం. వాటిని విడదీయకూడదు. అట్లాగే మీరూ విడివిడిగా ఉండకూడదు. నాకోసమన్నా మీరు ఇద్దరూ కలవాలి. పిల్లల్లాగా కొట్లాడటం మానాలి" తమ వెనకనే నిలబడి అంటున్న పోలీస్ కమిషనర్ అంజనని చూడగానే అమర, పల్లవిల హృదయం కరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని, కంట తడి పెట్టారు. "అవునమ్మా! చదువులూ ఆటలూ రెండూ అవసరమే, కాదని ఎవ్వరూ అనలేరు. మీరిద్దరూ మంచివాళ్ళు. మిత్రులవ్వాలి అంతే, తప్పదు" అన్నారు జడ్జిగారు, పద్మగారు. పల్లవి, అమర ఇద్దరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు.
పల్లవి అన్నది" అమరా నన్ను క్షమిస్తావా?" అని.
అమర అన్నది "నువ్వు నన్ను క్షమిస్తే, నేనూ నిన్ను క్షమిస్తాను" అని.
వింటూన్న అంజన సంతోషపడింది.