చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, పెంచి పెద్ద చేస్తారు అమ్మానాన్నలు. మనం పెద్దయ్యేసరికి, వాళ్ళేమో ఇంక ముసలివాళ్ళవుతారు- క్రమంగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనం అయిపోతారు. అలాంటప్పుడు 'వాళ్లను కనిపెట్టుకొని ఉండటం, వాళ్ల ఇష్టాలను గమనించుకొని మెలగటం, వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవటం మన బాధ్యత. అదే ధర్మం' అని చెప్తాడు శ్రవణుడు.

అనగనగా ఎప్పుడో రామాయణకాలంలో, పేర్లు తెలీని ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవాళ్ళు, ఓ అడవిలో. వయసు మీద పడుతున్నా వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరూ చాలా చాలా తపస్సు చేసాక, చివరికి వాళ్ళ కోరిక ఫలించింది. వాళ్లకో చక్కని కొడుకు పుట్టాడు.

అతనికి 'శ్రవణుడు' అని పేరు పెట్టారు వాళ్ళు. లేకలేక పుట్టిన కొడుకు గదా, అందుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచారు. రకరకాల విద్యలు, మంచి సంగతులు నేర్పారు.

అయితే, శ్రవణుడికి పదహారేళ్ళు వచ్చేసరికి, వాడి అమ్మానాన్నలిద్దరూ పూర్తిగా ముసలి వాళ్లయిపోయారు. నడక తగ్గింది; బలం తగ్గింది; వాళ్ల కంటి చూపు కూడా క్రమంగా మందగించింది. చూస్తూ చూస్తూండగానే వాళ్ళు గ్రుడ్డివాళ్లయిపోయారు. ఇప్పుడు ఆ తల్లితండ్రులకు అన్నీ శ్రవణుడే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి. ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి.

శ్రవణుడు చాలా మంచివాడు. ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నవాడు. కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్లను.

అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది- "కాశీకి పోవాలి; గంగలో‌ స్నానం చేయాలి; వీలైతే అక్కడే ఉండిపోవాలి" అని. ఆ రోజుల్లో‌ కాశీకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పని. రవాణా సౌకర్యాలు ఏవీ‌ ఉండేవి కావు; దారి కఠినంగా ఉండేది; అనేక అడవులు, నదులు దాటుకొని పోవాల్సి వచ్చేది. వాళ్ళా ముసలివాళ్ళు- నడవలేరు; పైగా చూపుకూడా లేని వాళ్ళు. వాళ్ళను కాశీకి చేర్చటం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాదు. అయినా శ్రవణుడు వాళ్ల మాటను కాదనలేదు. ఎలాగైనా సరే, వాళ్ల కోరికను తీర్చాలనుకున్నాడు.

కావడిని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు. కావడి అంటే తెలుసుగా, ఐదారు అడుగుల పొడవున్న గట్టి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని, దానికి రెండువైపులా తాళ్లతో తక్కెడలు కట్టుకోవాలి. ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే, కావడి కట్టెను భుజానికెత్తుకొని నడవచ్చు. శ్రవణుడు అట్లాంటి కావడిలో అమ్మానాన్నలను చెరొకవైపునా కూర్చొబెట్టుకొని, కావడిని మోసుకొని, కాలినడకన ప్రయాణం సాగించాడు. ఎండను, వానను, శ్రమను, అలసటను దేన్నీ లెక్కచేయలేదు- 'అమ్మానాన్నల కోరికను నెరవేర్చాలి' అన్నదొక్కటే అతని సంకల్పం. అట్లా బయలుదేరి కొండలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్యా రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒకదానిలోకి ప్రవేశించాడు.

మధ్యాహ్నం అయ్యింది. శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం అయ్యింది- "ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో చూడు నాయనా" అన్నారు వాళ్లు. సరేనని వాళ్లను ఎత్తుకొస్తున్న కావడిని క్రిందికి దించి, సొరకాయ బుర్రను చేతపట్టుకొని, నీళ్ళకోసం వెతుకుతూ బయలుదేరాడు శ్రవణుడు. దగ్గర్లోనే ఒక సరస్సు కనబడింది. సరస్సులో నీళ్లు నిశ్చలంగా, తేటగా ఉన్నాయి. శ్రవణుడు క్రిందికి వంగి కూర్చొని, సొరకాయ బుర్రలోకి నీళ్ళు నింపుకోసాగాడు. నీళ్ళు లోపలికి పోతుంటే సొరకాయ బుర్ర 'బుడబుడ'మని శబ్దం చేస్తున్నది.

సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు, అయోధ్య రాజు- దశరథుడు. దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడు. 'శబ్ద భేది' అనే విద్యను సాధన చేస్తున్నాడు. లక్ష్యాన్ని చూడకనే, అటువైపునుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం, లక్ష్యాన్ని ఛేదించటం- దీన్ని 'శబ్దభేది' అనేవాళ్ళు. దశరథుడికి శ్రవణుడు కనిపించలేదుగానీ, బుడబుడమని శబ్దం వినబడింది. 'జంతువేదో‌ నీళ్ళు త్రాగుతున్నది' అనుకున్నాడు రాజు. అటువైపుగా గురి పెట్టి బాణం వదిలాడు. బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకున్నది! 'హా!' అని అరిచి క్రింద పడిపోయాడు ఆ పిల్లవాడు!

శ్రవణుడిది పెద్ద మనసు. తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది. 'తను చనిపోతే పర్లేదు- కానీ తన తల్లిదండ్రుల గతి?! వాళ్ళు ముసలివాళ్ళు, పైగా చూపు లేని వాళ్ళు. తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు?' ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసకబారాయి.

అరుపును వినగానే దశరధుడి గుండెలు గుభేలుమన్నాయి. గబగబా పరుగెత్తుకొ-చ్చాడు. క్రిందపడి కొట్టుకుంటున్న శ్రవణుడిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. సిగ్గుతోటీ, బాధతోటీ కుంచించుకు పోయాడు. శ్రవణుడిని ఒడిలోకి ఎత్తుకొని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. "నన్ను క్షమించు- శబ్దం విని ఇదేదో జంతువనుకున్నాను" అని మళ్ళీ‌ మళ్ళీ వేడుకున్నాడు. ప్రాణాలు పోతున్నా, శ్రవణుడు దశరథుడిని ఊరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు. "మా అమ్మా నాన్నలు గ్రుడ్డివాళ్ళు; ముసలివాళ్లు. పూర్తిగా నా మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు దాహం వేస్తున్నది. వాళ్ళకోసమని నీళ్ళు తీసుకెళ్తుంటే ఇలా అయ్యింది. ఇంక నా ప్రాణాలు నిల్చేట్లు లేవు. అదేమంత ముఖ్యం కాదు గానీ, ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అనే, చింత వేస్తున్నది" అన్నాడు శ్రవణుడు.

"నీ తల్లి దండ్రుల సంగతి మరచిపో, వాళ్ల బాధ్యత నాది. ముందు నీ గాయం మాన్పటం గురించి చూస్తాను" అన్నాడు దశరథుడు.

శ్రవణుడు ఒప్పుకోలేదు. నీరసంగా నవ్వి, "లాభం లేదు. నా ప్రాణాలు ఇంకో రెండు క్షణాలలో పోతున్నాయి. మీరు చేయగలిగింది ఒక్కటే- మీరు వదిలిన బాణపు ములుకు గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది. నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను. ఆలస్యం చేయకండి. ఆ వెంటనే ఈ సొరకాయ బుర్రలో నీళ్ళు తీసుకెళ్ళి మా అమ్మానాన్నల దాహం తీర్చండి. పాపం వాళ్ళు నాకోసం ఎదురు చూస్తుంటారు- వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి. ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయచ్చు" అన్నాడు. దశరథుడు బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు.

దశరథ మహారాజు తల వాల్చుకొని కన్నీరుమున్నీరుగా ఏడ్చాడు. ఆపైన ఒక నిశ్చయానికి వచ్చి, శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి, సొరకాయ బుర్ర వేత పట్టుకొని శ్రవణుడి అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళాడు.

అడుగుల శబ్దం వినగానే "నాయనా, శ్రవణా! ఇంత ఆలస్యం అయ్యిందేమిరా?" అడిగాడు శ్రవణుడి తండ్రి. "ఇవి మా శ్రవణుడి అడుగులు కావు. ఎవరది? ఎవరు నువ్వు?-" అడిగింది శ్రవణుడి తల్లి, అడుగుల్ని బట్టే అపరిచితుడిని గుర్తుపడుతూ.

"నమస్కారం తల్లీ, నా పేరు దశరథుడు. మీకు ఈ నీళ్ళు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి" అన్నాడు దశరథుడు సిగ్గుగా.

"వాడేడి? వాడికేమైంది? వాడెందుకు రాలేదు?" అడిగింది తల్లి, అనుమానంగా.

దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను అందించబోయాడు. వాళ్లు దాన్ని అందుకోనేలేదు.

"మావాడు రావాలి. వాడికేదో అయ్యింది. లేకపోతే ఇంత సేపు మమ్మల్ని విడిచి ఏనాడూ పోలేదు వాడు. నిజం చెప్పు. నువ్వే ఏదో చేశావు వాడిని. కదూ? ఏం చేశావు చెప్పు!" కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి.

ఇక చేసేది లేక, జరిగిందంతా వివరించాడు దశరథుడు.

శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు. "అమాయకుడైన మా కుమారుడిని మానుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు. రాజా! నువ్వు కూడా మాలాగానే పుత్ర శోకంతో మరణిస్తావు. నీ కొడుకు నీ నుండి దూరం అవుతుంటే, ఆ దు:ఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది. పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు" అని శపించారు.

దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు. కొద్ది సేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు!

తెలిసి చేసినా, తెలియక చేసినా- తప్పు తప్పే! దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు. తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికీ, అతని తల్లిదండ్రులకూ విధి పూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి, బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు.

ఆ తర్వాత చాలా సంవత్సరాలకు గానీ అతనికి పిల్లలు పుట్టలేదు. లేక లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథుడు. ఆ రాముడు పెద్దయి, సీతతోటీ, లక్ష్మణుడితోటీ అడవికి పోతుంటే, ఆ బాధకు తట్టుకోలేక చనిపోయాడు చివరికి!