దీప్తి, మధుమతి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. దీప్తి పేద ఇంటి అమ్మాయి. మధుమతి పెద్ద ఇంటి పాప.

ఒకసారి మధుమతి పుట్టిన రోజు వచ్చింది. సాయంకాలం వాళ్ళింట్లో విందు. చాలామంది బంధువుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించింది విందుకు. దీప్తిని కూడా రమ్మన్నది.

"నేను రాను లే" అంది దీప్తి.

"ఎందుకు రావు? రావాల్సిందే! నాకోసం, నాకు నచ్చే ప్రత్యేక బహుమతిని కూడా తెచ్చివ్వాలి నువ్వు" పట్టు పట్టింది మధుమతి. పొదుపు డబ్బులతో తనకు ఏదైనా బహుమతి కొనుక్కుపోదామనుకున్నది దీప్తి. అయితే ఆ సరికే వాళ్లమ్మ ఆ డబ్బుల్ని ఇంటి అవసరాలకోసం వాడేసింది.

దాంతో చూసి చూసి, చివరికి ఉత్త చేతుల్తోటే మధుమతి ఇంటికి పోయింది దీప్తి.

చూడగా మధుమతి వాళ్ళింటికి ఎంతో మంది ధనవంతులు పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఉన్నారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో ఇల్లంతా వెలిగి పోతున్నది. వచ్చినవాళ్లంతా ఇచ్చిన ఖరీదైన బహుమానాలు అక్కడ కుప్ప పోసి ఉన్నాయి.

"ఏయ్! నా ప్రత్యేక బహుమతి ఏది?" సంతోషంగా ఎదురొచ్చి చేయి పట్టుకొని, నవ్వుతూ అడిగింది మధుమతి.

దీప్తికి ఏడుపు వచ్చేసింది. "మేము పేదవాళ్లం కదే, మా ఇంట్లో డబ్బులు లేకపోయాయి. తగిన బహుమతిని ఇవ్వలేక పోతున్నానే" అని చెప్పాలనుకుంది. కానీ దు:ఖంతో నోట మాట రాలేదు.

"ఏయ్! ఏడుస్తావెందుకు?" అంటూ నడుం చుట్టూ చెయ్యి వేసి మధుమతి దీప్తిని మిద్దెపైకి పిలుచుకొనిపోయింది.

"చూడు దీప్తీ! ఇన్నేళ్ళుగా మనం స్నేహితులం కదా, నీ గురించి నాకు తెలీదా? చూడు, నాకోసం పనిగట్టుకొని ఇంత మంది బంధుమిత్రులు వచ్చినా, ఇన్నిన్ని బహుమతులు ఇచ్చినా, నాకు అమ్మలేని లోటును వీళ్లెవరైనా పూడ్చగలరా?
ఒకసారి నీ పుట్టిన రోజునాడు మీ ఇంటికి వచ్చాను. గుర్తుందా? ఆ రోజు మీ ఇంట్లో ఏ విందూ లేదు; ఎవ్వరూ బహుమతులు తేలేదు; కానీ నువ్వు మీ అమ్మానాన్నల దగ్గరికి పోయి వాళ్ల కాళ్లకు దండం పెట్టావు. అప్పుడు మీ అమ్మ నీ తల నిమిరి, నీ నుదుటి మీద ముద్దు పెట్టింది. అట్లాంటి బహుమతి ప్రపంచంలో ఇంకొకటి వుంటుందా?
నీనుండి నేను కోరుకునే ప్రత్యేక బహుమతి అదే. నీ ప్రేమని కొద్దిగా నాకూ పంచు. అదేనే, నాకు కావలసిన బహుమతి!" అంది మధుమతి.

ఆప్యాయతతో ఇద్దరి కళ్ళూ చెమర్చాయి.