విజయనగర సామ్రాజ్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనాడు రాజు గారి పుట్టిన రోజు.
ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాదీ పుట్టినరోజునాడు రాజుగారు ఏనుగు అంబారీ మీద నగర వీధుల్లో సంచారం చేస్తారు. మనసుకు తోచినట్లుగా ధాన ధర్మాలు చేస్తారు.
కృష్ణదేవులవారు మనసున్న ప్రభువు. ఎదుటివారి విద్వత్తును, వారి పాత్రతను అంచనా వేయటంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు.
ఆరోజున ఒక వింత జరిగింది. మహారాజుల వారు వైభవంగా ఊరేగుతూ పేట వీధిలోకి వచ్చారు. అక్కడ ఆయన కోసమే ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడొక బిచ్చగాడు. పేరు అచ్చయ్య. అచ్చయ్యకు ఏలాంటి రోగమూ లేదు; ఇంకా వయసు మీరలేదు. వయసు మీరినవారికి, రోగులకు ప్రభువుల వారు అనేక ఉచిత భోజన సత్రాలు, వసతి క్షేత్రాలూఎలాగూ నిర్మించి ఉన్నారు. అచ్చయ్యకు బద్ధకం ఎక్కువ. పని చేయటం అంటే ఇష్టం లేదు. 'అడుక్కుతింటే చాలు కదా' అనుకునే వ్యక్తి.
ఆ నాడు ప్రభువుల వారు తనని గుర్తిస్తారనీ, తన జోలెను వెండితోటీ, బంగారు తోటీ నింపేస్తారనీ, తాను ఇక పని చేయనవసరం లేకుండా జీవితాంతం కాలుమీద కాలు వేసుకొని బ్రతకచ్చనీ కలలు కంటున్నాడు అచ్చయ్య.
అంతకు ముందే రాణి వాసం నుండి ఎవరో వచ్చి అతని జోలె నిండా అన్నం వేసి వెళ్లారు. కానీ అచ్చయ్యకు ఇప్పుడు కావలసింది అన్నం కాదు. బంగారం.
రాజుగారి అంబారీ అతని ముందుకు వచ్చింది. ఊరేగింపు చూసేందుకు వచ్చిన జనంతో తొక్కిసలాట మొదలయింది. అచ్చయ్య జనాన్ని తోసుకొని తోసుకొని అంబారీ దగ్గరగా వెళ్ళాడు- అన్నంతో నిండి ఉన్న తన జోలెను చూపిస్తూ "ధర్మం-ధర్మం!" అని అరిచాడు.
రాజుగారు అంబారీని అపమని సైగ చేశారు. అచ్చయ్య "ధర్మం చేయండి బాబు! ధర్మం చేయండి" అని అడుగుతూనే ఉన్నాడు.
రాజుగారు చిరునవ్వు నవ్వారు- "ముందు నాకు ఏమన్నా ఇవ్వు!" అని అడిగారు.
అచ్చయ్యకు చాలా కోపం వచ్చింది. "ఈ జనాలకే కాదు; ప్రభువుకూ తన జోలె నిండిందని అసూయేనన్నమాట! ఏం, కనీసం ఇవాళ్లనైనా తను కడుపునిండా తింటే వీళ్ళకేమి? తను అడుక్కున్నదాన్ని వీళ్లకు ఎందుకివ్వాలి అసలు?"
రాజుగారు అతనికేసే చూస్తున్నారు. అతని ఆలోచనల్ని ఆయన చదువుతున్నట్లున్నారు.
కొద్దిసేపటికి బిచ్చగాడికి నిరాశ మరింత ఎక్కువైంది. "తను ఏమైనా ఇస్తే తీసుకుంటారు తప్ప, రాజుగారు ఇక తనకు ఏమీ ఇవ్వరు" అని నిశ్చయించుకున్నాడు. తనకు ఏమీ ఇవ్వనివాడికి తను మాత్రం ఎందుకివ్వాలి?" అనుకున్నాడు. అయినా రాజుగారు చేయి చాపి అడుగుతున్నారు కనుక, తన జోలె నుండు ఒక అన్నం మెతుకు తీసి రాజుగారి వైపు విసిరాడు.
రాజుగారు ఆ మెతుకును అందుకొని, దానికేసీ- అన్నంతో నిండి ఉన్న అచ్చయ్య జోలె కేసీ చూస్తూ నవ్వారు. అంబారీ మీదినుండి దేన్నో తీసుకొని అచ్చయ్యకు అందేట్లు విసిరారు. అంబారీని ముందుకు నడిపారు.
కృష్ణదేవులవారి చేష్ఠ అర్థం కాలేదు అచ్చయ్యకు. అయినా ఒక్కమాటుగా ఎగిరి అందుకొని, 'అదేంటా' అని ఆత్రంగా చుశాడు దాన్ని.
అన్నం మెతుకంత బంగారం తునక అది!
తర్వాత కొద్ది సేపటికి మొదలైంది అచ్చయ్య బాధ- "అయ్యో! నేనెంత తెలివి తక్కువ వాడిని, జోలెలో ఉన్న అన్నాన్నంతా ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది?" అని.